"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

30 January, 2022

కవిత్వ రసవిద్య తెలిసిన కవి ఎండ్లూరి సుధాకర్ (సృజన నేడు దినపత్రిక, 29.1.2022)

 కవిత్వ రసవిద్య తెలిసిన కవి ఎండ్లూరి సుధాకర్






ఆధునిక తెలుగు కవిత్వ రసవిద్య తెలిసిన కొద్దిమంది కవులలో ఆచార్య ఎండ్లూరి  సుధాకర్  ఒకరు.  ప్రాచీన ఆధునిక సాహిత్యాన్ని బాగా చదువుకోవడం, ఆ సాహిత్య మర్మాలను లోతుగా అవగాహన చేసుకోవడం వల్ల కవిత్వ రహస్యం బాగా తెలుస్తుంది. ఆ కవిత్వ రహస్యాల్ని ఎండ్లూరి సుధాకర్ తన కవిత్వంలో నైపుణ్యంగా ఉపయోగించుకున్నారు. అందుకనే సరళమైన పదాలతో  లాలిత్యంతో తానేది రాసినా పదునుగా, మృదువుగా చెప్పగలిగారు.

''నన్నొక మొక్కను చేయండి 

మీ ఇంటిముందు పువ్వునవుతాను 

నన్ను ఊయలలూపి చూడండి 

మీ కంటి ముందు పసిపాప నవ్వునవుతాను'' 

అని చిన్ని చిన్ని పదాలతో మనల్ని ఆకర్షిస్తాడు. అయితే, తెలుగు కవులలో ఎండ్లూరి సుధాకర్  పేరు చెప్పగానే ఆయన ఒక దళిత కవి అనే ఎవరైనా వెంటనే చెప్పేస్తారు. 

చాతుర్వర్ణ వ్యవస్థ, వేదాలు, హిందూమతం వంటి వాటిపై ఆయన గురిపెట్టి రాసిన కవిత్వం సూటిగా పాఠకుల హృదయాల్లో నాటుకునేది. కనిపించే చావులే కాదు, కనిపించనివి ఇంకా ఎన్నో ఉన్నాయంటూ...

'' మా రహస్యచావుల్ని అక్షరీకరిస్తే

పత్రికల నిండా మా హత్యలే పతాక శీర్షికలవుతాయి'' అన్నారు. వేదాల్ని విన్న చెవుల్లో సీసం పోయడమేకాదు, ''అదేదో భాష మాట్లాడితే మీ నాలుక తెగ్గోసి'' చారిత్రక క్రమాన్నీ వర్ణించి ''మాకు ఇప్పుడు కావలసింది నెత్తురురొఖ్ఖం కాదు.మాకేం కావాలో కోరుకునే నిర్భయ గొంతుక కొత్త రాజ్యాంగం, కొత్త దేశం, కొత్తభూమి, కొత్త ఆకాశం'' అనగలిగినటువంటి ధైర్యం, భవిష్యత్తు దర్శనం, స్వేచ్చా స్వాతంత్ర్యం ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. 

ఇంకొంచెం లోతుగా ఆయన కవిత్వాన్ని పరిశీలించకపోయినా మాదిగ జీవితాల్ని,వారి హక్కుల్ని నినదించిన కవీ, వినిపించిన కవీ అని స్పష్టంగానే తెలుస్తుంది. తాను తన వంతు తన జాతి రుణం తీర్చుకోవాలని కొత్త గబ్బిలం కావ్యం రాశానని చెప్పుకున్నారు. అనడమే కాదు, నిర్మొహమాటంగానే మాదిగ తత్వాన్ని తన గుండెల్నుండి ప్రవహించేలా చేశారు. ప్రతి ఒక్కరూ ఏదొక హక్కు గురించి మాట్లాడుతుంటారు. అలాగే ఒక్కో జాతికి ఒక్కో హక్కు ఉంటుంది. అది భంగమైందని భావించిన చైతన్య శీలులు, హక్కుల తత్వం గురించి తెలిసిన వాళ్ళు దాన్ని సాధించుకోవాలనుకుంటారు. ఒక మాదిగ గా, ఒక కవిగా ఆ హక్కుల్ని హృదయానికి హత్తుకునే, దాన్ని వ్యతిరేకించే వాళ్ళకు నెత్తిన మొత్తేలా 'వర్గీకరణీయం' 'కొత్తగబ్బిలం' పేర్లతో కవిత్వ మయ్యారు.హక్కుల తత్త్వం  తెలియని వాళ్ళు వ్యతిరేకించారు. కానీ, ఆ వర్ణించిన తీరుకి అందరూ ఆకర్షితులయ్యారు. దానంతటికీ కారణం

తనకు ఆగ్రహం రాని అక్షరం సహించదనీ, ఆర్ద్రత లేని వాక్యం ఫలించదనీ, తన అనుభవం నేర్పిందే కవిత్వమని  అంటూ

'' నా బాల్య దృశ్యాలే 

నేను చూసిన అలంకార శాస్త్రాలు

ఆకలి రసం నాలోని రచనా రహస్యం అవమాన విషం 

నా కంఠంలోని నీలామృతం విశేషం

మా బీదబస్తీలే నన్ను కవిని చేశాయి 

నాలోని భావుకత్వానికి 

బాధల తత్వానికి బాటలు వేశాయి 

మా వీధి కుక్కలు జీవితాన్నీ 

జీవించడాన్నీ నేర్పాయి'' 

అని దళితులకు తమ జీవితానుభవాలే పాఠాల్ని నేర్పాయంటారు. తాము బ్రతకాలంటే కుక్కల్లోని పోరాడే శక్తిని తీసుకోవాలనడం కొత్త  అభివ్యక్తి. తమది బహుజన భావజాలమని చెప్తూ 'నీలామృతం' అన్నారు. శివుడు గరళాన్ని మ్రింగి గరళకంఠుడై ఉగ్రుడైతే, దళితుడు స్వీయానుభవాలన్నీ చవిచూసి 'నీలామృతం' అంటే బహుజన సమాజాన్ని నిర్మించబోతున్నారని స్ఫురిస్తూ కవిత్వమయ్యారు. ఈ యుగాన్ని ఒక కవితలో 'నీలిమిలీనియ'మని కూడా ఆశావాహంగా అభివర్ణించారు. ఇలాంటి భాషాప్రయోగ చమత్కారాలెన్నో ఆయన కవిత్వంలో కనిపిస్తాయి.అందుకనే

కొత్త అలంకారిక సొగసులతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారనుకోవడం అతిశయోక్తి ఏమాత్రం అవ్వదు. సాహిత్యంలో నూతన పదజాలాన్ని, పదకల్పనల్ని, ఉపమానాల్ని, ప్రయోగాల్ని, చమత్కారాల్ని అందిస్తూనే తన భావజాలాన్నీ విస్తరించారు. ఆయన  తెలుగు భాషను వాడుకోవడమూ, ప్రాసలతో ఆడుకోవడమూ ఆయనకు బాగా తెలుసు. ఆయన కవితను చదువుతున్నప్పుడు ఎంతగా ఆనందిస్తామో ఆ కవిత్వాన్ని మనం చదువుకుంటున్నా అంతే  ఆనందాన్ని పొందగలుగుతాం. 

దీనికి ప్రధాన కారణం ఆ కవిత నిర్మాణమే. ఆయన కవిత్వంలో వస్తు, శిల్పాలు సమపాళ్ళలో పాలూ నీళ్ళూ కలిసిపోయినట్లుంటాయి.

ఆయన రాసిన దళిత కవిత్వాన్ని మాత్రమే చూసి ఒక పరిధిలో నిర్ణయించడానికి వీలుపడదేమో. ఆయనకు ఉర్దూ, హిందీ, దానితో పాటు కొద్దిగా మరాఠీ కూడా వచ్చు. అందువల్ల గజల్స్ ఎన్నింటినో అనువదించారు. శరణ్ కుమార్ లింబాలే ఆత్మకథ టువార్డ్స్ యాన్ ఈస్తటిక్స్ ఆఫ్ దళిత్ లిటరేచర్ ని తెలుగులో తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా చేశారు. అనేక గజల్స్ నుంచి తెలుగులోకి అనువదించారు. ఉర్దూలో  రాసిన కొంతమంది కవుల కవితల్ని 'నజరానా' పేరుతో అనువదించారు.

''పనిగట్టుకొని ఆమె చిత్రపటాన్ని

పది మందికీ చూపించాను

ప్రతి ఒక్కడితో ఇప్పుడు

పగను కొని తెచ్చుకున్నాను''

అని 'ఆజాద్' అనే కవి రాసిన కవితను అనువదించారు. దీనిలోని చమత్కారం చూడండి. ఆమెను దక్కించుకున్నందుకు ఆ ప్రియుడి మిత్రులంతా తమకంత అందగత్తె దొరక్కుండా  అతడు దక్కించుకున్నందుకు ఈర్ష్య పెంచుకున్నారట! 

అక్బర్ ఇలాహాబాదీ  రాసిన మరొక కవిత...

''అందరూ నాకే చెబుతారు

బుద్ధిగా తలొంచుకుని నడవాలని

ఆమెకెందుకు చెప్పరు మరి ?

ముస్తాబై మా బస్తీలోకి రావద్దని''

ఎవరెన్ని చెప్పినా ఆమె తమ వీధిలోకి వస్తే చూడకుండా ఉండలేననేది దీనిలోని ధ్వని. 

ఆమె అందాన్ని ఆరాధించే వాళ్ళు కొంతమంది ఉంటే, దానికోసం తమ ప్రాణాల్నే తృణప్రాయంగా త్యజించిన వాళ్ళున్నారు. అనార్కలి కోసం సలీమ్ అలా చేశాడు. కానీ మరికొంత మంది దుర్మార్గులు, రాక్షసులు ఉంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఆడపిల్లల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ప్రేమించమని, ప్రేమించలేదని యాసిడ్ దాడులు చేస్తున్నారు. కత్తులతో నరికేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యువతులు, వాళ్ళని కన్న తల్లిదండ్రులు, కుటుంబమెలా ఆలోచిస్తుందో ''దు:ఖ గంధకామ్ల వర్షం" పేరుతో ఒక కవితలో అద్భుతంగా వర్ణించారు.

'' ఈ మధ్య గమనిస్తున్నాను

మా అమ్మాయిలు అదోలా ఉంటున్నారు

భద్రంగా ఉన్నట్టులేరు

ఏ యువకుడు కనబడినా

ఏ వాహన శబ్దం వినబడినా

ఊరికే ఉలిక్కి పడుతున్నారు'' 

అంటూ కవి నేడు అమ్మాయిల మనసుల్లోని భయాన్ని వర్ణించారు. ఆ మధ్య తరగతి గదిలోకి వెళ్ళి ఒక అమ్మాయిని ఒక యువకుడు నరికేశాడు. తర్వాత అతనికి మతిస్థిమితం లేదని అతన్ని కాపాడారు. ఈ మధ్య తనని ప్రేమించలేదని కత్తితో పొత్తికడుపులో అనేకసార్లు పొడిచేశాడు. సి సి కెమేరాల్లో ఆ దృశ్యాలు స్పష్టంగా కనిపించినా, అతడినింకా విచారణ చేస్తున్నామంటున్నారు. ఈ పరిస్థితుల్లో యువతుల ఆలోచనలు ఎలా ఉంటాయి? అటువంటప్పుడు వాళ్ళ మానసిక స్థితిని వర్ణిస్తూ కవి నేడు ఆడపిల్లలు:

''ఆకాశం ప్రతిధ్వనించేలా నవ్విన వాళ్లు

గలగల గోదారిలా మాట్లాడిన వాళ్లు

నీరింకిన చలమలౌతున్నారు

మేత ముట్టని దూడల్లా

మెత్తబడుతున్నారు'' 

అని అభివర్ణించారు. అందుకనే తమని తాము రక్షించుకోవడానికి తామెలా ఆలోచిస్తున్నారో చెప్తూ...

''నాన్నా!

మాకు యాసిడ్ ప్రూఫ్ ముఖాలు కావాలి

తెచ్చిపెట్టగలవా?!..'' అని అడుగుతున్నారట. ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా దాన్ని కవిత్వమెలా చేయాలో ఆ రసవిద్య తెలిసిన కవి ఎండ్లూరి సుధాకర్. 

ఆయన కవుల స్వేచ్ఛ గురించి రాశారు; కుల ప్రభావం గురించి రాశారు; క్రైస్తవ మత ప్రతీకలతో కవిత్వం రాశారు; తన సహచరి డాక్టర్ పుట్ల హేమలత మరణించిన తర్వాత కవిత్వ ప్రవాహమే అయ్యారు; తన వైయక్తిక జీవితానుభవాలకి అక్షర రూపమయ్యారు; తన కుటుంబ సభ్యులను తన మిత్రుల్ని తన కవిత్వంలో భాగస్వామ్యం చేసుకున్నారు. తన గురించీ, తన వంశం గురించీ, తన జాతి గురించీ 'మల్లెమొగ్గల గొడుగులు' పేరుతో కథలుగా పరిమళించారు. తనకు మధుమేహం వస్తే దాన్ని కూడా వస్తువుగా మార్చుకొని కవిత్వం చేశారు. ఆయన మరణించిన వెంటనే ఆయన రాసిన అనేక కవితలు పదేపదే ఎందరికో స్మరణీయమయ్యాయి. అటువంటి వాటిలో ఆయన రాసిన ఒక కవితా ఖండికతో ఈ వ్యాసం ముగిస్తాను.

''మిత్రులారా! 

నా నెత్తుటి కొమ్మలకు 

చుట్టుకున్న ఈ శర్కర సర్పం 

ఏ అపస్మారక క్షణాల్లోనైన కాటేస్తే 

నా కోసం దుఃఖించకండి

నన్ను ఖననం చేస్తున్నప్పుడు 

నా శవం మీద మట్టికి బదులు

గుప్పెడు పంచదార చళ్లిపోండి 

కనీసం నా ఆత్మైనా తీపిగాలిలోతేలుతూ 

ఒక మాధుర్యమండలానికి

చేరుతుందేమో!''

( ప్రముఖ కవి, అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు 28.1.2022 వ తేదీన హఠాన్మరణం చెందిన సందర్భంగా ఆయనకు అక్షర నివాళులర్పిస్తూ....)

-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 

తెలుగు శాఖాధ్యక్షుడు, 

సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్. 

ఫోన్: 9182685231

No comments: