"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

04 November, 2013

తప్పుదారిలో పోతే త్యాగయ్యలూ చేరతారు



(సమాంతర సాహిత్యం పై స్పందన)
 - ఘట్టమరాజు

సాహిత్య చరిత్రలో సమాంతర సృజన' వ్యాసకర్త లక్ష్మణ చక్రవర్తి ఎత్తుగడ స్వాగతార్హమే, అభిలషణీయమే. కాని వ్యాస ఆదిమధ్యాంతాల్లోనూ తీవ్రమైన గందరగోళానికి గురవ్వడమే శోచనీయం. ఆయన Subaltern Study అన్న పరికల్పనకు సమానార్థకంగా వాడిన 'సమాంతర సాహిత్యం' అన్న మాటే తప్పు. వ్యాసకర్త వ్యాస ప్రారంభంలో ఇచ్చిన ఇంగ్లీషు నిర్వచనాన్ని అవగాహన చేసుకోవడంలోనే పప్పులో కాలు వేశారు. Subaltern Study  సాహిత్యానికే పరిమితమైన అధ్యయనం కాదు. చరిత్ర, సమాజశాస్త్రం, నృతత్వశాస్త్రం, ఇంకా ఎన్నో శాస్త్రాల సమాహారం. పైగా ఈ ప్రత్యేక అధ్యయనంలో సాహిత్యానికంటే సామాజిక, సాంస్కృతిక పరిశీలనకే పెద్దపీట అన్న సంగతి మరువరానిది.
ఆస్థాన సాహిత్యానికీ, సంస్కృతికీ పూర్తిగా భిన్నమైన దేశ కాల పరిస్థితుల్ని ప్రతిఫలింపచేసే శిష్టేతరమైన, ఆస్థానేతరమైన ఆటవిక, అట్టడుగు వర్గాల ప్రజలు అలవోకగా సృష్టించిన సాహిత్యాన్నీ, వాళ్ల సాంఘిక, ధార్మిక సంప్రదాయాల్నీ తలస్పర్శిగా పరిశీలించే ప్రత్యేక అధ్యయనాన్ని Subaltern Study  అంటారు. మల్లంపల్లి సోమశేఖరశర్మ జానపద వాఙ్మయాన్ని అనాదృత వాఙ్మయ మన్నారు. ఆ పదాన్ని వాడుకుంటే Subaltern Study  అన్న పరికల్పనకు 'అనాదృత సంస్కృతి అధ్యయనం' అనడం సబబు అనుకుంటాను. లక్ష్మణ చక్రవర్తి వాడిన 'సమాంతర సాహిత్యం' అనే మాట Subaltern Study లోని నిహితార్థాన్నీ, లోతుపాతుల్నీ పిసరంత కూడా తడమలేదు. అస్తు. లక్ష్మణ చక్రవర్తి ఇలా అన్నారు: 'ప్రధాన సాహిత్య విభాగానికి దగ్గరగా అదే పద్ధతిలో విస్తృతంగా సృష్టించబడుతూ ఎక్కువ ఆదరణకు నోచుకోని సాహిత్యాన్ని సమాంతర సాహిత్యం అనవచ్చు. ప్రధాన సాహిత్యానికి సమీపంగా సృజింపబడుతున్న ఉపసాహిత్యం అనవచ్చు.'
ఈ అనాదృత సంస్కృతి అధ్యయనం (Subaltern Study) ప్రధాన సాహిత్యం దరీదాపుల్లో కూడా వుండదు. 'అదే పద్ధతిలో' -మార్గ పద్ధతిలో అసలే వుండదు. విస్తృతంగానేమో సృష్టించబడుతుంది. కాని 'ఎక్కువ ఆదరణకు' కాదు కదా అసలు ఆదరణకే -అంటే శిష్టుల గౌరవాదరాలకు పిసరంత కూడా నోచుకోదు. అలాంటప్పుడు ఈ సాహిత్యం ఎలా 'సమాంతరం' (Parallel)సమాంతర సాహిత్యం (Parallel Literature) Subaltern Study తో పొంతన లేని పరికల్పన. కెకెఆర్ ఎంతో లోచూపు ప్రసరించిన ఆస్థానేతర సాహిత్యం సమాంతర సాహిత్యం అవుతుంది కాని అది అనాదృత సంస్కృతి అధ్యయనానికి ఆమడల దూరమైనదని అవగాహన చేసుకోవాలి. లక్ష్మణ చక్రవర్తి కె.కె.రంగనాథాచార్యులు ప్రత్యేకంగా పరిశీలించిన ఆస్థానేతర సాహిత్యాన్ని అవగాహన చేసుకోవడంలో తికమకపడ్డారు. జి.వి.సుబ్రహ్మణం గారి 'సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు' శిష్యకోటిలో చాలా మందిని తప్పుదారి పట్టించింది. లక్ష్మణ చక్రవర్తి అలా తప్పుదారిలో పయనించిన వాళ్లల్లో ఒకరు కావడం దురదృష్టకరం.
'దేశి రచనలను ఆ కాలంలో సమాంతర సాహిత్యంగా అర్థం చేసుకోవచ్చు. నిబద్ధ దేశిగా వెలువడ్డ సాహిత్యానికి ఆదరణ లభించడంతో పద కవితలు, జానపద వాఙ్మయం ఆనాడు సమాంతర సాహిత్య రూపాన్ని పొందాయి' అని సెలవిచ్చారు లక్ష్మణ చక్రవర్తి. 'తెలుగులో దేశి రచనలు' అంటే -ముఖ్యంగా పాలకురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, నన్నెచోడుని 'కుమార సంభవం' ఇత్యాదులు ఆస్థానేతర కవిత్వమైనా, నన్నయ మార్గసంప్రదాయానికి భిన్నమైనా సమాజంలోని కొన్ని వర్గాలు తలకెత్తుకొన్నాయి. కాని పద కవితలు- అన్నమాచార్యుల సంకీర్తనలు, క్షేత్రయ్య పదాలు, సారంగపాణి పదాలు, భక్తరామదాసు కీర్తనలు - ఇవి రాజాశ్రయం ఆశించని అగ్రవర్ణ కవుల రచనలే. వీటిని మనం Subaltern Study పరిధిలోకి తీసుకొనే రాకూడదు. ఆస్థానేతర కవిత్వం అంటే ఎలాంటి అభ్యంతరముండదు. ఇలా లక్ష్మణ చక్రవర్తి పంథాలో నడుస్తూ పోతే భక్త కవులైన పోతన, త్యాగయ్యలు కూడా Subaltern Study
- అనాదృత సంస్కృతి అధ్యయన కేంద్రంలోకి చేరే ఘోరప్రమాదముంది. తస్మాత్ జాగ్రత! మరి వూరూ పేరూ, నోరూ వాయీ, దిక్కూ దివాణం లేని బయనీలు, పిచ్చుకుంట్లు, వీరముష్టులు, బుడగ జంగాలు, శారదకాండ్రు ఏ కోవకు చెందాలి. అనాదృత సంస్కృతి అధ్యయనం శ్రేణికి అసలుసిసలైన హక్కుదారులు వీళ్లే.
సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి గురువర్యులు జి.వి.సుబ్రహ్మణ్యం తికమక మకతిక బాటలోనే పయనిస్తూ ఇలా అనడం ఘనఘోర దుస్సాహసానికి నిదర్శనం: 'ఆధునిక యుగంలో 1990ల తర్వాత నిరాదరణకు గురైన సాహిత్యం సమాంతర సాహిత్యం అన్న అర్థం ఇవ్వడం కంటే నా దృష్టి కోణంతో సాహిత్యాన్ని పరిశీలించడం 'సమాంతర సాహిత్యం' అవుతుందని చెప్పడానికి సాహసించడం కనిపిస్తుంది.' శాంతమ్ పాపమ్! అయితే అనాదృత సంస్కృతి అధ్యయనం నేటి అవసరమనే లక్ష్మణ చక్రవర్తుల వారి అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. ఈ 'బహుళాంధ్రోక్తిమయ ప్రపంచం'లోని అట్టడుగు ప్రజల సంస్కృతీ చరిత్రను నిర్మించే మహత్సంకల్పాన్ని తలకెత్తుకొని, నెరవేర్చడానికి నడుం బిగించాలి మన విద్వాంసులు. విస్తృతమైన క్షేత్రపర్యటన, లోతైన అధ్యయనం, రాగద్వేషాతీతమైన ముక్తమనస్సు, కార్యదీక్షా తత్పరత వున్న పండితులు ఈ వీరతాంబూలాన్ని స్వీకరించాలి.

- ఘట్టమరాజు
099640 82076

04-11-2013 07:18 AM



04-11-2013 07:18 AM

( 4-11-2013 ఆంధ్రజ్యోతి సౌజన్యంతో...)
................


No comments: