"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

31 జులై, 2013

దళితోద్యమస్ఫూర్తి డా. కత్తి పద్మారావు


బహుజన సమాజంకోసం అహర్నిశలు శ్రమిం చిన ప్రముఖుల్లో డా. కత్తిపద్మారావు ఒకరు. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఉద్యమకారు డిగా అడుగువేసి, దళిత దార్శనికుడుగా రచనలు చేసి, చివరికి సామాజికంగా వివక్షకు గురవుతున్న వారందరికీ ఆనందాన్ని కలిగించే మానవతావాద పతాకను ఎగురవేసిన వ్యక్తి. నిజానికిది షష్ఠిపూర్తిసందర్భంగా ఆయన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని, ఉద్యమాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నసందర్భమైనప్పటికీ- దళితుల కోసమే తన జీవితాన్నంతటినీ త్యాగం చేయడానికి సిద్ధపడేవాళ్ళు కూడా ఉంటారని ఆయన జీవనప్రస్థా నాన్ని గమనించిన వాళ్ళకి అనిపిస్తుంది. పద్మారావు గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర్లోని ఈతేరులో 1953 జూలై 27న జానకమ్మ, సుబ్బారావు దంపతులకు ప్రథమ పుత్రుడుగా జన్మించారు. 1958-1969 వరకు ఈతేరులోని చీరాల ప్రాథమిక పాఠశాలలో చదివారు. చిన్ననాటి నుండే ఒక ఆర్గనైజర్‌గా, వక్తగా, కళాకారుడిగా తన జీవనప్రస్థానాన్ని మొదలు పెట్టారు.

తెలుగు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పొన్నూరులోని శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలో చేరారు. అక్కడే కొండవీటి వేంకటకవి ప్రభావం పడటం వల్ల సంస్కృతాంధ్రకావ్యాల్ని కంఠస్థం పట్టేవారు. అలా కంఠస్థం పట్టిన శ్లోకాలు, పద్యాలు తర్వాత కాలంలో ఆయన గొప్ప వక్తగా పేరు ప్రఖ్యాతులు పొందడానికీ, తన వాదనను సమర్ధవం తంగా వినిపించడానికి ఉపయోగించుకుంటున్నారు. తాను చదివిన కళాశాల్లోనే1975లో తెలుగు లెక్చరర్‌గా ఎంపికయ్యారు. తర్వాత కొన్నాళ్ళకు హేతు వాదం పత్రికకు గౌరవ సంపాదకులుగా వ్యవహరించారు. కొన్నాళ్ళు హేతువాద సంఘానికి ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన పద్మారావు, 1985లో జరిగిన కారంచేడు సంఘటనతో ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభను స్థాపించారు. తర్వాత 1986లో బహుజన సమాజ్‌ పార్టీలో చేరారు. 1989లో ఉద్యోగానికి రాజీనామాచేసి క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాల్లో బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేశారు. అక్కడ విజయం సాధించలేకపోయినా, అందరూ దళితసమస్యలను గుర్తించేలా చేశారు.


 తర్వాత కాలంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా వాటికి ప్రతిస్పందించి ఆ సమస్యలను పరిష్కరించేదిశలోనే కాకుండా, దళితుల్ని చైతన్యపరిచే సమావేశాలు నిర్వహించేవారు. కత్తిపద్మారావు చేస్తున్న పోరాటం అగ్రవర్ణాల వారికి ఒక సవాల్‌గా పరణమించింది. అందుకే ఈయన్ని అరెస్టు చేయించడానికి జరిగిన కుట్రల్లో భాగంగా 1985 అక్టోబరు 6న విజయవాడ వేదికపై అరెస్టుచేసి, విశాఖ జైలుకి పంపారు. అక్కడ రాసిన కవితల్ని జైలుగంటలు పేరుతో 1988లో ముద్రించారు. 1987లో జరిగిన అఖిలభారత మహాసభల సందర్భంగా రాసిన దీర్ఘకవిత విముక్తిగీతంలో సింధునాగరికత నుండి నేటి వరకూ దళిత ప్రతిభ, సంస్కృతి గొప్పగానే ప్రతిబింబించిందనీ, దీన్ని గుర్తించి పోరాటాలబాట పట్టాలని ప్రబోధించారు. 1991లో వెలువడిన రక్తక్షేత్రం కవితాసంపుటి చుండూరులో దళితులపై జరిగిన హత్యా కాండను వర్ణిస్తూనే, నాటి దళితుల చైతన్యాన్ని అభివ్యక్తీకరించారు.1996లో వచ్చిన నల్లకలువ కవితాసంపుటి దళితులే ఈ దేశమూలవాసులనే సిద్ధాంతాన్ని స్థిరీకరించేలా కనిపిస్తుంది.

దళితోద్యమం కోసం తన ఉద్యోగాన్ని వదిలేసి, దళితుల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసి, అంబేద్కర్‌నీ, ఆయన రచనలనీ, దళితుల అభ్యున్నతికి ఉపయోగపడే ప్రతి అంశాన్నీ అన్వేషించే క్రమంలో తన ఆరోగ్యాన్ని సహితం లెక్కచేయని మహోన్నత వ్యక్తిత్వం కత్తి పద్మారావుది. ప్రతివ్యక్తిలోను కొన్ని అంశాలు మనకి వ్యక్తిగతంగా నచ్చకపోవచ్చు. కానీ, వ్యవస్థ మొత్తానికి చూసినప్పుడు ఆవ్యక్తి చేసిన మేలు మరిచిపోకూడదు. అందుకనే మన ఆలోచనలను సంకుచితం చేసుకోకుండా చీలికలతో ఒక్కొక్కర్నీ దూరం చేసుకోకుండా మన మేధావుల్ని మనం గౌరవించుకోవాలి. వారి జీవితాలను, వారి రచనలను, వారి ఆదర్శాలను ఆచరణలో పెట్టగలగడమే వారికి మనమిచ్చే నిజమైన గౌరవమనుకుంటున్నాను.
-డా.దార్ల వెంకటేశ్వరరావు
( జూలై 27వ తేదీ కత్తి పద్మారావు షష్ఠిపూర్తి సందర్భంగా) 

(‘ఉద్యమ స్ఫూర్తి’ పేరుతో 27-7-2013 న సూర్య దినపత్రికలో ప్రచురితమైన వ్యాసం)



1 కామెంట్‌:

Jai Gottimukkala చెప్పారు...

దళిత ఉద్యమ నేత, కారంచేడు ఆత్మగౌరవపోరాట సేనాని, హేతువాద నాస్తికవాద సిద్దాంతాల సిపాహి, తెలంగాణా శ్రేయోభిలాషి డా. కత్తి పద్మారావు గారికి షష్టిపూర్తి శుభాకాంక్షలు.