9989628049, vrdarla@gmail.com
చిక్కనవుతున్నపాట, నీలిమేఘాలు, నల్లపొద్దు, మాదిగ చైతన్యం లాంటి పుస్తకాల స్థాయిలో మళ్ళీ తెలుగు సాహిత్య చరిత్రలో ఒక గొప్పస్థానాన్ని పొందగలిగిన పుస్తకమవుతుంది. గిరిజన కథలను కూడా దళిత, స్త్రీవాద కథలలాగే గిరిజనేతరులే ముందుగా ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో, ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే ఇటీవల కాలంలోనే గిరిజనులు కూడా కథల్ని రాస్తున్నారు. తమ జీవితాల్ని తామే రాసుకోవాలని నష్టపోతున్న దళిత సాహిత్య అస్తిత్త్వవాతావరణంలో ఇలాంటి సంపుటి వెలువడడం కొత్త ఆలోచనలకు మరో పిలుపునిచ్చే ఆశను కూడా కలిగిస్తుంది.
చాలా మంది పరిశోధకులు, విమర్శకులు ఇంతవరకూ చింతాదీక్షితులు ( 1891- 1956) రాసిన చెంచురాణి కథనే తొలి గిరిజన కథగా భావించేవారు. కానీ, గూడూరు రాజేంద్రరావు ( 1904 - 1945) రాసిన చెంచు కథ మొట్టమొదటి గిరిజన కథగా నిలుస్తుందనే ప్రతిపాదన ఈ పుస్తకంలో కనిపిస్తుంది.
గిరిజన దంపతుల పెండ్లికి చీరకొనుక్కోవడానికి ఆరు రూపాయల అప్పు ఇచ్చి, ఆ చెంచిని అనుభవించాలని నిరంతరం ప్రయత్నించి, చివరికెలాగోలా బలాత్కరించి, ఆమెను చంపేసిన కాబూలీవాలా వికృతస్వభావంతో పాటు, ఆ దంపతులను పనిచేయించుకోవడమే తప్ప వాళ్ళని మనుషులుగా పరిగణించని సమాజ స్వభావాన్ని శిల్పబిగువుతో వర్ణించిన కథ చెంచు. ఆ గిరిజన దంపతుల మధ్య గల స్వచ్చమైన, విడదీయలేని అనురాగం, కళ్ళుపోతున్న తన భర్తను కాపాడుకుంటూనే, కాబూలీవాలా వికృతచేష్టల్ని చెప్పుకోలేక, తప్పించుకోలేక ఆ చెంచి పడిన సంఘర్షణను చిత్రించడంలో రచయిత ప్రతిభ అనన్యసామాన్యం.
చెంచురాణి కథ గిరిజనుల్లో గల ఆచారాలకు బలైపోయిన ఒక ప్రేమమూర్తి జీవితం చుట్టూతిరుగుతుంది. కర్నూలు పరిసరాల్లోని గిరిజన తెగల్లో చెంచుల్ని ఊచకోతకోసిన చారిత్రక సంఘటనల్ని చెత్రిస్తూ రచయిత్ర సామాజిక వాస్తవికతతో గిరిజనుల పక్షం వహించాడు. గిరిజనేతర రచయిత అయినప్పటికీ ఆ సంస్కృతిని, సంప్రదాయాన్నీ, అన్నింటికీ మించి ఆ జీవితాన్ని గొప్పగా ఆవిష్కరించాడు. చెంచురాణి ప్రేమకథను సామాజిక సమస్యతో ముడిపెట్టి నడిపించడంలో గొప్పనైపుణ్యాన్ని సాధించాడు. అడవిని నమ్ముకున్న గిరిజన చెంచులు, తమ ఆహారం “ నాగరికుల” పరమైపోతూ, తాము ఆకలితో నకనకలాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అడవిలోని పంటనంతా పట్టుకుపోతుంటే, దాన్ని దక్కించుకోవడానికి గిరిజనుల్లో అందమైన ఒక యువతి చెంచిత పరిష్కారాన్ని సూచించిన వాళ్ళని పెళ్ళిచేసుకుంటానంటుంది. అప్పటికే ఆమెను ఒకతను ప్రేమిస్తున్నా, మరొకడు పరిష్కారం సూచించడంతో, ఆ పరిష్కారం వల్ల మళ్ళీ తమ జాతి ప్రజలకు ఆహారం దొరికి సుఖసంతోషాలతో ఉండటం వల్ల ఆతన్ని వివాహం చేసుకుంటుంది. కానీ, తన మొదటి ప్రేమికుడి అభ్యర్థన మేరకు రహస్యంగా కలిసి మెలిసి ఉండటం, దాన్ని ప్రజలు గమనించి, పెద్దలు శిక్ష వేసి పదిహేను రూపాయలు చెల్లించమంటారు. కానీ, వాటిని చెల్లించలేకపోతాడు. జాలితో ఆ డబ్బుని ఒక తెల్లదొర చెల్లిస్తాడు. దానితో మళ్ళీ ఆమె దొరకే చెందాలని పెద్దలు నిర్ణయించడం, ఆ దొరకి ఆ ఉద్దేశం లేకపోయినా, కొన్నాళ్ళు కలిసి ఉన్నతర్వాత, ఆమె గర్బవతి కావడం, ఆ దొర బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం, అతనితో పాటు మాత్రం ఆమెను తీసుకెళ్ళడాని అతను అంగీకరించకపోవడం, అయినా ఏ నాటికైనా తన భర్త వచ్చి తీసుకెళ్ళతాడని అలాగే ఉండిపోతుంది. మళ్ళీ ఇంతకు ముందు ప్రేమించిన, పెళ్ళిచేసుకున్న వాళ్ళిద్దరూ వచ్చి రమ్మన్నా రాకుండా అక్కడే జీవితాన్ని చాలిస్తుంది. ఇది ఈ కథ.
చెంచి కథ వ్యవహారంలోనూ, చెంచురాణి సరళ వ్యవహారికంలోనూ సాగినా, రెండూ శిల్పం దృష్ట్యా చూసినా గొప్పకథలే. ఇలాంటి కథలతో పాటు కరుణకుమార 512 ; భూషణం పులుసు, ఫణికుమార్ దండారి; సాహు రక్తపింజెర ; బి.ఎస్.రాములు అడవిలో వెన్నెల ; పి.చంద్ అనామతు ఖాతా ; అట్టాడ అప్పలనాయుడు అరణ్యపర్వం ; అల్లం రాజయ్య మలుపు ; గోపి భాగ్యలక్ష్మి జంగుబాయి ; ఎ.విద్యాసాగర్ కొండకు కట్టెలు మొయ్యమంటారా సారూ?; వాడ్రేవు వీరలక్ష్మీ దేవి కొండాఫలం ; సువర్ణముఖి గోరపిట్ట ; గంటేడు గౌరునాయుడు ఆర్తి శ్రీరామ్ కవచం సాగర్ కలలోని వ్యక్తి; పెద్దింటి అశోక్ కుమార్ గోస ; బోయి జంగయ్య ఇప్పపూలు; జాతశ్రీ వ్యక్తిగతం; జీవన్ పోటెత్తిన జనసంద్రం ; కొండవీటి సత్యవతి గూడు ; డా.వి.ఆర్. రాసాని పయనం; డా.దిలావర్ అరణ్యరోదన, శిరంశెట్టి కాంతారావు బిగిసిన ఆ పిడికిళ్ళు ; భూక్యా తిరుపతి కాక్లా ; భూక్యానర్సింగ్ మీటు భూక్యా; మల్లిపురం జగదీష్ దారి; పి.విద్యాసాగర్ దాడి; పద్దం అనసూయ మూగవోయిన శబ్దం వంటి చర్చకు అవకాశం ఉన్న కథలు ఇందులో ఎంపిక చేశారు.
కొండఫలం కథ గిరిజనుల దోపిడీని చిత్రిస్తుంది. కులాంతర వివాహాల పేరుతో గిరిజనుల భూముల్ని ఇతరులెలా అనుభవిస్తున్నారో, ఆ దోపిడీ నుండి కాపాడవలసిన చట్టాలు, న్యాయ వ్యవస్థ వాళ్ళతో ఎలా ఆటలాడుకుంటుందో కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది. ఇలా తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళను దోపిడీ చేయడం తగ్గాలంటే అందరికీ విద్యావకాశాలు లభించినప్పుడే అది సాధ్యమవుతుందని రచయిత్రి భావన కావచ్చు. బినామీ పేర్లతో, దొంగ కుల ధృవీకరణ పత్రాలతో గిరిజనులను మోసగించడం ఈ కథలో కనిపిస్తుంది. యూనివర్సిటీల్లో జరిగే రీసెర్చ్ ప్రాజెక్టుల పట్ల కూడా చురక కనిపిస్తుంది.
ఇప్పపూలు కథలో గిరిజనుల పై జరిగే ఎక్సైజ్ దాడులు, దాడుల ముసుగులో ఆడవాళ్ళపై జరిగే అత్యాచారాలు, జంతువులు ఎత్తుకుపోయాయని మోసగిస్తూ పిల్లల్ని అమ్ముకునే వాళ్ళ కుత్సితాలు వర్ణించారు. మనుషుల కంటే ఆడవి, జంతువులే నిష్కల్మషంగా కాపాడుతున్న వైనం ఈ కథలో కనిపిస్తుంది. ఆడవిలో పడి ఉన్న ఇప్పపూలను ఏరుకొని తమ శ్రమను మరిచిపోవడానికి నైజామ్ ప్రభుత్వం కూడా అనుమతించినా, సారా నిషేధం పేరుతో గిరిజనుల కాసుకొని, జీవనోపాధిని పొందేవాళ్ళని ఎలా హింసిస్తున్నారో చెప్పారు. ఆ ఇప్పపూలతో గిరిజనులు సారా కాయడం నిషేధమవుతుంది. కానీ, అవే పూలను సేకరించి ఫ్యాక్టరీల్లో వైన్ తయారు చేసి ప్రభుత్వం అమ్మితే తప్పుకాని ఒక విచిత్ర పరిస్థితిని ఎండగట్టిందీ కథ.
ఈ చిన్న వ్యాసంలో కథలన్నింటినీ వివరించటం శక్తికి మించిన పని. కానీ, ఈ కథల్లో సుమారు ఎనిమిది శతాబ్ధాలుగా గిరిజన తెగలు అనుభవిస్తున్న అనేక కష్ట నష్టాలను, వారి అన్యోన్యతను, త్యాగాల్ని, ఆచార, సంప్రదాయాల్ని, నిరక్షరాస్యతను, భూమికోసం, భుక్తికోసం జరుగుతున్న పోరాటాన్ని, వారిపై జరుగుతున్న రకరకాల దోపిడీలను చాలా వరకూ చూడవచ్చు. పాము కాట్లకు గురైనా సరైన వైద్యం దొరక్క ప్రాణాలెలా కోల్పోతున్నారో అరవైయ్యేళ్ళ స్వాతంత్ర్య భారతావనిలో ప్రతి పౌరుడూ ఆలోచించాల్సిన విషయాలు. తమకి రక్షణనిచ్చే వాళ్ళెవరో తెలియక, ఉన్న చట్టాలు, న్యాయస్థానాలు తమకి తోడ్పడలేనప్పుడు తప్పని సరిపరిస్థితుల్లో సాయుధులుగా ఎలా మారిపోతున్నారో గుర్తించమని చెప్పేకథలిందులో ఉన్నాయి.
తెలుగు వాళ్ళు జీవిస్తున్న ప్రాంతాల్లో సుమారు 33 గిరిజన తెగల వాళ్ళు జీవిస్తున్నారని పరిశోధకులు పేర్కొంటున్నా, అన్ని తెగల వారి జీవితాల్ని ఆవిష్కరించే కథలు మాత్రం ఇంకా రావట్లేదు. కొన్ని తెగల వారి జీవితాల్ని మాత్రమే వర్ణిస్తున్నారనీ, మిగతా తెగలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందనే విషయం మన కళ్ళముందుంచుతుందీ పుస్తకం.
( ఇప్పపూలు ( గిరిజన సంచార తెగల కథలు), సంపాదకులు ; ఆచార్య జయధీర్ తిరుమల రావు, జీవన్, పుస్తకం ఖరీదు రూ. 150/-లు, పుటలు : 336, అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో అభిస్తుంది)
( సూర్య పత్రిక కోసం రాసిన వ్యాసం, 18-1-2010 న ప్రచురించారు. అయితే దానిలో కొంత ఎడిట్ చేశారు. అందువల్ల పూర్తి వ్యాసాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను...దార్ల )
1 కామెంట్:
ippapoolu navla chala bagundi etuvanti navals chala ravaali k.damodar rao ph 9392008762
కామెంట్‌ను పోస్ట్ చేయండి