https://drive.google.com/file/d/1LbtPymcu-ItXG0plODQb5ugKBXjwFaK-/view?usp=sharing
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, ఉన్నత విద్యాశాఖ వారు 17 ఆగస్టు 2020 నుండి 21.8.2020 వరకు ఐదు రోజుల పాటు ‘అధ్యాపక విజ్ఞానాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా తొలిరోజు నన్ను ‘తెలుగు సాహిత్యంలో వస్తున్న నూతన ధోరణులు’ గురించి మాట్లాడమన్నారు. ఆంధ్రప్రదేశ్ కళాశాలల్లో పనిచేస్తున్న తెలుగు అధ్యాపకుల కోసం సుమారు గంటన్నరపాటు ఆన్ లైన్ ద్వారా నా ప్రసంగాన్ని కొనసాగించాను. ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాల్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్న కొన్ని
నూతన ఆలోచనలు
-ఆచార్య
దార్ల వెంకటేశ్వరరావు,
తెలుగుశాఖ,
స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్,
యూనివర్సిటి
ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్-500 046,
·
అందరికీ
నమస్కారం,
·
ముఖ్యంగా కళాశాల స్థాయి తెలుగు అధ్యాపకుల కోసం ‘‘తెలుగు
భాషా సాహిత్యాలు-నవీన దృక్కోణాలు-విద్యాసిద్ధాంతం-నైపుణ్యాలు’’ అనే అంశంపై
ఆగస్టు 17, 2020 నుండి ఆగస్టు 21, 2020 వరకు ఐదురోజుల పాటు ‘అధ్యాపక విజ్ఞానాభివృద్ది
కార్యక్రమా’న్ని నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కళాశాల విద్యాశాఖ వారికీ,
రాష్ట్ర ఉన్నత విద్య ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సతీష్ చంద్ర,
ఐ.ఏ.ఎస్, గార్కి, కళాశాల విద్య ప్రత్యేక కమీషనర్ శ్రీ ఎమ్.ఎమ్.నాయక్, ఐ.ఏ.ఎస్
గార్కి, ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరిస్తున్న ఇతరులందరికీ నా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.
·
ఈ
కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యాపకులకు శుభాకాంక్షలతో కూడిన నమస్కారాలు.
·
ప్రస్తుతం
మనమంతా ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అది కోవిద్-19. ఈ పరిస్థితుల్లో
ఇంట్లో ఉండి కూడా విద్యార్థుల గురించి ఆలోచిస్తూ, వారికి రకరకాల మార్గాల్లో విజ్ఞానాన్ని
అందించాలనే తపన మీ అందరిలోనూ కనిపిస్తోంది.
·
క్విజ్
కార్యక్రమాలు, వెబినార్స్, ప్రత్యేక ప్రసంగాలు, వారం వారం సాహిత్య కార్యక్రమాలు
మొదలైన వాటిని మన అధ్యాపకులు చేస్తున్నారు. వీటిలో చాలావరకూ వాట్సాప్, ఫేస్ బుక్,
రకరకాల సామాజిక మాధ్యమాల ద్వారా మనం గమనిస్తున్నాం.
·
ఇలా
నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉండడం, సమకాలీన సమాజంలో వస్తున్న మార్పులకు
అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడం ఎంతో అవసరం.
·
క్రొత్త
పుస్తకాలు చదవడం, క్రొత్త క్రొత్త రచనలను చేయడం, వాటిని విశ్లేషించుకోవడం అనేది
అధ్యాపకులు నిరంతరం చేయాల్సిందే. అప్పుడు మాత్రమే మనం చైతన్యవంతంగా ఉండగలుగుతాం.
అప్పుడు మాత్రమే మనం మన విద్యార్థులకు సమకాలీన సమాజంతో పోటీ పడేటట్లు చేయగలుగుతాం.
·
అధ్యాపకులకు మూడు విషయాలు ఉండాలని పెద్దవాళ్లు (ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ‘పునర్మూల్యాంకనం’ రచన:
దార్ల వెంకటేశ్వరరావుకి ముందుమాట రాస్తూ ఇలా అన్నారు ‘‘విశ్వవిద్యాయాల్లో అధ్యాపకుకి కూత ఒక్కటే ఉంటే చాలదు. రాత కూడా ఉండాలి. ఈ
రెండింటికీ బలం చేకూర్చే మేత అంతకన్నా తప్పనిసరి. మేత అనే పదానికి రంగాన్ని బట్టి
రంగు మారుతుంది. వేరే వేరే అర్థాలూ స్ఫురిస్తాయి. కానీ బోధన రంగంలో మాత్రం ఒక్కటే
అర్థం- నిరంతర అధ్యయనం అని. ఇది బోధకు కూతకీ, రాతకీ బవర్థకం.
ధైర్యవర్థకం కూడా ఇదే!’’ ) చెప్తుంటారు. మేత,
రాత, కూత అనేవి మూడూ ఉండాలని చమత్కారంగా చెప్తుంటారు.
·
మెదడుకి
నిరంతరం చదవడం, ఆలోచించడం వల్ల వచ్చేది ‘మేత’ చదివిన దాన్ని అవగాహన చేసుకొని
రాసుకొనేదీ, రాసేదీ ‘రాత’, ఈ రెండింటి వల్ల మనం ఇతరులకు బోధించేది ‘కూత’
·
ఈ మూడూ
ఉన్నప్పుడు మాత్రమే మనం ‘క్రొత్తదనాన్ని’ గుర్తించగలుగుతాం.
·
ఇవన్నీ నిత్యం నేను ప్రసిద్ధ సాహితీ విమర్శకుడు, పరిశోధకుడు,
సహృదయులు, నేను గురువుగా భావించే ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారిలో
గమనించాను. ఆయన పదవీవిరమణ పొందిన తర్వాత కూడా నిరంతరం చదువుతారు. నిరంతర చదివిన దాన్ని
రాస్తుంటారు. చదివి, రాసిన అంశాల్ని వివిధ వేదికల్లో ప్రసంగిస్తుంటారు. నిజానికి
ఆయన్ని గమనిస్తే చాలు సమకాలీన తెలుగు సాహిత్య తీరుతెన్నులు, సాహిత్యంలో వస్తున్న
నూతన ధోరణలు మనకు అవగాహనకొస్తాయి. వారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు
తెలియజేస్తున్నాను. వీరి తో పాటు అనేక మంది ఇలాంటి నిరంత అధ్యాపనపరులున్నారు.
ఆచార్య మేడిపల్లి రవికుమార్, ఆచార్య బన్న అయిలయ్య, ఆచార్య వెలుదండ నిత్యానందరావు,
డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్... ఇలా ఎంతోమంది
ఉన్నారు. వారందరినీ గుర్తుచేసుకుంటూ, ఈ సందర్భంగా వారికి నమస్కరిస్తున్నాను.
·
మన తెలుగు సాహిత్యంలో వస్తున్న నూతన ఆలోచనలు
తెలియాలంటే కూడా ఈ మూడింటి పట్లా ఒక అవగాహన ఉండాలి.
·
ఇక్కడ
నేను ‘తెలుగు సాహిత్యంలో వస్తున్న నూతన ధోరణులు’ అని నా ప్రసంగానికి
మొదటిలో శీర్షిక పెట్టినా, తెలుగు సాహిత్యంలో వస్తున్న కొన్ని నూతన ఆలోచనలు లేదా కొన్ని నూతన ఆవిష్కరణలు అనే దృష్టితోనే నా ఆలోచనల్ని మీతో పంచుకునే
ప్రయత్నం చేస్తున్నాను. ఇంగ్లీషులోని Trend అనే మాటకు ‘ధోరణి’
అని తెలుగులో అర్థాన్ని చెప్పుకుంటున్నాం.
ధోరణిని పద్ధతి, పోకడ, వైఖరి,
ఆలోచనా విధానం, ఆలోచనాక్రమం, మారుతున్న క్రమం మొదలైన అర్థాల్ని వివరించుకునే
అవకాశం ఉంది.
·
తెలుగులో
ధోరణి, వాదం, ఉద్యమం మొదలైన పారిభాషిక పదాలను కొంత గందరగోళంగా ప్రయోగిస్తున్న
స్థితి కూడా కనిపిస్తుంది.
·
‘‘ప్రక్రియ,
భాష, శైలి, శిల్పం, ఇతివృత్తం, సైద్ధాంతిక దృక్పథం- మొదలైన విషయాలలో రచయితలు
చెప్పుకోదగిన సంఖ్యలో అనుసరించే మార్గమూ, పద్ధతిని ‘ధోరణి’ అంటారని నళిని తన ‘సాహిత్య విమర్శ పదాల
డిక్షనరీ, 2009,పుట: 84) వివరించారు.
·
‘‘సంప్రదాయ
ధోరణి, నవ్య సంప్రదాయ ధోరణి, కాల్పనిక ధోరణి, అభ్యుదయ ధోరణి, విప్లవ ధోరణి వంటి
వన్నీ రచయితలు అనుసరించే మార్గాలూ , పద్ధతులూ కాబట్టి, వీటిని ‘సాహిత్యంలో ధోరణులు’
అనవచ్చని అభిప్రాయపడ్డారు.
·
వస్తువు
పట్లా, రచన పట్లా రచయితలు ఏర్పరుచుకునే
దృష్టినే స్థూలంగా ‘ధోరణి’ అంటారు. దీన్ని
బట్టే ఆ సాహిత్యానికి కొన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నారు.
·
నేను మరలా
ఆ ధోరణుల్ని, వాదాల్ని, సిద్థాంతాల్ని మరలా చెప్పట్లేదు. కనుక శీర్షికను ‘‘తెలుగు
సాహిత్యంలో కనిపిస్తున్న కొన్ని నూతన ఆలోచనలు’’ అని మార్చుకుందాం.
1.
తొలి తెలుగు మాట?
నాగబు అనే పదాన్ని తెలుగులో చాలాకాలం వరకూ తొలి మాట గా
భావిస్తూ వచ్చాం. దీన్ని ప్రముఖ
సాహితీవేత్త, శాసన పరిశోధకులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు
‘నాగబు’ అన్న పదంపై 1928లో ‘భారతి’ మాస పత్రికలో ఒక వ్యాసాన్ని ప్రచురించారు.
నాగబు అనేది ఒకేపదమని, తెలుగు ప్రత్యయాంతమైన తత్సమ పదమని చెప్పారు.
శాసనాల్లో కనిపించే నాగబు పదం.
·
ఎన్నో
శాసనాలను పరిశోధించి వాటిని భారత
పురాతత్వ సంస్థ శాసన విభాగ సంచిక ‘ఎపిగ్రాఫియా ఇండికా’ (EpigraphiaIndic)లో ప్రచురించారు. దీనిలో ‘నాగ’
ఒక పదమనీ, ‘బు’ మరోపదమనీ అన్నారు.
·
కానీ, వేటూరి
ప్రభాకరశాస్త్రిగారి వాదననే బలపరుస్తూ ఆరుద్ర తదితరులు ‘నాగబు’ తొలితెలుగు పదంగా
ప్రచారం చేశారు.
·
ఆరుద్ర తన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ పుస్తకాలకు
అగ్ర శీర్షికగా ముద్రించారు.
·
కానీ, ఇటీవల ఈ శాసనభాషపై విశేషమైన పరిశోధన
చేస్తున్న డా.ఈమని శివనాగిరెడ్డి గారు ‘ నాగబు’ ఒక పదం కాదనీ, అది రెండు వేర్వేరు
పదాల కలయిక అని ప్రకటించారు.
·
‘‘బౌద్ధం పట్ల ఆకర్షితులై సమసమాజాన్ని
కోరుకొన్న వివిధ వృత్తులకు చెందిన ప్రజలు, స్థూపాన్ని
అలంకరించటానికి అవసరమైన కట్టడ భాగాలను, శిలా ఫలకాలను
చెక్కించి బహూకరించారు. కొందరు వారి పేర్లను కూడా ఆ శిలాఫలకాల్లో
చెక్కించుకున్నారు. శాసనాల్లో ‘నాగ’ అన్న
పదం అనేకసార్లు కనబడింది. ఉదాహరణకు నాగసేన, నాగనిక, నాగసిరి, నాగమిత, నాగ చంపకి, భదంత నాగ, నాగోపాఝాయ, నాగబోధి, నాగబుద్ధి.
·
కొన్ని శాసనాల్లో కేవలం నాగ, బుద్ధి, కొన్ని
సందర్భాల్లో ఈ రెండు పదాలు కలిసిన ‘నాగబుద్ధి’ (ధనగిరి వత్తవ నాగబుద్ధి
వనియపుతో), నాగబుద్ధు అన్న పేర్లు కూడా కనిపిస్తున్నాయ’’ని
పరిశోధకులు గుర్తించారు.
·
‘ధనగిరి వత్తవ నాగబుద్ధి వనియపుతో’ అన్న
శాసనంలోనూ, అమరావతిలో దొరికిన మరో శాసనంలోనూ, ‘నాగబు’ ఒక
వరుసలోనూ, దాని కిందగల రెండో వరుసలో ‘ద్ధి’ చెక్కి ఉండటాన ‘నాగబు’ ఒక అసమగ్ర పదమనీ, ‘నాగబుద్ధి’
అనేది ఒక వ్యక్తి పేరనీ ఖచ్చితంగా చెప్పవచ్చని పరిఈమని నాగిరెడ్డి గారు
(ఆంధ్రజ్యోతి, 17 -1-2016, తొలితెలుగు
పదం అది కాదట!) ప్రకటించారు.
·
నాణేల పరిశోధకులు డా. డి. రాజారెడ్డి గారు
కోటలింగాల తవ్వకాల్లో శాతవాహన పొర కంటే కింది పొరలో దొరికిన గోబద, నరన, కంవాయ, సమగోప అనే
పేర్లున్న నాణేలపై గల లిపి క్రీ.పూ. 3వ శతాబ్ది నాటిదనీ, అందుచేత ఆ
రాజుల పేర్లు తెలుగులో ఉన్నాయని చెబుతున్నారు. అందుబాటులో ఉన్న పురావస్తు ఆధారాల ప్రకారం
ఇవే తొలి తెలుగు పేర్లు, పదాలవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు.
·
వీటి అర్థాలు, ప్రయోగ సందర్భాలు లోతుగా పరిశీలన
చేయాల్సి ఉంది.
2.
ఆంధ్రప్రదేశ్ అధికార చిహ్నం- తెలుగు సంస్కృతి ఔన్నత్యం
·
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార చిహ్నంలో ఒక
‘పూర్ణ కుంభం’ ఉండేది. కానీ అది పూజకు సంబంధించిన ‘పూర్ణకలశం’లా కనిపించేది.
దీన్ని 2018లో కొన్ని మార్పులు
చేశారు. 14 నవంబర్ 2018 న జి.ఓ. ద్వారా ఈ
మార్పు చేశారు.
·
రాష్ట్ర అధికార చిహ్నంలో ఉన్న ‘పూర్ణ కుంభం’
స్థానంలో ఇప్పుడు కొత్త చిహ్నంలో ‘పూర్ణ ఘటకం’ అని స్పష్టంగా ప్రకటించి, దాన్ని
చేర్చారు.
|
·
నిజమైన అమరావతి స్థూపంలో పూర్ణఘటం రూపాన్ని
ప్రభుత్వం పరిశీలించింది. లండన్ మ్యూజియం నుంచి దీనికి సంబంధించిన ఫొటోను
తెప్పించి పరిశీలించారు. పురావస్తు, చారిత్రక నిపుణులతో చర్చించి… 1954నాటి
నోటిఫికేషన్ ప్రకారం, అమరావతి సంస్కృతి నుంచి స్వీకరించిన
పూర్ణఘటాన్ని తిరిగి అధికారిక చిహ్నంలో చేర్చాలని నిర్ణయించారు.
|
|
·
ధర్మచక్రంలో 64 గీతలు, పూర్ణ ఘటం
చిత్రాన్ని చేర్చారు. నాలుగు సింహాల బొమ్మను అలాగే ఉంచారు. అదే సమయంలో గతంలో
అధికార చిహ్నం పైభాగంలో Government of Andhra Pradesh అని ఆంగ్లంలో ఉండేది.
ఇప్పుడు దాన్ని తెలుగులోకి మార్చారు. ఎడమ వైపు పాత దానిలో తెలుగులో ఉండే
ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ఇంగ్లీషులో Andhra Pradesh మార్చారు. కుడివైపున
హిందీలో ఉండే పేరుని అలాగే రాసినా, దాని దిశను మార్చారు. సత్యమేవ జయతే అని హిందీలో
ఉండే సూక్తిని కూడా తెలుగులోకి మార్చారు. జీ.వో.నెంబరు: 740 ప్రకారం దాన్ని మార్పు
చేశారు.
·
ఈ మార్పులు తెలియకుండా చాలామంది ఆంధ్రప్రదేశ్
అధికార చిహ్నంలో క్రైస్తవ చిహ్నాలు చేరాయని రాయడం మొదలు పెట్టారు. ఈ విషయం పట్ల తెలుగు సాహిత్య విద్యార్థులకు
అవగాహన అవసరం. అందువల్ల తెలుగు అధ్యాపకులు కూడా మన సాహిత్యం, శాసనాలు, చరిత్రలతో
ముడిపడిన ఈ విషయాన్ని తెలుసుకోవడం అవసరం.
·
ఇక్కడ మనం –
సాహిత్యానికి సంబంధించిన అంశాన్ని చూడాల్సిందేమిటంటే, ఆంధ్రుల తొలిపాలకులు
శాతవాహనుల కాలం నాటిది. దీనికి బౌద్ధమతశిల్పరీతిని జోడించి అమరావతీస్తూపంపై
ఉంచారు. ఈ పూర్ణఘటం రూపశిల్పి పేరు విధిక. విధిక తండ్రి నాగన. ఆ కుటుంబానికి
చెందినవాడే భుజంగరాయుడు. ఆచార్య కొలకలూరి ఇనాక్ ‘‘ ఆది ఆంధ్రుడు’’ పేరుతో
రాసిన చారిత్రక కావ్యంలో ఇతివృత్తం అదే.
·
తెలుగు వారి చరిత్రను, సంస్కృతిని
చెప్పేటప్పుడు ఈ సందర్భాల్ని బోధనలో ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది.
3. తెలుగు సాహిత్య చరిత్ర – పునర్మూల్యాంకనం
·
తెలుగు
సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాల ప్రభావం వల్ల సాహిత్యంలో పునర్మూల్యాంకనం మొదలైంది.
·
దీనికి
సంబంధించిన నా అలోచనల్ని ‘పునర్మూల్యాంకనం’, బహుజన
సాహిత్యదృక్పథం గ్రంథాల్లోను,
కొన్ని సదస్సుల్లోను వివరించాను.
సాహిత్యాన్ని
ఉత్పత్తి చేసేవాళ్ళు, దాన్ని మూల్యాంకన చేసేవాళ్ళు మారినప్పుడల్లా
సాహిత్య విలువల నిర్ణయంలో మార్పులొస్తాయి.‘మూల్యాంకనం’ చేయడమంటే రచనలోని సాహిత్య, సామాజిక విలువల్ని
గుర్తించడమే.ఆ సామాజిక, సాహిత్య పరిస్థితులు మారినప్పుడు ఆ విలువల్ని మళ్ళీ
నిర్ణయం చేయడాన్నే పునర్మూల్యాంకనం అంటారు.
·
‘‘సాహిత్యం సమాజాన్ని మూల్యాంకన చేస్తుంది. అది
సృజనాత్మకంగా జరుగుతుంది. కొంతకాలమయినా అదే సాహిత్యం పునర్మూల్యాంకనం కూడా
చేస్తుంది. మారిన సామాజిక పరిస్థితులు ఈ అవసరాన్ని కల్పిస్తాయి. అలాగే, సాహిత్య విమర్శ కూడా
సాహిత్యాన్ని ఒకసారి మూల్యాంకన చేస్తుంది. మరి కొంతకాలానికి పునర్మూల్యాంకానికి
పూనుకుంటుంద’’ ని ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి (చర్చ, ద్వితీయ ముద్రణ, 2010, ( ప్రథమ ముద్రణ, 2006, పుట:132) నిర్వచించారు.
·
పునర్మూల్యాంకన విమర్శలో రెండు పార్శ్వాలు
ఉన్నాయని విమర్శకులు (ఆచార్య రాచపాళెం
చంద్రశేఖరరెడ్డి, చర్చ, పుట:132.)
వర్గీకరిస్తున్నారు. మొదటి
పార్శ్వం, సృజనాత్మక సాహిత్యం రూపంలో సమాజాన్ని మూల్యాంకన, పునర్మూల్యాంకన
చేస్తూ వెలువడటం. అంటే, సమాజ అవసరాలకు అనుగుణంగా సాహిత్య సృజన జరుగుతూనే, మళ్ళీ అదే
సృజనాత్మక సాహిత్యం మారిన సామాజిక అవసరాలకు అనుగుణంగా పునర్మూల్యాంకనతో పున:
సృజనగా రూపొందుతుందన్నమాట.
·
వీటికి ఉదాహరణలుగా రామాయణ, భారతాలకు
సంబంధించిన కథలు ఆధునిక కథలుగా రాసే ప్రయత్నాన్ని చాలా మంది చేస్తున్నారు. అలాగే
కొన్ని నీతి శతకాలకు ప్రాచీన కథల్ని వివరణలుగా రాసిన పుస్తకాల్ని ( వేమన, సుమతీ శతక
పద్యాలకు పురాణ కథలు, రచయిత్రి శ్రీమతి కుసుమ.కె.మూర్తి)
చెప్పుకోవచ్చు.
·
కనుక, సాహిత్య పరిణామంలో
వస్తున్న మార్పుల్ని మాత్రమే కాకుండా, గతంలో విమర్శకులుగా
చేసిన తమ అభిప్రాయాల్లో వచ్చిన పరిణామాల్ని కూడా సమీక్షించుకునే అవకాశం
పునర్మూల్యాంకన విమర్శ వల్ల కలుగుతుంది. ఆరుద్ర ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’’(13
సంపుటాలు), డా॥ముదిగంటి సుజాతారెడ్డి ‘‘చారిత్రక సామాజిక
నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర’’ (1996), డా॥పిల్లి
శాంసన్ ‘‘ దళిత సాహిత్య చరిత్ర’’ (2000), డా॥సుంకిరెడ్డి
నారాయణరెడ్డి ‘‘ముంగిలి’’( తెలంగాణా ప్రాచీన సాహిత్యం’’(2009) మొదలైన సాహిత్య
చరిత్రలతోపాటు ప్రత్యేకించి ఈ దృష్టితో తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయడం
కనిపిస్తుంది.
|
|
|
·
సాహిత్య విమర్శకుడు, సాహిత్య చరిత్రకారుడు
కాసుల ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య చరిత్ర : ఏం
చెప్తారు? (https://telugu.oneindia.com) అనే
వ్యాసంలో సాహిత్య చరిత్ర పునర్మిర్మాణ ఆవశ్యకతను ఇలా తెలియ జేస్తున్నారు.
‘‘తెలుగుశాఖల్లో విద్యార్థులు
చదువుతున్నదంతా ఇప్పటి వరకు కోస్తాంధ్ర సాహిత్య చరిత్రనే. తెలుగు సాహిత్య చరిత్ర
తెలంగాణ సాహిత్యాన్ని తనలో ఇముడ్చుకోలేకపోయింది. ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి సాహిత్యం ఆంధ్రప్రదేశ్
అవతరణ తర్వాత రూపుదిద్దుకోలేదు. ఉమ్మడి సాహిత్యం రూపుదిద్దుకుని ఉంటే సాహిత్య
చరిత్రలో కోస్తాంధ్ర సాహిత్యంతో పాటు తెలంగాణ సాహిత్యం సమానమైన హోదాను, గౌరవాన్ని పొంది ఉండేది. తెలంగాణలోని
సృజనాత్మక సాహిత్యం సాహిత్యమే కాదన్నంతగా సాహిత్య చరిత్రల నిర్మాణం జరిగింది.
ఇప్పటి వరకు
తెలంగాణలోని తెలుగుశాఖల్లో బోధిస్తున్న సాహిత్య చరిత్రనే ఇక ముందు కూడా
బోధించడానికి వీలు లేదు. అలా బోధిస్తున్నామంటే, తెలంగాణ ఉద్యమంలోని సారాన్ని గ్రహించలేదని
అర్థం చేసుకోవాలి.
వీటిని కేవలం కాసుల ప్రతాపరెడ్డి
గారి అభిప్రాయాలుగా మాత్రమే స్వీకరించకూడదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక
ముందు నుండే ఇలాంటి వాదనలు వచ్చాయి. కానీ, తెలుగు వాళ్ళు రెండు ప్రత్యేక
రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత సాహిత్య చరిత్ర నిర్మాణంలో పునర్నిర్మాణం,
పునర్మూల్యాంకనం అనే దృష్టి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం సాహిత్య
చరిత్రకారుల్లో కనిపిస్తున్న నూతన ఆలోచనలుగా వీటిని గుర్తించాలి.
·
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి (‘ముంగిలి), కాసుల
ప్రతాపరెడ్డి (ఇరుసు, కొలుపు), సుజాతారెడ్డి సంపాదకత్వంలో తెచ్చిన ముద్దెర, నందిని
సిధారెడ్డి ‘
ఇగురు’ వంటి సాహిత్య
విమర్శనా గ్రంథాలన్నీ ఈ విషయాల్నే చర్చిస్తున్నాయి.
·
సమైక్య ఆంధ్రప్రదేశ్ – ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాలుగా తమ ప్రత్యేకతలను చాటుకున్న తర్వాత తెలుగు సాహిత్యం
పునర్మూల్యాంకనానికి గురవుతోందని
అర్థమవుతుంది.
·
సాహిత్య చరిత్ర పునర్మిర్మాణంలో తెలంగాణ
రాష్ట్రంలోని కవులు, సాహిత్య చరిత్ర కారులు, సాహిత్య విమర్శకులు విస్తృతంగానే
పనిచేస్తున్నారు.
·
డా.ముదిగొండ సుజాతారెడ్డి గారు రాసిన తెలుగు
సాహిత్య చరిత్రలోను, ఆచార్య ఎస్వీ రామారావు గారి తెలుగు సాహిత్య చరిత్రల్లోనూ ఈ
మార్పు బాగా కనిపిస్తుంది.
·
ఇంతవరకూ ఉన్న సాహిత్య యుగవిభజనలోను, కవుల
స్థానాల్ని – అంటే తొలితెలుగు కవి, ఆదికవి
మొదలైన స్థానాల్ని పునర్మూల్యాంకనం చేసుకుంటున్నారు.
·
రెండవ పార్శ్వం, ఒకసారి రచనను మూల్యాంకన చేస్తూ విమర్శ వెలువడినా, మారిన సామాజిక
విలువల్ని బట్టి ఆ విమర్శల్ని సైతం
పునర్విమర్శ చేయడం. వీటికి కుల, మత, ప్రాంతీయ సైద్ధాంతిక
భావజాలాల వంటి కొలమానాలుగా ఉండటం కారణం కావచ్చు.
·
వీటికి ఉదాహరణలుగా నన్నయ నుండి శ్రీశ్రీ వరకూ
వారి సాహిత్యాన్ని కులం, మతం, ప్రాంతీయ దృక్పథాలతో
పునర్మూల్యాంకన చేయడం విస్తృతంగానే జరుగుతుంది.
·
పునర్మూల్యాంకనానికి గురవుతున్న కొన్ని అంశాల్ని చూద్దాం:
·
తెలంగాణాలో తెలుగు కవులు లేరని శ్రీముడుంబ వేంకట
రాఘవాచార్యులు గారు గోల్కొండ పత్రిక,
తొమ్మిదవ సంవత్సరాది సంచిక, ‘ఆధునిక భావకవిత్వ తత్త్వము’ శీర్షికతో ఒక వ్యాసాన్ని
రాశారు. నిజాం రాష్ట్రంలో ఆంధ్రకవులు పూజ్యము
అనేది దీని సారాంశం.
·
అయితే, ఈ అంశాన్ని సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక
చాలెంజ్ గా తీసుకున్నారు. కానీ, ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇలా అన్నారు. ‘‘ఇచ్చటి పరిస్థితులు తెలియకను,
తెలుసుకొనుటకవకాశము లేమియు వెల్లడింపబడినవే గాని, ద్వేషబుద్దితోఁగాదనుట నిశ్చయము’’ (గోల్కొండ కవుల సంచిక,
1934, గోలకొండ ముద్రణాలయము, హైదరాబాద్,
డక్కన్., పుట:xii)
·
ఈ గోలకొండ కవుల సంచికలో 354 కవులతో కూడిన
" కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించిన నాటి నుండే తెలంగాణ సాహిత్యం
పునర్నిర్మాణం ప్రారంభమైంది.
4.
తెలంగాణాలో భావకవిత్వం-కవులు
·
1920-43,
1948-66 వరకు రెండు తరంగాలుగా
వచ్చిన భావ కవితలను అన్వేషించి,
విశ్లేషించి, సమీకరించి సామిడి జగన్ రెడ్డి ‘తెలంగాణలో
భావ కవితా వికాసం’ (2018) పేరుతో
తన సంపాదకత్వంలో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు.
·
ఈ భావ
కవితల్లో తెలంగాణ ప్రముఖులు బూర్గుల రామకృష్ణారావు, సురవరం
ప్రతాపరెడ్డి, కాళోజీ రామేశ్వరరావు, శేషాద్రి
రమణ కవులు, మాడపాటి హనుమంతరావు, వానమామలై
వరదాచార్యులు ఒద్దిరాజు సీతారామచంద్రరావుతో పాటు కవయిత్రులు సరోజినీనాయుడు, వి. లక్ష్మీదేవి, రూఫ్‌ఖాన్‌పేట రంగమాంబ దేశాయి మొదలైన వాళ్ళ
రచనల్లో భావకవిత్వాన్ని గమనించాలన్నారు.
·
ఈ పుస్తకం గురించి ఈ రోజు ఒక పత్రికలో విపులమైన ఒక వ్యాసం
వచ్చింది. దాన్ని ప్రసిద్ధ పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ రాశారు. ఆంధ్ర
ప్రాంతానికి చెందిన అనేకమందిని ఈ పుస్తకంలో చేర్చారనీ, విషయసూచిక ఇవ్వలేదనీ,
దానికి కారణం ఒకే కవి రాసిన అనేకకవితలను తీసుకోవడం ఒక కారణంగా కనిపిస్తుందనీ
పేర్కొన్నారు. కనీసం పరిశోధన పద్ధతులు పాటించకుండా ప్రచురించారని విమర్శించారు. తమ
తెలంగాణ ప్రాంతం గురించి రాసినంత మాత్రం చేత దాన్ని నెత్తికెత్తుకోవడం కాకుండా,
దానిలోని లోపాల్ని సరిదిద్ధుకోవాలనే సంగిశెట్టి శ్రీనివాస్ గారి సత్యాన్వేషణ
పునర్మూల్యాంకనంలో భాగంగానే చూడాలి. దాన్ని వస్తునిష్ఠగానే భావించాలి.
5.
వచన కవిత్వంలో వస్తున్న రూపపరమైన నూతన ప్రయోగాలు
·
ఛందోబద్ధంగా
పద్యాలు రాస్తున్న కాలంలోనే వివిధ లఘు రూపాల్లో కవిత్వం కనిపించింది. ఖండకావ్యాలు,
శతకాలు, చిత్రకవిత్వం, చాటువులు ఇలా రకరకాల పేర్లతో పద్యకవిత్వం వచ్చింది. నేటికీ
శతకాలు, ఆధునిక పద్యకావ్యాలు వస్తూనే ఉన్నాయి. వస్తువులో మార్పు కనిపించడం ఆధునిక
పద్యకావ్యాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పరిణామం.
·
తెలుగులో
వచన కవిత్వం రావడంతో ఛందస్సు బందోబస్తుల నుండి విముక్తి కలిగినట్లు కొంతమంది
భావించారు. దాని తర్వాత మినీ కవిత్వం కూడా
ఉద్ధృతంగానే వచ్చింది.
·
ఇప్పుడు
వచన కవిత్వంలో రూపపరమైన అనేక ప్రయోగాలతో వచన కవిత్వం వస్తోంది.
హైకూ
·
జపాన్ కవిత్వ ప్రభావంతో తెలుగులోకి
వచ్చిన కవితారూపం హైకూ. గాలినాసరరెడ్డి 1994 నుండీ హైకూల్ని రాశారు. 1991 నుండీ ఇస్మాయిల్ వీటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తర్వాత
పెన్నాశివరామకృష్ణ లక్షణయుక్తంగా రాసేప్రయత్నం చేశారు. హైకూలో మూడు పాదాలుఉండాలనీ, అవి 5,7,5 అక్షరాలు అనుసరించాలని లక్షణాల్ని వివరించారు. నిజానికివి జపాన్ భాషకి
తగినట్లు అక్షరనియతిని ఏర్పరిచినా, అవే
లక్షణాలు తెలుగులో పాటించడం కుదరలేదు. అందువల్ల తర్వాత కాలంలో చాలా మంది హైకూల్ని
రాసినా ఆ లక్షణాల్ని పాటించలేకపోయారు. కానీ, హైకూలో ఉండే తత్త్వాన్ని అందించేప్రయత్నం చేశారు. పెన్నా శివరామకృష్ణ
(రహస్య ద్వారం,1991,చినుకుల చిత్రాలు, 2000), ఇస్మాయిల్(కప్పల నిశ్శబ్థం,1997), బివివి ప్రసాద్(దృశ్యాదృశ్యం 1995 హైకూ,1997, పూలు రాలాయి,1999) , సూర్యభాస్కర్ ( హైకూ చిత్రాలు,1997), లలితానంద్ ( ఆకాశదీపాలు,1997), శిరీషా (సీతాకోక చిలకలు,1997) మొదలైనవి హైకూ సంపుటులు.
·
ఎండుకొమ్మపై/ఒంటరిగా
ఓ కాకి/శిశిర సంధ్య,.. గాలి నాసర రెడ్డి
·
నదిలో
ఈత/చంద్రునిలో శకలాలు/గుచ్చుకుంటాయి... గాలి నాసర రెడ్డి . ఈ హైకూలో స్థలవస్తు కాలాలను పరిశీలన చేస్తే స్థలం నది
; కాలం రాత్రి ; వస్తువు చంద్ర బింబం.
ఇక్కడ చంద్రుని ప్రతిబింబం కదులుతున్న నదీలో శకలాలు గా ఉన్నాయనీ కవి భావన.
నానీలు
·
నానీ' 1997 లో మొట్టమొదటి సారిగా ఆచార్య ఎన్.గోపి సృష్టించారు. నాలుగు పాదాలలో వున్న లఘు కవితా రూపం సృష్టికర్త
డా.ఎన్.గోపి. గోపీ మాటల్లోనే నానిల గూర్చి చిన్న పద్యాలు మరీ చిన్నవి కాదు. నానీలు
అతి బిగింపు, అవసరమైన సడలింపు లేకుండా
రూపొందిన 20 నుండి 25 అక్షరాల విస్తీర్ణంగల చట్రం. నానీలు అంటే నావీ నీవీ వెరసి
మనవి అని అర్థం. రెండు పాదాలు ఒక భావాంశగా, నాలుగు పాదాలు కలిసి రెండు భావాంశాలుగా
వేరు చేసుకోవాలి. రెండు భావాలు ఒకదానికొకటి వైరుధ్యంగా, సాదృశ్యంగా అల్లుకోవచ్చు. సమన్వయం
సాధించాలి. ఉదా: 'అబ్బే!/ ఏదో ఓటమి కాదు/ అది విజయానికి
మరోమెట్టు'...ఎన్. గోపి.
నానోలు
·
వృత్తి రేత్యా నేను ఎలక్ట్రికల్
ఇంజనీరైన ఈగ హనుమాన్ నానో కవితా ప్రక్రియను ప్రారంభించారు. నానో అంటే
సూక్ష్మాతిసూక్ష్మమైన ప్రక్రియ అనే అర్థంలో దీన్ని ప్రయోగిస్తున్నారు[1]. దీన్ని వివరిస్తూ కవి ఈగ
హనుమాన్ కవిత్వంX
10¯9 అనే సంఖ్యతో
సూచిస్తున్నారు. నానో టెక్నాలజీ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ‘నానో’ పేరుతో కవితా ప్రక్రియ కూడా ప్రసిద్ధిలోకి వచ్చింది. నానోలను'2005 నుండీ రాస్తున్నారు. ‘‘నానోలు కవిత్వంX 10¯9’’ అనే పేరుతో 2009లో ఈగహనుమాన్ ఒక
కవితాసంపుటిని ప్రచురించారు. నానోలో నాలుగు పాదాలు ఉండాలి. పాదానికి ఒక పదం లేదా
చిన్న సమాసం మాత్రమే ఉండాలి. నాలుగో పాదం చమత్కారంతో ముగియాలి. ఈ కవిత్వంలో
వస్తువు దేనైనా స్వీకరించవచ్చు. సుమిధ ఆనంద్ 26 నానాల్లో ‘రామాయణం’
రాశారు. గరికపాటి మణిందర్, పోతగాని
సత్యనారాయణ, కొట్టి రామారావు, భీంపల్లి శ్రీకాంత్, రాధికా కేశవదాస్‌లు నానోలు రాస్తున్నారు. ఈగ హనుమాన్ రాసిన నానోలు. ఉదా : లోపలికి/ప్రవహించు/లోకంలోకి/ప్రయాణించు. 2.
దేహాల/చీకటిలో/దీపం/ప్రేమ-
రెక్కలు
·
రెక్కలు అనే కవితా ప్రక్రియతో కూడా
ఈ మధ్య కాలంలో కవిత్వం వస్తుంది. రెక్కలు కవితాప్రక్రియని ఎం.కె.సుగమ్‌బాబు
ప్రారంభించారు. 2002 లో “ రెక్కలు “
ప్రక్రియను సృష్టి మొదలైందని సుగమ్ బాబు చెప్పారు. రెక్కలు కవితలో నాలుగు
పాదాలు ఉంటాయి. ఒక్కోపాదంలో ఒకటీ లేదా రెండు పదాలు ఉండాలి. నాలుగు పాదాలకు మధ్య ఒక
వాక్యానికి ఉండే ఖాళీ వదిలి మరో రెండు పాదాల్ని రాయాలి. చివరి రెండు పాదాల్లో కూడా
ఒకటి లేదా రెండు పదాలు చొప్పునే ఉండాలి. అవి దీర్ఘసమాసాలతో ఉండకూడదు. సరళ సుందరంగా
ఉంటే బాగుంటుంది. పై నాలుగు పాదాలు పక్షి దేహనిర్మాణాన్ని పోలి ఉంటుంది. అయితే, కింది రెండు పాదాలు పక్షికుండే రెక్కలు
లాంటివి. ఈ చివరి రెండు పాదాల్లోనే ఒక చమత్కారమో, ఆలోచనను రేకెత్తించే గుణమో ఉండాలి. ఇలాంటి గుణాన్నే ‘పంచ్’ అంటారు. ఆమని లాంటి సంకలనాలు వచ్చాయి. మల్లవరపు చిన్నయ్య, రాజ్యశ్రీ తదితర 150 మంది కవులు రాస్తున్నారు. సుగమ్ బాబు గారి రెక్కలు ఉదా: తనలో
తలెత్తిన/ప్రశ్నలే/సిద్ధార్ధుని బుద్ధుణ్ణి చేశాయి-/ప్రశ్నే/ప్రభాతం!
·
వచన
కవిత్వాన్ని వ్యతిరేకించడమే కాదు..వచన కవిత్వానికీ,లఘురూప
కవిత్వానికి మధ్య సంబంధాన్ని తెగ్గొట్టేశాం. వచనకవిత్వం నీడలో లఘురూపకవిత్వం ఎదగడం
లేదు.అందుకే లఘురూప కవిత్వానికి గుర్తింపు, గౌరవం
తెచ్చేందుకు వచన కవిత్వంతో ‘ తెగతెంపులు ,’ చేసుకున్నాం
’’ అని రెక్కలు సృష్టి కర్త సుగమ్ బాబు ‘సారంగ’ అంతర్జాల పత్రికకు ఇచ్చిన
ఇంటర్వ్యూలో చెప్పారు.
·
ఇప్పటికే
నూతక్కి రాఘవేంద్ర రావు రావు గారి “ ఉల్కల రామాయణం”, విశ్వేశ్వర
వర్మ భూపతి రాజు ( వర్మ ) గారి “ రవ్వల గీత “(భగవద్గీత ). ‘ రెక్కల ‘ప్రక్రియలో
డి. హనుమంత రావు గారు టాగూర్ గీతాంజలి “ని అనువదించారు. డా. కేతవరపు రాజేశ్వర గారు
‘ రెక్కల్లో ‘ గీతామృతం నింపారు .వీరారెడ్డి ‘ రెక్కల్లో ‘ చాణక్య నీతులు
వినిపించారు.
రవ్వలు
విశ్వేశ్వర వర్మ భూపతి రాజు ( వర్మ రవ్వలు పేరుతో లఘురూప కవితాప్రక్రియకు
శ్రీకారం చుట్టారు. సుగమ్ బాబుగారి రెక్కల్లో ఆరుపాదాలున్నాయి. నానోల్లో నాలుగు
పదాల కూర్పు వుంది.అలాగే రవ్వల్లో కూడా
నాలుగు పదాల నియతి వుంది.
3+1 మూడు పాదాల
తర్వాత విరామం ఇచ్చి నాలుగో పాదాన్ని వుంచడం జరిగింది.ఇందులో మొదటి మూడు పాదాలు
వ్యాఖ్య/విషయం/ లేదా సందర్భం అయి వుంటుంది.4 వ పాదం వీటికి మూలం . అంటే మొదటి
మూడుపాదాల భావాంశం నాలుగో పాదంతో సమగ్రమై రవ్వలా..మెరుస్తుంది.ఈ నాలుగో పాదమే
రవ్వకు ఆయువు పట్టు. రవ్వలకు వస్తు నియతి ఏదీ లేదు. వస్తువు ఏదైనా కావచ్చు.
మణిపూసలు:
‘‘తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించిన నూతన
ప్రక్రియ మణిపూసలు. దీని సృష్టికర్త వడిచర్ల సత్యం. ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే
150 మందికి పైగా కవులు ఈ ప్రక్రియలో రచనలు చేశారు. అతి తక్కువ కాలంలో ప్రాచుర్యం
పొందిన కవితా ప్రక్రియగా ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్సు చేత గుర్తింపబడింది.
గేయశైలిలో మాత్రా నియమబద్ధంగా అంత్యప్రాసతో అలరారే ఈ మణిపూసలు వెన్నెల సత్యం కలంలో
మరింతగా వన్నెలీనాయి’’. ‘కవిత్వంలో
కొత్త వెలుగు ’ వ్యాసం, శాంతి కృష్ణ, 23.12.2018. ఉదా:
అమ్మ కప్పినట్టి కొంగు/ ఆకాశం దాని రంగు/ ఆ క్షణము తల్చుకుంటే/ ఆనందమున ఎద
పొంగు... వెన్నెల సత్యం ‘ వెన్నెల మణిపూసలు’
మొగ్గలు:
·
ఆధునిక
మినీ వచన కవితా ప్రక్రియ మొగ్గలు...సృష్టి కర్త భీంపల్లి శ్రీకాంత్, సెప్టెంబర్ 2017 నుంగీ
రాస్తున్నారు. మొగ్గలు మూడు పాదాల కవిత్వం.ఎలాంటి అక్షర నియమం కానీ, ఛందస్సు కానీ
లేదు.ప్రతి పాదంలో మూడు నుంచి ఐదు పదాలు ఉండాలి.ఈ మొగ్గలు మూడుపాదాల కవిత్వం
అయినప్పటికీ క్లుప్తత, సరళత, సంక్షిప్తత, గాఢత దీని ప్రధాన
లక్షణాలు.మూడు పాదాలలో మొదటి పాదానికి కొనసాగింపుగా రెండవపాదం వుండాలి. అంటే
మొదటిపాదంలో వాక్యం అంతం కారాదు.మొదటి రెండు పాదాలు భావయుక్తంగా, అర్ధవంతంగా చెబితే,దానిని సమర్థిస్తూ, అన్వయిస్తూ, బలపరుస్తూ, మూడవపాదం
ముక్తాయింపుగా ఉంటుంది.మరోవిధంగా చెప్పాలంటే కొన్నిసార్లు మొదటి రెండు పాదాలు ఒక
"సంశ్లిష్ట వాక్యం"లా ఉండాలి. అంటే కవితా సౌలభ్యం బట్టీ
ఉపయోగించుకోవచ్చు.ఈ మూడవపాదం ఒక నినాదంగా, సూక్తిగా, సామెతగా
చెప్పబడుతుంది. ఈ మూడవపాదాన్ని చెప్పడంవల్ల కవి ఒక కొత్త నినాదాన్ని, సూక్తిని, సామెతను
చెప్పినట్లవుతుంది.వస్తు అనుకూలత, బలమైన శిల్పం, నూతన అభివ్యక్తి, ఈ నూతన ప్రక్రియకు
ఆలంబన. ఈ మూడు అనుకూలతలే మొగ్గలు వికసించడానికి పాదుకలు.మొగ్గలు కవితా ప్రక్రియలో
మొదటి రెండు పాదాలు లోకం నుంచి గ్రహించి, మూడవపాదాన్ని తన అనుభవంలోచి వ్యక్తంచేయడం
ఎంతో రమణీయపొందిక.
·
మొగ్గలు
కవితా పక్రియతో ఇప్పటివరకు ఇరవైకి పైగా కవితా సంపుటాలు వెలువడ్డాయి. "మొగ్గలు
నాన్న" భీంపల్లి శ్రీకాంత్ 300 మొగ్గలతో "మొగ్గలు" కవితా సంపుటిని
వెలువరించాడు. ఆ తర్వాత మట్టి మొగ్గలు (బోల యాదయ్య), చిరుమొగ్గలు
(ఉప్పరి తిరుమలేష్), సిరిరేఖలు (ధనాశి ఉషారాణి), ఆదిశక్తి మొగ్గలు (సత్యనీలిమ), బతుకమ్మ మొగ్గలు(భీంపల్లి
శ్రీకాంత్), బతుకమ్మ మొగ్గలు(ఉప్పరి తిరుమలేష్), తొలి మొగ్గలు(అనుపటి హేమలత) వెలువడ్డాయి. అంతేకాదు "ప్రేమ" అనే
ఏకాంశంతో పన్నెండుమంది కవులు రాసిన ప్రేమ మొగ్గల కవితాసంపుటాలు వెలువడ్డాయి. ప్రేమ
మొగ్గలు ( భీంపల్లి శ్రీకాంత్),
శిథిలస్వప్నం( బోల యాదయ్య), నీలో నేను (పులి జమున),
నీ ధ్యాసలోనే (ఉప్పరి తిరుణలేష్), నీ తలపుల్లోనే (సత్యనీలిమ),
చెదరని జ్ఞాపకం (ఓర్సు రాజ్ మానస), చెరగని సంతకం (కొప్పోలు యాదయ్య), కేరాఫ్ అడ్రస్
(పొన్నగంటి ప్రభాకర్), నీ ఆరాధనలో (కె.శైలజాశ్రీనివాస్), దాసుకున్న లోకం (కెపి.లక్ష్మీనరసింహ), తొలి
చూపులోనే (బర్క శశాంక్), నీ ప్రేమ సాక్షిగా ( పోలే వెంకటయ్య) వెలువడ్డాయి. ఇంకా సంకలనాలు కూడా వెలువడ్డాయి.
వందమంది కవులతో "బతుకమ్మ మొగ్గలు", నలభైఆరు
మందితో "బాలల మొగ్గలు" వెలువడ్డాయి.
·
శ్రీకాంత్
రాసిన మొగ్గలు ఉదా: ‘‘వాడు వౌనంగా ఉన్నాడంటే/ఏదో ఆలోచనకు బీజం వేసినట్టే/వౌనం ఒక
మహావిస్ఫోటనం’’
·
‘పొలాన్ని
దున్నితేనే కానీ/మట్టి మహానందాన్ని పొందదు/విత్తనాలు మట్టిబిడ్డలు’’
కైతికాలు
·
వ్యంగ్యం
తో పాటు సకారాత్మకత గోచరించే ఆరు పాదాలతో రాసి మామూలు ప్రజలు మాట్లాడే భాషలో, సూక్ష్మంలో మోక్షం లాగా ప్రజల భాష వాడడం వలన కవిత్వంకు వికృతి పదమైన కయిత
ఆ కయితకు రూపాంతరం కైతికంగా ఉన్న పేరును ఏర్పర్చుకొని గోస్కుల రమేష్ అక్టోబర్ 18 విజయ దశమి
2018లో ఈ కవితా రూపాన్ని ప్రారంభించారట.
·
కైతిక
ప్రక్రియ లక్షణాలు:
మాత్ర ఛందస్సులో రాయాలి
1,2,3,4,పాదాలలో
9 నుండి 12 మాత్రలు ఉండాలి
2,4 పాదాలలో అంత్యానుప్రాసలో ఉండాలి
5 పాదంలో "వారెవ్వా" లేదా పై నాలుగు
పాదాలను బలపరిచే మకుటం ,లేదా
సరైన పదము గానీ వాడాలి.
6 వ పాదంలో కవితాత్మక వాక్యం ,నూతన పదబంధం లేదా జాతీయం ,కొసమెరుపులా ఉండాలి.
5,6పాదాలలో మాత్ర ఛందస్సు నియమం అవసరం లేదు.కాని
సరితూగే అక్షరాలు ఉండాలి.పెద్ద వాక్యాల రూపంలో ఉండకూడదు.
గోస్కుల రమేష్ రాసిన కొన్ని కైతికాలు
నొచ్చుకున్న గుచ్చుకున్న
ఒక్క మాట చెబుతున్నా
ఆడమనసు మెత్తనన్న
ఎన్నడు నొప్పించకన్నా
వారేవ్వా బాలికలు
మమతలకు మూలికలు
ఆడపిల్ల ప్రాధాన్యాన్ని అద్భుతుంగా దీనిలో వర్ణించారు.
అనుమానం వీడరా
ఆకాశం హద్దురా
జడివానై కురవరా
జగమంతా నిండరా
సెలయేరాలోచనైతే
చంద్రుని కన్న వెలుగు వురా
ఇది ఆత్మస్థైర్యాన్నని నింపే ఒక కైతికం .
· ‘‘175 దేశాల్లోని సమాచారాన్ని నమోదు చేసే వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం పొందిన నూతన కవితా ప్రక్రియ కైతికాలు ప్రారంభించిన 365 రోజుల్లో 50 కి పైగా పుస్తకాలు ముద్రింపబడిన ఏకైక కవితా ప్రక్రియ’’ అని వికీపీడియాలో రాశారు.
· ఇంకా ఇలాంటి అనేక ఆధునిక కవితారూపాలు లెక్కకు మించి వస్తున్నాయి. మెరుపులు, సమ్మోహనాలు, ఇష్టపదులు (అడిగొప్పుల సదయ్య నూతన సాహిత్య ప్రక్రియలో తెచ్చిన 'ఇష్టపది') ఇలా రకరకాల పేర్లతో ఆధునిక వచన కవిత్వంలో రూపపరమైన కవితలు వస్తున్నాయి. వందలాది కవులు, కవయిత్రులు ఇటువంటి కవిత్వం రాస్తున్నారు.
·
ఈ
కవిత్వానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్
రికార్డులు కూడా నమోదవుతున్నాయి. వీటిని సాహిత్య
విమర్శకులు పట్టించుకోవలసిన అవసరం ఉంది. వీటి మంచి చెడులను సమీక్షించవలసిన అవసరం
ఉంది.
6.
తెలుగు నవల – తొలి నవల ఏది?
·
తెలుగు
నవల ప్రారంభానికి సంబంధించిన చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కందుకూరి వీరేశలింగం
(పంతులు అనే విశేషణాన్ని ఆయన వదిలేశారు. ఆయన అభిప్రాయాన్ని గౌరవించేవారు ‘పంతులు’
అని వాడకూడదు) గారు రాసిన “రాజశేఖరచరిత్ర”(1878)ని కొంతమంది తొలి తెలుగు నవలగా
భావిస్తుంటే, మరికొంతమంది ‘నరహరిగోపాల కృష్ణమశెట్టి రాసిన‘ రంగరాజచరిత్ర (1872) గా
వివరిస్తున్నారు. ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు రంగరాజచరిత్రము (సోనాబాయి పరిణయం)
సంపాదించి, ప్రచురించి, దానికి ఒక విపులమైన పీఠిక రాస్తూ, తొలి నవలగా
గుర్తించారు.
·
తెలుగునవలాచరిత్ర
పుస్తకం (పుట:12)లో సంగిశెట్టిశ్రీనివాస్
1866లో తడకమళ్ళ వెంకటకృష్ణారావు రాసిన “కంబుకంధరచరిత్ర” మెదటి నవల అవుతుందని
చెప్పారు. దీన్ని వచన ప్రబంధంగా పేర్కొని, అక్కడక్కడా పద్యాలు కూడా రాశారు. 8
అధ్యాయాలు ఉన్నఈనవల గురించి మద్రాసు గ్రంథాలయం వారు తమ కేటలాగ్‌లో
పేర్కొన్నారు.మరో నవల ‘తెలుగు వెలుగు ముగుదకథ’ 1879లో ముద్రితమైంది, దీనికే “శ్రీమదాంధ్రకవితావేదిని విలాసము” అనిపేరు ఉందని ముంగిలిలో
సుంకిరెడ్డిగారు పేర్కొన్నారు. (తెలంగాణ నవలా వికాసం (వ్యాసం)
మనతెలంగాణ పత్రిక, 22.10.2018
·
నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ ప్రాంతానికి చెందిన తడకమల్ల కృష్ణారావు 'కంబుకంధర చరిత్ర' అనే రచన చేశారు. ఆయనే 'కామ రూప కథ' అనే
రచన కూడా చేశారు. ఇది 1860-66 మధ్యలో
వచ్చింది. దీనిలో తొలి నవలకు సంబంధించిన బీజాలున్నై. అలా తెలంగాణ నవలకు అంకురార్పణ
జరిగిందని చెప్పవచ్చు. 'కంబుర
చరిత్రను' వచన ప్రబంధమని ఆయన అన్నాడు.
దానికి నోట్ రాసిన వారు నవలలాంటిదని అన్నారు.
·
తెలం గాణ సాయుధ పోరాటంపై నవలలు రాశారు. అలా వచ్చిన నవలల్లో ప్రధాన మైనవి
బొల్లిముంత శివరామకృష్ణ 'మృత్యుంజయులు' మహీధర రామమోహన రావు 'ఓనమాలు', మృత్యువునీడల్లో, లక్ష్మీ కాంతమోహన్ 'సింహగర్జన', ఈ
నవలలు తెలంగాణ సాయుధ పోరాటస్పూర్తిని, స్థూల
రాజకీయాలను ప్రతిబిం బించినవే తప్ప నిర్దిష్టంగా తెలంగాణ ప్రజాజీవితాన్ని
చిత్రించాయని చెప్పలేము
7.
తొలితెలుగు కథానిక ఏది?
·
నేటికీ చాలా మంది తెలుగులో తొలి కథానిక గురజాడ
అప్పారావు గారు రాసిన ‘దిద్దుబాటు’గానే ప్రస్తావిస్తున్నారు. అయితే తెలుగులో
తొలికథానిక ఏది అనే అంశం గురించి సాహితీవేత్తల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కథానిక
ప్రక్రియ, భాష. వస్తువు, దాని నిడివి మొదలైన అంశాల్ని చర్చలోకి తీసుకొస్తున్నారు.
·
మన సాహిత్య చరిత్రకారులు ఆరుద్ర తదితరులు
‘దిద్దుబాటు’ కంటే ముందున్న కథానికలను కొన్నింటి గురించి తమ సాహిత్య చరిత్రల్లో
చర్చించారు. వాటి కంటే భిన్నంగా మరికొంతమంది సాహితీవేత్తలు తొలితెలుగు కథానిక
గురించి చర్చించారు.
·
1910లో గురజాడ అప్పారావు రాసిన 'దిద్దుబాటు' ని తొలి
తెలుగు కథగా అత్యధికులు భావించారు.
·
'దిద్దుబాటు' కంటే, మరికొంతమంది
ఆచంట సాంఖ్యాయన శర్మ రాసిన 'లలిత' (1902), 'విశాఖ' (1904)లలో
ఒకదాన్ని తొలి తెలుగు కథగా సమర్ధించారు. సాహిత్యంలో వస్తున్న వివిధ ధోరణుల ఫలితంగా
స్త్రీవాదులు బండారు అచ్చమాంబ రాసిన 'స్త్రీ విద్య' (1902), 'ధన త్రయోదశి' (1902) కథలను
తొలి తెలుగు కథలని వాదిస్తున్నారు.
·
వివినమూర్తి గారు ‘దిద్దుబాటలు (దిద్దుబాటుకు
ముందు కథలు 92) పేరుతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. దీనిలో దిద్దుబాటు కంటే ముందు
వివిధ పత్రికల్లో సుమారు 102 కథలను గుర్తించినా, వాటిలో అన్నిపుటలూ ఉన్న కథలుగా 92
గుర్తించి, ప్రచురించారు. ఈ చర్చలో వివినమూర్తిగారు ఆధునిక కథానిక స్వరూప,
స్వభావాల్ని గుర్తుంచుకొని, దిద్దుబాటు కథానికను ఒక మైలురాయిగా చేసుకొని దానికంటే
ముందున్న రచనలను అన్వేషించాలన్నారు.
·
ఈ
కథలన్నింటినీ పరిశీలించిన తర్వాత చారిత్రకంగా స్త్రీ విద్య (1902) ధన త్రయోదశి(1902),
ఆధునిక భావజాలం దగ్గరగా ఉన్న కథగా దిద్దుబాటు (1910) లు గా గుర్తించే అవకాశం ఉందని
పరిశోధకులు భావిస్తున్నారు.
8.ప్రస్తుత అస్తిత్వ ఉద్యమాల ధోరణి
· తెలంగాణ ప్రాంతీయ సాహిత్యం విస్తృతంగా వచ్చినా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాహిత్యం పరిశోధనాత్మకంగా పునర్మిర్మాణంలో ఉంది. అందువల్ల శాసనాలు, పత్రికలు మొదలైన వాటిని పరిశోధిస్తున్నారు. 2017, డిసెంబరు 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు హైదరాబాదులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన పుస్తకాలు ఇంచుమించు అన్నీ తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణంలో భాగంగానే వెలువడ్డాయి.
సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, కాసుల ప్రతాపరెడ్డి, కె.శ్రీనివాస్, డాక్టర్ గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి తదితరులు విశేషంగా కృషిచేస్తున్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ద్వారా డాక్టర్ సిధారెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తదితరులు కూడా విశేషంగా తెలంగాణ సాహిత్య పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు.
· 9.ముద్రణ నుండి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి మారడం.
· ప్రపంచీకరణ ఫలితంగా అస్తిత్వ ఉద్యమాల సాహిత్యాన్ని పత్రికలు
పెద్దగా ప్రోత్సాహించడం లేదు. అందువల్ల అస్తిత్వ సాహిత్యాన్ని రాస్తున్నవాళ్ళు
సామాజిక మాధ్యమాల వైపు దృష్టి కేంద్రీకరించారు.
·
చాలా మంది
రచయితలు కవులు ప్రధాన పత్రికలకు రాయడం లేదు.
·
వీరిలో
అత్యధిక సంఖ్యాకులు అంతర్జాలంలో రాయడం అనేది ఈ మధ్య కనిపిస్తున్న ఒక ప్రధాన ధోరణి.
·
దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి
·
ఆ
పత్రికకు సంబంధించిన ఒక పాలసీ విధానాల ప్రకారం కొన్ని అం భావజాలాలకు సంబంధించిన
సాహిత్యాన్ని ప్రచురించకపోవడం ఒక ప్రధాన కారణం
·
తాము పంపించిన సాహిత్యాన్ని ఎడిటింగ్ చేయడంలో
లోపాలు ఉండడం
·
ఇలాంటి కారణాల వల్ల ప్రధాన పత్రికలు రాయకుండా
ఫేస్బుక్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో సాహిత్యాన్ని రాయడం అనేది ఒక ప్రధాన
కారణంగా కనిపిస్తోంది.
·
అ యాకూబ్
గారి కవిసంగమం అలాగే గుంటూరు లక్ష్మీ నరసింహ గారి దళిత సాహిత్య కవితా నిర్మాణ
పద్ధతులు, కాత్యాయని విద్మహే గారు రాస్తున్న 'దళిత సాహిత్య వ్యాసాలు
·
మొదలైనటువంటి వాటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
·
వాట్సాప్
గ్రూపు లో కూడా మంచి సాహిత్య చరిత్ర సాహిత్య చర్చ కూడా జరుగుతోంది ఆచార్య రాచపాళెం
చంద్రశేఖర రెడ్డి గారు, తవ్వా
వెంకటయ్య తదితరులు సాహిత్య విమర్శ కోసం మంచి సాహిత్య గ్రూపుని నిర్వహిస్తూ
ఎప్పటికప్పుడు సాహితీ చర్చలు చేయటం అనేది ఈ గ్రూపులో కొనసాగుతోంది
·
సాహితీ
సిరికోన పేరుతో ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అడ్మిన్ గా వ్యవహరిస్తూ
సాహిత్య విషయాల పట్ల చాలా ప్రామాణికమైన ఇటువంటి వ్యాసాలను కవితలను చర్చలను
కొనసాగిస్తోంది
·
కొంతమంది
రెగ్యులర్ గా ఫేస్ బుక్ లో కథాసాహిత్యం, నవలా సాహిత్యం, కవిత్వం మొదలైన సాహిత్య ప్రక్రియల పై నిర్వహిస్తున్న ప్రసంగాలు
ఆలోచనాత్మకంగా తెలుగు సాహిత్య కీర్తిని పెంచేలా ఉంటున్నాయి.
10.డయాస్పోరా
భావనలు
·
ఇరవయ్యో శతాబ్దంలో తెలుగు సాహిత్యాన్ని
సుసంపన్నం చేస్తున్న వాటిలో డయాస్పోరా సాహిత్యాన్ని ఒకటిగా గుర్తించాలి. దీన్నే తెలుగులో దీన్నే వలసవాద సాహిత్యం, వలసాంధ్ర
సాహిత్యం, ప్రాంతేతర ఆంధ్ర సాహిత్యం, ప్రవాసాంధ్ర సాహిత్యం అని కూడా పిలుస్తున్నారు. వీటిలో
‘డయాస్పోరాసాహిత్యా’నికి ‘ప్రవాసాంధ్ర సాహిత్యం’ అనే పారిభాషిక పదాన్ని వాడడం
సమంజసమని చాలా మంది భావిస్తున్నారు.
·
కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఇతర
దేశాలకు వలసగా గానీ, శాశ్వతంగా గాని వెళ్లి అక్కడ కొన్నాళ్ళు ఉండడం లేదా శాశ్వతంగా
అక్కడే ఉండిపోవడం ద్వారా గానీ తమ జీవితానుభవాల్ని సాహిత్యీకరించి రాసేదే డయాస్పోరా
సాహిత్యం.
·
వలస, శాశ్వతంగా ఉండిపోవడమనేది ఒక
ప్రాంతం నుండి మరొక ప్రాంతం వెళ్ళడం ద్వారా కూడా జరుగుతుంది. అది దేశమే కానవసరం
లేదు. గ్రామం, జిల్లా, రాష్ట్రం కూడా కావచ్చు. కానీ, ఒకే దేశంలో వలస వెళ్లడం లేదా శాశ్వతం
గా తమ జన్మస్థలాన్ని వీడి వెళ్లినా వాళ్ళంతా ఒకే దేశమనే భావన ఉంటుంది. ఒకే
పౌరసత్వం ఉండడం దీనికి ఒక ప్రధాన కారణం. దాని వల్ల వాళ్ళకు అభద్రత అనేది అంత
ప్రాధాన్యతాంశం కాదు.
·
డయాస్పోరా సాహిత్యంలో దేశాన్ని వీడి
వెళ్ళడం అనేది ఒక లక్షణం. దాని వల్ల తమ జన్మస్థలంలో ఉన్నంత స్వేచ్ఛ, హక్కుల్ని
పొందడం ఆ దేశంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ, అది తన మాతృదేశం కాదనే భావనే ప్రవాసాంధ్ర సాహిత్యానికి అంకురార్పణ.
·
దీనితో పాటు మరొక వాదన కూడా
కనిపిస్తుంది. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల్ని వదిలి ఇతర దేశాల్లో కొంతకాలం
జీవించిన వాళ్ళు అక్కడున్న పరిస్థితుల్ని అక్కడే ఉండి గానీ, తర్వాత మరలా తమ
ప్రాంతానికి వచ్చిగానీ తెలుగు భాషలో రాసిన సాహిత్యాన్ని కూడా ప్రవాసాంధ్ర
సాహిత్యంగా భావించవచ్చు. కానీ, ఏవో కొన్ని అనివార్య కారణాల వల్ల మాతృదేశాన్ని
వదిలేసి పరాయిదేశంలో బతకాల్సి వచ్చినప్పుడు కలిగిన అనుభవాల్ని తెలుగు భాషలో
అక్కడున్నప్పుడే రాస్తే ఆ సాహిత్యాన్ని ప్రవాసాంధ్ర సాహిత్యంగా పిలవడం సమంజసం. ఇలా
పరాయిదేశంలో నివసిస్తూ రాసినంత మాత్రాన ఆ సాహిత్యమంతా ప్రవాసాంధ్ర సాహిత్యం
అయిపోతుందా అనేదొక ప్రశ్న. అందువల్ల మాతృదేశాన్ని వదిలి వెళ్ళడం వల్ల కలిగిన జీవిత
సంఘర్షణలను ప్రతిఫలిస్తే ఆ సాహిత్యాన్ని ప్రవాసాంధ్ర సాహిత్యంగా గుర్తించడం
మంచిది.
·
‘‘Diaspora అన్న పదం గ్రీకు పదం, నిజమే! దీనిని, క్రీస్తు పూర్వం 586 లో యూదు జాతి వాళ్ళు దేశ భ్రష్టులై, ఈజిప్ట్ నుండి చెల్లాచెదరైపోయిన
సందర్భంలోనే వాడడం కద్దు. కానీ, చిన్న
d తో రాసిన diaspora అన్న మాటని, విధిలేకనో, అప్రయత్న పూర్వకంగానో, స్వదేశాన్ని వదిలి పరదేశాలకి వెళ్ళిన అందరికీ
అన్వయించడం మొదలై,
చాలా కాలం
అయ్యింది.’’ అని వేలూరి వెంకటేశ్వరరావు డయాస్పోరా
శబ్దాన్ని వివరించి కింది లక్షణాలను చెప్పి, వీటిలో కొన్ని లక్షణాలున్నా
సరిపోతాయన్నారు.[2]
·
ప్రవాసాంధ్ర సాహిత్య లక్షణాలు:
1.
మాతృదేశ
జ్ఞాపకాలు
2.
పెంపుడు
దేశంలో మనని పూర్తి భాగ స్వాములుగా ఎప్పటికీ ఒప్పుకోరు అన్న నమ్మిక (కారణాలు
ఏవైతేనే!)
3.
ఎప్పుడో
ఒకప్పుడు మనం వెనక్కి తిరిగి మన మాతృదేశానికి వెళ్తాం అన్న నమ్మకం, ఇది
ఎంత పిచ్చి నమ్మకమైనా సరే!
4.
మాతృదేశానికి
ఏదో మంచి చేద్దామన్న కోరిక, గట్టి పట్టుదల (అందరికీ కాదులెండి.)
5.
మాతృదేశ
సాహితీ సంస్కృతుల్లో వచ్చే మార్పులలో,
“విప్లవాలలో” భాగస్వాములు
కావాలనే కుతూహలం
6.
సామూహిక స్పృహ, ధృఢమైన
ఏకత్వ నిరూపణ ( project a strong
uniform identity. )
వీటితో పాటు ప్రవాసాంధ్ర సాహిత్యంలో వ్యక్తమై
భావాల్ని బట్టి మరికొన్ని లక్షణాల్ని కూడా
చేర్చుకోవచ్చు.
ప్రవాసాంధ్ర సాహిత్యం
అనే భావన ఎప్పటి నుండి ఉందనేది స్పష్టంగా చెప్పలేకపోయినా,
ఆ భావన 1990
నుండీ అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి నుండి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని
ప్రస్తుత పరిశీలన వల్ల తెలుస్తుంది[3]. అమెరికా కథలు, అమెరికా కవిత్వం అనే విశేషణాలతో అమెరికా తెలుగు
డయాస్పోరా సాహిత్యం వెలువడుతోంది. 1960లకి ముందు ఉద్యోగ రీత్యా వచ్చి, స్థిరపడి, తెలుగు భాషకోసం
అన్వేషించేటప్పుడు, ఆంధ్రేతర
భాషల్లోనూ, అప్పుడప్పుడూ తెలుగు ప్రాంతాలకు
వచ్చినప్పుడు రాసిన తెలుగు భాషా రచనల్లోనూ ఈ సాహిత్యం కనిపించినా, దానిలో నాస్టాల్జియా అత్యధికంగా కనిపిస్తుంది.
1970 తర్వాత రెండవ తరం తెలుగు వాళ్ళు సంస్కృతి గురించిన తపనతో, తమ మత, కుల, ప్రాంతీయ
పరిస్థితుల్నే రచనల్లో సృజన చేయడం కనిపిస్తుంది. 1990 తర్వాత భారతదేశంలో పారిశ్రామికీకరణ, ఆర్థిక సరళీకృత విధానాల ఫలితంగా తెలుగు వాళ్ళు అధిక సంఖ్యలో, అనేక మత, కుల వర్గాల వాళ్ళు అమెరికా, ఇతర ప్రపంచదేశాలకు వెళ్ళడానికి అవకాశం కలిగింది. అక్కడి పరిస్థితులతో
నిజమైన డయాస్పోరా సాహిత్య భావన ఈ కాలంలోనే ఏర్పడింది.
1971
లో స్థాపించుకుని, అయిదేళ్ళపాటు నడిపిన ‘‘తెలుగు
భాష పత్రిక’’లో శాస్త్ర రచనలతో
పాటు, సాహిత్యం కూడా ప్రచురించారు.
మొదట చేతిరాత పత్రికగా ఉన్నా, తర్వాత
అది అచ్చు పత్రికగా మారింది. 1977
- 82 మధ్యలో ‘‘తెలుగు అమెరికా’’ పత్రిక షికాగో నుంచి వెలువడేది. ప్రతియేటా ప్రచురించే ‘‘తెలుగు వెలుగు’’ సంచికల్లోను, ఆటా, తానా వారి వార్షిక
సంచికల్లోను కొన్ని సృజనాత్మక రచనలు ప్రచురించేవారు. తర్వాత కాలంలో ‘‘రచ్చబండ’’ ఇంటర్నెట్ చర్చావేదిక,
ఈమాట, సుజనరంజని
వెబ్ పత్రికలు సాహిత్యాన్ని రాసేటట్లు ప్రోత్సహించాయి. ఇవన్నీ అమెరికా, ఇతర దేశాల్లోని తెలుగు వాళ్ళని రాసేటట్లు
ప్రేరేపించాయి. ఇప్పుడైతే, తమకిష్టమైన
భాషలో ఉచితంగా రాసుకునే అవకాశం ‘‘బ్లాగు’’ల వల్ల
కలిగింది. దీనితో వందల సంఖ్యలో సొంతంగా బ్లాగులు రూపొందించుకుని, వాటిలో తమ జీవితానికి సంబంధించిన అనేక
విషయాల్ని రాస్తున్నారు. నిడదవోలు మాలతి ‘‘తూలిక’’ మొదట్లో
ఆంగ్లంలోను, తర్వాత తెలుగులోను వెబ్
పత్రికను నడిపారు. తెలుగు రచనల్ని, ముఖ్యంగా
స్త్రీ భావాల్ని ప్రతిఫలించే రచనల్ని అనువదించి అందించేవారు.
1995 నుంచీ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళ ఆధ్వర్యంలో ‘‘అమెరికా తెలుగు కథ’’ పేరుతో కథాసంపుటాలను ప్రచురిస్తున్నారు. ఈ నేపథ్యం నుండే వచ్చిన ఒక
బృహత్తర కథా సంకలనం ‘‘20 వశతాబ్దంలో
అమెరికా తెలుగు కథానిక మరియు తెలుగు సాహితీవేత్తల పరిచయం’’ పేరుతో 2009లో ఒక గ్రంథం వెలువడింది. దీనిలో 1964 నుంచీ 1999 వరకూ అమెరికా
నుంచి ప్రచురితమైన 116 కథలున్నాయి.
ప్రవాసాంధ్ర సాహిత్యం ఎక్కువగా కథల్లో కనిపిస్తోంది. తర్వాత స్థానంలో కవిత్వం,
నవలా ప్రక్రియల్లోను వస్తోంది. వీటితో పాటు డయాస్పోరా జీవన సంస్కృతిని వ్యాసరూపంలో
కూడా విరివిగానే అందిస్తున్నారు.
సృజనాత్మక
ప్రవాసాంధ్ర సాహిత్యాన్ని రాస్తున్నవారిలో నిడదవోలు మాలతి, నోరి రాధిక, ఆరి
సీతారామయ్య, వేలూరి వెంకటేశ్వరరావు, వంగూరి చిట్టెన్ రాజు, అఫ్సర్, కల్పనా రెంటాల
తదితరులెంతో మంది వలసాంధ్రసాహిత్యాన్ని రాస్తున్నారు. పేర్ల జాబితా చెప్తే
వ్యాసమంతా పేర్లతోనే నిండిపోతుందని రాయడం లేదు.
మాతృభాషపై
మమకారం:
కల్పనా
రెంటాల రాసిన ‘హోమ్ రన్ ’ ( 2013) కథలో సుచిత్ర తన కొడుకు క్రిష్ కి తెలుగు భాష
నేర్పడానికి పడే తపన కనిపిస్తుంది. క్రిష్ అమెరికాలోనే పుట్టి, పెరుగుతున్నా,
భారతదేశంలో కుటుంబమంతా ఉండటం వల్ల వాళ్ళతో సంబంధబాంధవ్యాలు కొనసాగాలంటే తెలుగు భాష
అవసరమెంతుందో గుర్తించాల్సిన అవసరాన్ని చెప్పిన కథ. అందుకే ఇంటిలో తెలుగులో
మాట్లాడమనీ, తెలుగు భాష నేర్చుకోవమనీ చెప్తుంటుంది. ఇటువంటి కథే అంబల్ల జనార్థన్
‘శ్రీకారం’ (1997) భారతదేశంలోనే తెలుగు భాష మాట్లాడే ప్రాంతం నుండి
మహారాష్ట్రవెళ్ళి స్థిరపడిన వాళ్ళు కూడా మరలా తమ సంబంధ బాంధవ్యాల్ని
కొనసాగించుకోవాలంటే మాతృభాషేశరణ్యమనేది చాలా బాగా రాశారు. జగన్ భారతదేశంలోని ఒక
రాష్ట్రమైన మహారాష్ట్రలో జీవిస్తూ, తెలుగు నేర్చుకునే అవకాశం ఉన్నా దాన్ని
తక్కువగా భావించి నేర్చుకోడు. తీరా తన సొంతూరు వచ్చినప్పుడు తెలుగు భాష రాకపోతే
పడే కష్టాలేమిటో బస్సుల మీద రాసిన తన ఊరిపేర్లను కూడా చదవలేకపోవడం, తెలుగు
దినపత్రికలో బొమ్మలు తప్ప భాష అర్థం కాకపోవడం, ఒక పల్లెటూరి వాడి దగ్గర తన ఆంగ్ల
భాష పటాటాపాన్ని ప్రదర్శించి భంగపడ్డం, తర్వాత అమెరికాలో ఉన్నా తెలుగు నేర్చుకున్న
క్రిష్ అందరితో కలివిడిగా కలిసిపోవడం వంటి సన్నివేశాల్ని చక్కగా వర్ణించి మాతృభాష
ప్రాధాన్యాన్ని వివరించాడు రచయిత. అమెరికా వెళ్ళినా తమ భాషవాళ్ళు కనిపిస్తే కలిగే
ఆనందాన్ని కూడా ప్రవాసాంధ్ర రచయితలు, రచయిత్రులు వర్ణించారు. సామాజిక జీవన
విధానంలో భాష కూడా ఒక అంశం. భాష జీవనాన్ని ఎలా నిర్దేశిస్తుందో సామాజిక,
సాంస్కృతిక కోణంతో అధ్యయనం చేయవచ్చు. ప్రవాసాంధ్ర సాహిత్యంలో శక్తివంతమైన
విషయాల్ని అంతేశక్తివంతంగా వ్యక్తం చేయాలనే భావనతో కొంతమంది అన్యదేశ్య భాషా పదాలు
విరివిగా వాడుతుంటారు. అంతమాత్రం చేత వాళ్ళకి ఆ భావాన్ని తమ మాతృభాషలో వ్యక్తం
చేయడం ఇష్టం లేకపోవడం కాదని భావించడం సమంజసం కాదేమో. ఒక్కోసారి అన్యభాషలోని ఆ భావం
తన మాతృభాషలో అంత శక్తివంతంగా అందించలేకపోవచ్చనే అపనమ్మకం కూడా ఒక కారణం కావచ్చు.
మరికొన్ని సార్లు ప్రవాసాంధ్రులు చాలా కాలంగా ఇతర ప్రాంతాల్లోనో, అన్యభాషల
అనివార్య జీవితంతోనో జీవించడం వల్ల తన మాతృభాషలోని పలుకుబడినీ, నుడికారాన్నీ
మరిచిపోయి, పొరపాటుగా మాట్లాడవచ్చనే న్యూనత లేదా భయం వల్ల కూడా అన్యదేశ్యాలను
విరివిగా వాడుతుంటారు. భాష, ప్రాంతం, మత విషయాల్లో అమెరికాలో స్థిరపడిన భారతీయులు,
తెలుగువాళ్లు ఎలా ఎదుర్కొంటున్నారో ‘సంకట్
కాలమే బహర్ జానేకామార్గ్’ కథలో వంగూరి చిట్టెన్ రాజు హాస్యధోరణిలో వర్ణించారు. అక్కడ కూడా మతం మనకి అంటించిన అనేకాంశాలతో
మానవుడెలా జీవిస్తున్నాడో చక్కగా వివరించారు.
సాంస్కృతికాంశాల
వర్ణనలు:
నోరి రాధిక
రాసిన ‘పండగ’ కథలో అమెరికాలో తెలుగువాళ్లు వివిధ పండుగలు ఎలా చేసుకుంటారో, ఎందుకు
చేసుకుంటారో చక్కగా వర్ణించారు. సునందకు పిల్లలు లేకపోయినా అమెరికాలోని తెలుగు
వాళ్ళని ఒకచోటకు చేర్చి, పిల్లల చేత ఆటలాడించి, బహుమతులిచ్చి, తెలుగు వంటకాలు
చేయించుకొని సాంస్కృతిక సమైక్యతతో జీవించాలనుకుంటున్నారో వర్ణించారు. అయితే
భారతదేశంలో లా ఒక ఇంటిలోనే వంటలు వండడం కాకుండా, ఒక్కొక్క వంటా ఒక్కొక్కరు తయారు
చేసుకొస్తారనీ, తర్వాత వాటిని అందరూ కలిసి తింటారనీ వివరించారు. ఉగాది, సంక్రాంతి, దీపావళి మొదలైన భారతీయ, తెలుగు
పండగలను ప్రవాసాంధ్రులు నిర్వహించుకుంటారనీ, ఆ సందర్భంలో నిర్వాహకుల మధ్య కొన్ని
అపోహలు వచ్చినా, మళ్ళీ వాటిని మరిచిపోయి కలుసుకుంటుంటారని ప్రవాసాంధ్రుల
సాంస్కృతిక కోణంతో ఈ కథను రాశారు.
జాతి
వైషమ్యాలు-అభద్రత:
నిడదవోలు మాలతి రాసిన
రంగుతోలు (2008) కథలో అమెరికాలో
పిల్లల పెంపకం, అభద్రత, భార్యాభర్తల బంధాల గురించీ వర్ణించారు. నీలవేణి నల్లగా
ఉంటుంది. పెళ్ళైన కొత్తలో తన భర్త ఆఫీసుకి వెళ్ళిపోయిన తర్వాత తాను ఒంటరిగా గడపలేక
ఒక నాటకం చూడ్డానికి వెళుతుంది. అక్కడో చిన్నపిల్ల తనకాళ్ళకు చుట్టుకొని
ఏడుస్తుంటే, ఆ పిల్ల తనపిల్లే అనుకుంటారంతా. ఆ పిల్ల చేతిలోనూ నాటకం చూడ్డానికి
టికెట్ ఉంటుంది. అందువల్ల ఆ పిల్లని
తీసుకొని థియేటర్ కి వెళ్ళడం, నాటకం వేసిన నటి వచ్చి తన పిల్లని తీసుకుని థాంక్స్
చెప్తుంది. తానెవరికో ఒప్పచెప్పాననీ వాళ్ళు రాలేకపోవడం వల్ల అలా పిల్ల ఒంటరిగా
ఏడ్చిందని వివరణనిచ్చుకుంటుందా నటి. దాని గురించే ఆలోచిస్తూ, తనని పికప్
చేసుకుంటానని చెప్పిన భర్త సుందరం ఇంకారాకపోయేసరికి తన ఇళ్ళు దగ్గరే కాబట్టి,
నడుచుకుంటూ దారిలోనే ఉన్న స్టోర్ లో కూరగాయలు, సామాన్లు పట్టుకెళ్ళాలనుకుంటుంది.
తాను ఇరవై డాలర్ల వస్తువులు కొని చెక్ ఇస్తే, తనని రకరకాల ప్రశ్నలు వేస్తారా
స్టోర్ వాళ్ళు. కానీ, అంతకు ముందు తనకంటే ఎక్కువ సామాన్లు కొని చెక్ ఇచ్చిన
తెల్లామెను మాటమాత్రం ప్రశ్నించకుండా చెక్ తీసుకున్న సంగతిని తలచుకుంటుంది. అలా తన
పేరు, భర్తపేరు రాయమనీ, రకరకాలుగా ప్రశ్నలు వేసేసరికి తాను కొన్న సామాను వద్దనీ
ఇచ్చేయబోతుంది. మేనేజర్ వచ్చి చెక్ తీసుకుంటాడు. తన సామాను పట్టుకొని, తన
‘రంగుతోలు’ వల్లనే ఇలాంటి పరిస్థితి ఎదురైందని, తననొక ఆఫ్రికన్ అనుకుంటున్నారనీ
భావిస్తుంది. తాను నల్లగా ఉన్నా, తన పెళ్ళవుతుందో లేదో నని ఇండియాలో తన
తల్లిదండ్రులు బాధపడినా సుందరం ఇష్టపడి చేసుకున్నాడు. తాను భర్తతో పాటు అమెరికా
వచ్చేసింది. కానీ, అమెరికాలో వర్ణాన్ని బట్టి వైషమ్యాలు కనిపించడం తనని
బాధిస్తుందనుకుంటూ నడిచొస్తుంటుంది. ఇంతలో కొంతమంది వచ్చి నీలవేణి చేతిలో సామాన్లు
లాక్కోబోతారు. దాన్ని గట్టిగా పట్టుకోవడంతో ఆమెని తోసేస్తారు. ఆమెకు రక్తం
కారుతుంది. ఈ లోగా ఒక నల్లటిమొహం మీద ఎర్రటి రక్తం కారుతూ ఒకతను తనకి కనిపిస్తాడు.
అతడు తనని రక్షించడమే కాకుండా, పోలీసులకు కూడా సమాచారం అందిస్తాడు. అతనెవరని
ఆలోచిస్తే అతను కూడా బహుశా ‘నల్లని’వాడే. తమ జాతి వాళ్ళే అనుకొని ఆమెను
రక్షించబోయాడనుకుంటుంది.
ఈ కథలోని అంశాల్ని
సామాజిక, సాంస్కృతిక దృక్పథంతో విశ్లేషించుకుంటే
అమెరికాలో స్వేచ్ఛ, భద్రత ఉంటుందనే మాటలు అక్కడికి వెళ్ళిన తర్వాత గానీ
అనుభవంలోకి రావనేది ఈ కథ ద్వారా తెలుస్తుంది. జాతి వైషమ్యాలు లేవనే మాటలు కూడా
వాస్తవాలో కాదో అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలి. పిల్లల సంరక్షణకు ప్రత్యేకచట్టాలు
అమల్లో ఉన్నాయి. భారతదేశంలో కుల భేదాలు గురించి చర్చిస్తూ హరిజనుల్ని మనుషులుగా
గుర్తించరనే భావాలు వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆఫ్రికన్స్ పట్ల అమెరికాలో
ఉన్న భిన్నాభిప్రాయాల్ని ఈ కథలో చర్చకు
పెట్టారు రచయిత్రి. రంగుని బట్టీ, జాతిని బట్టీ మనస్తత్వాలు ఉండవనీ, వారి వారి
పరిస్థితులే వాళ్లనలా తయారు చేస్తాయనీ ఈ
కథను బట్టి తెలుస్తుంది.
ఇలాంటి వాటిలో
భారతీయుల్ని అమెరికన్లు చిన్నచూపు చూస్తున్న స్థితిని ఆరి సీతారామయ్య రాసిన ‘అపచారం’
కథ (2001)లో కూడా చూడొచ్చు. ఈ కథలో
అమెరికా వచ్చి స్థిర పడిన భారతీయురాలు కమల. సోషల్ వర్కర్ గా పనిచేస్తూ మానసిక
రోగుల్ని మామాలు మనిషిగా చేయడానికి కౌన్సిలింగ్ నిర్వహిస్తుంటుంది. అమెరికాలో
హైస్కూలు టీచర్ గా పనిచేస్తున్న ఎమిలీ మానసిక రోగిగా ఆసుపత్రిలో చేరుతుంది.
వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణలో రోగిని కమల ప్రశ్నించేటప్పుడు గౌరవ వాచకంలో
పిలుస్తుంటుంది. కానీ, ఎమిలీ మాత్రం ఏకవచనంతో సమాధానమిస్తుంది. కమల చదువునీ, కమల
నైపుణ్యాన్నీ కూడా గుర్తించడానికి గానీ, గౌరవించడానికి గాని ఎమిలీ మనస్తత్వం
అంగీకరించదు. తర్వాత సంభాషణల్లో తాను కూడా అమెరికాలోనే చదువుకున్నానని కమల
చెప్పడంతో కొంచెం సరిగ్గా సమాధానం చెప్తుంది.
అఫ్సర్ రాసిన ‘ఛోటీ
దునియా’ కథలో కూడా అమెరికాలో ముస్లిములు, ఇతర దేశాల వాళ్లు ఎదుర్కొంటున్న వివక్షను
చిత్రంచారు. ముస్లిములనగానే పాకీస్తానీయులుగా చూసే ధోరణిని విశదీకరించింది.
డా.శంకరయ్య రాసిన ‘పడమటి కొండలు’ నవలలో కూడా కథానాయకుడు వెంకట సాయి ఇటువంటి
వివక్షల్ని కెమెరా పెట్టి చూపినట్లు పాఠకులకు చూపించాడు. ఇలా చాలా కథలు, నవలల్లో
ప్రవాసాంధ్ర సాహిత్యంలో కనిపించే వివక్షను చిత్రించడాన్ని గమనించి, సామాజిక,
సాంస్కృతికాంశాలను విశ్లేషించవచ్చు.
·
ప్రస్తుతం
తెలుగులో ప్రవాసాంధ్ర సాహిత్యం విస్తృతంగానే వస్తుంది.
సాహిత్య విమర్శ- బహుళ’ – సాహిత్య విమర్శ (సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు)
·
సరైన
సాహిత్య విమర్శ రావడంలేదని కొంతమందీ, అసలు సాహిత్య విమర్శే లేదని మరికొందరు,
సాహిత్య విమర్శ అవసరం లేదనే వారు సాహిత్య విమర్శ చర్చలో కనిపిస్తున్నారు.
· ‘‘సృజనాత్మక
సాహిత్యం మీదా సాహిత్య విమర్శ మీదా బలమైన ప్రభావమే వేసింది. స్థిరమైన గొంతులు
లేవని కాదు. తగ్గుముఖం పడుతున్నాయి. నిక్కచ్చిగా వుండాల్సినచోట నీరుకారుతున్నాయి.
పొసగని మాటలు కోటలు దాటుతున్నాయి. మేధా – జ్ఞానం – ఆచరణల మధ్య పొంతన లేకుండా
పోతోంది. ద్వంద్వ ప్రవృత్తులు ఎక్కువయ్యాయి. ఇటువంటి విషాద సన్నివేశంలో సాహిత్య
బుద్ధి జీవుల ఆలోచనల్ని మరోసారి నిబద్ధత గీటురాయిమీద గీసి చూడాల్సిన పరిస్థితి
ఏర్పడింది. ఎవరు ఎక్కడ నిలబడ్డారో నిరూపించాల్సిన అవసరం వచ్చింది.’’ ఏ.కె.ప్రభాకర్
· ఏ.కె.ప్రభాకర్ ఈ
పుస్తకానికి రాసిన ముందుమాటలో సమకాలీన తెలుగు సాహిత్య విమర్శ ధోరణిని
విశ్లేషించుకునే కొంతమంది అభిప్రాయాల్ని ఉటంకించారు. ఈ ముందుమాటను పుస్తకం డాట్ నెట్ వారు పూర్తి గా ప్రచురించారు.
‘‘సమాజంలోనూ
సాహిత్యంలోనూ పక్కలకు నెట్టివేయబడ్డ ప్రజా సమూహాల నుంచి (marginalized groups) వస్తున్న రచయితల
గొంతులు వినిపించడం మొదలైనాకా సాహిత్య వ్యవస్థలో ప్రజాస్వామిక భావనలు బలపడే
గుణాత్మకమైన ధోరణి రూపొందింది. అయితే ఆ గొంతులన్నిటినీ సమ్మిళితం చేసుకొని
ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్య భావజాల రంగాన్ని పటిష్టపరచుకొని విశాలమైన ఐక్య
వేదికని నిర్మించుకోవడంలో చొరవ చూపించలేకపోతున్నాం. ఆ లోటు సాహిత్య విమర్శలో సైతం
ప్రతిఫలించింది (నారాయణస్వామి వెంకటయోగి).
·
సాహిత్యంలో
అకడమిక్ విమర్శ, నాన్ అకడమిక్ విమర్శ అనే ఆలోచనలు బాగా కనిపిస్తున్నాయి.
ముగింపు:
·
ఈ విధంగా
తెలుగు సాహిత్యంలో కొన్ని నూతన ఆలోచనలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ ఈ ప్రసంగంలో
వివరించడానికి సమయం సరిపోదు. కానీ, ఇవన్నీ నేడు మనకు సాహిత్యంలో కనిపిస్తున్న
కొన్ని ఆలోచనలు.
·
మీతో నా
ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ వార్కీ,
ముఖ్యంగా ప్రత్యేక కమీషనర్ శ్రీనాయక్ గార్కి, డాక్టర్ అనిల్ గార్కి, విన్న మీ
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
·
నా
ప్రసంగం పై ఏమైనా అనుమానాలు, సూచనలు, సలహాలు ఉంటే చెప్పొచ్చని మిమ్మల్ని అందర్నీ
కోరుతున్నాను.
అందరికీ కృతజ్ఞతలు
[1]
నానో టెక్నాలజి రాజ్యమేలుతున్న నేటి
రోజుల్లో కవిత్వాన్నీ సూక్ష్మాతి సూక్ష్మ స్థాయిలో చెప్పడానికే
"నానోలు". నానో అంటే సూక్ష్మాతి సూక్ష్మం (10-9) అని అర్ధం. ఈ పేరు భౌతిక శాస్త్ర
పారిభాషిక పదం.
[2] నా భావనలో డయాస్పోరా (వ్యాసం), http://eemaata.com/em/issues/200211/1004.html
[3] తెలుగు డయాస్పోరా సాహిత్యం - ఒక పరిచయం (వ్యాసం), దార్ల వెంకటేశ్వరరావు, ద్రావిడి
(త్త్రైమాసిక తెలుగు పరిశోధన పత్రిక) ఆగస్టు, 2011, సంపుటి-1, సంచిక-1. పుటలు: 114
–123.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి