"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

28 డిసెంబర్, 2009

'సమైక్యత' ఎవరి కోసం?

( సాంబయ్య గుండిమెడ రాసిన వ్యాసాన్ని ఆంధ్రజ్యోతికి పంపి దాన్ని నా బ్లాగులో పెట్టమని రచయిత ఫోను చేశారు. ఆంధ్రజ్యోతిలో నిన్న( 27-12-2009) దాన్ని ప్రచురించారు. ఆ వ్యాసాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.. దార్ల)

ఆంధ్ర విశ్వ విద్యాలయం వంటి కొన్ని చోట్ల అణగారిన కుల-వర్గాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమైక్య ఆంధ్ర అంటూ ఉద్యమంలో ముందున్నప్పటికీ, నిజానికి ఈ ఉద్యమం ద్వారా వారు బావుకునేది ఏమీ లేదు. సమైక్యంగా ఉండడం వల్ల వారు పొందుతున్న ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల ఈ ప్రత్యేక ప్రయోజనాలకు ఎట్లా గండి పడుతుందో ఓ పట్టాన అర్థం కావడం లేదు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియను మొదలు పెడతామని కేంద్ర హోం మంత్రి చిదంబరం మొదట ప్రకటించిన తరువాత కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, ప్రజల వినిపించిన వాదాలు, చేపట్టిన చేష్టలు ఆశ్చర్యం కలిగించాయి. మలిదశం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆరంభమైన దగ్గర నుంచి ఏనాడు మచ్చుకైనా వినిపించని సమైక్య వాదం ఇప్పుడు ఎందుకు ఇంత ప్రబలంగా వినిపిస్తున్నది? ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కానీ, సమైక్య వాదానికి మద్దతుగా కానీ కనీసం ఓ మీటింగ్‌ పెట్టడం, ఓ చిన్న పాదయాత్ర జరపడం చేయని కోస్తాంధ్ర, రాయలసీమ నాయకులు, ప్రజలు ఇప్పుడు భారీ ఎత్తున బయటకొచ్చి నిరసన వ్యక్తం చేయడంలో ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి? అసలు సమైక్యవాద ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందా లేక ఆర్థిక, రాజకీయ, సామాజిక బలాలున్న కొందరు వ్యక్తులు స్పాన్సర్‌ చేసిందా? ఇటీవల శక్తివంతంగా జరిగిన విద్యార్థి ఉద్యమం వల్లనే తెలంగాణకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది అనుకుంటే పొరపాటే.

అంతకు ముందు ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ మరింత బలంగా ఉన్నా కేంద్రం ఎందుకు సానుకూలత చూపలేదో అర్థం చేసుకోవాలి. వై.ఎస్‌. మరణం, చంద్రబాబు అధి కార లేమి ప్రత్యేక తెలంగాణకు మార్గం సుగమం చేశాయి. ఆంధ్ర విశ్వ విద్యాలయం వంటి కొన్ని చోట్ల అణగారిన కుల-వర్గాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది సమైక్య ఆంధ్ర అంటూ ఉద్యమంలో ముందున్నప్పటికీ, నిజానికి ఈ ఉద్య మం ద్వారా వారు బావుకునేది ఏమీ లేదు. సమైక్యంగా ఉండడం వల్ల వారు పొందుతున్న ప్రత్యేక ప్రయోజనాలు ఏమిటో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడం వల్ల ఈ ప్రత్యేక ప్రయోజనాలకు ఎట్లా గండి పడుతుందో ఓ పట్టాన అర్థం కావడం లేదు.

అయితే వారికి తెలుసో, తెలియదో కానీ ఒక్క విషయం మాత్రం నిజం. సమైక్య ఆంధ్ర ఉద్యమం వెనుక అగ్రకులాలున్నాయి. ముఖ్యంగా ఆ కులాలలో ఆర్థికంగా బలపడిన వర్గాల వారి ప్రయోజనాలున్నాయి. హైదరాబాద్‌లో, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలలో బట్టల వ్యాపారం దగ్గర నుంచి, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, షాపింగ్‌ మాల్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం, మీడియా - వంటివి కోస్తాంధ్ర, రాయలసీమ వారి చేతిలో ఉన్నాయి. వీరి వ్యాపార సామ్రాజ్యాలలో పనిచేసే ఉద్యో గస్తులలో కింది శ్రేణిని తప్పించి ఉన్నత, మధ్య శ్రేణులకు చెందిన వారి సామాజిక, ప్రాంతీయ చిట్టా తీస్తే అప్పుడు తెలుస్తుంది, ఆ వ్యాపార అధిపతులలో పేరుకు పోయిన కుల, ప్రాంతీయ తత్వం.

మరి ఉన్నత కులాల వారు నిర్వహిస్తున్న వ్యాపారాలలో , సంస్థలలో తమకు ఉద్యోగాలు కూడా ఇవ్వని అగ్రకుల వర్గాలు నడిపిస్తున్న సమైక్య ఉద్యమంలో అణచివేతకు గురి కాబడిన కుల వర్గాల వారు సిపాయిలుగా ఎందుకు మారాలో అర్థం కావడం లేదు. హైదరాబాద్‌లో, నగర శివారులో సంస్కృతి కళల పేరిట, అభివృద్ధి వ్యాపారాల పేరిట ఉన్నత వర్గాలకు కట్టబెట్టిన వేలాది ఎకరాల చిట్టాను బయటకు తీసే అవకాశం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది సాధ్యమైన రోజున అన్యాయంగా కట్టబెట్టిన , అక్రమం గా ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం తీసుకుని తెలంగాణలో అణగారిన కుల-వర్గాలకు, అగ్రకులాలలోని పేదలకు పంచడానికి మార్గం సుగమం అవుతుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వల్ల మైనారిటీల రక్షణకు భంగం కలుగుతుందనే వాదనను కొందరు ముందుకు తెస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. నిజాం చరిత్రను పరికిస్తే- వందల ఏళ్ళుగా హైదరాబాద్‌ సంస్థానంలో భిన్న మతాల వారు సామరస్యంతో జీవించారు. హైదరాబాద్‌, సికిందరాబాద్‌లలోనే కాదు తెలంగాణలోని పలు చోట్ల క్రైస్తవ దేవాలయాలు నిజాం కాలంలో నిర్మితమయ్యాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత మైనారిటీల శాతం పెరిగి మరిన్ని ప్రయోజనాలు సాధించుకోవచ్చు. ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి, మైనారిటీలు సమైక్యాంధ్ర వాదాన్ని వ్యతిరేకించి, ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలుపవలసి ఉంది.

ఇందుకు తగిన కారణాలున్నాయి. కోస్తాంధ్రలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందడం వల్ల ఈ ప్రాంతంలోని కింది కుల-వర్గాలవారు కొందరయినా విద్య నేర్చుకుని ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. కానీ విద్యాభివృద్ధి అంతగా లేని తెలంగాణలో కింది కుల-వర్గాల వారు అధికశాతం ఇంకా వ్యవ సాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కృష్ణా గోదావరి వంటి జీవనదులు తమ ముంగిటే ప్రవ హిస్తున్నప్పటికీ వాటిని తమ పొలాల్లోకి మళ్ళించుకోలేక పోతున్నారు. తెలంగాణ వస్తే వారి ముంగిట్లో పరవళ్లు తొక్కుకుంటూ పారే నదీ ప్రవాహాలను తమ పొలాలకు మళ్లించుకుంటారు. కొత్త రాష్ట్రం అంటే ప్రభుత్వంలోని ప్రతి శాఖను ప్రత్యేకించి ఏర్పాటు చేయవలసి ఉంటుం ది.

దీని వల్ల ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీనిలో ఎస్‌సి, బిసి, ఎస్‌టి, మైనారిటీలకు తమ కోటా ఎలాగూ ఉంటుంది. అంబేద్కర్‌, ఆయన అనుయాయుల చిరకాల స్వప్నం దళిత ఆదివాసీ బహుజన మైనారిటీ వర్గాల వారికి రాజ్యాధికారం. ఇప్పటి వరకు రెండు కులాల వారే అన్ని పార్టీలను గుప్పెట్లో పెట్టుకుని పాలిస్తున్నారు. తెలంగాణలో బహు సంఖ్యలో ఉన్న దళి త, ఆది వాసీ, మైనారిటీలు ఉమ్మడిగా రాజ్యాధికారాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో చేజిక్కించుకునే ఒక సువర్ణ అవకాశాన్ని తెలంగాణ రాష్ట్రం కల్పిస్తుంది. అందుకే న్యాయబద్ధమైన తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సమర్థించవలసిన బాధ్యత అణచివేతకు గురవుతున్న కుల-వర్గాల ప్రజలపై ఉంది.

- సాంబయ్య గుండిమెడ
(వ్యాసకర్త గుంటూరు జిల్లా వాస్తవ్యుడు, లండన్‌ విశ్వవిద్యాలయంలో పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలో)

5 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అది సాధ్యమైన రోజున అన్యాయంగా కట్టబెట్టిన , అక్రమం గా ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం తీసుకుని తెలంగాణలో అణగారిన కుల-వర్గాలకు, అగ్రకులాలలోని పేదలకు పంచడానికి మార్గం సుగమం అవుతుంది.
మిగతా వాటి సంగతేమో కానీ ఈ వాఖ్యంలో నాకు చాలా అర్థాలు కనపడుతున్నాయి.

Nrahamthulla చెప్పారు...

ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదనలుః

* మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్‌ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్‌ చుట్టూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్‌ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్‌ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.

Nrahamthulla చెప్పారు...

ఆనాడు తొందరపడి ఇతర రాష్ట్రాల్లో కలిపేసిన తెలుగు ప్రాంతాలు ఇవిః
ఒడిసా – గంజాం,బరంపురం,కోరాపుట్,పర్లాకిమిడి.
కర్నాటక – చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి.
మహారాష్ట్ర – చంద్రపూర్,గచ్చిబోల్
చత్తీస్గడ్ – బీజాపూర్,బస్తర్,దంతెవాడ.
తమిళనాడు – హోసూరు,దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట.
పాండిచేరి -యానాం
సమైక్య ఆంధ్ర(ఆంధ్రప్రదేశ్)కే బీటలు పడుతుంటే,ఇక పై తెలుగు ప్రాంతాలతో కలిసిన మహా తెలుగునాడు(విశాలాంధ్ర)ఆవిర్భవిస్తుందా?

Nrahamthulla చెప్పారు...

చిన్న రాష్ట్రాలే చిదంబర రహస్యం

చిన్న రాష్ట్రాలే పటిష్ఠమైన ఆర్థిక పునాదికి కారణమవుతాయని కేంద్ర హోం మంత్రి చిదంబరం 2003లో వేకప్‌ టు ద కేస్‌ ఆఫ్‌ స్టేట్స్‌ శీర్షికన తాను రాసిన వ్యాసంలో స్పష్టం చేశారు. దానితోపాటు మరికొన్ని వ్యాసాలను సంకలనంగా చేసి ఏ వ్యూ ఫ్రమ్‌ ద అవుట్‌ సైడ్‌ పేరిట పుస్తకాన్ని ప్రచురించారు.

ఇంతకీ ఆ వ్యాసంలో ఆయన ఏమన్నారంటే.. చిన్న రాష్ట్రాల్లోని ప్రజలు ప్రతి విషయానికి ప్రభుత్వంపై ఆధారపడే అవసరం ఉండదని, మహారాష్ట్ర నుంచి గోవా విడిపోయిన తర్వాత 11 మంది సీఎంలు మారినా అక్కడ అభివృద్ధి ఏ మాత్రం నిలిచిపోలేదని వివరించారు. గతంలోనూ కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

సీఎంలు ఎంతమంది మారారన్నది ప్రధానం కాదని.. సక్రమమైన పనితీరుతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. మహారాష్ట్ర మూడు రాష్ట్రాలుగా విడిపోవడం వల్లనే గుజరాత్‌, గోవా అభివృద్ధి చెందాయని.. గోవా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, హర్యానా, పంజాబ్‌ అభివృద్ధిలో పెద్ద రాష్ట్రాలతో సమానంగా పోటీ పడుతున్నాయని చిదంబరం వివరించారు.

రాష్ట్రాల విభజన రాజకీయ నాయకుల ఇష్టారాజ్యంగా ఉండరాదని, విభజన విషయంలో ప్రత్యేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా రాష్ట్ర విస్తీర్ణం, జనాభా, భౌగోళిక పరిస్థితుల ఆధారంగానే విభజన ఉండాలని అభిప్రాయపడ్డారు.

అన్ని రాష్ట్రాలను విభజించాల్సిన అవసరం లేదని, జనాభాను ప్రాతిపదికగా తీసుకుని పరిశీలిస్తే.. మహారాష్ట్రలో 9.67 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో 7.57 కోట్ల జనాభా ఉందని, ఈ 2 రాష్ట్రాల నుంచి విదర్భ, తెలంగాణలను విభజించాల్సి ఉందన్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లనూ మరోసారి విభజించాలని అభిప్రాయపడ్డారు.

మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, బీహార్‌ నుంచి జార్ఖండ్‌ విడిపోయినా.. అక్కడి ప్రభుత్వాల అధ్వాన పాలన కారణంగా సమస్యలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దేశంలో ఉన్న పేదల్లో 45 శాతం మంది ఈ మూడు రాష్ట్రాల్లోనే ఉన్నారని, ఇక్కడ వృద్ధిరేటు, తలసరి ఆదాయం తక్కువగా ఉన్నాయని వివరించారు. వెనకబడిన రాష్ట్రాల్లో మానవ వనరులు ఉన్నా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నాయని పేర్కొన్నారు. (ఆంధ్ర జ్యోతి౨.౨.౨౦౧౦)

Rajendra Devarapalli చెప్పారు...

శ్రీ చిదంబరంగారు ఏమి రాసిందీ నేను ఇంకా చదవలేదు కానీ శ్ర్రీవారి అంతర్యం బహుశా చిన్నరాష్ట్రాలకు కొలబద్ద అచ్చంగా.ఖచ్చింతంగా తమిళనాడంత ఉండాలనా?అందుకు విరుద్ధంగా ప్రకటనచేస్తే తిరుకరుణానిధివారు ఎలాంటి శిక్ష విధించగలరో ఊహించలేనంత అమాయకులు మాత్రం కాదు చిదంబరం.