Saturday, November 30, 2013

డా.దార్లకు తెలుగు‘వర్సిటీ కీర్తి పురస్కారం ప్రదానం‘తెలుగు సాహిత్య విమర్శ’ రంగంలో చేసిన విశిష్టమైన కృషి చేసిన వారికి ప్రతి ఏడాదీ ఇచ్చే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తిపురస్కారాన్ని 2012 సంవత్సరానికి గాను ప్రముఖ విమర్శకుడు, కవి హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో అసిస్టెంటు ప్రొఫెసర్ డా.దార్ల వెంకటేశ్వరరావు కి ప్రకటించారు. 2013 నవంబరు 29న హైదరాబాదులోని శ్రీనందమూరి తారకరామారావు కళావేదికపై దుశ్శాలువ, వెయ్యినూటపదహారు రూపాయల నగదుతో డా.దార్ల వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు. , ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజీవ్ యువకిరణాలు ప్రోగ్రామ్ చైర్మన్ ఆచార్య కె.సి.రెడ్డి ఈ  పురస్కారాన్ని ప్రదానం చేశారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డిఆంధ్రప్రదేశ్ పూర్వ సాంస్కృతిక శాఖ సలహాదారు  డా.కె.వి.రమణాచారి, వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం, డా. జె. చెన్నయ్య తదితరులు ఈ పురస్కార ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఇతర వివిధ రంగాల్లో విశిష్టమైన కృషి చేసిన మరో 31 మందికి కూడా డా. దార్ల వెంకటేశ్వరరావుతో పాటు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారాలతో సత్కరించారు.
P1030857.JPG
డా. దార్ల వెంకటేశ్వరరావు కవిత్వం, పరిశోధన, విమర్శ రంగాలకు సంబంధించి ఇప్పటి వరకూ సుమారు పదకొండు పుస్తకాలను, 45 పరిశోధన పత్రాలను రాసి, తెలుగు సాహిత్య విమర్శలో తనదైన ముద్రవేయగలిగారు. పునర్మూల్యాంకన విమర్శ, మాదిగ సాహిత్య విమర్శ, బహుజన సాహిత్య విమర్శలో  డా.దార్ల వెంకటేశ్వరరావు చేసిన ప్రతిపాదనలకు సమకాలీన విమర్శకుల ప్రశంసలు లభించాయి. సృజనాత్మక రచనలు చేయడం ఎలా? (2005), సాహితీ సులోచనం (2006), దళితసాహిత్యం- మాదిగదృక్పథం (2008), వీచిక 2009), పునర్మూల్యాంకనం (2010), బహుజన సాహిత్య దృక్పథం (2012) పుస్తకాలు ప్రదానంగా విమర్శకు సంబంధించినవి.  
ఇప్పటికే, భారతీయ దళితసాహిత్య అకాడమీ ( న్యూఢిల్లీ) వారి డా.అంబేద్కర్ ఫెలోషిప్ తో పాటు వివిధ సంస్థలనుండి పలు పురస్కారాలను అందుకున్న డా. దార్ల వెంకటేశ్వరరావుని పలువురు అభినందించారు.No comments: