"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 July, 2021

ఆకాశవాణి ఉద్యోగిని డా.బి.డి.ఎల్.ప్రసన్న మృతి

 మేడమ్ డా.బి.డి.ఎల్ . ప్రసన్నగారు నిన్న (22.7.2021) మరణించారని తెలిసి షాక్ అయ్యాను. నేను ఆకాశవాణి, యువవాణిలో కాంపియర్ గా పనిచేసేటప్పుడు వారి దగ్గర కూడా పనిచేశాను. ఆమె తన పేరుని  *డా.బి.డి.ఎల్. ప్రసన్న* అని రాసుకొనేవారు. నాకెందుకో ఆమెను చూసిన వెంటనే రెండుచేతులతో నమస్కరించాలనిపించేది. మన సినీనటి అంజలీదేవిగార్ని చూస్తున్నట్లనిపించేది.  చిరు నవ్వుతో పలకరించేవారు. ఎంతో ఓపికగా అన్నీ చేస్తూ నేర్పే గుణాన్ని ఆమెలో


గమనించే వాడిని. ఆ ఓపిక, ఆ నెమ్మది, ఆ ఆత్మీయతలను బట్టి ఆమెను చూస్తే బహుశా సీతమ్మతల్లి ఇలాగే ఉండేదేమో అనిపించేది.  ఆమెపట్ల నాకెందుకో ఒకరకమైన పవిత్రమైన భావన నా మనసులో ఏర్పడిపోయింది. ఒకసారి నన్ను డాక్టర్ పట్టాభి రామ్ గారి ఇంటర్వ్యూని చేసుకొని రమ్మన్నారు. విద్యార్థులను ర్యాగింగ్ చేస్తుంటే దాని నుండెలా కాపాడుకోవాలో , ర్యాగింగ్ చేయాలనే ఆలోచనలకు కారణాలు, ఆ పరిస్థితులు...మొదలైనవి దానిలో ఉండాలన్నారు. ఆమె అలా చెప్తుంటే ఒక గొప్ప టీచర్ లా నాకు అనిపించేవారు. సరే నని, వారి అడ్రస్, ఫోన్ నెంబరు అడిగాను. వారి టేబుల్ మీద ఉన్న టెలిఫోన్ డైరెక్టరీ చూపించి, దానిలో చూడమన్నారు. నేను దాన్ని అటూ, ఇటూ తిప్పేసి నాకు కనపడలేదని నాతోపాటు క్యాంపియర్ గా పనిచేస్తున్న మధురాపంతుల లక్ష్మి గార్కే అనుకుంటా, 'నాకు తెలియట్లేదు .. కొంచెం చూడండి' అన్నాను. నన్ను ఒక కంటితో గమనిస్తూ, తన పనులు చేసుకుంటూనే వెంటనే డా.లక్ష్మీ ప్రసన్నగారు '' అమ్మా...అతనికిచ్చెయ్..మీకెందుకు కనిపించలేదు?...మరలా చూడండి..' అన్నారు. '' వెంటనే అసలు విషయం చెప్పేయాలనిపించిఃది. '' నాకు టెలిఫోన్ డైరెక్టరీ చూడ్డం తెలీదు మేడమ్'' అన్నాను. ఒక చిరునవ్వు, ఒక కోపం కలగలిపిన చూపుతో '' మీకు డిక్షనరీ చూడ్డం వచ్చా?'' అనడిగారు...నా వైపే చూస్తూ. అప్పుడే నాకొక టీచర్ లా అనిపించారు. ఒకరకంగా భయపడుతూనే వచ్చని నెమ్మదిగా చెప్పాను. 'అలాగే ఇదీను...' అంటూ ఇప్పుడు మళ్ళీ చూడమన్నారు. పుస్తకాన్ని చేతులోకి తీసుకొని, అకారాది క్రమంలోను, బిజినెస్ సెక్షన్ గాను రెండు మూడు విధాలుగా ఉన్న ఆ పుస్తకాన్ని అంటూ, ఇటూ తిప్పుతూ, మనసులో ఒక పసిపిల్లాడు భయపడుతున్న ఫీలింగ్ తో వెతికాను. ఒక టీచర్ దగ్గర భయపడుతున్న విద్యార్ధిలా వెతికాను. ఎలాగోలా డా.పట్టాభిరామ్ గారి నెంబరు , చిరునామా దొరికింది. ప్రశాంతి కౌన్సెలింగ్ సెంటర్ సెక్రటేరియట్ కి దగ్గర్లోనే ఉంది. అది ఏ.జి.ఆఫీసుకి ఎదురుగా ఉంది. పసిపిల్లాడికి చాక్లెట్ దొరికినంత సంతోషంగా  మెరుస్తున్న కళ్ళతో ఆమెకు ఆ వివరాలు చూపించాను. ఎంతో సంతోషంగా, 'ప్రసన్న' వదనంతో డాక్టర్ లక్ష్మీ ప్రసన్న మేడమ్...'' మనకి తెలిసినా, మన స్కిల్ నుంచి మనం హడావిడి, నిర్లక్ష్యం వల్ల దాన్ని ఉపయోగించుకోలేకపోతాం. అందుకే దేన్నైనా నెమ్మదిగా, ప్రశాంతంగా..ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది...అంటూ అభినందిస్తూ, తనదగ్గరున్న పెర్సనల్ డైరీలో ఉన్న ఫోను నెంబరు తో సరిచూసి, 'ఓకే'అన్నారు. ఫోన్ నెంబరు తన దగ్గరే పెట్టుకొని, నన్నిలా మళ్ళీ వెతికించారెందుకన్నట్లు ఆశ్చర్యంగా చూస్తున్న నాకు, ఒక తల్లిలా, ఒక టీచర్ లా నేర్పే లక్షణం ఆమెలో కనిపించింది. ఎందుకో అర్ధమయ్యిందా అన్నట్లు విసిరిన ఒక మందహాసం ఆమె పట్ల ఎనలేని గౌరవం భావాన్ని కలిగించింది.నాకిప్పటికీ డిక్షనరీ చూసినప్పుడల్లా డా.లక్ష్మీ ప్రసన్న మేడమ్ గారే గుర్తుకొస్తారు. ఆమె మరణించారనే వార్త నాకే ఇంత బాధ కలిగిస్తుంటే, వారి కుటుంబానికెంత తీవ్రంగా ఉంటుందో... మేడమ్ గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. *ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖాధ్యక్షుడు, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్*

No comments: