ఆంధ్ర ప్రభ దినపత్రిక,11.2.2022 సౌజన్యంతో
సమాజంలో నిత్యం కనిపించే యోగులు, సిద్ధులు, కాలజ్ఞానులు, అవధూతలు మొదలైన వారంతా శాంతిని పెంపొందించడమే వారి ఆశయమని హెచ్ సియు, తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మద్రాసు క్రైస్తవ కళాశాల, తాంబరం చెన్నై వారు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల వెబినార్ లో గురువారం (10.2.2022) పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు సదస్సులో ప్రారంభోపన్యాసం చేశారు.
యోగులు, సిద్ధులు, కాలజ్ఞానులు, అవధూతలు ఒక మతానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదనీ అన్ని మతాల్లోనూ ఉన్నారనీ వారందరి లక్ష్యమూ లోకశ్రేయస్సునే ఆకాంక్షిస్తారన్నారు.
నిజమైన ప్రేమను పెంపొందించేదే జ్ఞానమనీ, మానవీయే్ సంబంధాలు పరిమళించేలా చేయడంలో వారి బోధనలు ఎంతగానో తోడ్పడతాయన్నారు. తెలుగు ప్రాంతాల్లో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వేమన వంటి వాళ్ళే కాకుండా, కడప జిల్లాలోని కాశీరెడ్డి నాయన, దున్న ఇద్దాసు, కొత్తలంక వలీబాబా, ముమ్మిడివరం బాలయోగులు...ఇలా ఎంతో మంది అన్ని ప్రాంతాల్లోను ఉన్నారని, ఆ యా కాలాల్లో సమాజంలోని అన్ని వర్గాల వారిని కలిసిపయనించేలా కృషి చేశారన్నారు. ఇటువంటి వారి గురించి ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, హేతువాదులు, నాస్తికులు వీరినినమ్మని పరిస్థితి కూడా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో మానవ వనరుల అభివృద్ధి చేయవలసిన బాధ్యత విశ్వవిద్యాలయ ఆచార్యులు, ఉన్నతవిద్యావంతులకు ఉంటుందని, అటువంటి వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలకు గుర్తించడానికి, శాస్త్రీయంగా తెలుసుకోవడానికీ ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడతాయని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ఆచార్య పులికొండ సుబ్బాచారి, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ పాల్గొని కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి వివరించారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ సామాజిక చెతన్యానికి ఈ యోగులు,కాలజ్ఞానులు, అవధూతలు ప్రయత్నిస్తారని అన్నారు. ఈ సదసూ మంగిపూడి రాధిక , సదస్సు నిర్వాహకులు ఆచార్య శ్రీపురం యజ్ఞశేఖర్, డా.మునిరాజ, డా.తమిళ్ సెల్వి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి