"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

21 December, 2023

నాగలి కూడా ఆయుధమే కవితాసంపుటి ఆవిష్కరణ 19.12.2013

 నాగలి కూడా ఆయుధమే

కవితా సంపుటి ఆవిష్కరణ ##

ప్రసిద్ధ కవి కె.శివారెడ్డికి అంకితోత్సవం


హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 19: కొమ్మవరపు విల్సన్ రావు కవిత్వం వినూత్నం, అభివ్యక్తి శక్తిమంతం అని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. విల్సన్ రావు రాసిన 'నాగలి కూడా ఆయుధమే' కవితా సంపుటిని మంగళవారం రవీంద్రభారతి మినీహాల్లో ఆచార్య కొలకలూరి ఇనాక్ ఆవిష్కరించి..జరగబోయే ప్రమాదాన్ని, రాబోయే కష్టాల్ని గురించి విల్సన్ రావు తన కవిత్వంలో చెప్పడం బావుందన్నారు..మనిషి మెత్తనే అయినా, కవిత్వంలో మాత్రం ఆయన ముద్ర గట్టిదే అని కవిని ప్రశంసించారు. ‘దేవుడు తప్పిపోయాడు’ వంటి వినూత్న కవితా వస్తువుతో కావ్య రచన చేసి, సాహిత్యాభిమానుల మనసు దోచుకున్నాడని అన్నారు. కవులకు సూచన చేస్తూ.. సమాజంలోని అస్తవ్యస్త వ్యవస్థ మీద కవిత్వం రాయకుండా విల్సన్ రావు లాగా సున్నితమైన కవిత్వం రాయాలని సూచించారు..

ఈ పుస్తకాన్ని ప్రసిద్ధ కవి కె.శివారెడ్డికి అంకితం ఇచ్చారు.‘శివారెడ్డి గారు కాలానికి నిలిచిన కవిత్వం రాసారని,శివారెడ్డి గారి కవిత్వమంటే తనకు ఎంతో ఇష్టమని కవి విల్సన్ రావు అన్నారు.తన కవితా సంపుటిని కవికుల గురువు శివారెడ్డి గారికి అంకితం ఇవ్వడం సంతోషంగా ఉందని’ చెప్పారు కవి విల్సన్ రావు..!! శివారెడ్డి 81వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనను ఘనంగా సన్మానించారు. 

ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ 'కవిత్వం రాయడానికే పుట్టిన శివారెడ్డి ఎంతో మందిని కవులుగా తీర్చిదిద్దారు' అంటూ ప్రశంసించారు. 

కవితా సంపుటి స్వీకర్త కె. శివారెడ్డి మాట్లాడుతూ… “కవిత్వం రాస్తే యేం ఒరిగిద్ది.‌ ఇదిగో ఇలాంటి సన్మానం జరుగుద్ది” అన్నారు.'నేనొక ప్రేమ కవిని. ప్రేమ కవిత్వం రాయడం కూడా ఒక విధంగా నిరసన వ్యక్తం చేయడమే” అన్నారు. కవిత్వం నాకు చాలా విషయాలు నేర్పింది. మనిషి నిర్భయంగా వుండటం,నిజాయితీగా మాట్లాడటం ముఖ్యమన్నారు.కవులు అల్పసంతోషులు. నాగలి కూడా ఆయుధమే కవితా సంపుటిని అంకితమిచ్చి ఈరోజు నాకు గొప్ప సన్మానం చేశాడు విల్సన్ రావు. విల్సన్ రావు కవిత్వంలో మెరుపులుండవు. ఆయన మృదుస్వభావి.ప్రేమ, అమృతత్వాలు విల్సన్ రావు కవిత్వంలో నిండుగా ఉన్నాయంటూ అభినందించారు. 

ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె. శ్రీనివాస్ మాట్లాడుతూ 'తెలుగు కవిత్వాన్ని శివాలూగించిన కె. శివారెడ్డి కోటి చంద్రులతో సమానమైన కవిత్వ వెన్నెలను తెలుగు సాహిత్యంలో ప్రసరింప చేశారు' అన్నారు. ‘నాగలి కూడా ఆయుధమే' శీర్షిక తనను ఆకట్టుకున్నదని, ఢిల్లీ రైతుల ఉద్యమం ప్రేరణతో రాసిన కవిత్వం కూడా ఇందులో ఉన్నదని అన్నారు. విల్సన్ రావు కవిత్వంలో కొన్నిచోట్ల గాఢమైన అభివ్యక్తి, మెరుపులు ఉన్నాయని, చాలా సరళంగా ఉంటూనే పాఠకులను ఆకట్టుకునేలా వుంటాయని అన్నారు..ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఈ కవి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు పట్ల సహానుభూతితో రాసిన “తెల్లారితే” కవిత్వంతో పాటు రోహిత్ వేముల ఘటన మీద కవిత్వ స్పందన అతని సాహిత్య వ్యక్తిత్వాన్ని పాఠకులకు పరిచయం చేస్తాయంటూ విశ్లేషించారు. 

నగర సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్య క్షుడు కోయి కోటేశ్వరరావు పుస్తక సమీక్ష చేశారు. కార్యక్రమానికి హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ తెలుగు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర రావు సభాధ్యక్షత వహించగా, ప్రముఖ కవి యాకూబ్, పుస్తక రచయిత కొమ్మవరపు విల్సన్ రావు, జల్ది విద్యాధర్ రావు తదితరులు పాల్గొన్నారు. 

సభకు అధ్యక్షత వహించిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. విల్సన్ రావు చెప్పినట్లు ‘నాగలి’ కూడా ఆయుధమే. కాకుంటే ఈ ఆయుధం ఎవరి ప్రాణాలు తీయదు సరికదా!ప్రాణాలు పోస్తుంది. జీవకోటికి అవసరమైన ఆహారాన్ని అందించడానికి తోడ్పడుతుంది.రైతన్న చేతిలోని ఈ ఆయుధం నేలను దున్ని, బంగారు పంటలు పండించడానికి దోహద పడుతుంది..ఇప్పుడంటే…ట్రాక్టర్లు, యంత్రాలు వచ్చాయి కానీ,మా బాల్యం వరకూ కూడా చేలు దున్నడానికి ఈ నాగలే ప్రధాన ఆయుధం.. సాధనం..! విల్సన్ రావు ఈ నాగలినే వస్తువుగా/ శీర్షికగా చేసుకొని ఈ కవితా సంపుటిని తెచ్చారు..ఈ పుస్తకం చదువుతుంటే మనల్ని మనం చూసుకుంటున్నట్లే వుంటుందన్నారు..!!

విల్సన్ రావు సాహితీ విద్యార్ధి కాకున్నా, జీవితాన్ని చదివాడు.‌ఈయన కవితా సంపుటిలో ఆలంకారిక శాస్త్రంలోని కవితా మర్మాలున్నాయని సభకు అధ్యక్షత వహించిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వేంకటేశ్వర రావు అన్నారు.

డాక్టర్ కోయి కోటేశ్వరరావు పుస్తకాన్ని పరిచయం చేశారు…విల్సన్ రావు కవిత్వంలో సమకాలికత గొప్పదన్నారు‌. తన కవిత్వంలో శ్రమ సౌందర్యపు పరిమళం,ప్రాణ చైతన్యం ఉంటుందని అన్నారు. తన కవితా సంపుటి దేవుడు తప్పిపోయాడులోని కవిత్వం,ఇప్పటి ఈ సంపుటిలోని కవిత్వం బేరీజు వేసుకుంటే.. ఈ రెండిటిలోను పాఠక విధేయత,కవితా కళాతత్వ దృష్టి ఉంటుందని ..ఈ రెండింటిని సమన్వయం చేయడం కష్టమని..కానీ విల్సన్ రావు దానిని సాధించాడని  కోయి కోటేశ్వరరావు అన్నారు. ఉత్పత్తి సాధనాలే నిజమైన ఆయుధాలు అనే నిజాన్ని గ్రహించి, నిర్ధారించి ఈ కవితా సంపుటికి నాగలి కూడా ఆయుధమే అని శీర్షిక నిర్ణయించిన కవి విల్సన్ రావును అభినందించారు.

   డా.జల్ది విద్యాధరరావు మాట్లాడుతూ విల్సన్ రావు వ్యక్తిత్వాన్ని,ప్రేమపూర్వక పలకరింపును ఉటంకిస్తూ మంచి కవిత్వం రాసిన కవిని అభినందించారు. ..!!

     కవి డాక్టర్ యాకూబ్ ..సభకు స్వాగతం పలుకుతూ కవిపరిచయం చేశారు. సభ ప్రారంభించడానికి ముందు ‘నాగలి కూడా ఆయుధమే’ కవితా సంపుటిలోని కొన్ని కవితలను ప్రముఖ కవులు తగుళ్ళ గోపాల్, పి.శ్రీనివాస గౌడ్, వంజారి రోహిణి చదివి వినిపించారు.

ఈ సభ మొదటి నుండి చివరి వరకు కల్చరల్ టివి వారు లైవ్ టెలికాస్ట్ చేశారు.

అతిథి సత్కారం తరువాత ప్రముఖ రచయిత్రి శ్రీమతి వంజారి రోహిణి వందన సమర్పణ చేశారు.













No comments: