13 అక్టోబర్, 2018
ఘనంగా ప్రపంచ విద్యార్థి దినోత్సవం
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ , 13 -10-2018 కార్యక్రమం
ప్రతిభకు కుల,మత,జాతి,లింగభేదాలు ఆటంకం కాదని, శాస్త్రానికి మానవీయకోణాన్ని సమన్వయిస్తే సాధించే ఉత్తమ ఫలితాలు ఎలాగుంటాయో నిరూపించిన ఆదర్శనీయ శాస్త్రవేత్త, మాజీ భారత రాష్ట్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ అని సెంట్రల్ యూనివర్సిటి స్టూడెంట్స్ వెల్ఫేర్ డిప్యూటి డిఎస్ డబ్ల్యూ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి అబ్దుల్ కలామ్ జయంతి (అక్టోబరు, 15)ని ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’ గా ప్రకటించిన నేపథ్యంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో తారానగర్ విద్యానికేతన్ మోడల్ ఉన్నత పాఠశాలో భారతమాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాఖశాస్త్రవేత డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అబ్దుల్ కలామ్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఇంటింటికీ పత్రికలు సరఫరాచేసి, ఆ వచ్చిన డబ్బులతో చదువుకున్నాడన్నారు. తన పేదరికం, తన మతం తన ప్రతిభకు ఏనాడూ ఆటంకంగా మారలేదనీ, నిజమైన కృషీ, పట్టుదల ఉంటే ప్రతిభను గుర్తించేవాళ్ళెప్పుడూ ఉంటారని నిరూపించారన్నారు. రక్షణరంగంలోను, అంతరిక్షపరిశోధనల్లోను శాస్త్రవేత్తగా ప్రవేశించిన కలామ్, అంచెలంచెలుగా భారతదేశానికి రాష్ట్రపతిగా ఎంపికయ్యారనీ, ఆయనకు సుమారు 40 దేశాలు గౌరవ డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేశాయన్నారు. తేలికపాటి విమానాలు, హెలీకాప్టర్లు, కృత్రిమ అవయవాలకు ఉపయోగపడే శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన కృషి అసామాన్యమైందని ఆచార్య వెంకటేశ్వరరావు కొనియాడారు. నేడు దేశ రక్షణ రంగానికి ఉపయోగపడే రాకెట్స్ రూపొందించడంలో, అలాగే సామాన్య ప్రజానీకానికీ మొబైల్, ఇంటర్నెట్, టీవి వంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొని రావడానికి కలామ్ చేసిన పరిశోధనలు ఎన్నో మంచిఫలితాల్ని ఇచ్చాయన్నారు. భావిభారత పౌరులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలనీ, ఐక్యరాజ్యసమితి అన్నిదేశాల్లోని ఉత్తమ క్రమశిక్షణ, ఆదర్శనీయ గుణాలున్న వ్యక్తిగా అబ్దుల్ కలామ్ ని గుర్తించి ఆయన జయంతిని ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’గా ప్రకటించిందటే ఆయన గొప్పతనం తెలుస్తుందన్నారు. ఆయన జీవితాన్ని ప్రతి విద్యార్థీ ఆదర్శనీయంగా తీసుకోవాలని ఆయన ఉద్బోధించారు. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న సెంట్రయూనివర్సిటి రీసెర్స్ స్కాలర్ గౌడ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మహోన్నతమైన కలలు కనాలనీ, వాటిని సాకారం చేసుకోవడానికి నిరంతరం కృషిచేయాలని చెప్పి, నిరూపించిన వ్యక్తి అబ్దుల్ కలామ్ అన్నారు. ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకొని తమలోని శక్తిసామర్థ్యాలను ప్రదర్శించే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ విజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామమోహనరావు, ఆహార పోషణానిపుణురాలు శ్రీమతి శ్రీచందన, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహులు, విద్యానికేతన్ మోడల్ ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ రామాచారి, ప్రిన్సిపాల్ శ్రీమతి కనకదుర్గ, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, జనార్థనరావు, పవన్ తదితరులు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి