ఉదయం 6 గంటలప్రాంతం...
తేది:
28-8-2014,
రోజూ
వెళ్తున్నట్టే, ఈ రోజూ పొద్దున్నే వాకింగ్ కి బయలుదేరాను. మా ఇంటి దగ్గర నుండి గ్రౌండ్ కి వెళ్ళేటప్పుడు రోడ్డుమీదకొస్తుంటే, ఒక
మూలనెవరో నాకు సైగలు చేస్తున్నట్లనిపించింది. చుట్టూ చూశాను. నా దృష్టి ఆ
సైగలుచేసే వైపుగా పోయింది. అక్కడున్నది ఆడో,
మగో తెలియదు. కానీ, అలా సైగలు చేసేవాళ్ళు ‘మనిషి’ అని మాత్రం చెప్పగలం. రోడ్లన్నీ
నిర్మానుష్యంగా ఉన్నాయి. అక్కడ ఆ ‘మనిషి’ తప్ప మరెవరూ కనిపించడంలేదు. నోటితో ఏవో
సైగలు చేస్తున్నాడు. మాటలు సరిగ్గా రావడంలేదు. ఆ మాట్లేడే భాషకూడా తెలుగులా లేదు. తనబలాన్నంతా
ఒకచోటకి చేర్చి చేత్తో సైగచేసినట్లనిపించింది. ఆ సైగలు నాకు ‘చాయ్ కావాలి’ అన్నట్లనిపించింది.
‘‘ఇంతపొద్దున్నే
ఎవరిస్తారు? ఇవిగో కావాలంటే డబ్బులిస్తాను. తెచ్చుకో’’ అంటూ దగ్గరకెళ్ళాను.
కదల్లేకుండా, మాట్లాడ్దానికి గానీ, కనీసం సైగలు చేయడానికి కూడా ఓపికలేదుకదా అనేదే
స్ఫురించలేదు. అప్పటికే అతని చేతిలో పదిరూపాయలు కనిపిస్తున్నాయి. అతను అడుక్కొనేవాడో కాదో అనిపించింది.
దగ్గరకెళితే వాసనొచ్చేస్తుంది. మలమూత్రాలతో నిండిపోయాడు. ఈగలు ముసురుతున్నాయి.
చేతులు రక్తం కారుతున్నాయి. స్నానం చేసి ఎన్నాళ్ళయ్యిందో. తలంతా జడలు
కట్టికిపోయినట్టుంది.
దగ్గర్లో
ఎక్కడా ‘టీ’ కొట్టుల్లేవు. ఇప్పుడెవరు తెచ్చిస్తారు... అనుకుంటూ వెళ్ళిపోయాను
కానీ, మనసంతా ఏదో బాధగా అనిపిస్తోంది.
రెండు, మూడు వందల మీటర్లు వెళ్ళిన తర్వాత ఛాయ్ దుకాణం కనపించింది. ఒక ఛాయ్
తీసుకున్నాను. దాన్ని తీసుకొని వెనక్కి వచ్చి
అతనికివ్వాలనిపించింది. అలాగే చేశాను.
ఇంతలో అతను
కూర్చున్న ఇంటి యజమానురాలు వచ్చింది. అతనికి టీ ఇవ్వొద్దంటుంది. నేను ఆశ్చర్యంగా
ఎందుకన్నట్లు చూస్తున్నాను. ఆమే మాట్లాడింది. ‘‘మీకే... టీలు, టిఫిన్లు, భోజనాలు
పెట్టేసి వెళ్ళిపోతారు. వాడు తినేసి ‘ అన్నీ’ అక్కడే పోసేస్తాడు....’’ ఇంకా ఏదో
అంటూనే ఉంది. నాకేమి చేయాలో అర్థం కాలేదు. ఆమె ఏమన్నా, తెచ్చిన టీ అతని చేతిలో
పెట్టేసి వెళ్ళిపోయాను.***
వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు
మళ్ళీ అతని పరిస్థితి ఎలా ఉందో అని చూడాలనిపించింది. నా కళ్ళన్నీ అతన్ని వెతికాయి.
అప్పటికే వర్షం వస్తోంది. దగ్గర్లో ఎక్కడా కనిపించలేదు. ‘ఏమయ్యాడో’ అనుకుంటూ
వెళ్ళిపోబోతుంటే ఒక చెత్తకుప్పదగ్గర అతను మెదులుతూ కనిపించాడు. దగ్గరకు వెళ్ళాను. కదల్లేకపోతున్నాడు. అతని
దగ్గరకు వెళ్ళి చూస్తుంటే జనం పోగయ్యారు. దూరంగా అపార్ట్ మెంటుల నుండి మరికొంతమంది
చూస్తున్నారు. ఆ పక్కనే కొలువైన పూజకు సిద్దంగా మండపంలో వినాయకుడుతో సహా అందరూ మౌనంగానే
ఉన్నారు. నాకేమి చేయాలో తోచలేదు.నేనూ మౌనంగానే ఆ
ప్రాంతాన్నంతా నా సెల్ తో కొన్ని ఫోటోలు తీసుకొని నేనూ వెళ్ళిపోయాను. రాత్రంతా నిద్దరపట్టలేదు. ఏం చేయాలి? చేతిలో సెల్ ఫోన్... కేవలం ఫోటోలు తీసుకోవడానికే ఉపయోగమా? మనవాళ్ళకోసం కాల్ చేసుకోవడానికేనా? .... ఆలోచించాలి?
***
మర్నాడు సుమారు పది పదకొండు గంటల ప్రాంతం...
‘అతని’ దగ్గర ఏదో హడావిడి మొదలైంది! ఏం
జరుగుతుందని నేనూ నా కారు ఆపి వాళ్ల దగ్గరకెళ్లాను.
ఒక అంబులెన్స్, ఒక కాంపౌండర్, కొన్ని ఫస్ట
ఎయిడ్ సామాన్లు, ఇద్దరు కానిస్టేబుల్స్....చుట్టూ ఉన్నవాళ్ళని కానిస్టేబుల్స్
పిలిచారు.అతనెవరో
వాళ్ళు తమకి తెలియదన్నారు. కాంపౌండర్ సాయి ముందు అతన్ని ఆ గొయ్యి నుండి
తియ్యాలన్నాడు. స్నానం చెయ్యించి, ఫస్ట్ ఎయిడ్ చెయ్యాలని అక్కడ చేరినవాళ్ళతో
చెప్పాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఒకాయన బకెట్ ఇచ్చాడు. కానిస్టేబుల్ ముకుందం నీళ్ళు
పట్టుకొచ్చాడు.మరో
కానిస్టేబుల్ రవి ‘అతన్ని‘ పైకి లేపి పట్టుకున్నాడు.సాయి
నీళ్ళేసి కడిగాడు. చుట్టుపక్కల ఉన్న అపార్ట్ మెంటులో మరికొంతమంది కదిలారు. ఒకరు ఒక
పాత చొక్కా, మరొకరు ఒక పాత లుంగీ, ఇంకొకరు పాత ఫ్యాంటు పట్టుకొచ్చారు....ఇలా
‘అతన్ని’ రక్షించారు.
అంబులెన్స్
వెళ్ళిపోయింది. ‘అతని’కి అంబులెన్స్ ఉపయోగపడింది. కానిస్టేబుల్స్ సహకరించారు.
వాళ్ళంతా వచ్చాక చాలామందిలో కదలికా వచ్చింది. మండపంలో వినాయకుడికి
పూజ మొదలైంది!
పూజ మొదలైంది!
థాంక్స్ టు 108.
థాంక్స్ టు పోలీస్.
థాంక్స్ టు మానవత్వం!
(ఈ సంఘటన శేరిలింగంపల్లి, హైదరాబాదు మెయిన్ రోడ్డు దగ్గరే జరిగింది. ఇలాంటి సంఘటనలింకెన్ని జరుగుతున్నాయో....!)
1 కామెంట్:
something to think
కామెంట్‌ను పోస్ట్ చేయండి