మన తెలుగు కథ... ఒక త్రివేణీ సంగమం !
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు,
శాఖాధిపతి, తెలుగుశాఖ, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాద్.
ఫోన్: 9182685231
శ్రీరాజ రాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్
కళాశాల, తెలుగు శాఖ, కరీంనగర్ మరియు మద్రాసు విశ్వవిద్యాలయం,
తెలుగు శాఖ, చెన్నై సంయుక్తంగా ఈ అంతర్జాల సదస్సు నిర్వహించడం తెలుగువారి సమైక్యతను చాటిచెప్తుంది.
2021 జులై 2, 3వ తేదీల్లో ‘తెలుగు కథ-సమకాలీనత’ ( 2000 నుండి
2020 వరకు) అనే శీర్షికతో జరుగుతున్న ఈ సదస్సులో రెండు దశాబ్దాల్లో వచ్చిన తెలుగు కథల
వస్తు, శిల్పవైవిధ్యాల గురించి పత్రాలను సమర్పిస్తున్నారు. సదస్సు నిర్వాహకులు
తెలుగుశాఖాధిపతి డా.కొత్తిరెడ్డి మల్లారెడ్డి, తెలుగు అధ్యాపకులు డా.పోగేల విశ్వప్రసాద్,
కళాశాల ప్రిన్సిపాల్ డా. కలువకుంట రామకృష్ణ, మద్రాసు విశ్వవిద్యాలయం
తెలుగుశాఖాధిపతి ఆచార్య విస్తాలి శంకరరావుగారు నాకు అత్యంత ఆప్తులు. మరలా సెంట్రల్
యూనివర్సిటివాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటున్నంత సంతోషంగా ఉంది.
సమకాలీన సమాజాన్ని, దానిలోని రుగ్మతలను పోగొట్టే
చక్కని వచన ప్రక్రియ కథ. ఈ అంశంపై సదస్సు నిర్వహించడం సమకాలీన సాహిత్యాన్ని,
సమాజాన్ని గుర్తించడంగా భావించాలి. చరిత్ర, సామాజికశాస్త్రాల్లో ప్రతిఫలించే
సమాజానికంటే భిన్నమైన సమాజ స్వరూప, స్వభావాల్ని సాహిత్యం పట్టుకోగలుగుతుంది. వివిధ
సందర్భాలు, సంఘటనలకు మనిషి ఎలా ప్రతిస్పందిస్తుంటాడో ఆ భౌతిక, మానసిక సంఘర్షణలను
సాహిత్యం పట్టుకోగలుగుతుంది. నేటి ఈ ప్రారంభ సభలో నాకంటే ముందు మాట్లాడిన అతిథులు
కూడా సాహిత్యం ద్వారా ప్రతిఫలించే సమాజ చరిత్ర ద్వారా నిజమైన చరిత్రను అవగాహన
చేసుకోవచ్చునని అన్నారు. దీన్నే మనం సమకాలీనత అంటాం. దీనితో పాటు భావజాల
పటిష్టత,
ప్రయోగం విశిష్టత అనే అంశాలు కూడా మన కథాసాహిత్యం స్పష్టంగా
కనిపిస్తున్నాయి. ఈ మూడు అంశాలు తెలుగు కథాసాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. వీటికి
అనేక కథలను ఉదాహరణగా వివరించాలని ఉన్నా, ప్రారంభోత్సవ సభలో ఒక గౌరవ అతిథిగా
పిలిచినప్పుడు, కీలకోపన్యాసం చేయడానికి మరొక వక్త ఉన్నప్పుడు నేను ఎక్కువసేపు
మాట్లాడ్డం మర్యాదనిపించుకోదు. అందువల్ల నేను చెప్పిన సూత్రీకరణను సమన్వయించే మూడు
కథలను మాత్రం సంక్షిప్తంగా వివరిస్తాను.
సమకాలీనత అనేదొక పారిభాషికపదం. దీనిలో
భావవాద, భౌతిక వాద భావజాలాలన్నీ ఉంటాయి. ఆధునికత అంటే హేతువాద దృష్టీ,
శాస్త్రీయమైన నిరూపణ, మానవుని కేంద్రంగా జరిగే అభివృద్ధిని ప్రధానంగా పరిగణనలోకి
తీసుకోవడం. కానీ, కేవలం మన సమాజం అలాగే లేదు. అందువల్ల తెలుగు కథల్లో ‘ఆధునికత’
అనడం కంటే ‘సమకాలీనత’ అనడం వల్ల సమాజాన్ని అంతటినీ పరామర్శించే అవకాశం ఉంది. సమకాలీనతలో
మనకి నిత్యజీవనంలో జరిగే వాస్తవికతను కళ్ళకు కట్టినట్లువర్ణించే కథకు ఒక ఉదాహరణగా
ప్రముఖ కథకుడు వెల్దండ శ్రీధర్ రాసిన ‘కాసెపుల్ల’ కథ (ఆంధ్రజ్యోతి,
13 సెప్టెంబరు 2020). దీనిలో ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అందరూ ఇంటిలోనే ఉండడం
వల్ల గృహిణికి పనిభారం పెరగడం, స్త్రీ శారీరక, మానసిక శ్రమకు గురవుతున్న
పరిస్థితిని వర్ణించింది. ఇలాంటి సమకాలీన వాస్తకవితను వర్ణించే కథలు అనేకం ఈ రెండు
దశాబ్దాల్లో వచ్చాయి. మన కథల్లో రెండవ అంశం భావజాల పటిష్ఠతను వ్యాపిస్తూ అనేక కథలు
వస్తున్నాయి. జిలుకర శ్రీనివాస్ ‘సారంగ’ అంతర్జాల పత్రికలో రాస్తున్న ‘బైండ్ల
సెంద్రయ్య కథలు’ తమ భావజాలాన్ని పటిష్ఠంగా వినిపిస్తున్న కథలకు ఉదాహరణ. ఆయన రాసిన
‘కిరాతవిజయం’ కథ ( సారంగ, 15 జూన్ 2021) ప్రాచీన సమాజాన్ని,
సాహిత్యాన్ని దళిత. బహుజనులు పునర్మూల్యాంకన చేసుకొంటూ తమపై సాగిస్తున్న భావజాల దాడుల
నుండి రక్షించుకోవలసిన అవసరం ఉందని వాదిస్తుంది. మహాభారతంలో కిరాతార్జునీయం కథను
చెప్పి, తర్వాత ఏకలవ్యుడి ద్రోణాచార్యుని
విగ్రహం పెట్టుకొని విలువిద్యను అభ్యసించినా, పాండవుల కోసం బొటనవ్రేలుని
గురుదక్షిణగా సమర్పించుకోవలసివచ్చింది. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక
ద్రోణాచార్యులు దళిత, బహుజన విద్యార్థుల్ని కొట్టి, భయపెట్టి పాఠశాలలకు రాకుండా
తరిమేస్తున్నారని, వాళ్ళను ఒక కంట కనిపెట్టుకోవాల్సిన అవసరం ఉందంటాడు. ఇక, మూడవది ప్రయోగవిశిష్టతకు
ఉదాహరణగా అనేకమంది రాసిన కథలున్నాయి.శ్రీశ్రీ నుండి డా.వి.చంద్రశేఖరరావు వరకు
అనేకమంది ప్రయోగాలు చేస్తూ కథలు రాశారు. కవి, అధ్యాపకుడు, పరిశోధకుడు,
విమర్శకుడుగా మాత్రమే కాకుండా కథకుడుగా కూడామనముందుకొస్తూ ఆచార్య విస్తాలి
శంకరరావు ‘తడి ఆరని బ్రతుకులు’ (2021) కథలను ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. దీనిలో
దివ్యాంగుల గురించి రాసిన కథ ‘ఆత్మాభిమానం’ సమకాలీన సమాజంలో చాలామంది పెద్దగా
పట్టించుకోని అంశాల్లో ఒకటైన వికలాంగులకుండే గొప్ప ఆత్మాభిమానాన్ని చిత్రించింది.
ఇలా అనేక కథల గురించి ముచ్చటించుకుంటే మన
తెలుగుభాష, సాహిత్యం, అది ప్రతిఫలించిన సమాజం మనకళ్ళముందు స్ఫష్టంగా కనిపిస్తుంది.
ఆ పనిని చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ అంతర్జాల సదస్సు దిగ్విజయం
కావాలని ఆకాంక్షిస్తూ, నాకీ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు
తెలియజేస్తున్నాను
శ్రీ రాజరాజేశ్వరీ ప్రభుత్వ కళాశాల, కరీంనగర్ & మద్రాసు విశ్వవిద్యాలయం, చెన్నై వారు సంయుక్తంగా జాలై 2&3 వ తేదీల్లో (2-3,7.2021) తెలుగు కథ-సమకాలీనత అనే అంశంపై జరుగుతున్న అంతర్జాల అంతర్జాతీయ సదస్సులో భాగంగా శుక్రవారం (2.7.2021) ప్రారంభోత్సవ సభలో గౌరవ అతిథిగా సెంట్రల్ యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని, మాట్లాడారు. సమకాలీనత, భావజాల పటిష్టత, ప్రయోగం విశిష్టత అనే మూడు అంశాలు ఈ ఇరవై యేళ్ళ కథాసాహిత్యం లో స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామకృష్ణ, మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖాధిపతి ఆచార్య విస్తాలి శం
కరరావు తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి