సామాజిక చైతన్యానికి ప్రతీక కాళోజీ
సామాజిక చైతన్యానికి, ఉద్యమానికి ప్రతీక కాళోజీ నారాయణరావు అని వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగు శాఖ, హెచ్ సియు ఆధ్వర్యంలో గురువారం నాడు ( 14.9.2023) కాళోజీ నారాయణరావు జయంతోత్సవాన్ని తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. సెప్టెంబర్ 9 వతేదీన పుట్టిన కాళోజీ జయంతిని ఆరోజు తెలుగు శాఖ అధ్యాపకులు వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో వక్తలుగా పాల్గొనడం వల్ల జరుపుకోలేకపోయామని అందువల్ల నేడు జరుపుకుంటున్నామని శాఖాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య పిల్లలమర్రి రాములు ముఖ్యవక్తగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషా చైతన్యాన్ని పెంపొందించడంలో కాళోజీ నారాయణరావు పాత్ర చిరస్మరణీయమైందని ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. చిన్ననాటి నుంచి కాళోజీ తిరుగుబాటు లక్షణాలు ఉన్ళవారనీ, నిజామ్ కాలంలో తెలుగు భాష, తెలుగు వాళ్ళందరికోసం కాళోజీ పోరాడారని, దానిలో భాగంగానే విశాలాంధ్ర ఉద్యమాన్ని, హైదరాబాద్ రాజధానికావాలనడాన్నీ చూడాలన్నారు.
తర్వాత తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని 1969 ఉద్యమంలో ఎత్తి చూపించారని ఆచార్య పిల్లలమర్రి రాములు అన్నారు. కాళోజి భాషాప్రయోగాలను, వాటిలోని ఔచిత్యాన్ని సోదాహరణంగా వివరించారు. ఈ సమావేశానికి డా.భూక్యా తిరుపతి స్వాగతం పలుకగా, ఆచార్య డి.విజయలక్ష్మి వందన సమర్పణ చేశారు. ఈ సమావేశంలో ఆచార్య ఎం.గోనానాయక్, డా.భూక్యాతిరుపతి, డా.బాణాల భుజంగరెడ్డి, డా.డి.విజయకుమారి, డా.శంకర్ అనంత, డా.రాగ్యా నాయక్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.















కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి