మీ ఆత్మకథ "నెమలికన్నులు" తొలిభాగం 'బాల్యం' చదువుతున్నంతసేపు ఒక రసవత్తరమైన సినిమాను చూసిన అనుభూతి పొందాను. తరువాయి భాగం చదవాలనే కుతూహలం తక్షణమే నన్ను వెంటాడుతుంది. మిగిలిన భాగం త్వరగా పుస్తక రూపం దాల్చాలని ఆశిస్తున్నాను. ఒకరోజు (09-09-2023) డిపార్ట్మెంట్ లో మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు టేబుల్ మీద మీ ఆత్మకథ కనపడగానే ఆ పుస్తకం తీసుకోవచ్చా సార్ అని అడిగిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా నాకు, విశ్వంత్ కి మీ సంతకంతో సహా ప్రేమగా అందించారు. ఆ రోజే చదవాలని అనుకున్నాను కాని మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మీ ఆత్మకథ చదవాలని నిర్ణయించుకుని ఇప్పుడు చదివాను.
ఒక విత్తనం మహా వృక్షంగా ఎదిగి అందరికీ ఫలాలని అందించే క్రమంలో ఆ వృక్షం మొక్కగా ఉన్నప్పుడు ఎలా ఉండిందో తెలుసుకోవడానికి అంటే మీ బాల్యాన్ని తెలుసుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది.
మీకు శిష్యుడిగా ఉన్న ప్రత్యక్ష పరిచయం కొంతే అయినా ఈ పుస్తకం చదివాక మీరు ఈ స్థాయికి రావడానికి వెనుక ఉన్న బాల్యం నాటి ప్రాథమిక భూమికను అందించారు. ఈ పుస్తకం ద్వారా మిమ్మల్ని మరింత దగ్గరగా చూసే అవకాశం లభించింది. మధ్యలో మీరు పంచుకున్న చిన్ననాటి చిలిపిచేష్టలు మా బాల్యాన్ని గుర్తు చేశాయి. మీరు ఇప్పటికీ కూడా మాకు క్లాసులో, క్లాస్ బయట చిన్నపిల్లాడిలానే కనిపిస్తుంటారు. మీ ఆత్మకథ నాలో ఏదో తెలియని స్ఫూర్తిని నింపిందని బలంగా చెప్పగలను. అది నా తదనంతర జీవితంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుందని విశ్వసిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలమని మిమ్మల్ని లైవ్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మన కళ్ళముందు లేని వ్యక్తి ఆత్మకథ చదివితే పొందే అనుభూతి కన్నా మనతో ఉన్న వ్యక్తి ఆత్మకథ చదువుతుంటే ఆ కిక్కే వేరు. మీ ఆత్మకథ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. మధ్య మధ్యలో మీరు కవిత్వంతో నన్ను పరవశింపజేశారు. ఇప్పటివరకు నేను చదివిన పుస్తకాలు కేవలం ఒక వంద వరకు ఉండొచ్చు, కానీ మీ ఆత్మకథను చదివినంత సాఫీగా ఏ పుస్తకాన్ని చదవలేదు.
"మనం జాగ్రత్త చేసుకొనేటప్పుడు ఒక్కొక్క గింజనూ ఏరి సమకూర్చుకోవాలి. కానీ, తినేటప్పుడు ముద్దగా తినాలి. మనం ఉన్నదని ఒకేసారి ఖర్చు చేసేయకూడదు. లేదని మానేయకూడదు" అని మీ అమ్మగారు చెప్పిన మాటలు నన్ను బాగా ఆలోచింపజేశాయి.
- నవీన్ కుమార్, పిహెచ్.డి తెలుగు పరిశోధకుడు
25.12.2023
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి