సూర్య ‘అక్షరం’ 4-3-2012
-డా||దార్లవెంకటేశ్వరరావు,
అసిస్టెంటు ప్రొఫెసరు,
అసిస్టెంటు ప్రొఫెసరు,
తెలుగు శాఖ,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు (సెంట్రల్‌యూనివర్సిటి),
గచ్చిబౌలి, హైదరాబాదు-46,
మన జీవినవిధానాన్నే సంస్కృతి అంటారు. ఈ సంస్కృతిని ప్రభావితం చేసే అంశాల్లో పురాణేతిహాసాల పాత్ర ఎంతగానో ఉంటుంది.ఇంచు మించు ప్రతిదేశంలోను ఈ పురాణేతిహాస సంప్రదాయం కొనసాగుతూనే ఉంటుంది.గ్రీకులో వెలువడిన ''ఇలియడ్'', ''ఒడిస్సీ'' లనుపాశ్చాత్య వాఙ్మయంలో అత్యంత ప్రాచీన పురాణేతిహాసాలుగా చెప్తారు. వీటిని హోమర్ రాశాడని ప్రసిద్ధి. 'హోమర్' అనేది నిజమైన పేరు కాదనీ, అది కవి, గాయకుల వంశపారంపర్య నామంగా కూడా సాహితీవేత్తలు భావిస్తున్నారు.
' హోమర్' అనేది గ్రీకుపదమే అయినా అనేకమంది (మార్టిన్‌వెస్ట్) దానిని వంశపారంపర్య నామంగా అభివర్ణించారు. ... హోమర్ వారసులు వంశపారంపర్య గాయకుల కూటిమిగా( బార్డిక్ గిల్డ్) ఉండేవారని వారు రాజసభల్లో, ఉత్సవాల్లో, దైవపూజల్లో సంచార గాయకులుగా( వండరింగ్ మినిస్ట్రెల్) వ్యవహరించేవారని తెలుస్తున్నది.''(డా|| లంకా శివరామ ప్రసాద్, . హోమర్ విరచిత ఇలియాడ్, తెలుగు స్వేచ్చానువాదం, సృజనలోకం, రైటర్స్‌కార్నర్ ప్రచురణ, వరంగల్లు, 2011.,పుట:శIII, )
పురాణేతిహాసాలని సాధారణార్ధంలో పిలుస్తున్నా, వాటిని కావ్యాలనో లేదా మహాకావ్యాలనో అనడమే సమంజసం. అలాగే భారతదేశంలో వేదాలు అపౌరుషేయాలనీ, వాటిని వ్యాసుడు అందులోని వివిధాంశాలను విభజిండం వల్ల వేదవ్యాసుడైయ్యాడనీ, ఆయనే అష్టాదశపురాణాల్నీ , భారత, భాగతాది కావ్యాలు కూడా రాశాడనీ ప్రసిద్ధి వచ్చింది.
గ్రీకులో హోమర్ ఒక కవిపేరుకాదనే వాదన ఉన్నట్లే, వ్యాసుడు అనేది కూడా ఒక్క వ్యక్తిపేరు కాదనీ, అది ''ఒక బృందం'' అనే వాదనా ఉంది. దీన్నిబట్టి ''ఇలియడ్'', ''ఒడిస్సీ''లను గానీ, వేదాలు, అష్టాదశపురాణాల్ని గానీ ఒకరెవరో రాసినవో, సాక్షాత్తూ భగవంతుని వరప్రసాదాలో కాదనీ స్పష్టమవుతుంది. ఈ దృష్టితో చూసినప్పుడు అష్టాదశపురాణాలకున్న స్థానమే మిగతా అన్ని పురాణాలకూ ఉండాలి. కానీ, ఆచరణలో అలా జరగడం లేదు. మాదిగల పుట్టుపూర్వోత్తరాల్ని ప్రస్తావించే జాంబపురాణం, జాంబవపురాణం, డక్కలి పురాణం మొదలైన పేర్లతో పిలిచే జాంబవపురాణమే దీనికి నిదర్శనం! అష్టాదశపురాణాల్లాంటిదే జాంబవపురాణం కూడా! కాకపోతే అవి సంస్కృతంలో వెలువడ్డాయి. సాధారణంగా పూర్వం ఎప్పుడో జరిగిందనీ, అందులోనే తమ వంశమూలాలు ఉన్నాయని భావిస్తూ, అప్పుడెప్పుడో మౌఖికంగా చెప్పిందాన్ని, లేదా జరిందని భావిస్తూ రాసిన దాన్నే నేటికీ కొత్తగా చెప్పడాన్నే పురాణమని పిలుస్తారు.
సాధారణంగా సృష్టి ఆవిర్భావాన్నీ (సర్గం), ఆ సృష్టి ప్రళయం వల్ల నాశనమైయ్యే లయనీ (ప్రతి సర్గం), తర్వాత మానవవంశం ఎలా క్రమపరిణామం పొందిందీ ( వంశం), ఆ వంశం యుగయుగాలుగా సాధించిన మాహాత్కార్యాల్నీ (మన్వంతరం) , ఆ వంశాల్లో అవతారపురుషులైన (వంశాలచరిత్ర) వారినీ వర్ణిస్తూ, నిత్యనూతనంగా చెప్పేదే పురాణం.దీని మౌలిక లక్షణాలు 'అమరకోశం' లో కనిపిస్తాయి.దీన్నే ఇంచుమించు పౌరాణి పండితులంతా అంగీకరిస్తున్నారు.అంటే, సృష్టిపూర్వం నుండీ ప్రారంభించి, జరుగుతున్న, జరగబోయే విషయాలతో సహా ఊహించడం పురాణాల్లో జరుగుతుంది.
యుగానికొక అవతారపురుషుడెవరొకరు వస్తుంటారనీ, ఆ అవతారపురుషుడ్ని నమ్ముకొని మనవిధిని మనం నిర్వర్తిస్తూ మోక్షాన్ని సాధించుకోవడానికి భగవంతుణ్ణి ఆశ్రయించాలనేదే పురాణాల్లోని ప్రధానోద్దేశం.సాధారణంగా ఆ మోక్షాన్ని పొందడానికి భక్తులెలా ప్రవర్తించాలనేది పురాణాల్లో ఉంటుంది. పురాణాల్లో యుగపురుషుడుగా ఉండే అవతారపురుషుడు మానవుడుగా ఏదొక వంశంలో జన్మిస్తాడనీ,అతణ్ణే నాయుకుడుగా చేసుకొని వర్ణనలకు ప్రాధాన్యాన్నిచ్చేది ఇతిహాసం. రెండింటిలోను చారిత్రకాంశాల్ని వెతికేవాళ్ళూ ఉన్నారు. అవి కేవలం ఊహకు సంబంధించినవని భావించేవాళ్ళూ ఉన్నారు.
కావ్యేతిహాసంలో అయితే, నాయికా, నాయకలు, ఇతర పాత్రలు కొన్ని వాస్తవంగా జరిగిన చారిత్రక ఇతివృత్తాలకు సంబంధించినవి కూడా కావచ్చు. అయినా, పురాణేతిహాసాలు చరిత్ర వంటివి కాదు. అయితే, వక్రీకరణకు గురౌతున్న చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు కావ్యేతిహాసాల్లోను పెట్టచ్చు. అవి నియంతృత్వ పాలకుల విధానాల వల్ల వాస్తవాన్ని కళాత్మకంగా చెప్పేప్రయత్నంలో వెలువడతాయి.అలాగే, సృజనసాహిత్యంలోనూ వక్రీకరణ జరగొచ్చు. ఆ యా సమాజాల్లో రాజకీయంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా ఉన్నతస్థానంలో ఉన్నవాళ్ళ చరిత్రల్నీ, కావ్యాల్నీ తమకి కావలసినట్లుగా రూపొందించుకొని, వాటినే విశిష్టమెనవిగా ప్రచారం చేయించుకొనే అవకాశమూ ఉంది.ఇలాంటప్పుడు కొన్ని పాత్రల్ని, సన్నివేశాల్ని అనివార్యంగా చిత్రించాల్సివస్తుంది. శిష్ట, దుష్టపాత్రలుగా వాటిని చిత్రించి, అధర్మం నుండి, ధర్మాన్ని రక్షించడానికి ఉపయోగపడేసన్నివేశాలుగా అవి మారిపోతాయి. ఉదాహరణకి ప్రపంచాధిపత్యాన్ని ఎదుర్కొవడానికి ప్రయత్నించిన వాళ్ళెంతోమందిని ప్రజాస్యామ్యపంథాలోనే ''ఒక దుర్మార్గ'' ముద్రవేసి బహిరంగంగా వాళ్ళని తరిమి తరిమి చంపించిన సన్నివేశాలు చరిత్రలోను, కావ్యాల్లోను ఎలా మారిపోతున్నామో చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం, సహజంగానే ఆధిపత్యం, అవకాశాలు ఉన్న వాళ్ళు తమ ఆలోచనల్నే సరైనవిగా ప్రచారం చేసుకోవడంలో కృతకృత్యులౌతారు. విదేశీదురాక్రమణదారులతో నిజంగా యుద్ధంలో పాల్గన్న దళితయువతి ఝల్‌కారీబాయి అయితే, దాన్ని ఝాన్సీలక్ష్మీబాయిగా ప్రచారం చేసుకొని, భారతీయస్వాతంత్య్రసంగ్రామంలో వీరనారి అంటేనే 'ఝాన్సీలక్ష్మీబాయి' అనుకునేటట్లుగా చరిత్రీకరించారని ఈ మధ్య వస్తున్న పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి.
చమురుబావులకోసం గోరంతని కొండంతగా చూపి ప్రపంచాధిపత్యాన్ని చెలాయిస్తున్న అమెరికా, సద్దాం హుస్సేన్‌ని నియంతముద్రవేసి ఉరితీసి, ప్రజలచేతనే దాన్ని సరైనచర్యగా ప్రచారం చేయగలిగింది. తర్వాత అమెరికా చర్యని సమర్ధించేటట్లు రూపొందిన సాహిత్యమే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అతడ్ని చంపడం ఒక ప్రపంచవిజయంగా ఉత్సవాలు చేయడం మొదలైంది. ఇటువంటివే అష్టాదశపురాణాల్లోను, ఇతిహాసాల్లోను వివిధ అట్టడుగు సామాజికవర్గాలు, వర్ణాలవారిని చిత్రించినప్పుడూ జరిగిఉండొచ్చు.
నేడు హిందూపండగల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అవి ఏదొకరూపంలో కిందిసామాజిక వర్గానికి చెందినవారిపై వాళ్ళు సాధించిన విజయాలకు చిహ్నాలే! కొన్ని ఆధిపత్య, అగ్రవర్ణాల ప్రయోజనాల్ని కాపాడేచర్యల్ని సాధారణీకరించి వాటిని అందరి ప్రయోజనాలుగా ప్రచారంచేసి, వారి విజయాల్నే పండగలుగా చేసుకోవడం జరుగతోంది. ఈ క్రమంలోనే అష్టాదశపురాణేతర పురాణాలకు, వాటిల్లో ఉండే వారి అభిమతాలకు తగినస్థానం లభించకుండా చేయగలిగారు.
ప్రస్తుతం ఇక్కడ సమాజంలో నేడు అత్యంత అంటరానికులంగా ఉన్న మాదిగలకు సంబంధించిన ''జాంబవపురాణం'' గురించే విశ్లేషించుకున్నా, దళితులు, బహుజనులు తమ పురాణాల్ని పరిశీలించేవారికి కొన్ని కొత్తఆలోచనలు కలుగుతాయనిభావిస్తున్నాను. సుమారు 60 పాఠాంతరాల్లో 'జాంబవపురాణం' ఉందని, నేటికీ ఆరుకులాల వారు ఈ పురాణాన్ని వివిధరీతుల్లో ప్రదర్శిస్తూ, మాదిగలను ఆశ్రయించి జీవిస్తున్నా, వాళ్ళంతా ఒకప్పుడు గౌరవనీయమైన ఆశ్రిత కులస్థులుగా జీవించగలిగారని ఈ పురాణంపై పరిశోధన చేసిన ఆచార్య పులికొండసుబ్బాచారి వ్యాఖ్యానించారు. (కొలనుపాక, నులకచంద్రయ్యల 'ఆది జాంబవ మహాపురాణము, 2008:10,13) దీన్ని బట్టే మాదిగలకున్న సాంస్కృతిపునాదులెంతగట్టివో తెలుస్తాయి.
మాదిగలకు మొదటినుండీ ఒక ప్రత్యేకమైనజీవనవిధానం ఉంది. అది మాయ మాటలతోకూడిందికాదు. వాస్తవాలపై, అనుభవాలపై ఆధారపడేది. తమకే కాకుండా, తమతో ఉండేవాళ్ళనీ ఆరించగలిగేది. ఆనందింపజేసేది. అది పనిచేసి బతికే శ్రమసంస్కృతి. నైపుణ్యాన్ని ప్రదర్శించే సంస్కృతి.అది చర్మకారవృత్తిని ఆధారంగా చేసుకున్నది. జంతువులు చనిపోతే మానవులు దానిదరిదాపులకే వెళ్ళడానికి భయపడే సమయంలో వాటిని తీసి, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి, ఆ జంతువుల్ని పూడ్చిపెట్టడమో, దహనం చేయడమో, అవసరమైతే వాటిని భుజించడమో చేశారు దాన్నొక పవిత్రమెన కార్యంగా భావించారు. దాన్నుండే తమదైన ఒక సాంస్కృతికవారసత్వాన్ని నిర్మించుకోగలిగారు. దానిలోని అనేకఅంశాల్ని మౌఖికసంప్రదాయరూపంలో భద్రపరిచిన కళారూపమే ''జాంబవపురాణం''. అందుకే'దీన్నొక వ్యక్తి సృజనగా కాకుండా, ఒక సామాజిక వర్గం మొత్తానికి చెందిన సాహితీ సంపదగానూ, సంప్రదాయిక సామాజిక సిద్ధాంతం రూపంగాను భావించాల'ని పరిశోధకుల అభిప్రాయం. (పులికొండసుబ్బాచారి, కొలనుపాక,నులకచంద్రయ్యల 'ఆది జాంబవ మహాపురాణము, 2008:10)
జాంబవంతుని పుట్టుకను తెలిపే జాంబవపురాణాల్లో ఇంచుమించు అన్ని పాఠాంతరాల్లోను సృష్టిలో మొదటిగా పుట్టినవాడని చెప్తున్నాయి. పురాణాల్లోని సృష్టి క్రమం వివరించడంలో భాగంగా ఏమీలేని శూన్యంలో ఒక వెలుగురూపంలో జ్యోతిర్మహేశ్వరుడు ప్రభవించి, ఆయన చేసని ప్రణవ మంత్రం నుండి జలం, దాని నుండి తామరపుష్పం, ఆ పుష్పం నుండి ఆదిజాంబవంతుడు జన్మించినట్లుంది. జాంబవంతుడు స్వయంభువుగా జన్మించినట్లు మరికొన్ని జాంబవపురాణ ప్రతుల్లోనూ ఉంది. మరికొన్నింటిలో భూమికంటే ఆరునెలల ముందే జాంబవంతుడు పుట్టినట్లుంది. ఈ కథనాన్ని బట్టి చూస్తే, మాదిగలు అత్యంతప్రాచీనజాతివాళ్ళని చెప్పడంలో భాగంగానే దీన్ని గుర్తించాలనిపిస్తుంది.
ఇలా అత్యంతప్రాచీన జాతివాళ్ళైన మాదిగలు భారతదేశమంతా రకరకాల పేర్లతో విస్తరించి ఉన్నా, వీళ్ళు ప్రధానంగా ద్రావిడజాతికి చెందినవాళ్ళు. ఆర్యుల దాడితో అంతవరకూ ఒక వెలుగు వెలిగిన మాదిగల ప్రభ క్రమేపీ ఆరిపోవడమే కాకుండా, గెలిచిన ఆర్యులు, ఓడిన వాళ్ళను దాసులుగా చేసుకున్నారు. ఇది రామాయణంతో సంబంధం ఉన్న వాలీ-సుగ్రీవుల కథను గమనిస్తే, విభజించి పాలించే విధానాన్ని ప్రయోగించి విజయం సాధించగలిగారని తెలుస్తుంది. తర్వాత యుగంలో జరిగిన కథగా చెప్పే శ్యమంతకమణి జాంబవంతుడికి దొరకడం, దాన్ని వశపరుచుకోవడానికి కృష్ణుడు యుద్ధం చేయడం, అతడ్ని గతయుగంలో శ్రీరాముడిగా భావించి యుద్ధాన్ని విరమించి, ఆ మణితో పాటు అతని కూతురు జాంబవతినిచ్చి వివాహం చేసినట్లు సంప్రదాయపురాణేతిహాసాల్లో కూడా ఉంది. ఎలుగుబంటిలాంటి వాడుగా జాంబవంతుణ్ణి చెప్తూనే, ఆయన కూతర్ని వివాహం చేసుకున్నాడని అనడంలోని ఆంతర్యాన్ని పరిశీలించాలి. ఆర్యుల దాడితో పరాజయం పాలైన మాదిగజాతి కొండకోనల్లో నివశించి ఉండొచ్చు. వాళ్ళుని ఆర్యులు తమతో సమానంగా చూడలేకపోయినా, వాళ్ళ శక్తిసామర్థ్యాల్ని గుర్తించి, వాళ్ళని సహాయకులుగా ఉపయోగించుకోవడానికి రకరకాల ప్రలోభాలకు గురిచేసి ఉండొచ్చు.
జాంబవపురాణంలో మాదిగల సాంస్కృతిక మూలాల్ని ఇలా రకరకాల ఆధారాలతో విశ్లేషించే అవకాశం ఉంది. మాదిగల సంస్కృతిని పురాణేతిహాసాల నుండీ, చారిత్రక సత్యాల నుండీ వెలికితీసేప్రయత్నంలో భాగంగానైనా దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీని వల్ల మాదిగల సామాజిక, సాంస్కృతిక అంశాలు ప్రతిఫలించవచ్చు. మాదిగేతరులు సంప్రదాయసాహిత్యంలో వర్ణించిన తీరుతెన్నుల్ని గుర్తిస్తూనే, వాస్తవంగా మాదిగల సంస్కృతి ఏమై ఉంటుందనే విషయాల్ని శోధించి సాధించడమే సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక ప్రతిఫలనమవుతుంది. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం ఆ యా వర్ణాల వాళ్ళు, వాళ్ళకు నిర్దేశించిన విధుల్ని నిర్వర్తించాల్సి ఉంటుంది. అలా నిర్వర్తించడంలో అన్ని వృత్తుల వారికీ సమానగౌరవాదరాలు ఉండాలి. కానీ, కొన్ని వృత్తులు గౌరవప్రదంగాను, మరికొన్ని అగౌరవప్రదంగానూ మారిపోయాయో ఈ అధ్యయనం వల్ల తెలిసే వీలుకలుగుతుంది.
వేదాలు, అష్టాదశపురాణాల్లోను కనిపించే రాముడు, కృష్ణుడు, ఇంద్రుడు, యమధర్మరాజు, ధర్మరాజు, సీత, సత్యభామ, రుక్మిణి, జాంబవతీ, నారదుడు మొదలైనపాత్రలే తర్వాత కాలంలో భారతీయకావ్యేతిహాసాల్లోనూ కనిపిస్తాయి. మరికొంత కాలం తర్వాత వీళ్ళలో చాలామందిని చారిత్రక వ్యక్తులుగా కీర్తించడం, దేవాలయాలు కట్టించడం, విగ్రహాలు పెట్టించడం, వాటినే చివరికి పాఠ్యాంశాలుగా అధ్యయనం చేయించడంతో క్రమేపీ అదే మన సంస్కృతిగా గాఢమైనముద్రవేయడం సహజంగానే జరిగిపోతుంది. అదే మన నరనరాల్లో ఇంకిపోతుంది. అదే మన ఆలోచననీ, మన ప్రతి చర్యనీ ప్రభావితం చేస్తుంది. అదే నేడు జరుగుతోంది. ఆ ఆలోచనతోనే వాళ్ళందించిన ఆధిపత్యభావజాలంతోనే వేదాలు, రామాయణ, భారతేతిహాసాలు, అష్టాదశపురాణాలు మొదట్లోనే కాకపోయినా, జాంబవపురాణం కంటే ముందుగానే అవి లిఖితరూపంలోకి రావడం, అదీ ''సంస్కారాన్ని'' సంతరించుకొని రావడంతో వాటికొచ్చినంత లేదా వాటికిచ్చినంత ప్రామాణ్యాన్ని దళిత, బహుజనులు కూడా వారి వంశమూలాలున్న పురాణాలకు ఇవ్వలేకపోతున్నారు.
తమ వంశమూలాల్ని భావవాదదృష్టితో చెప్పడానికి ఇష్టంలేకపోతే, ఆ పాత్రల ''సృష్టి''లోని ఆంతర్యాన్ని విశ్లేషించి, ప్రజల్ని చైతన్యపరచాల్సిన బాధ్యత దళిత, బహుజన మేధావులకు ఎంతైనా ఉంది. దళిత, బహుజనులు అష్టాదశపురాణాల్ని కూడా ''కల్పనలు'' గానే భావిస్తున్నారు తప్ప, వాటికేదో విలువనిస్తున్నారని భ్రమించనవసరంలేదనుకుంటే ప్రత్యామ్నాయ సంస్కృతిని వ్యాపింపజేసేప్రయత్నం చేయాలి.
3 కామెంట్‌లు:
అయ్యా దార్ల వెంకటేశ్వరరావుగారూ,
మీ వ్యాసం బాగుంది. కాని కొన్ని కొన్ని విషయాలతో మీతో యేకీభవించలేక పోతున్నాను.
మీరు కూడా, ఆర్యుల దురాక్రమణ సిధ్ధాంతాన్ని ప్రస్తావించారు. ఇది చెల్లని సిధ్ధాంతంగా తేలిపోయింది. అయినా కొందరు దీని ఆధారంగా ఊహాగానాలు చేస్తున్నారు.
పురాణం, ఇతిహాసం, కావ్యం అనే మాటలు వేర్వేరు అర్థాలు ఇస్తాయని మీకు స్పష్టంగా తెలుసని నా అభిప్రాయం. కాని ఈ వ్యాసంలో మీరు కావాలని వాటిని కలగాపులగం చేసారు.
సమయాభావం వలన విపులవిమర్శకు పూనుకోవటంలేదు. కాని ఒక విషయం. విశ్వవిద్యాలయాలలోని బోధనాసిబ్బందికి రాసిందివేదంగా చెలామణి చేసుకోగలిగే అవకాశం ఉంటుంది అందుచేత content కన్నా intent తోటే చాలా వ్యాసాలు వగైరా వచ్చే ప్రమాదం కూడా పుష్కలంగా ఉంది. ఇది అటువంటి వ్యాసం లాగా అనిపిస్తోంది నాకు.
gfgvf
కులపరంగానే చూడాలి. ఎందుకంటె మనకు "పచ్చకామెర్ల" కళ్ళద్దాలు బ్రిటీషు వాళ్ళు, మెకాలే, మాక్స్ ముల్లరు ఇచ్చారు. ఉన్నది ఉన్నట్లుగా చూస్తే వాళ్ళు భాదపడుతారు. తోలు భారతీయులుగా, ఆలోచన విదేశీ వాళ్ళ లాగా, పూర్తిగా ఏ సిధ్ధాంతమూ లేని కమ్మ్యూనిష్టుల ఆలోచనతో ఉన్నాము, వాళ్ళు వ్రాసిన చరిత్ర, వాళ్ళ చేత మన చదువుల సిలబస్సు, చదువుకుని మనకు మనము కీచులాడుకుంటూ, దేశాభిమానము లేకుండా "రండి, మమ్మలను ఏలుకోండి" అనే పరిస్థితికి దిగాజరుతున్నామేమో!
కామెంట్‌ను పోస్ట్ చేయండి