నువ్వు ఓడిపోయావన్నావు
నేనే గెలిచానని నాకు మాత్రమే తెలుసు
నువ్వే గెలిచావన్నావు
నేనే ఓడిపోయానని నాకు మాత్రమే తెలుసు
నాది ఏనీడా లేని పయనమనుకుంటూ
విజయదరహాసంతో నడుస్తుంటాను
ఒక మహాపర్వతమేదో
నీ పాదాల దగ్గర కూలిపోయినట్లు
నా అడుగుల వెనుకే నడుచుకుంటూ వచ్చేనీడేదో
నీ కళ్ళల్లో కనిపించినప్పుడల్లా
నేనే ఓడిపోతుంటానని నీకు తెలుసా!
పట్టపగలు
మనసు కమ్ముకున్న దట్టమైన చీకటి బిందువులు
నా కళ్ళ నుండి కురవడం నీకు తెలుసా!
- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 30.4.2022
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి