"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

30 సెప్టెంబర్, 2020

మాదిగ మూలాల్ని మరిచిపోని కవి ‘ఎజ్రాశాస్త్రి’ ( 30.9.2020, భూమిపుత్ర దినపత్రికలో ప్రచురితం)

 



‘‘చెప్పు నా జాతి జెండా

డప్పు నా అజెండా

చర్మం నా తంత్రి

నూరు కోట్ల పాదాలలో నుండి

మృత్యుంజయుడనై లేచిన వాడిని! నేను మాదిగోడిని’’ అని సాహిత్యం ద్వారాను, ఉద్యమాల ద్వారా కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో పయనిస్తూ, తాను చేసే ప్రతి పనిలోనూ తన బతుకు మూలాల్ని మరిచిపోని కవి దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి. ఈయన పేరు రికార్డ్సులో ‘దుగ్గనపల్లి ఎజ్రయ్య’ అని ఉంటుంది. కానీ, తాను చదువుకోవడానికి సహకరించి,  ఎంతగానో ప్రోత్సాహించిన తన ఒక గురువు తెలుగు పండితుడు ’’శాస్త్రి’’ గారి పేరుని తన పేరులో పెట్టుకొని శాశ్వతంగా గురువుగారి ఋణాన్ని తీర్చుకున్నారు. అప్పటి నుండి నేటి వరకూ తన పేరు ఎజ్రాశాస్త్రిగానే కొనసాగించారు. ‘‘ఒక సారి మా జూనియర్ కాలేజీ వార్షికోత్సవానికి  ఎస్.టి జ్ఞానానంద కవిగారు ముఖ్య అథిధిగా వచ్చారు ఆయనను ఉద్దేశించి కవిత రాసి చదివాను. అప్పుడు ఆయన నా తల నిమిరి భవిష్యత్ లో గొప్ప కవివవుతావోయ్ అని దీవించారు. అప్పటినుండి మా క్లాస్ మాష్టరు సవరపు ఆశీర్వాదంగారు. నా సహవిద్యర్దులు వొరే కవీ అని పలిచేవారు’’ అని తాను కవిగా మారడానికి గల నేపథ్యాన్ని ఈ వ్యాసకర్తకిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు ఎజ్రాశాస్త్రి. ఆ విధంగా కవిత్వం పట్ల అభిలాష పెరిగి శ్రీశ్రీనీ, జాషువానీ బాగా చదువుకున్నారు. విద్యార్థి దశనుండే నాయకత్వ లక్షణాలుగల ఎజ్రాశాస్త్రి మొదట్లో పిడియస్ లోపనిచేసినా, తర్వాత దళిత సంఘాల్లో పనిచేశారు. ఆ పోరాటపటిమే నేటికీ మాదిగ హక్కుల కోసం పనిచేసేలా చేస్తుంది. ఆ నేపథ్యమే నేటికీ తన జాతి జీవితాన్ని సాహిత్యీకరించేలా ప్రేరేపిస్తుంది.

 

ఈమధ్య కరోనా నేపథ్యంలో ఎజ్రాశాస్త్రిగారు ‘రోడ్లు చిగురించాలి’’ పేరుతో రాసిన ఒక కవిత  ప్రథమ బహుమతి పొందింది. అది ఈనాడు మెయిన్ పేజీలో ప్రచురితమయ్యింది.  ఆ కవితను ప్రముఖనేపథ్యగాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారు ఇష్టపడి చదివి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ కవితలో కూడా మాదిగజీవితాన్ని వర్ణించకుండా వదల్లేదు ఎజ్రాశాస్త్రిగారు. ‘‘బతుకు రోడ్డు కోటి వ్యాపారాల కూడలి

మనషన్న వాడికి

రోడ్డే జీవనాధారం

ఫుట్‌పాత్‌ మీద చిల్లులుపడ్డ గొడుగు

గొడుగు కింద బడుగు

అతగాడి ఉనికేదిప్పడు!?

నాలుగు పాదాలకు

పాలిషైతేనే కదా కుటుంబం కడుపునిండేది,

ఇప్పుడు ఇంట్లో

దారాన్ని పెనవేస్తున్నాడు రేపటి

తెగిన చెప్పుకోసం!

మనకు కనిపించదు కానీ

రోడ్ల మీద కూడా బతుకు మొలుస్తుంది, చిగురిస్తుంది’’ అని రోడ్లు పక్కన చెప్పులు కుట్టుకునే మాదిగల జీవితాన్ని వర్ణించారు ఎజ్రాశాస్త్రి.  దీన్ని ఏప్రిల్ 30, 2020 వతేదీన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గారే స్వయంగా తన ఫేస్ బుక్ వాల్ లో ప్రచురించారు.

 

1995లోప్రకాశం జిల్లా కనిగిరిలోమందా కృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రిలే నిరహార దిక్షల్లో కూడా పాల్గొని, నాటి నుండి నేటి వరకూ మాదిగల కోసం పనిచేస్తూనే ఉన్నారు.

 

ఎజ్రాశాస్త్రి 1జూలై1962 న శ్రీమతి సంతోషమ్మ శ్రీరాజు దంపతులకు ఎర్రఓబెన్నపల్లి గ్రామం, కనిగిరి మండలం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. ఆయన తండ్రి రాజుగారు పద్యకవిత్వాన్ని కూడా రాసేవారు. ఎజ్రాశాస్త్రి వృత్తి రీత్యా ప్రభుత్వ ఉద్యోగి, ఇరిగేషన్ శాఖలో పనిచేస్తుంటారు. కానీ, ప్రవృత్తి మాత్రం చక్కని సాహిత్యాన్ని రాయడం. ప్రముఖ దినపత్రికలు ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, విశాలాంధ్ర, ప్రజాశక్తి, సూర్య, మనం, సాక్షి తదితర పత్రికలన్నింటిలోనూ ఆయన రాసిన వ్యాసాలు, కవితలు ప్రచురితమయ్యాయి. తన జాతి గురించెవరైన అసంబద్ధమైన వ్యాఖ్యలు చేసినా, వక్రీకరించినట్లనిపించినా వెంటనే ప్రతిస్పందిస్తూ ఖండన లేదా వివరణాత్మకంగా వ్యాసాల్ని రాస్తుంటారు. తాను పుట్టి పెరిగిన మాదిగ జాతి పరిమళాల్ని సాహిత్యమంతా పరుచుకున్నప్పటికీ, దళితులంతా ఏకమైన నాడే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని నమ్మే దార్శనికుడు.

 ‘‘బువ్వొద్దు భూమికాలి

రాయతీలోద్దు రాజ్యం

కావాలి ఇస్తావా !?’’ అని ఏరువాకై తిరిగి లేస్తా (కవితా సంకలనం -  2006)అనే కవితాసంకలనంలో రాయగలిగారు.  తన బిడ్డ తల్లి అయినప్పుడు రాసుకున్న కవితలో ఒక తండ్రి స్పందన అద్భుతంగా పలికించి చక్కని అనుభూతి కవిత్వం కూడా రాయగలనని నిరూపించుకున్నారు.

‘‘తన చిట్టి పాదాలతో

నా గుండెల మీద

నడుస్తుంటే, నా శ్వాస

సముద్రకెరటమై ఉప్పొంగేది’’ అని అలా ఆడపిల్లని ఆడిస్తూ గుర్రంలా, ఏనుగులా ప్రతి తండ్రీ మారినట్లే తానూ మారినా కాలం గడిచే కొద్దీ ఆ పిల్ల వయసులో కొచ్చేసరికి తండ్రి  ఎలా ఫీలవుతాడో వర్ణిస్తూ

‘‘కాలంతో పాటువయస్సు తనను

వరదలా ముంచెత్తింది

మా ఇద్దరి మధ్య ఏదో

తెలియని తెర ఏర్పడింది’’ అని చక్కని అనుభూతితో తడిసిపోతారు కవి.

 

అందుకే ఒకవైపు మాదిగ, అనుబంధ కులాలతో పాటు షెడ్యూల్డు కులాలలోని అన్ని ఉపకులాలవారికి రాజ్యాంగం ప్రకారం దక్కవలసిని రిజర్వేషన్లు సమానంగా దక్కాలని భావిస్తుంటారు కవి.. అందుకు జరిగే ఉద్యమాల్లో క్రియాశీలంగా కూడా పాల్గొంటారు కవి.. మాదిగ హక్కుల కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు కవి.. మాదిగ ఉద్యమానికీ, సాహిత్యానికి కావలసిన తాత్త్విక ధారను అందించడంలో, మాదిగ సాహిత్యంలో మాదిగల సంస్కృతిని, దానిలోని ఔన్నత్యాన్ని వర్ణించడంలో ఎజ్రాశాస్త్రి పాత్ర చిరస్మరణీయమైంది.

''కర్రముక్కకదా అనుకుంటే పొరపాటే

 ఆకులు వలువలు ధరిస్తే, మహారణ్యం!,

ఆకులు విదిల్చిచేతే ఒక మహా సింహాసనం’’  అనీ ‘‘చర్మం తో చేయికలిపి దమనకాండ దౌర్జన్యాలపై దండోరా వేస్తా’’ నంటారు కవి. కర్రముక్క ( దీర్ఘకవిత -2005)లో. ఎజ్రాశాస్త్రి కవిత్వాన్ని ప్రముఖ విమర్శకుడు శ్రీరామకవచం సాగర్‌ వ్యాఖ్యానిస్తూ                    ‘‘ కవిత రాయట ద్వారా అతను రెండు ప్రయోజనాలు సాధిస్తున్నారు. ఒకటి అతని రచన సూటిగా వుంటుంది. రెండు అస్పష్టత ధరి దాపులకు వెలకుండా సూటిగా పాఠకుడికి అనుభూతిని ప్రసాదిస్తుంద’ని అంటారు .   నిప్పుల్లో నడిచే తప్పెట (దీర్ఘకవిత -  2008),  మా ఎర్రఓబన్నపల్లె (నవల 2018), పంచమాగ్ని, ఉత్తర కవితా సంపుటాలు. ఇంకెంతదూరం కవిత్వం, కథలు ,వ్యాసాలు రాశారు. వీటితో పాటు ముద్రణలో ఉండి, త్వరలోనే రాబోతున్న ‘చంద్రవంక’ నవల మొదలైన రచనలన్నీ ఎజ్రాశాస్త్రి గారి మాదిగల పట్ల గల నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తాయి. ఎజ్రాశాస్త్రి గారి రచనలపై అనేకమంది వ్యాసాలు రాశారు కవి.. ముఖ్యంగా ఆయన రాసిన ‘మా ఎర్రఓబెన్నపల్లె నవల దళితుల్లో మాదిగల ఆత్మగౌరవాన్ని నిలిపేనవల. కళ్యాణరావు ‘అంటరానివసంతం’ నవలలో మాలల్ని, మాదిగల్ని కలిపి వర్ణిస్తూనే మాలల సంస్కృతినీ, వారి అంటరానితనాన్నే ఉన్నతీకరించడం కనిపిస్తుంది.కానీ, ఎజ్రాశాస్త్రి మాదిగల ఆత్మగౌరవపోరాటాల్ని, భూమికోసం చేసిన పోరాటాల్ని ప్రతీకాత్మకంగా వర్ణిస్తుంది. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్న నవల అందరు చదువుతున్న నవల. వివిధ పత్రికలలో, సామాజిక మాద్యమాలలో విస్తృతంగా చర్చ జరుగుతున్న నవల "మా ఎర్ర ఓబన్న పల్లె" అని ప్రముఖకవి వనపట్ల సుబ్బయ్య ఈ నవల గురించి తన ఫేస్ బుక్ లో రాసుకున్నారు. ‘‘ఏడు తరాల అనామక మాదిగ జీవితాన్ని చాటింపు వేస్తున్న నవల. ఒక స్వతంత్ర వస్తువు, శిల్పం ,చరిత్ర లతో సాగిన నవల. రచయిత నవలలో తన మూలలను వెతుకున్న తీరు చాలా గొప్పగా ఉంది. అడుగడుగునా నవల మాదిగ వాసన వొచ్చింది. అభూతకల్పనలు కాకుండా జీవితాన్ని ఒక దృశ్య కావ్యం లాగా నవల చూయించిన తీరు ఆమోఘం. మా ఎర్ర ఒబాన్నపల్లె  చదువుతున్నంత సేపు మా గుడిపల్లి లోని మా తాతల చరిత్ర ను చదువు తున్నట్లు అనిపించింది. నా చరిత్రలాగే  ...నాలోకి నేనే చూసుకున్నట్లు ఉంది. మాదిగల జీవితాల మీద ఎన్ని కుట్రల చీకటి కోణాలు కప్పిన సగర్వమైన చరిత్ర మా మాదిగ జాతిది అని ఈ నవల నిరూపించింద’’ని ఈ నవల గురించి ప్రముఖ విమర్శకుడు గుడిపల్లి నిరంజన్ వ్యాఖ్యానించడం వాస్తవాన్ని సరిగ్గా అంచెనా వేసినట్లే.

 

మాదిగల గురించి కవిత్వం రాయడమే కాదు, మాదిగల గురించి వచ్చిన రచనల్ని పరిచయం చేయడానికి కూడా సమీక్షకుడిగా, మాదిగల జీవితాన్ని, సాహిత్యాన్ని వక్రీకరిస్తే దాన్ని శక్తివంతంగా ఎదుర్కొనే విమర్శకుడిగా కూడా ఎజ్రాశాస్త్రి పలు పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు కవి.. ఆత్మకూరి చెన్నయ్య రాసిన ‘‘ బహుజనులకు రాజ్యాధికారవేు లక్ష్యంగా జీవించిన మాన్సశ్రీ కాన్సీరామ్  పోరాట జీవితం’ గ్రంథాన్ని సమీక్షిస్తూ  మెజారిటి పీడితులు చిన్న చిన్న కులాలుగా విడిపోయి సంఘటిత శక్తిగా పోరాడే వీలు లేనపుడు వీరందరిని ఏకంచేసి బహుజన సిద్దాంతం ద్వారా రాజ్యాధికారంవైపు నడిపించడానికి ముందుకు సాగిన వ్యక్తి గా కాన్షీరామ్ జీవితపోరాటాన్ని చక్కగా రాసారని, కావ్య లక్ష్యాన్ని పట్టుకుంటారు కవి.. వ్యాసం చివరిలో

‘‘ఇప్పుడు పార్లమెంటు భవనం కూడా

 నాకు నా మాదిగ పల్లెలా కనబడుతుంది.

 మా వూరి ఆసామి

 నా తప్పెట ముందు చిందేసినట్లుంది

 ఎండు తునకల జండా

 పార్లమెంటు భవనం మీద

 ఎగరేసనంత సంబంరంగా ఉంద’’ తనకవితాత్మక పంక్తులతో తనదైన ముద్రవేస్తారు కవి..  దార్ల వెంకటేశ్వరావు రాసిన ‘నెమలికన్నులు’ కవిత్వం గురించి సమీక్షా వ్యాసం (ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం, 4 ఏప్రిల్ 2016) రాస్తూ ‘‘దార్ల విద్యార్థి దశ నుండే కవిత్వం రాయడం ప్రారంభించారు. ఈయనకు కవిత్వం కొత్తకాదు. కవిత్వంతో పాతికేళ్ళ అనుబంధం ఉంది. పరిచయాలు అక్కరలేని వ్యక్తి. వస్తువు, శిల్పము, ఎత్తుగడ, ముగింపులలో ఎక్కడా రాజీపడరు. దార్ల వెంకటేశ్వరరావు కవిత్వం వేరు. జీవితం వేరు కాదు జీవితమే కవిత్వమైనవారు. జీవితాన్నే కవిత్వీకరించినవారు’’ అని వ్యాఖ్యానించి, దార్ల రాసిన మాదిగ మ్యానిఫెస్టో కవితలో ఒక అంటరానివాడు ఇంకొకరిని అంటరానివారిగా చూడటం ఎంత విడ్డూరం/ అంటరానితనంలో/ మళ్ళీ అంటరాని తనం పెంచే/ ఇంటర్‌ సుపీరియారిటీ భరించలేక/ అంతరాంతరాల్లోని అగ్నిపర్వతం పగిలిందిప్పుడే. వామపక్షాలు, స్త్రీవాదం, మావోయిజం, మార్క్సిజం, ట్రాన్స్‌జండర్‌, పాలస్తీనా, అన్నీ వాదాల్లో ముందుండి ప్రపంచ రాజకీయాలదాకా మాసోదరులు మాట్లాడుతుంటారు. వర్గీకరణ వాదం వచ్చేసరికి మాట దాటవేస్తారు. అందితే స్వజాతినే తినేస్తున్న అవకాశవాద కొరమీనుల సమూహం పాడిన/ సమైక్యతా గీతాలనూ విన్నాను. మాదిగ మానిఫెస్టోలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌లా ధవళ వస్త్ర జిలుగుల్ని మెరిపించడం దళితులంతా బాబు జగజ్జీవన్‌రామ్‌లా అధికారంతో పోటీపడటం, మహాకవి గుర్రం జాషువాలా కమ్మని కావ్యాన్నాలపించండి అంటూ ఓ మంచి సందేశాన్నిచ్చాడ’ని వ్యాఖ్యానించారు. ఇలా ఒక విమర్శకుడిగా రాసినా తన జాతి వేదనను మరిచిపోని వారు ఎజ్రాశాస్త్రి.

 

ఈ మధ్య ఎజ్రాశాస్త్రి రాసిన ఒక కవిత మాదిగల ఔన్నత్యాన్ని, ఆత్మాభిమానాన్ని ఎంతో ఉదాత్తంగా ప్రకటితమైంది. కవిత పేరు ‘‘ప్రపంచ చెప్పుల ఘోష!’’ ఈ కవిత చూద్దాం.

‘‘జతలు, జతలుగా ఉండాల్సిన చెప్పులు

సైజుల తేడాలతో చెల్లాచెదురుగా

పడి ఉన్నాయి

ఎక్కడ చూసినా ఒక చెప్పే

రంగుల్లో తేడాలే కాని అన్నీ చెప్పులేగా

కొన్ని కొత్తచెప్పులుకూడా ఉన్నాయి

ఎంత వెదికినా జోడీ దొరకడం లేదు

వీళ్ళంతా ఏమయినట్టు !?

పోని ఇది గుడో ,బడో ,చర్చో ,మజీద్

అనుకుందామంటే అదీ కాదు

అంతా మనుషులు తిరగాడే నేలే

 ఒక చెప్పుతో నడక సాగుద్దా అంటే

అదీ కాదు!

దేహాలు అదృశ్యమై చెప్పులు

వదిలేసుంటారు ,మరలా తిరిగొస్తే కదా!

వాళ్ళ చెప్పులు  భద్రంగా గూట్లో

దాచుకొనేది ,ప్రాణం వదిలేసీ దేహంతో

వెళ్ళుంటే చెప్పులు వేసుకోవాలి కదా ?

మర్చిపోయుంటారు కాబోలు

 జీవం లేదు వీటికి ఉంటే ఒంటరి చెప్పు

జతకలిసేది జతలేకుండా జీవితం

గడిచేది ఎట్టా అని !

పాలీష్ లేదనో ,తెగిపోయిందనో

రోడ్డుపట్టుకు తిరిగే ఆ మనుషులు లేరు

కుక్కలెత్తుకు పోతాయని ఎంత బధ్రంగా

దాచుకునే వాళ్ళు ఇప్పుడవి యజమాని

పాదాల కోసం పరితపిస్తున్నాయి

వేలకు వేలు' బెట్టి కొని "వేలు" కూడా దూర్చలేదు

వదిలిపెట్టి ఎటో వెళ్ళిపోయారు చెప్పులు

కొత్తవి కదా ,ప్రాణంలా చూసుకొనే వాడు

చెప్పులు మిగిలాయి ప్రాణం పోయింది.

కొన్ని చెప్పులు కరుస్తుండేవి

కొన్ని సైజలు సరిపోక  అవే ఇరికుంచుకొని

తిరిగే వాడు, వాడు ఇప్పుడేడీ

చెప్పులున్నాయిగానీ మనిషిలేడు

అయినా బతికున్నప్పుడు

ఉచ్ఛ నీచాలు చెప్పుతో పోల్చేవాడు

చెప్పు బతికే ఉంది మనిషి కనబడటం లేదు

పసుపు పారాణికూడా ఆరలేదు

ప్రయాణమయ్యాడు చెప్పులు

మర్చిపోయాడు !!

ప్రపంచమంతా మనుషులకంటే

చెప్పులే ఎక్కువ !,జతలేని

చెప్పులే ఎక్కువ’’ ఈయన జీవితాన్ని, రచనలను పరిశీలిస్తే దళితసాహిత్యంలో గానీ, మాదిగ సాహిత్యంలో గానీ, యావత్తు తెలుగు సాహిత్యంలోగానీ ఒక చెరపలేని సంతకం ‘ఎజ్రాశాస్తి’ అని అభివర్ణించుకోవచ్చు. అయితే ఈయన పై పరిశోధనలు చేస్తున్నారు. పరిశోధన పత్రాలను రాస్తున్నారు. కానీ ప్రభుత్వపరంగా కూడా తగిన గుర్తింపు రావలసిన  అవసరం ఎంతైనా ఉంది.

 

 -      ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగుశాఖ, సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాద్.

 

 

 

( 30.9.2020 భూమిపుత్ర పత్రికలో ప్రచురితం)


కామెంట్‌లు లేవు: