భారతీయ దళిత సమస్యల ప్రతీకాత్మక నవల ‘అవతలి గుడిసె’
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగుశాఖ, అధ్యక్షుడు,
యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాద్, ఫోన్: 9182685231
దళితుల సమస్యలు భారత దేశంలో ఏవో ఒకటి, రెండు ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావనీ, దేశవ్యాప్తంగా ఆ సమస్యలను అనుభవిస్తూ కష్ట నష్టాలకు గురవుతూ, వాటినుండి బయటపడి ఆత్మగౌరవంతో నిలబడి, ఆర్ధికంగా బలపడ్డానికున్న అడ్డంకులకు గల కారణాలను, వాటి పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆ దళిత జీవిత సంఘర్షణ అంతా దళిత సాహిత్యం పేరుతో దేశవ్యాప్తంగా విస్తృతంగానే వస్తుందని చాటి చెప్పే నవల అవతలి గుడిసె. దీన్ని హిందీలో ఛప్పర్ అనే పేరుతో డా.జయప్రకాష్ కర్ధమ్ రాసిన ఈ నవలను తెలుగులోకి ఆచార్య వి.కృష్ణ అనువదించారు. 2021 జూలైలో ఛాయా పబ్లికేషన్స్ వారు దీన్ని ప్రచురించారు. ఈ నవల ప్రజాస్వామ్య బద్ధంగా, చట్టపరిధుల్లో దళితులు తమ సమస్యల్ని సామరస్య పూరితంగా పరిష్కరించుకొనే మార్గాలను సూచించిన నవల. దళితులకు ముందుగా కావాల్సింది రాజ్యాధికారం కంటే సామాజిక చైతన్యమనీ, దాన్ని సాధించినప్పుడు దళితులు కూడా ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తే, రాజ్యాధికారాన్ని సాధించినా సాధించకపోయినా దళితులు స్వేచ్ఛగా, ఆత్మగౌరవంతో పాటు అందరితో సమానంగా జీవించగలిగే ధైర్య,స్థైర్యాల్ని సాధించే అహింసాయుత ఉద్యమాన్ని ఈ నవలలో సూచించారు. మనిషికి నిజమైన మానసిక పరివర్తన వస్తే మానవునిలో ఎలాంటి భేదభావాలు లేని సమానత్వం, మానవత్వం పరిమళిస్తాయని, అలాంటి మార్పు మాత్రమే అందరికీ మంచి చేస్తుందని ఆశించిన నవల.
ఛప్పర్ - అవతలి గుడిసె రచయితలు:
ఉత్తర భారత దేశానికి చెందిన డా.జయప్రకాష్ కర్ధమ్ ఉన్నత విద్యావంతుడు. హిందీ, చరిత్ర, తత్వ శాస్త్రాలలో ఎం.ఏ.పట్టాపొంది, డాక్టరేట్ పట్టా మాత్రం హిందీలో తీసుకున్నారు. కవిత, కథ, నవల, విమర్శ ప్రక్రియలలో విశేషమైన కృషి చేశారు. హిందీలో ప్రచురిస్తున్న దళిత వార్షిక సంచికకు సంపాదకులుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన హిందీ లో రాసిన మూడు నవలల్లో ఒక నవల పేరు ఛప్పర్ (1996). తెలుగులో ఆచార్య వి. కృష్ణ దీనికి అవతలి గుడిసె అని పేరు పెట్టడానికి అనేక అంశాల్ని పరిగణనకు తీసుకున్నారనుకుంటున్నాను. కృష్ణగారు కూడా హిందీలో ఎం.ఏ. పిహెచ్. డిలను చేసి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ హిందీ శాఖలో ఆచార్యుడుగా ఉండి, ప్రస్తుతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ కి డీన్ గా పనిచేస్తున్నారు. కవిత్వం, కథ, నవల, విమర్శ ప్రక్రియలలో అనేక రచనలు చేశారు. అనేకమంది పరిశోధకులకు పర్యవేక్షకులుగా ఉన్నారు. హిందీ భాష నుండి తెలుగులోకి అనేక అనువాదాలు చేశారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో దళిత, ఆదివాసీ సాహిత్యంపై పరిశోధనల కోసం సెంటర్ ఫర్ దళిత్ అండ్ ఆదివాసీ స్టడీస్ & ట్రాన్స్ లేషన్ అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పరిచేలా కృషి చేశారు.
ఛప్పర్ - అవతలి గుడిసె: అనువాద నవల నామౌచిత్యం:
హిందీలోని ఛప్పర్ అనే పదానికి ఆకులతో కట్టిన ఒక ఇల్లు అనే అర్ధ వివరణను చెప్పుకోవచ్చు. కాబట్టి దాన్ని వ్యవహారంలో ఆకులతో కట్టిన గుడిసె అనుకోవచ్చు. పేదవాళ్ళు సాధారణంగా తాటాకులతో గానీ తుంగ గడ్డితో గాని లేదా తమకు దొరికే ఆకులతో ఇల్లు పై కప్పు కట్టుకుంటారు. ఇల్లు అనగానే సాధారణంగా మనకి గోడలు, గదులతో కూడిన ఒక దృశ్యం మదిలో మెదులుతుంది. అలా కాకుండా గుడిసె అన్నారనుకోండి... ఒక నిట్రాడు ( మధ్యలో పాతిన ఒక స్తంభం), దానికి ఆనుకొని చుట్టూ చిన్న చిన్న కర్రలు లేదా గెడలు లేదా వాసాలతో నిర్మించే దృశ్యమే మన మనసులో కనబడుతుంది. గుడిసెకు ఒకవైపే గుమ్మంలా లోనికి వెళ్ళడానికీ, బయటకు రావడానికీ చేసుకున్న ఒకే ఒక్క మార్గం ఉంటుంది. దానిలో నుండి లోనికి వెళ్ళినా, బయటకొచ్చినా తల కిందికి పెట్టిన వంగి రావాలి. అలాంటి గుడిసెలు పేదరికానికి సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంటాయి. అలా నిర్మించుకోవడంలో కూడా ఆధిపత్య వర్గాల ఆలోచనలు ఉన్నాయేమో అనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సంచులతో కుట్టిన బరకం లేదా ప్లాస్టిక్ తో చేసిన బరకంతో కూడా గుడిసెలు కట్టుకుంటున్నారు. ఇలాంటివి సాధారణంగా నగరాల్లోని రోడ్డు ప్రక్కన తాత్కాలికంగా వేసుకుంటుంటారు. ఇక్కడ పేదవాళ్ళనే పదంలో దళితులు, వాళ్ళ అవమానాలు అంతగా స్పురించవు. కానీ, పేదవాళ్ళలో దళితులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా గుడిసెల్లో ఉంటారు.అందువల్ల అనువాదకుడు ఆచార్య వి.కృష్ణదీనికి ఇల్లు, గుడిసె అనే పదాల్లో ఏదొకటి పెడితే నవలలోని వస్తు లక్ష్యమంతా పాఠకుడికి స్ఫురిస్తుందో లేదోనని అవతలి గుడిసె అని పేరు పెట్టారేమోననిపిస్తుంది. అప్పుడు మాత్రమే పాఠకుడికి నవలంతా పరుచుకున్న దళిత జీవితమే దీనిలోని కథావస్తువని తెలుస్తుంది. ఆచార్య కృష్ణ మార్క్సిజాన్ని, దాని పరిభాషను బాగా అధ్యయనం చేసినవారు. కేవలం ఆర్థికాంశాలతో మాత్రమే దళిత సాహిత్యం ముడిపడి లేదనీ, ఆర్థికాంశాలు, వాటిని దళితులకు అందకుండా చేసిన మనువాదాన్నీ, సమాజంలో కనిపిస్తున్న కులప్రభావాన్నీ గుర్తించిన సాహితీవేత్త. దళితులను వెంటనే గుర్తించడానికి వారికెలాంటి పేర్లు పెట్టాలో, వారికెలాంటి విధులు కేటాయించాలో, వాళ్ళెక్కడ నివాసముండాలో కూడా నిర్దేశించిన మనుధర్మ శాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేసినవారు. శూద్రులు ఊరికి దూరంగా నివాసం ఉండాలని మనుస్మృతి పదవ అధ్యాయంలో ఉంది.
అవతలి గుడిసె వస్తువు:
ఒక గ్రామంలో ఆధిపత్య కులాలకు బలైపోతున్న ఒక దళిత కుటుంబాన్ని కేంద్రంగా చేసుకొని భారతీయ దళితుల సమస్యను ఈ నవల్లో వస్తువుగా తీసుకున్నారు. దీనికి ఒక వాస్తవిక సంఘటన ప్రధానమైన ఆధారం. ఉత్తరభారత దేశంలో గంగానదీప్రాంతంలో కథ జరిగినట్లు రాశారు రచయిత. ఊరికి దూరంగా విసిరివేయబడిన ఒక గుడిసెలో రమియా-సుఖ్ఖా జీవిస్తుంటారు. వారి కొడుకు చందన్. పట్టణంలో చదివించడానికి పంపిస్తారు. అక్కడ తన గ్రామపెత్తందారు ఠాకూర్ హర్నామ్ సింగ్ కూతురు రజని తనకు క్లాసుమేటుగా ఉంటుంది. చందన్ నిజాయితీ, తెలివితేటలు ఆమెను ఆలోచింపజేస్తాయి. తన తండ్రి, మరికొంతమంది ఆధిపత్య వర్గాలతో కలిసి తమ ఊర్లో చేస్తున్న దురాగతాలను ఎప్పటికప్పుడు గమనిస్తుంది. చివరికి చందన్ తల్లి దండ్రుల ఇల్లు, పొలాన్ని కూడా లాగేసుకునేలా చేసిన తన తండ్రి, ఆధిపత్య వర్గాల కుట్రను రజని వ్యతిరేకిస్తుంది. చందన్ పట్టణంలో అంబేద్కరిజాన్ని ప్రచారం చేస్తున్నందుకు ఆధిపత్య హిందూ భావజాలం గల వాళ్ళు అతనిపై దాడిచేస్తారు. ఆ దాడిలో తనకు ఆ పట్టణంలో ఇల్లు దొరక్కపోతే ఆశ్రయం ఇచ్చిన హరియా కూతురు కమల అతణ్ణి కాపాడి, తాను ప్రాణాలు కోల్పోతుంది. ఒకప్పుడు వినాయక జయంతులు, శ్రీరామనవములు చేస్తే జనంలో అంబేద్కర్ చైతన్యం చదువుకునేలా చేస్తుంది. తమ బ్రతుకులలో గల చీకటికి కారణమైన కర్మసిద్ధాంతాన్ని వ్యతిరేకించేస్థితికి చేరుకుంటారు. చందన్ తన మిత్రులతో కలిసి చట్టపరిధిలోను, న్యాయపరిధిలోను, వ్యాపారాల్లోను తాము నిలదొక్కుకోగలిగినప్పుడు మాత్రమే దళితుల సమస్యలకు శాశ్వతమైన పరిష్కారాలు, శాంతియుతమైన జీవనం సాధ్యమవుతుందని గుర్తించేలా ఉద్యమాన్ని చేస్తాడు. తన కొడుకు కేవలం తమకు ఉపయోగపడితే చాలనుకున్న తండ్రి సుఖ్ఖా తనకొడుకుని సమాజానికి అంకితం చేయడానికి సిద్దపడిపోతాడు. ఒక తరం చేసిన అన్యాయాలు, అక్రమాలు తర్వాత తరంపై వాటి ప్రభావం తీవ్రంగా ఉండి దళితులకు ఆధిపత్య వర్గాలు, కులాలు తర్వాత తరం వాళ్ళు అవే దుశ్చర్యలు చేయకపోయినా ఒక ద్వేషాన్ని పెంచుకునేలా చేస్తాయని, అందువల్ల ఆ ఫలితాలనుండి తర్వాత తరం వాళ్ళు ఎలా కాపాడుకోవాలో రజని పాత్ర ద్వారా చిత్రించారు. ఆమె దళితులకు రావలసిన హక్కుల కోసం పోరాడే ఉద్యమంలో కలిసిపనిచేస్తుంది. తన కూతురే తనను అసహ్యించుకోవడంతో తట్టుకోలేని తండ్రి ఠాకూర్ హర్నామ్ సింగ్ ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు తనని హింసినప్పటికీ క్షమాహృదయంతో సుఖ్ఖా అతణ్ణి కాపాడటం, ఆతనిలో పశ్చాత్తాపంతో దళితుల్ని కూడా సమాజంలో భాగంగా గుర్తించడంతో నవల ముగుస్తుంది.
నవల ప్రారంభంలోనే రచనలో తీసుకొనే జాగ్రత్తను గమనించాలి. '' మిగతా గ్రామాల లాగానే సవర్లులు ఎగువ వైపు, అవర్లుగా పిలవబడే దళితులు గంగా నది కి దిగు వైపున ఉంటారు. దిగువ వైపున ఊర్లో అన్నింటికన్నా చివరన సుఖ్ఖా ఇల్లు. ఆ తరువాత కూలిపోయే శిధిలావస్థలో ఉండే రెండు మూడు పూరి గుడిసెలు, పెంట కుప్పలు'' (పుట:5) ఇక్కడ అవర్ణలుగా పిలవబడే దళితులు అనడంలో అవర్ణులు అనేదాన్ని రచయిత నిర్ధారణ చేయట్లేదు.అది సమాజంలో దళితులు ఆరోపిస్తున్న స్థితి. అంతే తప్ప దాన్ని తాము అంగీకరించడం లేదనే భావం ఇక్కడ స్పురిస్తుంది. ఈ నవల్లో రమియా - సుఖ్ఖా భార్యా భర్తలు. వీళ్ళకు పుట్టిన చందన్ ఈ నవలలో కథానాయకుడు. అతనిది చందనంలా చల్లని మనసు. అందరూ బాగుండాలే ఆశయం కలవాడు. చందనమెలా తన చుట్టూ ఉన్నవాళ్ళనీ, తనని తాకిన వాళ్ళనీ సువాసనలతో నింపుతుందో, అతను కూడా తన చుట్టూ ఉన్నవాళ్ళని మానవత్వంతో పరిమళించేలా చేస్తుంటాడు. రచయిత ఈ పేరు పెట్టడంలో కూడా ఎంతో ఔచిత్యం దాగివుంది.
భావజాలాలతో నిమిత్తంలేని స్వచ్ఛమైన మానవ స్పందన:
ఈ నవల చదువుతుంటే సుఖ్ఖా అనే పాత్రలో మనలోని ఓ తండ్రి... చందన్ పాత్రలోమనలోని ఓ కొడుకు...వాళ్ళకున్న అనుబంధాలన్నీ గుర్తుకొస్తాయి. మూల రచయిత డా.జయప్రకాశ్ కర్ధమ్ ఎలా రాశారో తెలియదు. కానీ, తెలుగు అనువాద రచయిత ఆచార్య వి.కృష్ణ రచన ద్వారా ఇద్దరి రచయితలపైనా పాఠకులకు ప్రేమ రెట్టింపవుతుంది. వర్ణనలు కూడా సన్నివేశానికి అనుగుణంగా శాశ్వతమైన అనుభూతితో నింపేలా వర్ణించారు. పేదవాడైన సుఖ్ఖా తన భార్య గురించెంత ఉన్నతంగా ఆలోచిస్తాడో రచయిత చక్కని పోలికలతో కవితాత్మకంగా ఇలా వర్ణించారు. ''పెళ్లి కూతురై వచ్చినప్పుడు రమియా ఎంత అందంగా ఉండిందో- పావురంలా. తన మృదువైన చేతులతో ఇంటి పనిని ముగించుకొని నాకోసం ఎలా ఎదురు చూసేది?..... ఎప్పుడూ గులాబీ పువ్వులా వికసించే ఆమె అందమైన శరీరం ఇప్పుడిలా ఎండిపోయిన ముల్లు లా మారిపోయింది. నిన్నటి ఆ పావురం ఎలా కలప మాదిరిగా మారిపోయింది'' ( పుట: 6) దళితుల అందమంతా నిత్యం చేసే చాకరీకే నాశనమై పోతుంది. ఎండా, వానా తేడా లేకుండా నిరంతరం శ్రమించే వారి సౌందర్యాన్ని చూడాల్సింది శరీరంలో కాదు; వాళ్ళ శ్రమైక జీవనంలోనే చూడాలి. నీతిగా బ్రతకాలనే వారి జీవన విధానంలో చూడాలి. దళిత స్త్రీ ఇంటికే పరిమితమయ్యే కేవల సౌందర్య సాధనం కాదు. పురుషుడితో సమానంగానే కాదు, ఇంకా ఇంటి పనీ వంటపనీ ఎక్కువగానే చేసే కష్టజీవి కూడా. అదే నిజమైన దళిత సౌందర్యం.
సాధారణంగా నవల ఒక మనిషి జీవితంలోని ఒక పార్శ్వాన్ని లేదా ఒక జీవితంతో ముడిపడిన అనేక సంఘటనలు, అనేక పాత్రలతో సామాజిక వాస్తవికతను, జీవితానుభవాల్ని కథనాత్మకంగా వర్ణిస్తుంది. మానవ జీవితాలనుభవాలు, జీవితానుభూతుల ద్వారా ఒక జీవితం పట్ల పరిపూర్ణమైన అవగాహనను వివిధ పాత్రలతో నడిపించే దృశ్య చిత్రంగా అనుభూతినిస్తుంది. ఈ నవలలో చందన్ ... పట్టణానికి చదువుకోసం వెళతాడు. అక్కడ తనకి అద్దెకు ఇల్లు దొరకదు. తిరగ్గా తిరగ్గా ఒక చిన్న ఇంటిలో ఉండటానికి అవకాశం దొరుకుతుంది. ఆ ఇంటిలో ఒక ముసలివాడు తప్ప ఇంకెవరూ లేరు. అతను కూడా కాటికి కాళ్ళు చాపి ఉన్నాడు. నిరాశ నిండిన కళ్ళతో , ఎవరినో కోల్పోయినవాడిలా ఉన్నాడు. నిజమే తన కొడుకు చిన్నప్పుడే తననుండి దూరంగా వెళ్లి పోయాడు. కాదు, ఆ ఆధిపత్య సమాజం అలా చేసింది. తన కూతుర్ని అధిపత్యవర్గాలు, కులాల వాళ్ళు అత్యాచారం చేశారు. ఆ అవమానభారంతో ఆమె ఎక్కడికి వెళ్ళిపోయిందో తన తండ్రికి తెలియదు. ఆ వయసులో ఉన్న వాళ్ళెవరైనా కనబడితే అందుకే తన కొడుకు గుర్తొస్తాడు, తన కూతురు గుర్తొస్తుంది. వాళ్ళని చందన్ లో చూసుకోవచ్చని ఆ ముసలివాడు తనకున్న ఆ చిన్న ఇంటిలోనే ఉండమంటాడు. వీళ్ళిద్దరి మధ్యా రచయిత వర్ణించే సన్నివేశాలు భావజాలాలకు అతీతంగా మానవత్వాన్ని మేల్కొలుపుతాయి. ఆ చందన్ మాట్లాడితే వినాలని ఆ ముసలివాడు తహతహలాడే వాడు. నిద్రలేని రాత్రుల్లో వెలుగుని చూసేవాడు. అతనితో మాట్లాడుతుంటే మరలా బ్రతుకు మీద ఆశపెరిగేది. అలా ఎంతసేపైపు గడిపినా సమయమిట్టే గడిపోయినట్లనిపించేది. ఒక తండ్రికి కొడుకు /కూతురు ఉంటే, వాళ్ళే లోకంగా ఆ తల్లిదండ్రులెలా బ్రతుకుతారో వీళ్ళిద్దరి జీవితాల్ని చదివేవారికి స్ఫురిస్తుంది.
నాకు మా నాన్న గుర్తుకొచ్చాడు.
నాన్న నాతో మాట్లాడుతుంటే
మా నాన్న కళ్ళనిప్పుడే చూడాలనిపిస్తుంది.
నాన్న దగ్గరున్నప్పుడు నన్ను చూసే చూపుల్లో
నాన్న పడే సంతోషాన్నిప్పుడే ఆస్వాదించాలనిపిస్తుంది.
కానీ, ఇప్పుడు మానాన్నేడీలోకంలో ...
నాకిప్పుడు నాన్న లేడు.
నిజమే కానీ..
నా కళ్ళముందు నా కన్నయ్య కనిపిస్తున్నాడు.
కల్మషం తెలియని వీడిలో
నిజంగా అమాయకుడైన మా నాన్నే కనిపిస్తున్నాడు.
వీడితో గడుపుతుంటే కాలమిట్లే చిటికలో కరిగిపోతుందేమిటి?
నా కళ్ళముందు వాడు ఆడుకుంటుంటే
నా మనసెందుకో సంతోషంతో తేలిపోతుంది.
నామనసెందుకో క్షణకాలం భయపడుతుంది కూడా.
వీడి ఎదుగుదలనంతా చూడగలిగేటంతటి జీవితం నాకుందో లేదో.
వీడికేకష్టమొస్తుందో
వీడిని ఓదార్చే అమృతహస్తం దొరుకుతుందో లేదో.
వీడి సుఖ దుఃఖాల కోసం నా ప్రాణమెందుకిలా తహతహలాడిపోతుంది?
నా కన్నయ్యనెత్తుకుంటే
నా చిన్నితండ్రి భుజమ్మీదాడుకుంటుంటే
వచ్చీరాని వాడి మాటల్లో అనంతభావాలు వినిపిస్తున్నాయి
వాడి పాదాల్తో నా యెదంతా పులకించి మొలకొచ్చే పుడమితల్లిగా మారిపోతుంది
వాడు నా కళ్ళెదుట ఉంటే చాలు
నాకింకేమీ వద్దు ఇలా గడిచిపోతే చాలనిపిస్తుంది.
నా కన్నయ్య కళ్ళల్లో కన్నీళ్ళొస్తే లోకమే తల్లకిందులౌతుంది.
నా కోసం కూడా నాన్న ఇలాగే ఫీలయ్యాడేమో... తిరిగి రాదనుకున్న ఆ గతాన్నంతా నా కళ్ళముందీనవల నిలబెడుతుంది. అందుకే నాన్నను ప్రేమించడం నేర్పుతుందీనవల. నాన్ననెలా అర్థం చేసుకోవాలో చెప్తుందీ నవల. తల్లీ తండ్రీ...కుటుంబమంతా ఈలోకంలో ఉన్నప్పుడే వాళ్ళతో ఎలా ఉండాలో బోధిస్తుందీనవల. ఈ సన్నివేశాల్ని చదివేవాళ్ళకి భావజాలంతో పనేముంది. వాళ్ళు మనుషులైతేచాలు. వాళ్ళకి మనసుంటే చాలు. ఆ మనసు మనకు తెలియకుండానే కళ్ళల్లో కన్నీరవుతుంది. మానవత్వమంటే ఏమిటో మనసుకి రుచి చూపిస్తుంది. హిందీ మూలం లో ఎలాగుందో నాకు తెలియదు గానీ, తెలుగులో కృష్ణగారీ సన్నివేశాల్ని మాత్రం తన్మయత్వంతో రాశారనిపించింది. ఈ సన్నివేశాల్ని రాసేటప్పుడు రచయిత కళ్ళు కూడా చెమ్మగిల్లాయనిపించింది. అంత మృదుమధురంగా సాగాయీ సన్నివేశాలు. రచయితలకు కూడా అభిమానులెందుకుంటారో ఈ సన్నివేశాల్ని చదివాక నాకర్థమైంది. నాకే కాదు సున్నితమైన మనసున్న వాళ్ళెవరైనా ఈ సన్నివేశాల్ని చదివి కదిలిపోతారు.
చందన్ ని అతని తల్లిదండ్రులు అతడ్నెలాగైనా సరే కష్టపడి చదివించాలనుకుంటారు. ఒక్కడే కొడుకు. నిజానికి అతడ్ని వదిలి ఉండలేకపోతుంటారు. వాళ్ళవి రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు. అయినా పదవతరగతి తర్వాత తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళెవరూ పట్టణానికి వెళ్ళలేదు. ఆ పల్లెటూరు నుండి తన కొడుకుని పట్టణానికి ఎలాగైనా పంపించి, ఉన్నత చదువులు చదివించాలనుకుంటారు. అలా పంపాలనుకోవడంలో రెండు ప్రధాన కారణాలున్నాయి.ఒకటిః ఎదిగిన కొడుకుని అక్కడే ఉంచితే ఆ ఆధిపత్య వర్గం, ఆ ఆధిపత్య కులాలు బ్రతకనివ్వవు. అది తన జీవితంలో చూసిన అనేక సంఘటనల అనుభవం. దాన్నుండి తన కొడుకుని తమ దూరంగా పంపైనా కాపాడాలనుకోవడం. రెండుః తాము చదువుకి నొచుకోక దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. నిత్యం ఆకలితో పాటు అవమానాల్నీ ఎదుర్కొంటున్నారు. కళ్ళముందే అన్యాయం జరుగుతున్నా దాన్ని ఎదిరించలేని నిస్సహాయ స్థితి. దీన్నుంచి బయట పడాలంటే తనకొడుకైనా ఉన్నత చదువులు చదవాలి. అందుకే చందన్ ని ఎన్ని కష్టాలకోర్చైనా చదివించాలనుకున్నారు.
కొడుకు చందన్ పాత్ర ద్వారా చిత్రించిందేమిటి?
చందన్ ఉన్నత చదువులకోసం పట్టణమెళ్ళాడు. తన చదువేదో తాను చదువుకుంటూ, తన చుట్టూ జరిగే దాన్నేమీ పట్టించుకోకుండా ఉండగలిగాడా? ఉండలేకపోయాడు. పేదలు, దళితులు నివాసాలుండే ప్రాంతాల్ని పరిశీలించాడు. అక్కడి మనషుల్ని చూశాడు. మూఢత్వాన్ని పెంచి పోషించే పనుల్ని తనవంతుగా అరికట్టే చైతన్యం కోసం పని చేశాడు. కర్మ సిద్ధాంతం తప్పని వాళ్ళ జీవితాలనే ఉదాహరణలుగా చూపి, వాళ్ళలో ఆలోచనను రేకెత్తించాడు. తన పాఠ్యాంశాలతో పాటు అంబేద్కర్ రచనల్ని చదివాడు.దానిలోని భావాల్ని ప్రజలకు చెప్పి, వాళ్ళలో ఐక్యతా సూత్రాన్ని వివరించాడు. వాళ్ళలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాడు. వాళ్ళలో ఒకడుగా కలిసిపోయాడు. ఈ సన్నివేశాల్ని, ఈ చందన్ చేసే సంస్కరణ భావాల్నీ చదువుతుంటే నాకు ఈ పాత్రలో ఆచార్య కృష్ణ గారే మనసులో మెదిలారు. ఈ యూనివర్సిటీలోనే ఫిజీ నుండీ నేను చదువుకోవడం వల్ల, కృష్ణ గారు అప్పటికే ప్రొఫెసర్ ఉండటం వల్ల ఆయన్ని దగ్గర్నుంచి గమనించే అవకాశం కలిగింది. ఆయన జనవిజ్ఞాన వేదిక ద్వారా సమాజంలోని మూఢవిశ్వాసాల్ని పోగొట్టే కార్యక్రమాలెన్నింటిలోనో పాల్గొనడం నాకు తెలుసు. ఆయన దళిత సాహిత్యంపై చేసిన అనువాదం రచనలు చదివాను. వల్లకాడు అనే అనువాదకవితలతో పాటు, రమణికా గుప్త గారి నవలను పిన్ని పేరుతో అనువదించారు. స్త్రీ పోరాటాన్ని చిత్రించిన నవల నేను చదివాను. అవన్నీ నేను విద్యార్ధిగా ఉన్నప్పుడే ప్రేమగా నాకిచ్చారు. అందుకే ఆయన నాకు గురువుతో సమానులంటున్నాను. ఆయన ఈ యూనివర్సిటీలో ఎంత చైతన్యవంతంగా ఉండేవారో విద్యార్థిగా, పరిశోధకుడిగా, అధ్యాపకుడిగా నాకు తెలుసు.అందువల్ల ఆయనంటే మాకు ఎనలేని గౌరవం.
బాధ్యత కలిగిన రచయితల రచనల్లో ఒక సామాజిక లక్ష్యం ఉంటుంది. మనువు, మనువు లాంటి వాళ్ళు ఈ దళితుల్ని ఊరికి దూరంగా విసిరే ఆలోచనలు చేస్తుంటే, వాటినెలా తిప్పికొట్టాలో చందన్ పాత్ర ద్వారా డా.జయప్రకాశ్ కర్ధమ్ మనకర్ధమయ్యేలా వర్ణించారు.
అవతలిగుడిసె...కేవలం ఓ ఇల్లు మాత్రమే కాదు. ఈ సమాజానికి దూరంగా, అవతలికి విసిరేసిన దళితుల జీవితాలకు ఓ ప్రతీక. అవతలి గుడిసెల్లోనూ మనుషులుంటారు. వాళ్ళకీ చీమూ నెత్తురూ ఉంటుంది. వాళ్ళకీ ఆలోచించే మెదడుంటుంది. వాళ్ళకీ తిరగబడేబలముంటుంది. వాళ్ళకీ ఆత్మగౌరవముంటుంది. వాళ్ళలోనూ విద్యావంతులుంటారు. వాళ్ళలోనూ తెలివైన వాళ్ళుంటారు. వాళ్ళలోనూ చైతన్యమొస్తుంది. అప్పుడు వాళ్ళే అవతలి గుడిసె ను ఇవతలి గుడిసెగా, ఊరుకి మధ్యనుండే గుడిసెగా మారుస్తారు. అలాంటివాడే ఈ నవల్లోని చందన్. జాగ్రత్తగా పరిశీలిస్తే చందన్ ఒక్క పాత్రకాదు...ఒక చైతన్యానికి ప్రతీక. చందన్ అంబేద్కర్ కి ప్రతీక. చందన్ ఒక పెరియార్ రామస్వామి కి ప్రతీక...చందన్ ఒక మహాత్మా జ్యోతిరావు బా పూలే కి ప్రతీక. చందన్ ఒక గాంథీయిజానికి ప్రతీక, చందన్ ఒక బౌద్ధిజానికి ప్రతీక. ఒక్కమాటలో చందన్ ఒక నిలువెత్తు మనిషికి ప్రతీక. ఈ చందన్ లక్ష్యమే రచయిత డా.జయప్రకాశ్ కర్ధమ్ లక్ష్యం. ఈ చందన్ ఆశయమే ఆచార్య కృష్ణగారి తెలుగు అనువాదలక్ష్యం. అంబేద్కర్ రచనలు, ఉపన్యాసాలు, ఉద్యమాల సారాన్ని చదువు, సమీకరించు, పోరాడు అనే మూడు నినాదాలు అంబేద్కరిస్టులు చెప్తుంటారు. ఆ సారాంశమే ఈ నవల్లో కనిపిస్తుంది. అందుకే ''ఒక రచనను ఒక భాషలో నుంచి మరొక భాషలోకి రూపాంతరం లేదా ప్రస్తుతించడం అనువాదం కాదు. అనువదించి భాషలో అది పునః.సృజనమవుతుంది. అనువాదం ఒక నైపుణ్యం. మూల, లక్ష్య భాషలలో భాష మీద పట్టుతో పాటు విషయపరిజ్ఞానం ఉంటేనే మంచి అనువాదం సాధ్యమవుతుంది.'' అని చెప్తూ''కథా వస్తువులో వ్యక్తమైన భావాల పట్ల అవగాహన కలిగి ఉన్నవారు'' అని డా.జయప్రకాశ్ కర్ధమ్ వ్యాఖ్యానించిన మాటలు ఎంతో సముచితంగా ఉన్నాయనిపించింది.
ఈ నవల్లో ఒక్కో పాత్రా ఒక్కో సమస్యకో, ఒకో రకమైన వ్యవస్ధకో ప్రతీకలు. భారతదేశంలోని దళితుల ఆత్మగౌరవంతో బ్రతికే మార్గం దీనిలో ఉంది. దళితులు తమ సమస్యల్ని శాంతియుతంగా, చట్టబద్ధమైన మార్గంలో సాధించుకునే సూచన దీనిలో ఉంది. దళితుల్ని హింసించిన తొలి తరం ఆధిపత్య కులం వల్ల, తర్వాత తరాలు వాటినెంతభారంగా మోయవలసివస్తుందో దీనిలో ఉంది. దళితులు, ఆధిపత్య కులాలు కలిసిమెలిసి ఉంటే వెల్లివిరిసే ప్రేమానుబంధం దీనిలో ఉంది. అందుకే డా.జయప్రకాశ్ కర్ధమ్ ఈ నవలను రాశారు. అందుకే ఆచార్య వి.కృష్ణగారీనవలను తెలుగులోకి తెచ్చారు. భారతీయ సాహిత్యాన్ని హిందీ ద్వారా, తెలుగు అనువాదం ద్వారా తెలుగు సాహిత్యాన్ని దీప్తిమంతం చేశారు. సాహిత్యంలో తొలి తరం చేసే పనులు ప్రభావం తర్వాతి తీరుపై ఎలా ప్రసరిస్తుందో ఎంతో లోతైన, ఎంతో సున్నితమైన, ఎంతో విలువైన అంశాన్ని సాహిత్యానికి పరిచయం చేశారు. ఈ నవల ఇప్పటీకే కొన్ని భారతీయ భాషల్లోకి అనువాదమయ్యింది. అన్ని భారతీయ భాషల్లోకి ఇది వెంటనే అనువాదం కావలసి సమయమిది.
ఇంత గొప్ప నవలను అందించిన రచయితలు ఇద్దరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. ఇవి నావి మాత్రమేకాదు, ఈ నవల చదివిన ప్రతివాళ్ళూ మీకు చెప్పే మాటలనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు రచయితలూ ఒకే వేదికపై ఉండగా ఆ నవల గురించి మాట్లాడే అవకాశం గానీ ఇద్దరు రచయితలూ ఒకే వేదిక పై ఉండగా ఆ నవల గురించి మాట్లాడుతుంటే వినే అవకాశం గానీ ఇలా లభించడం అరుదైన అవకాశం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి