"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

16 జనవరి, 2017

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’’ జాతీయ సదస్సు వివరాలు (కొన్ని)

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం అనే అంశంపై రాజమహేంద్రవరంలో ఈ నెల (జనవరి) 11 వతేదీన ఒక రోజు జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, మనోజ్ఞ సాహిత్య అకాడమీ                         ( విహంగ డాట్ కామ్ ) వారు సంయుక్తంగా నిర్వహించారు. 


మానస ఎండ్లూరి ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ సదస్సుకి ప్రముఖ కవి, సాహిత్యపీఠం డీన్ ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు అధ్యక్షత వహించారు. ప్రారంభ సభ ఆయన ఆధ్యక్షంలో ఆద్యంతం చక్కని ఛలోక్తులతో కొనసాగింది. అంతర్జాలమనేది తనకో మాయాజాలంలాంటిదన్నారు. తరాలు మారుతున్నప్పుడు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని విజ్ఞానవంతులు వేగంగా అందుకుంటారని, ఆ విధంగా ఈ సదస్సు అటువంటి కొత్తవిషయాలను చర్చిస్తుందన్నారు. తొలిసారిగా అంతర్జాల సాహిత్యంపై పిహెచ్.డి. పట్టాను పొందిన డా.పుట్ల హేమలత ఈ సదస్సుని నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నానని అన్నారు. సాహిత్య పీఠం నిర్వహణ సాధకబాధకాల్ని స్పృశిస్తూనే, సిబ్బందికి నెల నెలా అందని జీతభత్యాల గురించి కూడా ప్రస్తావించారు. ఈ విషయాన్ని వైస్ ఛాన్సలర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరారు.    పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆధునిక శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల్ని గమనిస్తూ వాటిని అందుకోవడంలోనే పరిశోధన విజయవంతమవుతుందనీ, ఆ విధంగా ఈ సదస్సు ఒక మంచి ప్రయత్నమన్నారు. తెలుగు భాష ఎక్కడున్నా దాన్ని పరిరక్షించుకునే ప్రయత్నాన్ని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్మరించదని, అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, అవి ప్రభుత్వంతో ముడిపడి ఉన్పప్పుడు వాటి పరిధి, పరిమితులను గుర్తెరిగి నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నారు. నేటి పరిశోధకుల, పరిశోధనలు తీరుతెన్నుల్ని ఛలోక్తులతో వివరించారు. తన రచన అచ్ఛయిన పత్రికలో తన రచన తప్ప మరొకరి రచన చదవని పరిశోధకులు కూడా ఉంటున్నారని, అది చెప్పడానికి చాలా విచారిస్తున్నానన్నారు. ఆ పరిస్థితి మారాలన్నారు. కనీసం దిన, వార, మాస పత్రికల్లోని సాహిత్య పుటలైనా పరిశోధకులు చదవాలని ఉద్బోధించారు. అంతర్జాలంలో వచ్చే సాహిత్యమంతా ప్రామాణికమని చెప్పలేమని వ్యాఖ్యానించారు. అటువంటి సాహిత్యాన్ని సరిగ్గా నిర్ధారణ చేసుకోవాల్సిన బాధ్యత పరిశోధకులపై ఉంటుందన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం, విజయనగరం  శాఖ ప్రత్యేక అధికారి ఆచార్య జి. యోహాన్ బాబు విశిష్ట అతిథి గా పాల్గొని శుభాకాంక్షలు అందించారు. అలాగే అనంతసేవానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టపగలు వెంకట్రావు మరొక విశిష్ట అతిథి గా పాల్లొని, రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శాఖను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరాన్ని వివరించి, దానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిధులు లేకపోయినా ధైర్యంగా మంచి సదస్సుని నిర్వహిస్తున్న ఆచార్య ఎండ్లూరి సుధాకర్, డా.పుట్ట హేమలత గార్ని అభినందించారు.


సదస్సు అవగాహనా పత్రాన్ని సదస్సు కన్వీనర్ డా.పుట్ల హేమలత వివరించారు. నేటికీ చాలామందికి అంతర్జాలం పట్ల అవగాహన ఉండటం లేదనీ, దీన్ని కనీసం పరిశోధకులు, రచయితలు అయినా ముందుగా అందుకోగలిగితే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ సదస్సుని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచం ఒకవైపు వైజ్ఞానికంగా దూసుకుపోతుంటే, మరోవైపు ఆ ఫలాలేమీ అందకుండా దూరంగా జీవిస్తున్న వాళ్ళూ ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆంగ్ల భాష విజ్ఞానాన్ని అందించడంలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న తరుణంలోనే తెలుగు భాష కూడా తనవంతు భాగస్వామ్యాన్ని అందించే ప్రయత్నం ఈ దశాబ్దంలో బాగా పెరిగింది. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే తానీ సదస్సుని నిర్వహిస్తున్నట్లు వివరించారు.
మొదటి సదస్సుని హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి, తెలుగు శాఖ, అసోసియేట్ ప్రొఫెసర్ డా. దార్ల వెంకటేశ్వరరావు, రెండవ సదస్సుని ప్రముఖ  కవి. మేనేజింగ్ డైరెక్టర్ ,డిజిటల్ ప్లానెట్ టెక్నోసొల్యూషన్స్ బెంగుళూరు కు చెందిన డా.ఇక్బాచంద్, మూడవ సదస్పుని రచయిత, విమర్శకులు ప్రెసిడెంట్, లార్డ్ ఇన్సాస్టక్టర్ ఇండస్టీగ్రూప్ అధినేత పి. విక్టర్ విజయకుమార్ ,  నాల్గవ సదస్సు ,  ధర్మవరం ప్రభుత్వ డిగ్రీకళాశాల లో తెలుగు శాఖలో  అసిస్టెంట్ ప్రొఫెసర్  డా. షమీఉల్లా గార్ల ఆధ్యక్ష్యంలో జరిగింది. అంతర్జాలంలో అందుబాటులో ఉన్న ఈమాట, విహంగ, సారంగ, ఆంధ్రభారతి, వాకిలి, కౌముది తదితర అంతర్జాల పత్రికల గురించే కాకుండా, వికీపిడియన్ల కృషిని ప్రశంసిస్తూ కూడా కొన్ని పత్రాలను సమర్పించారు. అంతర్జాలంలో యూనికోడ్, డైనమిక్ ఫాంట్, ఇమేజెస్, పిడిఎఫ్. డైస్ మొదలైన ఫార్మేట్స్ రూపంలో అందుతున్న అంతర్జాల సాహిత్యం, భాషల గురించి చర్చించారు. ఇవే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు వాళ్ళు నిర్వహిస్తున్న పత్రికలను గురించి కూడా పత్రాలను సమర్పించారు.

ఈ సమావేశానికి మధ్యలో భోజనానంతరం ‘విహంగ సాహిత్యపత్రికవార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం’ జరిగింది. ఈకార్య క్రమానికి విహంగ సంపాదకురాలు డా. పుట్ల హేమలత అధ్యక్షత వహించారు. విహంగ అంతర్జాల పత్రిక నిర్వహణలో ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందిస్తున్న రచయిత్రులు, రచయితలకు ‘విహంగ పురస్కారాల’ను ప్రకటించారు. వీటిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, సాహిత్య పీఠం, బొమ్మారు పీఠాధిపతి ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు, ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం, విజయనగరం  శాఖ ప్రత్యేక అధికారి ఆచార్య జి. యోహాన్ బాబు, విహంగ సంపాదకురాలు డా.పుట్లహేమలత గార్ల చేతుల మీదుగా పురస్కారగ్రహీతలను సత్కరించారు.

సదస్సు  నిర్వహణలో ఎండ్లూరి మానస, ఎండ్లూరి మనోజ్ఞ, పెరుమాళ్ళ రవికుమార్, రాచర్ల గౌతమి, మల్లిపూడి వనజ,  జ్యోతిర్మయి తదితరుల సహకారం బాగుంది. సభలో కవయిత్రులు, రచయిత్రులు, రచయితలు  విజయభాను, డా. లక్ష్మి సుహాసిని, గుబ్బిట దుర్గాప్రసాద్, బొడ్డు మహేందర్, డా.మంజుశ్రీ, బాలిరెడ్డి, లలిత, మస్తాన్, రామకృష్ణ,  వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు లేవు: