నానీల సుగంధం కవితాసంపుటి ఆవిష్కరణ
నానీలు రాయడంలో చాలా మంది సీనియర్ కవులకంటే కూడా శక్తివంతంగా ఆదినారాయణ వర్ణించాడని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ అధ్యక్షులు ఆచార్య ఎన్. గోపి గారు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ అండ్ సాహితీ జిగీష సాహితీ సంస్కృతి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నాడు (13.12.2023) డా. గిన్నారపు ఆదినారాయణ రచించిన నానీల సుగంధం కవిత్వ సంపుటిని ఆవిష్కరణ, అంకితోత్సవ సభ రవీంద్ర భారతి మినీ సమావేశ మందిరంలో జరిగింది. డాక్టర్ ఎస్. రఘు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పుస్తకాన్ని తన గురువు హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుకి అంకితం ఇచ్చారు. ఈ సమావేశంలో ఆచార్య ఎన్ గోపి ముఖ్య అతిథిగా పాల్గొని నానీల సుగంధం కవిత్వాన్నీ, ఆ ప్రక్రియను సోదాహరణంగా వివరించారు. తాను రాసిన కొన్ని నానీలతో పాటు ఆదినారాయణ నానీలను ఆయన విశ్లేషించారు. ఇంతవరకు వచ్చిన మొదటి 50 పుస్తకాల్లో ఆదినారాయణ పుస్తకం ఒకటిగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు పుస్తకాన్ని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అధ్యాపకురాలు ఎం దేవేంద్ర సమీక్షించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ ఎస్ చంద్రయ్య పుస్తకంపై మాట్లాడారు. ఈ సమావేశంలో గ్రంథకర్త డాక్టర్ ఆదినారాయణ, కృతి స్వీకర్త ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తనకు అంకితం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో విశిష్ట అతిథిగా సాహితి జిగీష కార్యదర్శి, పూర్వ ప్రిన్సిపాల్ డా..పి.లలితవాణి, సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు ప్రొఫెసర్ ఆచార్య పిల్లలమర్రి రాములు తదితరులు పాల్గొన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో గజవెల్లి ఈశ్వర్, వేముఎల్లయ్య, ప్రముఖ సాహితీవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి