చిట్టి కవితలు -43
(గణిత గీత)
- ఎన్వీఎస్ రాజు
ఒకటి కి ఒకటి జోడై
రెండై ప్రణయమైతే కానీ!
అది జీవిత సత్యం
అన్నది అంక గణితం (అరిత్మెటిక్)
ఒకటి కి ఒకటి తోడై
చెరిసగమై ఒక్కటైతే కానీ!
అది పరిణయ పరిణామం
అన్నది బీజ గణితం (ఆల్జీబ్రా)
ఒకటీ ఒకటీ ఒక్కటై
చివరకు మూడైతే కానీ!
అది ప్రణయ ఫలితం
అన్నది క్షేత్ర గణితం (మెన్సురేషన్)
ఒకటికి ప్రక్కన ఒకటి నీడై
ఒక్కొక్కటిగ అవి పదకొండైతే కానీ!
అది మనసులొక్కటైన స్నేహితం
అన్నది అనుకరణ గణితం (సిమ్యులేషన్)
ఒకటి పై ఒకటి ఎక్కి రేడై
గుణకభాగాహార ఘాతాలైతే కానీ
అది ఒక్కటైన గుత్తాధిపత్యం
అన్నది వ్యాపార గణితం (బిజినెస్ మ్యాథ్స్)
ఒకటిని ఒకటి తోసి మోడై
శూన్యమై వృత్తమైతే కానీ!
అది జీవన్మరణ చక్రం
అన్నది రేఖా గణితం (జామెట్రి)
శూన్యాన్ని శూన్యం భాగించే క్రీడై
అవధులు దాటి ఒకటైతే కానీ!
అది జీవాత్మ పరమాత్మ ఐక్యత్వం
అన్నది (రామానుజ) కలన గణితం (కాలిక్యులస్)
ఒకటీశూన్యాలే చివరికి కోడై
అన్నిటికీ అనుసంధానమైతే కానీ!
అంతా నేనే అదిమధ్యాంతం
అన్నది బులియన్ గణితం (బులియన్ ఆల్జీబ్రా)
1 కామెంట్:
👏👏👏
కామెంట్‌ను పోస్ట్ చేయండి