"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

28 జులై, 2015

దళితుల్ని ఆలోచింపజేసిన చైతన్య స్ఫూర్తి ‘కారంచేడు సంఘటన’. – డా. దార్ల వెంకటేశ్వరరావు



(దళిత్ స్టూడెంట్స్ యూనియన్ (DSU) వారి ఆధ్వర్యంలో ది17.జూలై 2015 న సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నార్త్ క్యాంపస్, షాపింగ్ కాంప్లెక్స్ లో ‘కారంచేడు ముప్పైఏళ్ళ సంస్మరణ సభ’ ను నిర్వహించారు. అదేరోజు దళితకవి డా.నాగప్పగారి సుందర్రాజు మరణించిన రోజుకావడంతో ఆయన వర్ధంతి సభను కూడా నిర్వహించారు. ఈ సభలో డా.దార్ల వెంకటేశ్వరరావు, డా. జి.నాగరాజు, డా.శ్రీపతిరాముడు, డా.ఈశ్వర్, డి.ఎస్.యు.నాయకులు గిన్నారపు ఆదినారాయణ, దామెర సుమన్, ఈశ్వర్, ఉదయభాను, ముప్పిడి సత్యనారాయణ, దేవయ్య, వెంకటాద్రి, సురేశ్, ప్రవీణ్, నవీన్, వేణు తదితరులు హజరయ్యారు. అదేవిధంగా వివి యూనియన్ లకు అతీతంగా అనేకమంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని ఘనంగా కారంచేడు దళితులకు నివాళులర్పించారు.ఈ సంస్మరణసభలో మా గురువుగారు ప్రముఖ విమర్శకులు, దళితకవి, తెలుగుశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు గారి ప్రసంగం నాకెంతో స్ఫుర్తిదాయకంగా అనిపించింది. ఈ ప్రసంగం దళితులను చైతన్యవంతం చేసే విధంగా ఉందనిపించింది. ఆ ప్రసంగం వారి మాటల్లో వింటేనే బాగుంటుందనిదనిపించింది. అందువల్ల దాన్ని మీకు కూడా అందిస్తున్నాను.... -బడిగె ఉమేశ్, పరిశోధక విద్యార్థి, తెలుగుశాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి)
కారంచేడు సంఘటన జరిగిన 30 ఏళ్ళ సందర్భంగా జరిగిన దళిత మృత వీరుల సంస్మరణ సభ పోస్టర్ విడుదల సందర్భంగా మాట్లాడుతున్న డా. దార్ల వెంకటేశ్వరరావు


‘‘ మిత్రులారా...ఏ ప్రభుత్వం హయాంలో అయితే 1985 జూలై 17న కారంచేడు సంఘటన జరిగిందో, మరలా అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ధైర్యంతో ఈ పని చేస్తున్న (ఈ సభను నిర్వహిస్తున్న ) దళిత్ స్టూడెంట్ యూనియన్ కి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
కారంచేడు సంఘటన కంటే ముందు కూడా దళితులపై దాడులు జరిగాయి. వాటిలో 1968 లో కంచికచెర్ల కోటేశు సంఘటన ఒకటి. ఒక మాదిగ యువకుడు  ఒక దళితేతర ( కమ్మ కులస్థురాలు) అమ్మాయిని ప్రేమించినందుకు దాన్ని సహించలేని ఆ వర్గం వాళ్ళు  అతన్ని సజీవంగా దహనం చేశారు. దాన్ని పత్రికల ద్వారా కూడా తెలిసేలా చేసి భయాన్ని వ్యాపింపజేసే ప్రయత్నం చేశారు. ఆ కేసు మాఫీ అయిపోయింది.  ఆ తర్వాత 1985 లో కారంచేడు సంఘటన జరిగింది. అది చరిత్రలో అత్యంత భయంకరమైన సంఘటన. సుమారు ఆరుగురు దళితుల్ని భౌతికంగా చంపారు. మానసికంగా మరెంతమందినో చంపాలనుకున్నారు. మరోసారి 1990 లో చుండూరు సంఘటన జరిగింది. నిన్న గాక మొన్న లక్షీంపేట సంఘటన.... ఈ సంఘటనల నేపథ్యాల్నీ, ఆ పరిణామాల్నీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, విద్యావంతులవుతున్న దళితులు... ఆ దళితుల్లో వస్తున్న చైతన్యాన్ని దళితేతరులు నీరు గార్చే కుట్రలో ఫలితంగానే ఈ సంఘటనల్నీ ప్రధానంగా కారంచేడు సంఘటనీ అర్థంచేసుకోవాలి.
మరి కారంచేడు సంఘటన దళితుల్ని భౌతికంగా చంపినా, మానసికంగా దళితుల్ని ఏకంచేసింది. కొత్త చైతన్యానికి ఊపిరులూదింది. ఆ సంఘటన జరిగి నేటికి 30 ఏళ్ళ జరిగింది. ఆ చైతన్యం కొనసాగుతుందా? ఒక వేళ కొనసాగకపోతే ఈ చైతన్యాన్ని రగుల్గోలిపేది ఎవరు? ఎవరో కాదు... చదువుకుంటున్నటువంటి దళిత విద్యార్థులే.
 డా.బాబాసాహేబ్ అంబేద్కర్ వంటి మహనుభావులెందరో ఇచ్చినటువంటి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాల్సి వాళ్ళు విద్యార్థినీ, విద్యార్థులైన మనమే. అలాంటి స్ఫూర్తిని మరోసారి నింపుకోవడంలో  భాగంగానే ఈ సంస్మరణ కార్యక్రమం జరుగుతుందను కొంటున్నాను.
అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకి తీసుకెళ్తూ, దీన్ని కొనసాగించడం కోసం అనేక మంది ప్రాణాలర్పించారు. అలా అర్పిచినటువంటి వారిలో  నాగప్పగారి సుందర్రాజు ఒకరు. ఈయన (హైదరాబాదు విశ్వవిద్యాలయంలో) ఇక్కడే ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి., చేశారు. డా.బి.ఆర్. అంబేద్కర్ స్టూడెంట్స్ అసోషియేషన్ ప్రారంభంలోగాని, దళిత సాహిత్య వేదిక ప్రారంభంలోగాని ఆయన చేసినటువంటి కృషి అంత ఇంత కాదు. ‘‘గుండెడప్పు’’ అనే ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారాయన. పట్టేటిరాజశేఖర్, నాగప్పగారి సుందర్రాజు వీళ్లిద్దరి సంపాదకత్వంలో 1996 లో ఒక పుస్తకం (‘‘గుండెడప్పు’’) తీసుకొచ్చారు. దాని తర్వాత తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యనికి ఒక విశిష్టమైనటు వంటి స్థానం ఏర్పడింది. దాన్ని నేటికి కొనసాగిస్తున్నారు మన విద్యార్థిని విద్యార్థులు.
 1996 తర్వాత నుండి నేటి వరకా క్యాంపస్ లో జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినట్లయితే... చాలా మంది విద్యార్థినీ, విద్యార్థులు చైతన్యమైనటువంటి వాళ్ళంతా వివిధ యూనియన్లుగా ముందుకు వచ్చారు. వీళ్ళంతా ఆ యా సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురావడమే కాకుండా కొన్ని నాయకత్వతరాల్ని తయారు చేయడమనేది నిజమైనటువంటి దళిత స్ఫూర్తి అనీ, దళితుల ఆత్మ గౌరవాన్నీ ముందుకు తీసుకురావడంలో భాగమేనని నేను భావిస్తున్నాను. అలా ముందుకు తీసుకొనిరావడంలో భాగంగానే నాగప్పగారి సుందర్రాజు ఈ యూనివర్సిటీలో అనేక మందికి ఆదర్శంగా నిలిచాడు. 

విద్యార్థిగా ఉన్నప్పుడే నాగప్పగారి సుందర్రాజు చేసిన కృషిని మనం జాగ్రత్తగా అర్థంచేసుకున్నట్లైతే మనం ఆయనకు నిజంగా రుణపడి ఉన్నాం. ఆయన ఒక ప్రణాళికను రచించినట్లే మనకి ‘‘గుండె డప్పు’ ’అనే కవిత సంపుటిని గానీ, ఆయన చేసినటువంటి పరిశోధనలుగాని, ఆయన తన కులాన్ని ప్రకటించుకోవడంలో గానీ, లేకపోతే ఆ భావజాలాన్ని (అంబేద్కర్ భావజాలాన్ని) ముందుకు తీసికెళ్ళడంలో గానీ ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు; తన ఆత్మగౌరవాన్నీ తాకట్టుపెట్టలేదు. వ్యక్తిగతమైన స్వార్థానికి యూనియన్స్ ని వాడుకోలేద. మరొక విషయమేమిటంటే డా.బాబాసాహేబ్ పయనించినటువంటి ప్రజాస్వామిక పొరాటపంథానే ఆయన ఎన్నుకోవడం ద్వారా అనేక మంది విద్యార్థినీ విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నించాడు. అటువంటి వ్యక్తి రెండువేల సంవత్సరంలో సరిగ్గా కారంచేడు లో జరిగిన సంఘటన రోజే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. అయితే దానికి అనేక కారణాలున్నాయనీ, వాటిని చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ గుర్తించాలి.
 నిజానికి ఈ రోజు దళిత విద్యార్థి సంఘం (DSU) వాళ్ళు మిగతా స్టూడెంట్ యూనియన్స్ నాయకులు, విద్యార్థులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమంటే నిజంగా ఒక మహోన్నతమైన దళిత చైతన్యాన్ని ముందుకు తీసుకోరావడానికీ, మనువాదాన్ని  ఎదుర్కోవడానికి మీరందరూ సమైక్యతతో అంకిత భావంతో ఇక్కడకు వచ్చారని నేను భావిస్తున్నాను. అందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.

 ఇటువంటి సంఘటనలు జరక్కుండా ఉండాలంటే ఈ చైతన్యం మరింత పెరగాల్సిన అవసరముందని భావిస్తూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్యు వెరీమచ్...జైభీమ్.’’


( ప్రసంగాన్నిలేఖన రూపంలో రాసిన వారు బడిగె ఉమేశ్, రీసెర్చ్ స్కాలర్, తెలుగుశాఖ, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటి, హైదరాబాదు. ఫోను: 09494815854)

కామెంట్‌లు లేవు: