"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

26 అక్టోబర్, 2015

‘‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’’- ఆవిష్కరణ, ప్రసంగాలు


ప్రముఖ కవయిత్రి, పరిశోధకురాలు డా.పుట్ల హేమలతగారి పరిశోధన గ్రంథం ‘‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’’ గ్రంథావిష్కరణ సభ
ది. 15 అక్టోబరు 2105  సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్, బొగ్గులకుంట, తిలక్ నగర్, హైదరాబాదులో జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి గారు విచ్చేసిన ఈ సభకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖకవి, పరిశోధకుడు ఆచార్య ఎన్. గోపిగారు అధ్యక్షత వహించారు.
 సభను ప్రముఖకవి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు స్వాగతం పలికారు. 
వక్తలుగా హైదరాబాదు విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా.దార్లవెంకటేశ్వరరావు, కంప్యూటర్ ఎరా మాసపత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ గార్లతో పాటు గ్రంథ రచయిత్రి డా. పుట్ల హేమలత గారు పాల్గొన్నారు.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ గారు సభకు వక్తలను పరిచయం చేసి వారందరినీ వేదికపైకి సాదరంగా ఆహ్వానించారు.
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి గారు వయోభారం మీద పడుతున్నప్పటికీ ఆత్మీయంగా సభలో ముఖ్యఅతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాను ఈ పుస్తకాన్ని అంతటినీ చదివాననీ ఒక్కమాట కూడా అర్థం కాలేదంటూనే అన్నీ గూగులమ్మ ద్వారా సేకరించి సమగ్రమైన పరిశోధన చేశారని డా. పుట్ల హేమలతగార్ని ప్రశంసించారు. పుస్తకం అనేక సాంకేతికాంశాలను వివరించే గ్రంథంగా ఉందని ఆయన పరోక్షంగా సూచించినట్లయ్యింది. పరిశోధకురాలకి చేదోడు వాదోడుగా నిలిచి ఆత్మస్థైర్యాన్ని నింపిన సహచరుడూ, ప్రాణవిభుడూ అయిన ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గార్ని కూడా అభినందించారు.  
సభాధ్యక్షత వహించిన ఆచార్య ఎన్. గోపీగారు పరిశోధన పత్రం రాసుకొచ్చినట్లు రాసుకొని మరీ మాట్లాడారు. దాని వల్ల సమయంతో పాటు, చెప్పాల్సిన అంశాల్ని సూటిగా చెప్పడానికి వీలవుతుంది. దీన్ని ప్రతి వక్తా అనుసరించాల్సిన పద్ధతి అనిపించేలా ఉంది. డా. పుట్ల హేమలత గారి పరిశోధన గ్రంథాన్ని తాను ఆమూలాగ్రం చదివాననీ చెప్పారు. తాను ఒకప్పుడు ఇంటర్నెట్ లో ఈ బుక్ గా చదువుకోవడమంటే చాలా కష్టమనుకునేవాణ్ణనీ, అయినా ముద్రితపుస్తకం చదువుకున్నంత సౌలభ్యం ఈ బుక్ కి ఉంటుందనుకోవడం లేదనుకుంటున్నానని తన అభిప్రాయాన్ని తెలిపారు.  కానీ ప్రపంచంతో వేగవంతంగా కలిసి పయనించడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం తప్పని సరిఅవుతుందన్నారు. తాను ఈ పరిశోధన పుస్తకం చదివిన తర్వాత తాను కూడా కంప్యూటర్ నేర్చుకోవాలనిపిస్తుందనీ, అంతర్జాలంలోవిస్తృతమైన సాహిత్యం లభిస్తుందని తెలిసిందని పరిశోధకురాలి కృషిని అభినందించారు. అంతర్జాలం వచ్చిన తర్వాత ‘గ్లోబల్ విలేజ్’ భావన పెరిగిందనీ, అయితే మనకున్న ‘వసుధైక కుటుంబం’ భావనకీ దీనికీ తేడా ఉందని పేర్కొన్నారు.  అంతర్జాలం వచ్చిన తర్వాత వచ్చిన ‘‘ప్రపంచమొక కుగ్రామం’’ అవుతుందనే దానిలో ఆర్థికాంశాలు, వ్యాపార ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయనీ, వసుధైకకుటుంభం భావనలో మానవతావిలువలున్నాయనీ రెండింటి మధ్య గల భేద సాదృశ్యాల్ని వివరించారు. అంతర్జాలంలో బ్లాగు, ఫేస్ బుక్, ఈ పత్రికల వంటివెన్నో ఉన్నాయని ఈ పరిశోధన ద్వారా తెలుగు భాషా, సాహిత్య ప్రపంచం తెలుసుకుంటుందన్నారు. దీనికి భాషాశాస్త్రంలోను, యంత్రానువాదంలోను విశేషమైన అనుభవం ఉన్న పరిశోధకుడు, భాషాశాస్త్రజ్ఞుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారి యోగ్యతాపత్రం లభించడమే పరిశోధన ప్రామాణికతను తెలియజేస్తుందని ప్రశంసించారు. ఈ రంగంలో విశేషమైన, నిరంతరం కృషి చేయడం ద్వారా అంతర్జాలంలో పరిశోధన చేయాలనుకునేవారికి డా.పుట్ల హేమలత ఒక ఆకరగ్రంథంగా మారే అవకాశం ఉందనీ, ఆ రకంగా కృషిచేయాలని ఆకాంక్షించారు.
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ, భాషాశాస్త్రశాఖాధ్యక్షుడు ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావుగారు మాట్లాడుతూ తెలుగు భాష విశ్వవ్యాప్తం కావాలనే జిజ్ఞాసతో యంత్రానువాదాన్ని చేపట్టామనీ, ప్రస్తుతం  తెలుగు భాష అస్తిత్వం ప్రశ్నార్థకమౌతుందనీ, ఈ పరిస్థితుల్లో ‘‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’’ పరిశోధన చేయడం సంతోషించదగిన కృషిగా అభినందించారు. కేవలం సైద్ధాంతిక పద్ధతిలో మాత్రమే కాకుండా అనువర్తిత విధానం ద్వారా ఈ పరిశోధన చేయడం మరింత అభినందించదగిన అంశమని ప్రశంసించారు. అంతర్జాలంలో ఉన్న బ్లాగులు, సోషల్ మీడియా, పత్రికలు మొదలైన వాటిని అన్నింటినీ ఈ పరిశోధనలో పేర్కొనడం నాకెంతగానో ఆశ్చర్యం కలిగించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాశ్చాత్యులు 90 శాతం మంది అంతర్జాలంలో తమ భాషను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితి మన తెలుగు భాష, సాహిత్యాలకు కూడా రావాల్సిన అవసరం ఉందని సూచించారు. తాను కూడా ఈ పరిశోధన గ్రంథానికి ముందుమాట రాశాననీ, అయితే ఈ పరిశోధకురాలు నా దగ్గరకు వచ్చినప్పుడు తొలిరోజుల్లో పెద్దగా పట్టించుకోకపోయినా, తర్వాత ఆమె అనేక సార్లు తనను సంప్రదించారని గుర్తుచేసుకున్నారు. పరిశోధనను చూసిన తర్వాత అంతర్జాలంలో ఇంత తెలుగు సాహిత్యం ఉందనే విషయం తనకే ఆశ్చర్యాన్ని కలిగించిందని చమత్కరించారు. చక్కని పరిశోధన చేసిన డా.పుట్ల హేమలతగార్ని అభినందిస్తున్నానని అన్నారు.
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ డా. దార్ల వెంకటేశ్వరరావుగారు మాట్లాడుతూ డా.పుట్ల హేమలతగారి ‘‘వెబ్ లో తెలుగు సాహిత్యం-తీరుతెన్నులు’’ పేరుతో పరిశోధన చేసి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి సమర్పించారు. అవార్డైన తర్వాత తన సిద్ధాంత గ్రంథాన్ని ‘‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’’ పేరుతో ప్రచురించారు. ఇంటర్నెట్ భాషా సాహిత్యాన్ని పరిశోధన చేసినందువల్ల దీన్ని కూడా ‘ఈ బుక్ గానే ఇంటర్నెట్ లో పెట్టాను చూసుకోండి’ అని అనకుండా ముద్రితరూపంలోకి తీసుకొచ్చినందుకు డా.హేమలతగార్కి శుభాకాంక్షలు తెలియజేశారు. ముద్రిత రూపంలోకి రాకముందు మూడు సార్లు ఈ బుక్ గా చూశాను. ప్రచురించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని ప్రశంసించారు.
తాను పరిశోధనాంశం తీసుకునేనాటికి తనకు తెలుగులో టైపు చేయడం కూడా తెలియదన్నారు. కానీ, నేడు ఇంటర్నెట్ లో తెలుగు భాషా సాహిత్యంలో ఏముందో అది అంతా ఇంచుమించుగా అన్నింటినీ పరిశోధనలో స్పర్శించారని అన్నారు. ఈ పరిశోధన గురించి తనను కూడా రాయమన్నారనీ అందువల్ల తానూ నాలుగు పేజీల్లో ‘అంతర్జాల పరిశోధనకు ప్రేరణనిచ్చే పరిశోధన’ పేరుతో అభిప్రాయాన్ని రాశానని తెలిపారు. ఈ పరిశోధన గ్రంథాన్ని చూస్తే ‘ఇంటర్నెట్ లో ఇంత భాషా పరమైన చర్చ జరిగిందా అనే ఆశ్చర్యం కలుగుతుంద’ని తెలుస్తుందన్నారు. విస్తృతమైన తెలుగు సాహిత్యం లభిస్తుందనీ ఈ పరిశోధన వల్ల స్ఫష్టమవుతుందనీ పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ఇంటర్నెట్ లో ఉన్న బ్లాగుల్లో, సోషల్ మీడియాలో ఉన్న సాహిత్యంతో పాటు పత్రికలు, ఈ పత్రికల్లో ఉన్న భాషా, సాహిత్యాలెన్నింటినో మనముందుంచే ప్రయత్నం చేశారు. అలాగని ఇక ఇంటర్నెట్ లో పరిశోధన చేయడానికి ఏమీ లేదనుకోవడానికి వీల్లేదనీ, ఒక ఈ పత్రిక ను తీసుకున్నా గొప్ప పరిశోధన చేయగలిగే వీలుందనీ, అలా ఏయే రంగాల్లో పరిశోధన చేయాలో ఈ పరిశోధన సూచిస్తూ ప్రేరణనిస్తుందని వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితే, ఇంటర్నెట్ లో సమకాలీన సాహిత్యాన్ని ప్రతిబింబించకుండా తప్పుదోవపట్టించే పత్రికలు కూడా ఉన్నాయన్నారు. ఒకవైపు కేవలం ముద్రిత పత్రికలు మరలా ఇంటర్నెట్ లో లభించేవిగా ఉంటూనే, మరో వైపు కేవలం ఇంటర్నెట్ లో మాత్రమే లభ్యమైయ్యే సాహిత్య పత్రికలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అలాంటి కృషి జరిగినప్పుడు మాత్రమే ఇంటర్నెట్ సాహిత్యానికి ప్రత్యేకత ఉంటుందని సూచించారు. వీటన్నంటినీ ఈ పరిశోధనలో  తన పరిశోధన పరిమితి, పరిధుల మేరకు పరిశీలించారని వివరించారు.  తన పుస్తకం ప్రచురిస్తూనే చివరి వరకూ పరిశోధన జిజ్ఞాసను ప్రదర్శిస్తూనే ఉన్నారనీ, అలా డా.రేమెళ్ళ అవధానుల గారి నుండి లభించిన సమాచారం మరింత ఆనందాన్ని కలింగించిందని పరిశోధకురాలు తనతో అన్నారని, అదే ఏ పరిశోధకునికైనా ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. 1975లోనే కంప్యూటర్ తెరపై తెలుగు అక్షరాలను రేమెళ్ళ అవధానులు గారు చూడగలిగిన విషయాన్ని తన పరిశోధనలో వెల్లడించారని అలా ఎన్నో విశేషాలు కలిగిన పరిశోధన పుస్తకంగా ఈ పుస్తకం గురించి వివరించారు.
కంప్యూటర్ ఎరా మాసపత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్ గారు మాట్లాడుతూ ఈ పుస్తకం రాసేటప్పుడు, ప్రచురించేటప్పుడు తీసుకున్న జాగ్రత్తలు తననెంతగానో ఆసక్తిని కలిగించాయనీ, పుస్తకాన్ని ప్రచురించేటప్పుడు తనకు కూడా కొన్ని అనుభవాలు తెలిసాయనీ, తొందరపడి, హడావిడిగా ప్రచురించకూడదని అర్థం చేసుకున్నానని అన్నారు. నిష్ణాతులైన వారిని కలిసి సమాచారాన్ని సేకరించుకొని, సమస్యను ధృవీకరించుకొని, దాన్ని విశ్లేషించడంలో పరిశోధకురాలి లోతైన పరిశీలన ప్రతి పుటలోను కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. తెలుగు భాష చచ్చిపోతుందని బాధ పడుతున్న తరుణంలో తెలుగు భాషను అంతర్జాలంలో సులభంగా వాడ్డానికి తాను కూడా రోజుకి ఏడు నుండి ఎనిమిది గంటల పాటు శ్రమించానని, అలాగే అనేకమంది చేసిన కృషి ఫలితంగా సోషల్ మీడియాలో తెలుగుభాషలోనే సాహిత్యాన్ని రాస్తున్నారని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు బ్లాగుల్లో రాసేవాళ్ళు నేడు ఫేస్ బుక్ లో తమ అభిప్రాయాల్ని అవి ఎలాంటివైనా స్వేచ్ఛగా తెలుగులో వ్యక్తీకరించుకోగలుగుతున్నారు. ఇలా అంతర్జాలంలో వస్తున్న తెలుగు భాషా సాహిత్యాల్ని చూస్తున్నప్పుడు  తెలుగు ఓ పది తరాల పాటు సజీవంగా నిలుస్తుందనే విశ్వాసం కలుగుతోంది.  అలాంటి ‘‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’’ గురించి చేసిన పరిశోధన గ్రంథావిష్కరణ సభలో తాను పాల్గొనడం తనకెంతగానో ఆనందం కలిగిస్తుందని అన్నారు.
పరిశోధకురాలు డా.పుట్ల హేమలతగారు మాట్లాడుతూ తన పరిశోధన నేపథ్యాన్ని వివరించారు. తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొండ మనదగ్గరకు రాకపోతే కొండదగ్గరకే మనం వెళ్ళాలని ఒక సామెత ఉందని, అలా తామే హైదరాబాదు వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ జరుపుతున్నామని చెప్పారు. తమ పరిశోధనలో పూర్తి సహకారాన్ని అందించిన తన సహచరుడు, కవి, అధ్యాపకుడు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికీ, మొదటి నుండీ చివరి వరకూ సాంకేతికంగా సహకరించిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా.దార్ల వెంకటేశ్వరరావు, నల్లమోతు శ్రీధర్ గార్ల కు ధన్యవాదాలు తెలిపారు. తనకు హైదరాబాదులో కుటుంబసభ్యులుగా అత్యంత ఆత్మీయతా సహకారాల్ని అందించిన ఆచార్య బి.రాజశేఖర్, బెల్లంకొండ రవికాంత్, వారి కుటుంబసభ్యులను ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. పరిశోధన ప్రారంభించింది మొదలు, పూర్తయ్యే వరకూ ఒక్కకొత్తవిషయం దొరికినా దాన్ని తన పరిశోధనలో పేర్కొనడానికి నిరంతరం ప్రయత్నించానని వివరించారు.  డా.రేమెళ్ళ అవధాని గారి దగ్గర కొన్ని కొత్తవిషయాలు లభించాయనీ, వాటిని కూడా పరిశోధనలో చేర్చానని ప్రకటించారు. తన సభకు విచ్చేసిన బ్లాగర్లు, ఫేస్ బుక్ ఫ్రండ్స్, రచయిత్రులు, కుటుంబసభ్యులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు, కవులు, పరిశోధకులు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

సభానంతరం కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, రచయిత్రులు పరిశోధకురాలు డా.పుట్ల హేమలతగార్ని ఘనంగా సన్మానించారు.



2 కామెంట్‌లు:

Augustus.Augustya చెప్పారు...

ఈ రోజు పుస్తకం చదివాను.
ఎన్నో వాటికి ఒక నాంది,
ఒక మలుపు.
అభినందనీయం,
శుభాకాంక్షలు.

పరుమల భరత్ చెప్పారు...

Sir I want to read this books.where it is available.please share details.