"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

10 May, 2011

కవిత్వమై పండిన జీవితం!

(రావినూతల ప్రేమకిశోర్ రాసిన " నలుగురమవుదాం  " కవితా సంపుటిని ఈ రోజు (10-5-2011) హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరిస్తున్న సందర్భంగా  ఆ పుస్తకానికి  రాసిన ముందుమాట ని ఇక్కడ ప్రచురిస్తున్నాను-దార్ల)
సాధారణంగా ప్రతి వ్యక్తీ వృత్తి రీత్యా తన విధుల్లో తలమునకలౌతున్నా, నిజమైన ఆనందాన్ని పంచుకునే వ్రవృత్తిని కూడా ఏదొకదాన్ని ఎన్నుకుంటాడు. మొదటిది నియతమైతే, రెండవది అనియతం.నియతి విధి విధానాల్ని కోరుకుంటుంటే, అనియతి విశాల ప్రపంచాన్ని వాంఛిస్తుంది.రావినూతల ప్రేమకిషోర్‌ వృత్తిరీత్యా విద్యాశాఖలో  విధుల్ని నిర్వహిస్తున్నారు. తను పుట్టి పెరిగిన కుటుంబం, ఉద్యోగ జీవితం అంతా అక్షరాలతో ముడిపడి ఉన్నదే. అయితే, యాదృచ్ఛికంగా తన వృత్తికి దగ్గరగా ఉండే ప్రవృత్తినే ఈయన ఎన్నుకొన్నారు.ఈయన కవిత్వం, కథలు, నాటకాలు రాయడమే కాదు, దర్శకత్వం కూడా వహించారు.వచన, దీర్ఘ కవిత్వంతో పాటు మినీకవిత్వ ప్రక్రియల్లో రచనలు చేస్తున్నారు. ఈయన రాసిన నాటకాలు, నాటికలు సామాజిక రుగ్మతను పోగొట్టడానికి ఉపయోగపడే చక్కని ఔషధాలవంటివి. ఒక బాధ్యత గల సాహితీవేత్తలా కృషి చేస్తున్నారు.
ప్రేమకిషోర్‌ రాసిన కొన్ని కవితలను ‘నలుగురమవుదాం’ పేరుతో కవితా సంపుటిగా ప్రచురిస్తున్నారు. ఈ సంపుటికి పెట్టిన పేరుతోనే దీనిలో ఒక కవిత ఉంది. ఇది ఎస్సీ వర్గీకరణను సమర్ధించే దృష్టితో రాసింది.నిజానికి ప్రేమకిషోర్‌ది ఎస్సీ వర్గీకరణ వాదాన్ని కవిత్వంలో వినిపిస్తున్న ఒక బలమైన గొంతు. ఉద్యమం ప్రారంభమైన నాటి నుండీ నేటి వరకూ ఆ పరిణామక్రమాన్ని సందర్భానుసారంగా కవిత్వీకరిస్తూనే ఉన్నారు. ఈ సంపుటిలో చాలా కవితలు రిజర్వేషన్స్‌ అందరూ సమాన ప్రాతినిధ్యంతో అందుకోవాలని వాదించేవే. ప్రత్యేక తెలంగాణాను సమర్థించే కవితలో కూడా ఈ వాదన కన్పిస్తుంది. అయినంత మాత్రం చేత ఈ కవిని కేవలం ఒక ఉద్యమకవిగా ముద్రవేసేయడానికి వీల్లేదు. మన చుట్టూ జరిగే వివిధ సంఘటనల పట్ల ప్రతికవీ స్పందించినట్లే ఈ కవీ స్పందించారు.తన చుట్టూ జరిగే మనుష్యుల మమతానురాగాల్ని కవిత్వమై పలకరించారు.
నీళ్లకోసం యుద్ధం చేసే పేద వాళ్ళని చూసి చలించిపోయారు.
‘‘ఇక్కడ గొంతులే కాదు
గుండెలూ పిడుచకట్టుకు పోతున్న దాహార్తదృశ్యం’’
గా దాన్ని వర్ణించారు. తన వర్ణనతో ఆ విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చేయడం కంటే కవికి కావాల్సిందేమిటి?
ఆఫీసుల్లో ఉద్యోగినుల పట్ల కొంతమంది ప్రవర్తనా వైఖరిని, దానివల్ల పొందే మానసికక్షోభనీ లేఖాత్మక కవిత్వ నిర్మాణ పద్ధతిలో ఓతల్లిదండ్రులకు రాస్తున్న ఉత్తరంగా వర్ణించారు. 
‘మీ ఉత్తరం చేరింది
మీ ఊసొచ్చిన ప్రతిసారీ
కళ్ళల్లో జలపాతం...
కలవని రైలుపట్టాల్లా ’’ ఉంటున్నామనే వాస్తవాన్ని, ఒక అనివార్య సందర్భాన్నీ చెప్తూనే 
‘‘ఈ నాగుల కోనలో‘‘జాగ్రత్తగానే మసలుతున్నా...
నా గురించి దిగులద్దు’’ అనే ధైర్యాన్నీ ప్రకటిస్తున్న ఆధునిక యువతి ఉద్యోగజీవితాన్ని మనముందుంచుతున్నారు. దీనిలో ‘నాగులకోన’ అనేది ఔచిత్యంతో కూడిన కొత్త అభివ్యక్తి.
ఒక వీరుడు మరణిస్తే, ఆతని ఆశయాల్ని కొనసాగిస్తామంటూ వాగ్దానం చేయడానికంటే, ఎవరికైనా ఇంకేమి కావాలి?
‘‘ ప్చ్‌... పిచ్చిరాజ్యం./
నాయకుడు లేని ఉద్యమమని భ్రమిస్తోంది
నీ స్ఫూర్తిలో
ఉద్యమమెన్నడూ విశ్రమించలేదు
నీ కనుపాపల్లో ఉద్యమం ఊపందుకుంది’’

‘అయ్యా!
నన్ను చంపేస్తున్నాడు/
కాపాడండి... కాపాడండి...’/
పొడవాటి పట్టాకత్తితో శత్రువు/
పబ్లిగ్గా నరకజూస్తుంటే/
పరుగులు తీస్తున్న ప్రాణభీతి/
జనారణ్య రోదనయ్యింది’’

‘‘అమ్‌...మ్మా...!?/
నీవు విదిల్చిన కత్తికొనకి క్షతగాత్రుణ్ణయ్యా’’     ఇలాంటి కవితలు చదువుతుంటే పాఠకుడు అభినయాత్మకమైన అనుభూతికి లోనవుతాడు. ఇది నాటకీయతలో కనిపించే ఒక లక్షణం.దీన్ని చాలా చోట్ల సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కనిపిస్తుంది.కేవలం వస్తువుని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా, దాన్ని కవిత్వం చేసే మార్గాన్నీ అన్వేషించారని తెలుస్తుంది.
 కుల, మత విద్వేషాల సమాజంలో, వాటికి అతీతంగా మానవీయతను పంచిన మాష్టార్ని స్మరించుకున్నారు. చిన్నప్పుడే కోల్పోయిన తల్లి జ్ఞాపకాల్ని వర్ణించిన కవితలో మాతృత్వం కోసం తపించే వారి హృదయపు లోతులు తెలుసుకోవాలంటే ప్రేమకిషోర్‌ కవిత్వం స్పర్శించి తీరాలి. తన ప్రతిభాపాటవాల్ని తన తండ్రి ఎదుట ప్రదర్శించాలనుకున్నా, ఎప్పటికీ తీరని ఆ కోరికను, వేదనామయ విషాదాన్ని వర్ణించిన కవిత ఈ సంపుటికే హైలెట్‌.‘‘నాన్నా!
ఎప్పటికైనా నా స్క్రిప్ట్‌ని
నీ డైరక్షన్‌లో ప్రదర్శించాలని ఎదురుచూస్తూ వున్నా
స్క్రిప్ట్‌ సిద్ధంగావుంది
ప్లీజ్‌` నాకోసం డైరక్ట్‌ చేయవూ!’’ దీనిలో జీవితం ఒక నాటకంగా ముగిసిపోయిన సంఘటనను ఎప్పటికీ మరిచిపోని దృశ్యకవితా రూపంగా వర్ణించారు. ఇలాంటి నాటకీయ కవితా నిర్మాణాన్నే మరో కవితలో ...
‘‘అమ్‌...మ్మా...!?
నీవు విదిల్చిన కత్తికొనకి క్షతగాత్రుణ్ణయ్యా
అంతమాత్రాన నీవు గెలిచినట్టు కాదు
నీవు విసిరిన విషపునవ్వుకు అపహాస్యం పాలయ్యా
అంతమాత్రాన నేను ఓడినట్టూ కాదు
ఈ హక్కుల పోరాటంలో సఫలమయ్యేది నేనే...’’ అని వర్ణించడంలో చక్కని ప్రణాళిక కనిపిస్తుంది. తమ న్యాయపోరాటం సఫలమవుతుందనే ఆశాభావం కనిపిస్తుంది. కేవలం ఒక ఉద్యమానికే కాకుండా, నిత్యం సమస్యలతో సతమతమవుతున్న మానవుడు తన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి నిరంతరం ఎవరోఒకరితో యుద్ధం చేయకతప్పదు. అన్నిసార్లు తానే విజయాన్ని సాధిస్తాడనీ భావించలేం. నైతిక విలువల్ని పాటిస్తూ, న్యాయమైన పోరాటాన్నే చేస్తున్నా, కేవలం విజయం కోసమే కుయుక్తుల్ని పన్నే వాళ్ళ దగ్గర, నీతినియమాల్ని లక్ష్యపెట్టకుండా, అవకాశవాదస్వభావంతో విజయపథాన్ని మాత్రమే వాంఛించేవాళ్ళదగ్గర నిజాయితీ పరులకూ కొన్నిసార్లు ఓటమి తప్పదు. అలాంటప్పుడు ఇలాంటి కవితాపాదాలు పాఠకులకు ఎంతగానో ఊరటనీ, ఆశనీ కలిగిస్తాయి. అందుకే ఈ కవిని కేవలం ఏదో ఒక ఉద్యమానికి మాత్రమే పరిమితమైన కవిత్వం రాయలేదని గుర్తించాలి. ఇటువంటి కవితాపాదాలే చాలా చోట్ల కనిపిస్తాయి. 
‘ముఖంమీది నవ్వు రాలినంత మాత్రాన
ఆత్మవిశ్వాసం రాలిపోతుందా...!?
నన్నెంతగా అపహాస్యం జేసినా
ఆశల ఉచ్ఛ్వాసం ఆగిపోతుందా?
నీవెన్ని గాయాల్ని చేసినా
గుండె నిబ్బరం సడలనివాణ్ణి
నలుగురమయ్యేంత వరకూ
రణ నినాదమై నిలబడ్డవాణ్ణి
కొనవూపిరిని కత్తికొనకి అద్దయినా
బ్రతుకుకోసం పోరుతాను
నా శిరస్సును నెత్తుటిబరిలో రాల్చయినా
రేపటికోసం నిలుస్తాను ’’ ఇలాంటివి ఒక ఉద్యమానికో, ఒక వ్యక్తికో మాత్రమే పరిమితమైన స్పందనలు కాదు. అవి విశ్వమానవ హృదయతంత్రుల్ని మీటగల శక్తివంతమైన భావనలు.
‘‘బాల్యంలో కన్నతండ్రి
‘ఆడపిల్లవు... నీకేంతెల్సు...?’ అన్నాడు
పెళ్ళయ్యాక కట్టుకున్నోడు
‘తెలియకుండా మాట్లాడకు...’ అన్నాడు
ఇప్పుడేమో కడుపున పుట్టినవాళ్ళు
‘మమ్మీ! ఏం తెల్సని మాట్లాడతావ్‌?’ అంటున్నారు
బ్రతుకంతా ఆడదానికి తెలియని తనమే...!?’’ ఈ కవితా ఖండిక చదివిన తర్వాత ఒక స్త్రీ సమస్యను సమర్థవంతంగా అభివ్యక్తీకరించే కవి ఆత్మీయతను చూడాలా? ఆనుభవాన్ని గుర్తించాలా? సహానుభూతిగానే పరిగణించాలా? కవిత్వాన్ని చేయడమెలాగో తెలిసిన కవిత్వప్రతిభగానే చూడాలా? వంటి ప్రశ్నలు అస్తిత్త్వ ఉద్యమాలకున్న మరోకోణాన్ని చర్చలోకి తీసుకొస్తాయి. అస్తిత్త్వ ఉద్యమాలు వచ్చిన తర్వాత ఎవరి సమస్యలు వాళ్ళే రాసుకోవాలనే ‘‘ అనుభవానికి ’’ ప్రాధాన్యం పెరిగిన మాట నిజమే అయినా, సానుభూతి పరులు దూరం కావడానికే ఎక్కువ ప్రయత్నాలు జరిగినట్లనిపిస్తుంది. ఔట్‌ సైడరా? ఇన్‌ సైడరా? అని నిలదీసినప్పుడు లోపించిన నిజాయితీ సమాధానాలు కూడా అస్తిత్త్వ ఉద్యమాల్ని పక్కదోవపట్టించడానికి దోహదపడతాయి. తెలుగులో స్త్రీవాద, దళిత, ప్రాంతీయ సాహిత్య ఉద్యమాల పట్ల గల మౌనానికిదొక కారణంగా భావించాలి. ప్రేమకిశోర్‌ తన జీవితానికి సంబంధించిన వస్తువుల్ని కవిత్వం చేసినప్పుడు ఇన్‌సైడర్‌గాను, స్త్రీ సమస్యల పట్ల రాసినప్పుడు ఔట్‌సైడర్‌గా ఉన్నా, ఇన్‌సైడర్‌లా ఫీలై కవిత్వం రాశారు. అలాగని స్త్రీలే ఆ సమస్యలపై కవిత్వం రాస్తే, కవి దానికే అధిక ప్రాధాన్యాన్నీ ఇవ్వొచ్చేమో! అలాగైతే, ఈ కవి అస్తిత్త్వ సాహిత్యోద్యమ రెండవ తలుపుని కూడా తెరుస్తున్నట్లే భావించవచ్చు.
 తెలుగు సాహిత్యంలో శ్రీనాథుని కాలం నుండీ ఏదో ఒక రూపంలో స్మృతికవిత్వం ఉన్నా, అభ్యుదయ కవిత్వం నాటికి ‘‘వీరగాథాస్మరణ’ మనే లక్షణంగా మారింది. సామాజిక సమస్యల కోసం ప్రాణత్యాగం చేసిన వారిని కీర్తిస్తూ, వారి నుండి వర్తమాన భవిష్యత్‌ తరాలు స్ఫూర్తిని పొందడం ప్రారంభమైంది. అది నేటి అన్ని సాహిత్యాధోరణుల్లోకి ప్రవేశించింది. కామ్రేడ్‌ సుధాకర్‌ ప్రసాద్‌, మాదిగసాహిత్య వేదిక వ్యవస్థాపకుడు నాగప్పగారి సుందర్‌రాజులు చనిపోయినప్పుడు వారి గురించి ప్రేమకిషోర్‌ రాసిన కవితల్లో ఈ లక్షణం కనిపిస్తుంది.కొన్ని తిరిగిరానివి ఉంటాయి. అయినా వాటి గురించి కవులు పదే పదే స్మృతిగీతాల్ని రాస్తుంటారు. అవి చదువుకున్న పాఠకులు అలాంటి సందర్భాల్ని గుర్తుచేసుకొని భవిష్యత్‌ ప్రేరణకు తక్షణ కర్తవ్యానికి ప్రేరణనిస్తాయి.
‘‘కవిత్వం పండాలంటే/
జీవితాన్ని పిండాల్సిందేనని చెప్పిన అప్పా!
రా... నీ పందిరంగడి ప్రేమలేఖఆరునొక్క శృతిలో మళ్ళకసారందుకో
డప్పుశబ్దం లేని
ఆ నీలికేకల్ని ఎండగట్టేందుకు/నీ కలాన్నొకసారి అందివ్వవూ!
అవునూ! నిన్ను దేశద్రోహన్న
ఆ జంధ్యంగాడి వైనాన్ని వివరించవూ!’’ దీనిలోసుందర్‌రాజు జీవితం, ఆ జీవితంతో ముడిపడిన విషయాల్ని కవిత్వీకరించిన తీరుని రెండు  అంశాల్ని వివరించే ప్రయత్నంచేస్తాను.
నీలికేక పేరుతో కత్తిపద్మారావు ఒక కవితాసంపుటి వేశారు. నిన్నమొన్నటి వరకూ ఆయన, ఆయనతో పాటు చాలా మంది కవులు దండోరా ఉద్యమం గురించి తప్ప చాలా విషయాలపై కవిత్వం రాశారు. వాళ్ళందర్నీ ‘‘నీలికేకలు’’గా ప్రతీకాత్మకం చేసి, సమకాలీన వాస్తవికతను విస్మరించిన వాళ్ళని నిరసిస్తూ కవిత్వం రాయగలిగే ప్రేరణనివ్వాలనేది కవి భావన అనుకుంటున్నాను. అలాగే, ‘‘దేశద్రోహన్న ఆ జంధ్యం గాడి వైనం’’ అనేది సెంట్రల్‌యూనివర్సిటీలో పరిశోధనకు సీటివ్వకుండా నిరాకరించడమే కాకుండా, అవమానించిన ఒక ప్రొఫెసర్‌ అహంకారాన్నీ, ఆ సందర్భంగా సుందర్‌రాజు ఉద్యమం చేసి, సీటు సాధించుకుని, ఆ ప్రొఫెసర్‌ చేత క్షమాపణలు చెప్పించిన విజయగాథను గుర్తుచేస్తున్నారు. ఇలా ఒక కవితలో అనేక సంఘటనల్ని, సంఘటనల్ని ఆధారంగా చేసుకున్న జీవనచైతన్యాన్నీ కవి తన ప్రతిభతో అభివ్యక్తీకరించారు. ఆప్తులైన వారు మరణించినప్పుడు, వారిని స్మరించుకునేది స్మృతి. అంటే గడిచిపోయిన సంఘటనల్ని మరలా గుర్తుచేసుకోవడం. వర్తమాన గమనాన్ని అవగాహన చేసుకుని రాసేది ‘బుద్ధి’ అంటారు. ఈ రెండిరటి కార్యకారణాలతో రాబోయే వాటిని ఊహించడం ‘ప్రజ్ఞ’ అవుతుంది. దీన్నే భవిష్యద్దర్శనం అంటారు. ఒక ప్రవక్తకుండే లక్షణమిది. కవినీ ప్రవక్తగానే భావించడానికి కారణం, ఆ కవిత్వంలో ఉండే దార్శినికత ఒక కారణం. వీటన్నింటి కలయికనే ‘ప్రతిభ’ అని పిలుస్తారు. ప్రేమకిషోర్‌ ప్రతిభావంతుడైన కవి అని ఈకవితల్ని చదివితే తెలుస్తుంది.
రాష్ట్రంలో మూడు ఉద్యమాలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించి, రాష్ట్రంలోనూ బలంపుంజుకుని సామాజిక విప్లవాన్ని ఆశిస్తున్న మావోయిస్టు ఉద్యమం ఒకటి. రెండవది, ప్రాంతీయ అసమానతల్ని, దోపిడీని నిరసిస్తూ సుమారు అర్ధ శతాబ్దం పాటు కొనసాగుతూ తీవ్రరూపం దాల్చిన  తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం.మూడవది, సుమారు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమం.బాధ్యత గల కవి సమకాలీన ఉద్యమాల పట్ల తన స్పందనను తెలపాలి. గోడమీద పిల్లిలా ఉండకూడదు. ప్రేమకిషోర్‌ ఈ మూడు ఉద్యమాలకూ మద్దతు ప్రకటిస్తూ కవిత్వం రాశారు.
అక్షరాలు గాఢమైన భావశకలాలై బయటకు రావడానికి కవి నిద్రలేని రాత్రులెన్నో గడుపుతాడు. అది కవికున్న లక్షణం.కవిత్వం బయటకు రావడానికి కవిపడే ఆరాటాన్ని ప్రసవవేదనతో పోలుస్తుంటారు. మరి కొంతమంది గుండె గొంతుల్లోకి వచ్చి కూడా బయటికి రాని స్థితితో వర్ణించారు. ప్రేమకిషోర్‌ కవిత్వం రాయడానికి పొందిన వ్యక్తావ్యక్త భావనను
‘‘నా గుండె గవాక్షాల్లోనే కాదు
మూసిన నా కనురెప్పలపై కూడా
అక్షరాలు కవాతు చేస్తుంటాయ్‌’’ అని అభివ్యక్తీకరించారు. కవికున్న ప్రధాన లక్షణం స్పందించటం.కవి  తనచుట్టూ జరిగేవాటిని చూస్తూ నిష్క్రియత్వంతో ఉండలేడు.కొన్నింటి పట్ల తను ప్రత్యక్షంగా పోరాడలేకపోయినా, ఆ సంఘటనల పట్ల సంఘర్షణను అక్షరీకరిస్తుంటాడు. అవసరం, సాధ్యాసాధ్యాలు, సామర్థ్యాల్ని అనుసరించి ఆ సమస్యల పరిష్కారాల పట్ల కార్యాచరణ ఉంటుంది. కవిగా తాను రాసినవన్నీ తన జీవితానుభవాలే అనుకోలేం. కొన్ని సహానుభూతితో వెలువడతాయి. మరికొన్ని అనుభవంతో బయటకొస్తాయి. రెండిరటినీ పాఠకుడు అనుభవించగలిగేలా చేయడమే కవి పనితనం.దీన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రేమకిషోర్‌ని కవిత్వాభిమానులంతా అభినందిస్తారు. దీనిలో నేనూ ఒకడిని!!

-డా॥దార్ల వెంకటేశ్వరరావు
 ప్రొఫెసరు, తెలుగు శాఖ,
సెంట్రల్‌యూనివర్సిటి, హైదరాబాదు-46

(Book details: Pages: 96, Rs.50/- books available at : 
Visalandhra Book House and Prajasakti Book house, Hyderabad)

No comments: