Courtesy: Prajasakti "Savvadi"
నిర్గుణ భక్తి కావ్యంలోని గొప్ప విశేషం ఏమంటే వారి యొక్క మానవీయ దృక్పథం. వారి దృష్టి విలాసవంతమైన ఐశ్వర్యమైన జీవితాన్ని గడుపుతున్న వారిపై పడలేదు. వారి కవితా వస్తువు సామాన్య మానవుడు. సమాజంలో విభిన్నమైన వైషమ్యాల మధ్య పడి నలుగుతున్న ఆ వ్యక్తి వారికి ఆధారం.
భక్తి సాహిత్యం హిందీ సాహిత్యపు నిర్మాణంతోపాటు భారత సామాజిక పరిస్థితులకు పరిష్కారం చూపిస్తూ భారతీయ సామాజిక పరిస్థితిని బలంగా ప్రభావితం చేసింది. సంత్ రవిదాసు సామాజిక అస్థిరత్వాన్ని తగ్గించేందుకు బాగా ప్రయత్నించారు. సంత్ రవిదాసు బోధన, ఆయన సాధన సామాజిక జీవితానికి దగ్గరగా ఉంది. రవిదాసు భారతీయ సామాజిక ధార్మిక రంగాల్లోకి తన కరుణ, స్నేహభావాన్ని ప్రసరింపజేశాడు.
ఆయన కవిత్వానికి సంపూర్ణ జీవితం ఆధారంగా ఉంది. ఆయన జీవితం బహుముఖమైంది. సామాజిక ప్రగతికి ప్రతిబంధకాలైన వాటిపట్ల, ఆ ఆచారాల పట్ల, రవిదాస్ యుద్ధాన్ని ప్రకటించాడు. నాటి సామాజికత మూఢ విశ్వాసాలపై ఆయన తిరగబడ్డాడు. సామాజిక జఢత్వం కారణంగా ఆయన అనేక కష్టాల పాలయ్యాడు. తనని కష్టాల పాల్జేసిన సామాజిక జఢత్వాన్ని నిరోధించేందుకు ఆయన తన రచనల్ని ఆయుధాలుగా ప్రయోగించాడు. తన సమాజాన్ని హీన భావన నుండి విముక్తం చేసి వారిలో ఆత్మగౌరవ భావనని రవిదాసు కలిగించాడు. సంత్ రవిదాసు భక్తి, సాహిత్యం సమాజం నుండి మనిషిని తొలగించే ప్రయత్నం చేయలేదు. ఆయన విశాలమైన దృష్టి సమాజంలో సమానత్వపు బీజాల్ని నాటేందుకు తోడ్పడ్డాయి. నాటి సమాజంలో మత ప్రభావం అధికంగా ఉండడంతో ఆయన మతం, భక్తి మాధ్యమాలుగా తన భావనల్ని ప్రయోగించాడు. అన్యాయం, అసమానత్వం, కర్మకాండలు, దురాచారాల్ని వ్యతిరేకిస్తూ సంత్ రవిదాసు విప్లవాత్మకమైన రూపంలో మన ముందుకు వస్తున్నాడు. ఆయన తన వృత్తి పట్ల గౌరవభావం ఉంది. ఆయనకు తన కులం పట్ల ఉన్న భావన ఏమంటే తనకి అవకాశం ఉంటే ప్రతి జన్మలోనూ ఇదే కులంలోనే పుట్టాలని కోరుకున్నాడు. ఆయన ప్రేమ సద్భావాల అసలైన రూపాన్ని విశ్వాసంగా గ్రహించి సమాజానికి మార్గం చూపాడు. నిద్రపోతున్న ఆత్మని నిద్రలేపి పోరాట మార్గంవైపు మరలించాడు. ఆయన ప్రబోధాలు మానవ విముక్తి ప్రశ్నలతో సామాజిక సందర్భంతో కలిసి ప్రయాణించాయి.హిందీ కవిత్వ చరిత్రని ఒకసారి పరిశీలిస్తే, చరిత్ర పేజీలని వెనక్కి తిప్పితే నాటి సంత్ రవిదాసు చుట్టూ అలముకున్న పరిస్థితి ఎంత భయంకరమో, అమానవీయమైనదో తెలుస్తుంది. నిరంతరం దాడులు, అణచివేతలతో కూడిన భయకంపితమైన భారతీయ సమాజం నివాసాలు కోల్పోయి రేయింబవళ్లు భయం నీడ క్రింద బ్రతికిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిరంతరం వారి బ్రతుకు పోరాటం గోచరమౌతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో రవిదాసు ప్రభవించడం అనేది కారు చీకటిని దునుమాడిన ప్రజ్ఞా సూర్యునిలా తప్ప మరేమీ లేదు.
భారతీయ సామాజిక వ్యవస్థలో అసమానతలే పునాదులుగా గల సిద్ధాంతం మధ్య విదేశీ దండయాత్రల నడుమ భారతీయ సమాజం రవిదాసు బోధనల్ని శిరసావహించి ఆ పరిస్థితుల్లో వెలుగు దివిటీల్లా నిలబడింది. సంత్ రవిదాసు వ్యక్తిత్వం వినోదాలకు దూరంగా ఉండేది. ఆయన దార్శనిక బోధనలు ముసుగు కప్పుకొని ఉండేవి కావు. రవిదాసు పుట్టుక గురించి కొంత వివాదం ఉంది. కొంతమంది ఆయన (క్రీ.శ 1376లో జన్మించాడని కొంతమంది ఆయన క్రీ.శ 1471లో జన్మించాడని అంటారు. ఆయన 126 సంవత్సరాలు జీవించాడని చెప్తారు. రవిదాస్ రామాయణంలో ఆయన తండ్రి పేరు 'రాహు' తల్లి పేరు 'కర్మా' అని చెప్పుకున్నారు. ఆయన భార్య పేరు 'లోనా' అని చెప్పారు. ''నాగర్ జనా మేరీ జాతి విఖ్యాత చమార్'' అని ఆయన స్వయంగా తనని తాను 'చమార్'గా పరిచయం చేసుకొని కుల అహంకారాన్ని ఖండించాడు.
రవిదాసు తన బోధనల్లో తన వృత్తిని ఇలా ప్రకటించుకున్నాడు. ''జాకే కుటుంబ్ కే ఢేడ్ సమ్ ఢోర్ ఢోవత్!/ ఫిరిహుః ఆజహు జనారసీ ఆస్‌పాస్!'' రవిదాసు చెప్పులు కుట్టి, చెప్పులు మరమ్మత్తు చేసి పేదరికంతో వారణాసి దగ్గర సాధారణమైన జీవితాన్ని గడిపాడు. పుస్తక జ్ఞానం లేకున్నా ఆయన ఆత్మజ్ఞానపు అంతిమ స్థానాన్ని చేరుకున్నాడు. ఆయన జ్ఞానాన్ని ఆర్జించి దేశమంతటా పర్యటించాడు. ఆయన ప్రబోధాలకు ప్రభావితం చెంది ఘాలీరాణి, మీరాభాయి ఆయన శిష్యులుగా మారారు. సంత్ రవిదాసు సాహిత్యం అనేక చోట్ల దొరుకుతుంది. సాగర్ ప్రచురణ సభ పరిశోధన పత్రాలననుసరించి క్రింది పుస్తకాలు ఆయనవి అందుబాటులో ఉన్నాయి. 'రైదాస్ బేక్ బాని'. రైదాస్‌జీకి సాఖీ, తథా పద్, మొదలైనవి రవిదాసు 1576లో చనిపోయాడని కొందరు 1597లో చనిపోయాడు. మరికొందరు ప్రకటించారు.
రవిదాసు ఒకచోట- ''ఎకై మాటకీ సభీ భాండె/ కాన శూద్ర్ క్యా పాండె'' శూద్రుడు పండితుల మధ్య ఎలాంటి తేడాలు లేవు. అందరిలో ఒకేరకమైన రక్తం ప్రవహిస్తుంది. రక్తమాంసాలు కూడా ఒకలాగే ఉంటాయి''. అంటాడు సంత్ రవిదాసు మరోచోట ఇలా అంటారు - హిందూ పూజయీ దెహరా. ముసల్‌మాన్ మసీతి రవిదాస్ పూజయీ ఉస్‌రామ్‌కో, జిస్ నిరంతర్ ప్రీతి||
హిందువులు దేవతల్ని పూజిస్తారు. ముస్లింలు మసీదులోకెళ్లి నమాజ్ చదువుతారు. కానీ ప్రతి మనిషిలో కూడా ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవున్ని పూజించటం అన్నింటికన్నా ఉత్తమం. అందరికీ బ్రతికే అవకాశం ఇవ్వాలి. మనుషులు ఒకరితో ఒకరు ప్రేమ భావంతో స్నేహితుల్లా మెలగాలి అని అర్థం. మరోచోట - మసిజిద్ సోం కభు ఘిక్ నహిఁ మందిర్ సోసహిఁ ప్యార్, దో మహం అల్లాV్‌ా రామ్ నహీఁ, కV్‌ా రవిదాస్ చముర్|| రవిదాసు తనని తాను చముర్ అని ప్రస్తావించుకుంటూ ప్రత్యేకమైన ఆలోచనని కలిగిస్తున్నాడు. మాకు మసీదుపై వ్యతిరేకత లేదు. దేవాలయంపై ప్రత్యేక ప్రేమ లేదు. వ్యర్థమైన పూజలు ఇవన్నీ. అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం పొంది నిజమైన మనసుతో మానవ సేవ చేయాలంటాడు. ఈ విధంగా హిందూ మతపు పతన దశలో ప్రవక్తగా ఉద్భవించి అనేక మతాల మూఢనమ్మకాల్ని వ్యతిరేకించి, మానవీయ ధర్మాన్ని ప్రవచించి భారతదేశ అంటరాని కులాలకి మహోన్నతమైన మర్గాన్ని చూపించిన సంత్ రవిదాస్ సదాస్మరణీయుడు.
- డా|| జి.వి రత్నాకర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి