"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

22 May, 2022

విశ్వర్షి కవిత్వం-ఒక తత్వవేదిక

 విశ్వర్షి కవిత్వం-ఒక తత్వవేదిక


నా సంక్షిప్తి : విశ్వర్షి లాహిరి వసంతకుమార్ గారి అభిప్రాయం 
మనం నిర్వహించుకుంటున్న 'విశ్వర్షి వాసిలి అక్షరాక్షర ప్రస్థానం' సదస్సులను *విశ్వజనీన సదస్సు*లుగా కితాబు నిచ్చిన ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారి అధ్యక్షోపన్యాసం మన 108 రోజుల అంతర్యానానికి తలమాణికంలా సాగటం నేటి 51వ సదస్సు ప్రత్యేకత. అంతర్జాల అంతర్జాతీయ సదస్సులు అనుకుంటున్న తరుణంలో "విశ్వజనీన సదస్సులు" అని ఆచార్య దార్లవారనటం 'యోగాలయ'కు లభించిన ఇంతకుపూర్వం ఏ సదస్సులకూ లభించని‌ అపూర్వ ప్రశంసా పత్రంగా పరిగణించుకోవచ్చు.
"సాధారణంగా అకడమిక్ సెమినార్స్ లో సదస్సు పత్రాల శీర్షికలన్నీ ఒక మూసధోరణిలో ఆ విషయాన్ని వివరించేలా ఉంటాయి. కనీ ఈ సదస్సులలోని శీర్షికలన్నీ ఒక నినాదంలా, ఒక సూక్తిలా, ఒక స్ఫూర్తినిచ్చే వాక్యంలా ఉన్నాయి." అంటూ మన సదస్సు పత్రాల శీర్షికల ప్రత్యేకతను ఎలుగెత్తి చెప్పారు.
విశ్వర్షివారి ప్రతిపుస్తకమూ మానవ అహంకారాన్ని పటాపంచలు చేస్తుంది అంటూ 'విశ్వర్షి రచనలను చదువుతుంటే కొత్తజన్మను పొందిన అనుభూతి కలుగుతుంది' అని అంటారు.
 "విశ్వర్షి కవిత్వం ఒక తత్త్వవేదిక" శీర్షికన ఆచార్ర దార్లవారు ప్రసంగిస్తూ విశ్వర్షి "వచనం ఎంత అందంగా రాస్తారో కవిత్వం అంతకంటే అందంగా రాస్తారు" అని అంటారు.
"'నేను'ను ఎన్నిసార్లు చదివినా ఇంకాఇంకా చదవాలనిపిస్తుంటుంది. నేను ఒక ప్రతీక, ఒక సంకేతం. నేను కనిపించేవాటి, కనిపించనివాటి చైతన్య ప్రతీక. నేను విశ్వం ఒక్కటే అనటం ఫలచైతన్యం" అంటూ 'నేను' యౌగిక కావ్య వివేచన చేస్తారు.
నా రెండవ పుస్తకం "ఏడవ ఋతువు" వచన కవితా సంపుటి. ఈ సంపుటిలోని అంతర్లీన ఆర్ద్రతను పట్టుకుని "రక్త ఋతువే ఏడవ ఋతువు" అంటూ ప్రకటిస్తారు దార్ల.
ఈ కావ్యంలో "లౌకిక విషయాలకు పారలౌకిక విషయాలకు ముడిపెట్టటం వాసిలి ప్రత్యేకత" అనీ అంటారు.
"పుట్టుకా ఒక వలసే ..‌. చావూ ఒక వలసే. వలసకాని వరస వుందా మిత్రమా" అన్న పాదాలను ఉటంకిస్తూ ఆచార్య దార్ల ఏడో ఋతువు కవిత్వాన్ని అర్థం చేసుకో వటానికి "ఆధ్యాత్మిక అనుభవం ఉండాలి" అని తేల్చేసారు.
ఇలా నా కవిత్వంలోని అనేకానేక అంశాలను విశ్లేషిస్తూ "ఈ ప్రసంగం ద్వారా నన్ను నేను తెలుసుకోవడానికి, నాలోని అహంకారాన్ని తగ్గించుకోవడానికి, నా నిజమైన అస్తిత్వాన్ని‌ గుర్తెరిగి ప్రవర్తించడానికి ఎంతగానో దోహదం చేసిన ఈ సదస్సు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అంటూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు తమ ప్రసంగాన్ని ముగించి మనల్నీ వారి ముందు వినమ్రుల్ని చేసి వారి ప్రసంగంతో మౌనమగ్నుల్ని చేసారు.






(విశ్వర్షి వాసిలి అక్షరాక్షర ప్రస్థానం పేరుతో యోగాలయ రీసెర్చ్ సెంటర్ నిర్వహణలో 108రోజుల అంతర్జాతీయ అంతర్జాల సదస్సు ఏడవ వారం సభలో చేసిన అధ్యక్షోపన్యాసం)  

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

అధ్యక్షులు, తెలుగుశాఖ, మానవీయ శాస్త్రాల విభాగం, 

యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, 

హైదరాబాద్ -500 046  ఫోన్: 9182685231


  • అందరికీ నమస్కారం

  • గత ఆరువారాలుగా నిరంతం ఎలాంటి అంతరాయం లేకుండా 108 రోజుల పాటు నిర్వహిస్తున్న విశ్వర్షి వాసిలి అక్షరాక్షర ప్రస్థానం పేరుతో యోగాలయ రీసెర్చ్ సెంటర్ వారు అంతర్జాలం ద్వారా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సులో ఈ ఏడవ వారం సదస్సుకి నన్ను అధ్యక్షత వహించమన్నందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశ్వర్షి డా.వాసిలి వసంతకుమార్ గార్కి, ఆచార్య జి.అరుణ కుమారిగార్కి, సదస్సు నిర్వాహకులు శ్రీమతి శ్రీలతగార్కి, కృష్ణ చైతన్యగార్కి, ఇతర సభ్యులందరికీ నా నమస్కారం.

  • ఈ నాటి సదస్సులో ‘ఆత్మయానంలో మెరిసిన అంతిమ రహస్య కొసమెరుపులు నేను’ పేరుతో శ్రీమతి నార్లంక మంజుల, సికిందరాబాద్ నుండి పాల్గొని మాట్లాడతారు. బహుశా, ‘నేను’ యౌగిక దీర్ఘకావ్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతారనుకుంటున్నాను.

  • శ్రీ జి.వి.జి.కె. మూర్తిగారు హైదరాబాదు నుండి ‘‘వాసిలి రచనలు-బహుముఖీన అనుశీలన’ చేస్తారు. అనేక రచనలు చేసిన వాసిలి వారి బహుముఖ పాండిత్యాన్ని విశ్లేషిస్తారనుకుంటున్నాను.



  • తిరుపతి నుండి శ్రీమతి సి.స్వరాజ్య భారతిగారు ‘ప్రజ్ఞాసింధువు మా మాస్టర్’ అని యోగామాస్టారుగా వారి ప్రజ్ఞను తెలియజేస్తారు. డా.వాసిలి గారి ‘‘మాస్టరిజం: ప్రజ్ఞా రహస్యాలు, మాస్టరిజం: యౌగికరహస్యాలు, యోగలయ మొదలైన గ్రంథాలను కేంద్రంగా చేసుకొని మాట్లాడతారేమో. 








  • విశాఖపట్టణం నుండి శ్రే కె.దివాకరరావుగారు 1+1=ఒకటా... రెండా= వివాహవ్యవస్థ – ఒక అవలోకనం’ అంటూ వివాహవ్యవస్థలోని రహస్యాల్ని వివరిస్తారు. డా.వాసిలి గారు ‘పెళ్ళి: ఒక బ్రతుకుపుస్తకం’ పేరుతో రాసిన పుస్తకాన్ని, మరికొన్ని అంశాల్ని కేంద్రీకరించి మాట్లాడతారనుకుంటున్నాను. 

  •  ప్రముఖ కవయిత్రి శ్రీమతి జి.లలితాభాస్కర్ దేవ్, సికిందరాబాద్ నుండి ‘‘వాసిలిగారితో మైత్రి అంటే కాలంతో మైత్రి అనే’’ పేరుతో వాసిలి వసంతకుమార్ గారి వ్యక్తిత్వాన్ని, వారి రచనాతత్వాన్ని విభిన్నకోణంలో వివరిస్తారు. వాసిలి గారు ‘టైమ్ పర్ సక్సెస్’ అనే గ్రంథాన్ని రాశారు. ఈ గ్రంథంతో పాటు కాలం విలువను, కాలాన్ని గెలవడమెలాగో చెప్పే రచనల్నీ మేళవించి తమ ప్రసంగాన్ని చేస్తారనుకుంటున్నాను. 

  •  శ్రీ వి.మధుసూదనరావుగారు విశాఖపట్టణం నుండి ‘‘మనసా, నిన్ను గెలవాలి! క్షణ క్షణం నేను గెలవాలి!!’ అంటూ మనసుని గెవడమెలాగో వివరిస్తారు. డా.వాసిలి గారు గెలవడం గురించి చాలా పుస్తకాలు రాశారు. ‘మనకే తెలియని మన రహస్యాలు, ఎమోషనల్ అయినా గెలవాల్సిందే, ది విన్నర్: గెలవాలి, గెలిపించాలి. మనసుని గెలవాలి, సిగ్గుపడితే సక్సెస్ రాదు మొదలైన గ్రంథాలున్నాయి. నిజానికి ఏ గెలుపుకైనా ముందు మనం మనసుని గెలవగలిగితే అన్నింటినీ గెలిచినట్లే. కానీ దాన్ని గెలవడం అంత సులభం కాదు. లౌకిక ప్రపంచంలో ‘గెలుపు –ఓటములు’ తాత్కాలికం. నిజమైన గెలుపు మన మనసుని గెలవడమే. ఆ గెలుపు గురించి మనం ఈ పత్రంలో వింటాం. 

  • మీరు జాగ్రత్తగా గమనిస్తే, సాధారణంగా అకడమిక్ సెమినార్స్ లో సదస్సు పత్రాల శీర్షికలన్నీ ఒక మూసధోరణిలో ఆ విషయాన్ని వివరించేలా ఉంటాయి. కానీ, ఈ సదస్సులో ఒక నినాదంలా, ఒక సూక్తిలా, ఒక స్పూర్తినిచ్చే వాక్యంలా ఉన్నాయి. వీటిని బట్టే ఆ సదస్సుల వంటిది కాదీ సదస్సు అని స్ఫష్టంగా తెలుస్తుంది. దీనిలో యోగా, ప్రాణాయామం, ఆధ్యాత్మిక సాధనాపరులు పాల్గొంటున్నారు. వీరందరికీ సదస్సు నిర్వాహకుల పక్షాన నా హృదయపూర్వక స్వాగతం. 

  • విశ్వర్షి డా.వాసిలి వసంతకుమార్ గారు నాకు ‘నేను’యౌగిక దీర్ఘకావ్యం ద్వారా బాగా పరిచయమయ్యారు. అంతకు ముందు ఆయన రచనలను పత్రికల్లో చదివేవాణ్ణి. నాకెందుకో అవి బాగా నచ్చేవి. ఆధ్యాత్మక విషయాలే రాస్తున్నా, ఒక శాస్త్రీయమైన వివరణలు దానిలో గమనించేవాణ్ణి. ఆ తర్వాత ‘సిరికోన’ ద్వారా ఆయన రాస్తున్న కవిత్వం, రచనల వల్ల మరింత సాన్నిహిత్యం పెరిగింది. 

  • ఆయన రాసిన ‘నేను’ దీర్ఘకావ్యం తెలుగుసాహిత్యంలో ఒక అపురూపమైన కావ్యం. అది చదివిన తర్వాత వాసిలి వార్ని ‘విశ్వర్షి’ అని ఎందుకన్నారో నాకు అర్థమైంది. అది తెలుగులో వెలువడిన కావ్యం కావచ్చు. కానీ, అది విశ్వరహస్యాన్వేషణలకు సంబంధించిన కావ్యం. 

  • మానవుడు, సమస్త జీవులకు ఈ విశ్వంతో గల సంబంధాన్ని హేతుబద్ధంగా, అనుభూతి రమ్యతతో దర్శించిన కావ్యం అది. ఈ ఒక్కకావ్యమే చాలు 108 రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించడానికి, దానిలోని సృష్టి రహస్యాల్ని అన్వేషించడానికి. 

  • దానితో పాటు ఆయన కలం నుండి వెలువడిన అన్ని రచనలను ఈ 108 రోజుల పాటు జరిగే సదస్సులో చర్చిస్తున్నారు.

  • వ్యక్తిత్వం, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, యోగానుభవం, సృష్టిరహస్యాలు, ఆధ్యాత్మిక రహస్యాలు, ఇంద్రియానుభవాలు, అతీంద్రియానుభవాలు మొదలైన వాటినెన్నింటినో ఈ సదస్సులో చర్చకు తీసుకొస్తున్నారు. ఇవి నిజంగా ఒక ప్రాంతానికో, ఒక దేశానికో చెందినవి కావు. ఇవన్నీ మనుషులున్న ప్రతి దేశంలోనూ చర్చించుకోవలసినవి. జీవులున్న ప్రతి స్థలంలోను చర్చించుకోవలసినవి. అందుకే ఇది నిజంగా ‘అంతర్జాతీయ సదస్సు’. 

  • సాధారణంగా ఒక సదస్సు జాతీయమా? అంతర్జాతీయమా? అని తెలిసేది – ఆ సదస్సు తీసుకున్న వస్తువుమీద ఆధారపడి నిర్ణయమవుతుంది. దురదృష్టవశాత్తూ నేడు భిన్నదేశాల వాళ్ళు పాల్గొంటేచాలు, దాన్ని అంతర్జాతీయ సదస్సు అనేస్తున్నారు. కానీ, ఇది అలాంటి అంతర్జాతీయ సదస్సు కాదు. ఈ సదస్సులో వక్తలు కూడా భిన్నదేశాల నుండి మాట్లాడుతున్నారు. అంతెందుకు, ఈ సదస్సుకి మూలకారకులైన విశ్వర్షి డా.వాసిలి వసంతకుమార్ గారే ప్రస్తుతం అమెరికానుండి ఈ సదస్సులో పాల్గొంటున్నారు. మనలో కొంతమంది భారతదేశం నుండి పాల్గొంటున్నాం. అందువల్ల ఇది అంతర్జాతీయ సదస్సు అయిపోలేదు. ఈ సదస్సులో చర్చించే అంశం అంతర్జాతీయమైంది. ఇంకా చెప్పాలంటే విశ్వజనీనమైంది. 

  •  విశ్వర్షి గారి ఏ రచన తీసుకున్నా, ఆ రచన అంతా మనల్ని మనం ఈ విశ్వంతో అనుసంధానించుకునేలా ప్రేరేపిస్తుంది. ఆయన ఏరచన తీసుకున్నా, ఆ రచన అంతా మనల్ని మనం సంస్కరించుకునేలా ఉంటుంది. ఈ విశ్వంలో మనస్థానమేంటో మనకి కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. మనలోని అహంకారం పటాపంచలైపోతుంది. మనం మరలా ఒక కొత్త జన్మను పొందేటట్లు చేస్తుంది. 

  • దీనికి కారణం, ఆ రచనలు అనుభవ రహస్యాలు కావడం, ఆరచనలు భారతీయ, పాశ్చాత్య దార్శనికతను దర్శించినవి కావడం, పూర్వమే మన యోగులు, మహర్షులు చెప్పిన అంశాల్ని అనుభవంలోకి తెచ్చుకున్న వ్యాఖ్యానాలు కావడం... 

  • ఆయన రచనలు చదివి వాటిపై గత ఆరువారాలుగా ఈ సదస్సులో ఒక్కొక్కరి అనుభవాలు చెప్తుంటే, ఆయన రచనల వల్ల ఎంతోమంది ఆధ్యాత్మకంగా తమ జీవితాల్లో గొప్పమార్పులకు గురవుతున్నారని అనిపించింది. ప్రతి ప్రసంగాన్నీ యూట్యూబ్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొనిరావడం వల్ల ఆ సదస్సు జరుగుతున్నప్పుడు వినలేకపోయినా, తర్వాత వాటిని వినే అవకాశం కలుగుతుంది. 

  • మన కంటికన్నీ కనిపించవు. కనిపించినవి మాత్రమే వాస్తవాలనుకోవలేం. అలాగే ఇంద్రియానుభవాల్ని అందరూ ఒకేరకంగా గుర్తించలేరు. అది సున్నితమైన, సునిశితమైన పరిశీలన గలవారికే సాధ్యం. అలా తమ ఇంద్రియానుభవాల్ని చెప్తుంటే, ఆ అనుభవాల్ని గమనించలేనివారికి అవి అర్థం కావు. 

  • ఈ సదస్సులో నేను మాట్లాడాల్సిన అంశం: విశ్వర్షి కవిత్వం-ఒక తత్త్వ వేదిక’

  • విశ్వర్షి డా.వాసిలి వసంతకుమార్ గారు వచనమెంత అందంగా రాస్తారో, దాన్ని అంతకంటే గొప్పగా కవిత్వీకరిస్తారు. ఆయన ‘నేను’ యౌగిక దీర్ఘకావ్యం (2020), ఏడో ఋతువు (2022), జీవ సంహిత ( 2022). మొదటిది దీర్ఘ వచన కవిత్వం. రెండవది వచనకవితల సంపుటి. మూడోది చోటి కవితలు అంటే మినీకవిత్వం. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మూడింటిలోని తాత్త్వికాంశాల్ని కొన్నింటిని పరామర్శించే ప్రయత్నం చేస్తాను. 

  • నేను యౌగిక దీర్ఘ కావ్యం గురించి ఇప్పటికే రెండు సార్లు మాట్లాడాను. రెండు వ్యాసాలు రాశాను. కానీ మాట్లాడాల్సిందీ, రాయాల్సిందీ ఇంకా చాలా ఉందనిపించింది. దీని గురించెన్ని సార్లు మాట్లాడినా కొత్త కొత్తగానే ఉంటుంది. భగవద్గీతను ఒక్కసారి చదివితే సరిపోతుందా? అర్థం కానివెన్నో, చదివినప్పుడల్లా అర్థమవుతున్నవెన్నో... భగవద్గీత గురించి ఒక్కసారి మాట్లాడితే సరిపోతుందా? అలాంటిదే విశ్వర్షి వాసిలిగారి ‘నేను’ అనుకుంటాను. 

తత్వమనే పదానికి అనేక అర్థాలున్నాయి. దాని స్వభావాన్ని తెలుసుకోవడం,  పరమాత్మ స్వరూపాన్ని అన్వేషించడం, వేదాంతం మొదలైవి.  అన్నమయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి మొదలైన యోగులు పాడుకొనేవాటినీ తత్వాలు అంటారు...అంటే పరమాత్మకు సంబంధించిన గేయాలుగా అర్థం చేసుకోవచ్చు. మానవుడికీ, దేవుడికీ మధ్య జరిగే ఆత్మ సంఘర్షణను కూడా తత్వమే అనుకోవచ్చు. 

 పంచతత్వాలు అంటే మరలా 1. పృథివి, 2. జలము, 3. తేజస్సు, 4. వాయువు, 5. ఆకాశము.

 తత్వజ్ఞుడు అంటే సత్యం తెలిసినవాడు. సత్యమంటే లౌకిక సత్యమా? ఆధ్యాత్మక సత్యమా? అది ఆధ్యాత్మిక సత్యం. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం.

 భగవంతుడెవరు? ఆయనేరూపంలో ఉంటాడు? ఇవన్నీ తెలుసుకోవడమే తత్వాన్వేషణ. 

తాత్వికుడు, తత్వజ్క్షుడనగానే ఒక ఫిలాసఫర్...అంటే ఒకదార్శనికుడగా అవగాహన చేసుకుంటాం. 

ఇక్కడ నేను వివరించేది వాసిలి వసంతకుమార్ గారి కవిత్వం యొక్క తత్వం. అంటే కవిత్వ స్వభావం. ఆయన కవిత్వంలో కనిపించే వస్తువుని వివరించడం. ఒక కవి అనేకకవితలు రాస్తాడు. కానీ వాటన్నింటిలో ఒకేరకమైన వస్తువు ఉండదు. భిన్నభిన్నకోణాల్లో ఆ వస్తువు అభివ్యక్తమవుతుంది. కానీ, ప్రధానమైన వస్తువు, అది ఆ కవి లక్ష్యభూతంగా ఉండేదొకటి ఉంటుంది. దాన్ని గుర్తించే ప్రయత్నం చేయడమే నేనిక్కడ చేసే ప్రయత్నం.

  • ‘నేను 

అణువు మూలంగా కణకణ సంయోగాన్ని

మానవతత్వానికి తొలి ఆత్మను

మానవ తనానికి తొలి అణువును

మానవ రూపానికి తొలి కణాన్ని

         సృష్టికి ఆకరంగా నేను’’ ( విశ్వర్షి వాసిలి ‘ నేను’ యౌగిక దీర్ఘకావ్యం, పుట: 49) అనడం ద్వారా మానవుడి గురించిన అన్వేషణ దీనిలోని తత్వమని స్ఫురిస్తుంది.  అది మానవుడిలోని ఏ అన్వేషణ? అనేదానికి సమాధానం చెప్తున్నట్లుగా ఇలావర్ణించారు కవి.

‘‘ ఇహం నుండి శక్తి విస్ఫోటనం

పరం నుండి ప్రాణి ప్రవాహం

అంతరిక్షాన జీవ చైతన్యం

భువిని అవతార భూమికనూ నేను’’ ( విశ్వర్షి వాసిలి నేను’ యౌగిక దీర్ఘకావ్యం, పుట:51) ఈలోకంలో కనిపించే భౌతిక సృష్టి, అంతే సమస్తజీవకోటికి సంబంధించిన విషయాల్ని వివరిస్తున్నాను. అయితే, ఈ జీవులన్నీ, మానవుడితో సహా మరణించడం, జన్మించడంలోని రహస్యాల్ని కూడా అన్వేషించడమనేది ‘‘పరం నుండి ప్రాణి ప్రవాహం’’ అనడం ద్వారా స్ఫురిస్తుంది. ఇహం, పరం అనే రెండు పదాలు జాగ్రత్తగా పరిశీలించాలి. మనం జీవిస్తున్న, మనకు తెలిసిన ఈ లోకంతో పాటు, మనకు తెలియని ఆలోకం గురించి కూడా ఈ‘నేను’ దీర్ఘకావ్యం అన్వేషిస్తుంది. అందుకనే దీన్ని తొలి ప్రకరణంలో ‘‘అణువు కథ ఇది... మనిజ కథ ఇది

మనసు కథనం ఇది...మనుగడ కథనం ఇది

మట్టి కథ ఇది... మట్టిని మెట్టిన ప్రాణి కథ ఇది

పరిణామ చరిత్రన తొలి ప్రకరణమిది’’  (విశ్వర్షి వాసిలి నేను’ యౌగిక దీర్ఘకావ్యం, పుట:51) అన్నారు. 

నేను’ యౌగిక దీర్ఘకావ్యం చదువుతుంటే ‘నేను’ అనేదొక సంకేతం, నేను అనేదొక ప్రతీక. ఈ విశ్వంలో నేను ప్రతి జీవికీ సంకేతం. ఈ విశ్వంలో ప్రతీ జీవి అస్తిత్వ సంఘర్షణకీ ఒక ప్రతీక. తనను తాను తెలుసుకోవడమే నిజం. తనను తాను తెలుసుకోవడమంటే తన రూపంలో ఉన్న ఒక జీవిని, తనలాంటి రూపంలో మన చుట్టూ ఉన్న జీవుల్ని తెలుసుకోవడం. అది కేవలం లౌకికజ్ఞానంతో సాధ్యం కాదు. దానికి సాధన కావాలి. ఆ సాధన గురువు ద్వారానే సాధ్యం. తన అనుభూతులు, తన ఇంద్రియానుభూతులు, తన అతీంద్రియానుభూతులను గుర్తించే శక్తి గల గురువు కావాలి. దానికి యోగా ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. తన శక్తిని తాను తెలుసుకొనేలా చేస్తుంది. నేను’ యౌగిక దీర్ఘకావ్యం తనను, తన చుట్టూ ఉన్న జీవుల్నీ, తనకు కనిపించే వాటినీ, కనిపించని వాటిని తెలుసుకొనే చైతన్యమే నేనుగా చెప్తుంది. పారమార్థిక పదకోశాన్ని మీరు గమనిస్తే అనేక సందేహాలకు వివరణలు లభిస్తాయి. మన పూర్వీకులు సప్తచైతన్యాలు గురించి వివరించారు. అవి: 1. శుద్ధ చైతన్యం, 2. ఈశ్వర చైతన్యం, 3. జీవ చైతన్యం, 4. ప్రమాతృ చైతన్యం, 5. ప్రమాణ చైతన్యం, 6. ప్రమేయ చైతన్యం, 7. ఫల చైతన్యం.  వీటిలో ఫల చైతన్యం విశ్వాన్ని తనను వేర్వేరుగా కాకుండా ఒకటిగా చూసేలా చేస్తుంది. అప్పుడు మాత్రమే ...

‘‘నేను ఈ విశ్వం /    ఒక్కటే!/అభేదమే!/త్వమేహమే/సెవన్త్ డైమన్సనే’(విశ్వర్షి వాసిలి నేను’ యౌగిక దీర్ఘకావ్యం, పుట:140) అని ఎందుకన్నారో అర్థమవుతుంది. దీన్ని విశ్వర్షి గారే ఇలా వివరించారు. 

‘‘రూపంలో 'అరూపం' అవుతూ

 'అపురూపం' అవుతున్నవాడ్ని 

భౌతికంలో 'అభౌతికం' అవుతూ 

‘అధిభౌతికం' అవుతున్నవాడ్ని.

నేను ఫోర్త్ డైమెన్షనల్

ధ్యాన మగ్నమైనవాడ్ని.

దేహాన్ని దాటుతున్నవాడ్ని 

మనసును దాటుతున్నవాడ్ని 

భూమ్యాకర్షణను దాటుతున్నవాడ్ని

దాటుడంతా త్రీడైమెన్షనే!

దాటుతూ దాటుతూ

అభౌతికం కావటం ఫోర్త్ డైమెన్షన్!

 - కాల స్థితుల మమేక ధ్యానమగ్నతని. 

అభౌతికం నుండి అధిభౌతికం ఫిఫ్త్ డైమెన్షన్!!

- గురుత్వాకర్షణ విద్యుదయస్కాంత శక్తుల సంయోగాన్ని

నేను

యౌగిక సంపర్కాన్ని

సిక్స్త్ డైమెన్షన్ పరిణామాన్ని

- భూత భవిష్య వర్తమాన కాలాల దర్శనాన్ని. 

సెవెన్త్ డైమెన్షన్ పరిణామాన్ని

- మాధ్యమాతీత పారదర్శక దర్శనాన్ని.

ఆ ‘భృక్తం'లో

ఎటు చూసినా నేను

 ఎక్కడ చూసినా నేను

 అన్నిటా నేను

అంతటా నేను

 అన్నీ నేను.

నేను ఈ విశ్వం

ఒక్కటే!’’ (విశ్వర్షి వాసిలి నేను’ యౌగిక దీర్ఘకావ్యం, పుట:140) 

ఈ సృష్టిలో మానవుని అస్తిత్వం, సర్వజీవుల అస్తిత్వం, ఈ విశ్వంతో ముడిపడిన తీరునంతా ఈ నేను యౌగిక దీర్ఘకావ్యం మనకు తెలియజేస్తుంది. ఈ పకృతితో కూడా మానవుడెలా ముడిపడి ప్రవహిస్తున్నాడో తెలియాలంటే ఈ నేను కావ్యం చదవాలి. యోగ సూత్రాలు తెలిసినవారికి, గురువు ద్వారా యోగ రహస్యాలు అభ్యసించి సాధన చేసేవారికి ఈ నేను దీర్ఘకావ్యం మరింత ఆత్మీయంగా ఉంటుంది.
ఏడో ఋతువు ( 2022) అముద్రితం:

    ఇది సుమారు 42 వచన కవితలతో కూడిన కవితాసంపుటి. మనకున్న ఋతువులు ఆరు: 1. వసంతము, 2. గ్రీష్మము, 3. వర్షము, 4. శరత్తు, 5. హేమంతము, 6. శిశిరము. కానీ, కవి ఏడోఋతువు అని ఈ కవితాసంపుటికి పేరు పెట్టడమే ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. కరోనా వల్ల వలసల్ని బాగా గమనించాం. దీన్ని కవి రక్త ఋతువు  పేరుతో రాసిన ఒక కవితను ఆధారంగా ఈ పుస్తకానికి ఏడో ఋతువు అని పేరుపెట్టారు. సమాజంలోని భిన్న తరగతుల మానవ జీవన సంఘర్షణను ఈ కవిత వర్ణించింది. వరుసగా మూడు కవితలు వలసల గురించే ఉన్నాయి. వలస వరస, వలస ఋతువు, రక్త ఋతువు. మూడూ వలసల వల్ల మానవులెలా తల్లడిల్లిపోయారో చెప్పారు. కానీ కేవలం లౌకికమైన విషయాలతోనే ఆపేస్తే, లౌకికమైన విషయాలతోనే ముగిస్తే విశ్వర్షి ఎందుకవుతారు. 

ఈ నగరం నాకేమిచ్చింది

 భవన భోగానికి 

పైకప్పుకు వేసిన వలస కూలీని చేసింది 

కూలిన జీవితానికి 

పిడకలు పేర్చిన కాటికాపరి చేసింది

 అయినా ఈ నగరం నిన్ను నన్ను మోస్తూనే ఉంది 

నన్ను నిన్ను వలసలనే అంటుంది. (రక్త ఋతువు- ఏడో ఋతువు, పుట:41)  ఈ కవిత చదివితే సమకాలీన సమాజంలో వలసవల్ల ఇబ్బందులకు గురవుతున్న సామాన్య, మధ్యతరగతి జీవితాలన్నీ కళ్ళకు కట్టినట్లుంటాయి. ఇలా ఇక్కడ వలస గురించి చెప్పిన కవి విశ్వర్షి మరోచోట వలస గురించి ఇలా చెప్పారు. 

‘‘ పురుషత్వం స్త్రీత్వాన్ని చేరుకునే వలస

కణమో, జీవమో ప్రాణమో ఆత్మనో

ప్రకృతి గర్భాన్ని చేరుకుంటున్న వలస 

భవిష్య తత్వాన్ని నవమాసాలు మోసిన 

అమ్మతనం నుండి విడవడుతున్న వలస

పరం నుండి పాంచభౌతికానికి వలస

పుట్టుకా వొక వలసనే

చావూ వొక వలసనే

వలసకాని వరసంటూ వుందా మిత్రమా’’ ( వలస వరస, పుట: 38)

దీనిలో కొన్ని లౌకిక స్పందనలకు సంబంధించిన కవితలున్నాయి. విశ్వర్షి వాసిలి వారి నాన్నగార్ని స్మరించుకుంటూ తాను పయనించిన కవితలున్నాయి. వలసల్ని కొత్తగా నిర్వచించి, మానవులంతా ‘వలస’ జీవులేనని లౌకిక వస్తువుని చూపిస్తూ, పారలౌకికమైన ఆలోచనాపథానికి తీసుకొనిపోయే కవితలు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. 

‘నాన్న’ పేరుతో రాసిన ఒక గొప్పకవితలో ...

అందరూ

అమ్మతనం గురించి మాట్లాడేవారే 

నాన్న మది అమ్మతనంలో లయిస్తుంటుంది.

 అమ్మ మన జేబులు నింపుతుంటే

 నాన్న తన జేబులు తడుముకుంటుంటాడు.

నాన్నతనం

నాన్నంత మౌనం అని కాబోలు !

అవును.

అమ్మ కనిపించే,

కని పెంచే దృశ్య మాలిక

నాన్న కనిపించక

పంచే అదృశ్య గీతిక.... ఇలా నాన్నలోని ఔన్నత్యాన్ని మనందర్నీ గుర్తించేలా హెచ్చిరిస్తూ చేయిపట్టుకొని నడిపించుకుపోతుందీ కవిత. ఇలా అనేకమైన లౌకికమైన జీవితాల్ని ప్రతిఫలిస్తూ వర్ణించిన కవితలన్నీ మళ్ళీ చివరికి తన సత్యాన్వేషణ వైపే పయనించేటట్లు చేస్తాయి. 

నా అక్షరం

తేజస్సంపన్న యోగ్యతాపత్రం

 సర్పనేత్ర యోగపథం 

భూలోక భృక్తనిధి 

భువర్లోక అంతర్విధి 

సువర్లోక అంతర్నిధి.త్య్ర

నా అక్షర

ఆత్మదర్శనాల నిఘంటువు

సాధనారహస్యాల సర్వస్వం.

అన్నట్టు,

నీ ఆత్మ తలుపులు తెరిస్తేనే కదా

 నా అక్షరం నీకు ఉపదేశామృత మయ్యేది’’ అని తన కవిత్వ తత్వాన్ని తెలిపేలా ‘ ఉపదేశామృత అక్షరం‘ పేరుతో తన కవిత్వ లక్ష్యాన్ని రాసుకున్నారు కవి. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిందొకటి ఉంది. ఈలోకంలో ఉన్న మానవుడు మరోలోకం గురించి ఆలోచించినా, ఆలోచించకపోయినా కచ్చితంగా మరణించిన తర్వాత ఏమవుతాడని ఆలోచించాలనిపిస్తుంది. అందుకే మనఋషులు చెప్పిన కొన్ని అంశాల్ని ఇక్కడ విశ్వర్షి పొందుపరిచారు. 

  • సాధారణంగా పెద్దవాళ్ళు ఏడు పుణ్యలోకాలు, ఏడు నరకలోకాలు గురించి చెప్తుంటారు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము ... సప్తలోకాలు వీటిని ఊర్ధ్వలోకములు అంటారు. 

 

  • భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అను ఊర్ధ్వలోకములు. ఈయేడు లోకములలోను జీవులు వారివారి కర్మఫలప్రాప్తికి అనుగుణ్యంగా దానిలో ఉంటారు. 

  • భూలోకమునందు మనుష్యులును, భువర్లోకమునందు యక్ష రాక్షస గంధర్వ కిన్నర కింపురుషులు మున్నగువారును, స్వర్గలోకమునందు దేవతలును దానికి పయిన వారివారి పుణ్యోదయ విశేషమును బట్టి పైపై లోకములయందు వారివారికి పైయంతస్తు కలవారును ఉంటారు. అన్నిటికి పైది సత్యలోకము. అదే బ్రహ్మలోకము. 

  • ఈలోకమునకు పోవుటకు రెండుమార్గములు- అర్చిరాది మార్గము ఒకటి; ధూమాది మార్గము ఒకటి. కేవల బ్రహ్మజ్ఞానము కలవారు అర్చిరాది మార్గమున పోదురు. సగుణ బ్రహ్మోపాసనా యోగాభ్యాసమును చేయువారు ధూమాది మార్గమున బ్రహ్మలోకమును పొందుదురు.


  • ఇట్లే అధోలోకములును ఏడు ఉన్నాయి. అవి అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము 

  • ఈ సప్తలోకములకు క్రింద మాయ మొదలగు నరకములు ఉండును. 

  • వీనికన్నిటికిని ఆధారముగ విష్ణ్వంశసంభూతుఁడు అగు ఆదిశేషుఁడు నిలిచి ఉండును. ఈశేషుని విషజ్వాలామయ ముఖములనుండి యముఁడు పుట్టి జనులను శిక్షించుచు ఉండును. 

  • ఈ లోకములు అన్నియు చేరి పదునాలుగు లోకములు అనఁబడును. 

  • స్వర్గమర్త్య పాతాళములు మూడును త్రిలోకములు అనఁబడును.

ఇలా ఒక్కో పదం వెనుక ఈ కవితా సంపుటాల్లో ఎంతో పారమార్థికమైన అర్థాలున్నాయి. 

 

 

 

జీవ సంహత: (2022) అముద్రితం 

  • వీటిని చిన్నిలోచనల చిట్టి కవితలుగా పేర్కొన్నారు కవి. ఈ పుస్తకానికి పెట్టిన పేరులో సంహిత అనేది గుర్తించాల్సిన పదం.  

  • వేదాన్ని కూడా సంహిత అంటారు. అంటే సంహితలతో కూడింది వేదం. 

  • ఇంతకీ సంహిత అంటే...వేదమంత్రాల సంకలనంగా చెప్తారు. సాధారణంగా వేదం నాలుగు భాగాలుగా చెప్తారు.

  •  సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తు. మంత్రభాగాన్ని, అదీ దేవతాస్తుతులకు సంబంధించిన భాగాన్ని సంహిత అంటారు. 

  • సంహితలోని విషయాన్ని వివరించేదాన్ని బ్రాహ్మణం అంటారు. 

  • ఉపనిషత్తులనేవి గురువుగారి దగ్గర ఆయన కంటే దిగువ స్థాయిలో కూర్చుంటే గురువుగారు చేసే బ్రహ్మోపదేశానికి సంబంధించిన చర్చోపచర్చల సారాంశం.

  •  బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్య కొన్న కర్మవిధులుంటాయి. వాటిని వివరించేదాన్ని అరణ్యకం అంటారు. 

  • ప్రతి వేదానికి చివర ఒక ఉపనిషత్తు ఉంటుంది. దీన్నే వేదాంతం అని పిలుస్తారు. కానీ వేదాంతం అంటే అద్వైత సిద్ధాంతమే. 

  • ఇంతకీ విశ్వర్షి గారు జీవ సంహితలో కొన్నింటిలో మూడు, నాలుగు, ఆరు పాదాలుగా చిన్న చిన్న వచనకవితలుగా రాశారు. వీటిని సాహిత్య పరిభాషలో మినీకవితలుగా చెప్పొచ్చు. మనచుట్టూ ఉన్న వస్తువుల్ని ఉపమేయాలుగా తీసుకొని జీవిత రహస్యాల్ని వివరిస్తూ ఈ కవితల వర్ణన కొనసాగింది. 

‘‘జీవితం కాల కొలమానం

అనవసరాల బరువులతో

అవసరాలను తూచాలి’’ ఈ కవితలో భౌతికంగా కనిపించే వస్తువులే మనకి ఉపమేయాలుగా పోల్చారు. కానీ, జీవితంలో బ్యాలెన్స్ తప్పామంటే అధ: పాతాళానికి పోతామనేది ధ్వని. దీన్ని ఎంతైనా వ్యాఖ్యానించవచ్చు. మనకెంత కావాలో అంతే సంపాదించుకోవడం, తినడం చేయాలి. దానికి మించి దాచుకుంటే మనలో ఎక్కడో స్వార్థం, ఇతరమనుషుల పట్ల నమ్మకం లేకపోవడం వంటివన్నీ ఆ మనిషిలో ఉన్నాయనేది తెలుస్తుంది, అవసరాల్ని కూడా తూచాలంటే అవసరమైనంతవరకే తీసుకోవడమనేది మనకి ఈ ప్రపంచంలోలభించే అనేకమైన వాటితో మనం ఏర్పరుచుకోవాల్సిన బంధాన్ని తెలియజేస్తుంది. అలా చెప్పిన కవిగారే మరలా తన తాత్విక సత్యావిష్కరణ వైపు తీసుకొనిపోతారు. 

  • ఇహానికే తులా భారం

పరానికి తల భారమే.

అహం నర పుర విలాసానికే

సోహం నవ పుర వాసానికే.

••

తనూవిలాపం ఇంద్రియ చాపల్యం

త్వమేవాహం అతీంద్రియ సంస్కారం.

  • ఇక్కడ ఇంద్రియాలు మనిషిని లోభర్చుకునే ఆకర్షక సాధనాలు. పాంచభౌతికమైనది ఈ దేహం. అంటే పంచభూతాల వల్ల ఏర్పడింది. శబ్ద స్పర్శ రూప రస గంధాలనేవి పంచభూతాల గుణాలు. శరీరంలో జ్ఞానేంద్రియాలు ఈ పనులు చేస్తుంటాయి. ఇంద్రియాల  లక్షణాలు ఏ రకంగా కలిగి ఉన్నాయో చూద్దాం.

1. ఆకాశము యొక్క గుణము శబ్దం. ఈ శబ్దాన్ని గ్రహించే ఇంద్రియం - చెవి.

2. వాయువు యొక్క గుణం స్పర్శ. ఈ స్పర్శని గ్రహించే ఇంద్రియం -చర్మము.

3. అగ్ని యొక్క గుణం - తేజస్సు, కాంతి. ఈ కాంతిని గ్రహించే ఇంద్రియం - కన్ను.

4. జలము యొక్క గుణం - రుచి. ఈ రుచిని గ్రహించే ఇంద్రియం - నాలుక.

5. భూమియొక్క గుణం - గంధం. వాసన చూసే ఇంద్రియం - ముక్కు. 

  • ఈ రకంగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అనే జ్ఞానేంద్రియాలు పంచభూతాల గుణాలను కలిగి ఉన్నాయి. అంతేకాదు. అసలు పంచభూతాలే ప్రత్యక్షంగా శరీరంలో కనిపిస్తాయి. హృదయాకాశమే - ఆకాశము. ఉశ్వాస నిశ్వాసలు జరిగేటప్పుడు శరీరమంతా ప్రసరించేది వాయువు. తిన్న ఆహారాన్ని అరిగించేది జఠరాగ్ని, ద్రవరూపంలో ఉన్న రక్తము మొదలైనవి జలము. గట్టితనం గల ఎముకలు మొదలైనవి భూమి. ఈ రకంగా పంచభూతాలలోను నిర్మించబడినదే ఈ శరీరము.

  • అందుకే దీన్ని పాంచభౌతికము అంటారు. అసలు పంచభూతాలే శాశ్వతం కానప్పుడు, వాటివల్ల ఏర్పడిన ఈ శరీరం ఏ రకంగా శాశ్వతమవుతుంది? అని ఈ మినీకవితలా ఉండే కవిత ద్వారా మనల్ని ఆలోచింపజేస్తారు కవి. 

లీలగా కళ్లముందు కదలాడుతోంది

 అడుగులు తడబడుతున్ననాడు

     అమ్మ చూపుల్లో చూపు కలిసినపుడు

      అయిన అసలైన విశ్వదర్శనం.

మనస్సు పొరలలో దోగాడుతోంది

 అక్షర పాఠాలు వెక్కిరిస్తున్ననాడు

నాన్న చూపుడువేలులో చుట్టుకున్న

     నా వేలికొసల ప్రవిమలదర్శనం.

అమ్మది ఆత్మజ్ఞానం - నాన్నది జ్ఞానామృతం ... ఇలా ఏ చిట్టి కవితను తీసుకున్నా సుదీర్ఘమైన వివరణలు ఉన్న భావాల సంగమం ఉంటుంది. 

 

  • మొత్తం మీద నేను యౌగిక కావ్యం, జీవ సంహిత, ఏడో ఋతువు ఏ పుస్తకాన్ని చూసినా  మానవజీవాన్వేషణాతత్వంతో జ్ఞానవాకిలిని చూపిస్తున్నాయి. 

  • 'అజ్ఞానం' అనే మాట మనం అనేకసార్లు చెబుతుంటాం. అసలు అజ్ఞానం అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? జ్ఞానం లేకపోవటమే అజ్ఞానం. జ్ఞానమనేది రెండు రకాలు.

 

  • విషయపరిజ్ఞానము: లోకంలో మనకు కనుపించేవస్తువుల, మనం ఉపయోగించేవస్తువుల విషయపరిజ్ఞానం. దీన్నే సామాన్యజ్ఞానము అంటారు. దైనందిన జీవితంలో దీని అవసరం ఎంతైనా ఉంది.

 

  • 2. పరాజ్ఞానము : పరమేశ్వరుడు, పరబ్రహ్మను గురించిన జ్ఞానము. చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించాడు. అతడే పరబ్రహ్మ సృష్టి ప్రారంభం కాక ముందు ఈ జగత్తంతా శూన్యంగా ఉండేది. ఆ శూన్యాన్ని పరబ్రహ్మ ఆక్రమించి ఉన్నాడు. సృష్టి జరిగిన తరువాత తానే

  • లక్షల రకాలయిన జీవరాసిగా మారాడు. ఈ రకంగా మళ్ళీ జగత్తంతా ఆక్రమించి ఉన్నాడు. మొత్తం మీద చరాచర జగత్తంతా పరమేశ్వరమయం. జగత్తే పరమేశ్వరుడు, పరమేశ్వరుడే జగత్తు. వేదాంత పరిభాషలో దీన్నే జ్ఞానము అంటారు. ఈ రకమైన జ్ఞానం లేకపోవటాన్నే అజ్ఞానం అంటారు.

 

  • పరమేశ్వరుడు మానవ శరీరాన్ని సృష్టించిన తరువాత ఈ శరీరంలో నేను లేకపోతే ఎలాగ? అనుకుని బ్రహ్మరంధ్రం గుండా మానవ శరీరంలో ప్రవేశించి, దానితో తాదాత్మ్యం చెంది, నవరంధ్రాలతోను అన్ని సుఖాలు అనుభవిస్తూ, వచ్చిన త్రోవ కూడా మరచిపోయి, నేను అంటే దేహము అని భావన చేశాడు

  • ఈ శరీరంతో అనుభవించే లౌకిక సుఖాలే నిజమైన సుఖాలు అనుకుని పంజరంలో బంధించబడిన పక్షిలాగా ఈ దేహంలోనే ఉండిపోయి, అజ్ఞానాంధకారంలో ఉండకూడదని తెలుసుకోవాలని ఈ కావ్యత్రయం ప్రబోధిస్తుంది. 

  • ఈ ప్రసంగం ద్వారా నన్ను నేను తెలుసుకోవడానికి, నాలోని అహంకారాన్ని తగ్గించుకోవడానికి, నా నిజమైన అస్తిత్వాన్ని గుర్తెరిగి ప్రవర్తించడానికి ఎంతగానో దోహదం చేసిన ఈ సదస్సు నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 


No comments: