''గ్రామీణ సామాజిక అభివృద్దిలో ఉన్నత విద్యాసంస్థల భాగస్వామ్యం అవసరం''
-విద్యావేత్తల సూచన
-విద్యావేత్తల సూచన
భారతదేశంలోని ఉన్నత విద్యాలయాలల్లో సామాజిక బాధ్యత కోసం చేపడుతున్న వివిధ అంశాల గురించి న్యూఢిల్లీలో ఈ నెల 20, 21 తేదీల్లో ( మంగళ, బుధవారాల్లో) యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ఆధ్వర్యంలో ఒక కార్యశాల జరిగింది. ఈ కార్యశాలకు దేశంలోని అన్ని సెంట్రల్ యూనివర్సిటీ ప్రతినిధులను ఆహ్వానించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రతినిధులుగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ నుండి డాక్టర్ జె.వి. మధుసూదన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటీ డీన్ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు లు ఈ కార్యాల్లో పాల్గొన్నారు. భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2012 నుండి ఒక శక్తివంతమైన కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పథకం గా ఈ కార్యక్రమాన్ని రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2018 నుండి దీన్ని ఉన్నత్ భారత్ అభియాన్ ద్వారా మరింత శక్తివంతంగా అన్ని ఉన్నత విద్యా సంస్థల్లోనూ అమలు చేయడానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనలో భాగంగా ఈ కార్యశాలను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా సంస్థల్లో సముపార్జించిన విజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాలలోని అన్ని సామాజిక వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడానికి కావలసిన మార్గాలను అన్వేషించే దిశగా రెండు క్రెడిట్ ల కోర్సుల రూపకల్పన కూడా జరుగుతోంది. జ్ఞానం అనేది కేవలం ఒక వైపు నుండే కాకుండా రెండు వైపుల నుండి పరస్పర వినియోగంగా ఉండాలనేది ఈ పథకంలోని ఒక ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ఆయా రంగాలలో నిష్ణాతులైన అధ్యాపకులను, ఆసక్తి కలిగిన విద్యార్థులను గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తారు. క్షేత్ర పర్యటన ద్వారా ఆయా సామాజిక వర్గాలకు కావలసిన అత్యవసర అవసరాలను గుర్తించి దానికి అనుగుణమైన ప్రణాళికలను రూపొందిస్తారు. దీని కోసం దేశవ్యాప్తంగా ఇంత వరకు అమలు జరుగుతున్న కార్యక్రమాలను సమీక్షించి వాటన్నిటినీ ఒక చోటకు చేర్చి సమన్వయించి నూతన పాఠ్య ప్రణాళికలను రూపొందించడానికి ఈ కార్యశాలను ఉద్దేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పటికే ఈ పథకంతో సంబంధం ఉన్న వాటినీ, అమలు చేసినవీ, చేస్తున్నవాటినీ ఈ కార్యాల్లో ఈ ప్రతినిథులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వీటిలో ప్రధానంగా విశ్వవిద్యాలయం పరిసర గ్రామాల్లో స్థానికుల సహకారంతో అమలు చేసిన అక్షరాస్యతా పథకం, ప్రభుత్వం సూచించిన స్వచ్ఛతాపక్వాడా కార్యక్రమాల గురించి పేర్కొన్నారు. దీనితోపాటు డిజిటల్ వెల్నెస్ సెంటర్ కార్యక్రమాలు మొదలైన వాటి గురించి ఈ ప్రతినిధులు ఈ కార్యశాలలో వివరించారు. ఈ కార్యశాలలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ చైర్మన్ ఆచార్య డి.పి.సింగ్, వైస్ చైర్మన్ ఆచార్య భూషణ్ పట్వర్ధన్, ఇంటర్ యూనివర్సిటీ ఏక్సలేటర్ సెంటర్ డైరెక్టర్ ఆచార్య ఏసిపాండే, కార్యశాల సమన్వయ కర్త, యూజిసి అడిషనల్ సెక్రటరీ డాక్టర్ రేణుబాత్ర, ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం జరిగిన కార్యశాల ముగింపు సమావేశంలో నిర్వాహకులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కృషి ప్రశంసించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి