తెలుగు సాహిత్య విమర్శ-వివిధ ధోరణులు
తెలుగు సాహిత్య విమర్శను కాలానుగుణంగా మూడు ప్రధానమైన విభాగాలుగా విభజించుకొనేవీలుంది. అవి: ప్రాచీన సాహిత్య విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ, అత్యాధునిక సాహిత్య విమర్శ.
ఆధునిక, అత్యాధునిక అనే పారిభాషిక పదాల ప్రయోగం పట్ల సాహితీ వేత్తల్లో భిన్నఅభిప్రాయాలున్నప్పటికీ, ఆధునిక సాహిత్య విమర్శను రెండు విభాగాలుగా చేసుకున్నా, రెండవదశను అత్యాధునిక లేదా ఆధునికానంతర, లేదా ఉత్తరాధునిక కాలంగా గుర్తిస్తున్నారు.
ప్రాచీన సాహిత్య విమర్శలో అలంకార శాస్త్రాలను ప్రమాణంగా తీసుకొని సాహిత్య విలువల
నిర్ణయం జరిగింది. గుణ దోష ప్రకరణాదులుగా విభజించుకొని సాహిత్య ప్రమాణాలను నిర్ణయించేదిగా కొనసాగింది. దానిలోకవుల అభిప్రాయాలు, ఆలంకారికుల ప్రమాణాలు సాహిత్య విలువల నిర్ణయంలో ప్రధాన ప్రభావాన్నిచూపాయి.
కందుకూరి వీరేశలింగం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డిగార్ల సాహిత్య విమర్శతో తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ ప్రారంభమవ్వడం లేదా పాశ్చాత్య ప్రభావం ప్రత్యక్షంగా కనిపించడం ప్రారంభించింది. దీనితో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శపై పాశ్చాత్య ప్రభావం గురించి అనివార్యంగా చర్చించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కవి జీవిత, మార్క్సిస్టు, మనోవైజ్ఞానిక, తులనాత్మక విమర్శ వంటివన్నీ సాహిత్య విమర్శలో ప్రధాన అధ్యయన అంశాలయ్యాయి. వీటితో పాటు సాహిత్యంలో సాంస్కృతిక అంశాల ప్రతిఫలనం ఆధారంగా సాంస్కృతిక విమర్శ కూడా వస్తుంది.
సాహిత్యం ప్రతిఫలించే వివిధ సామాజిక వర్గాల జీవిత నేపథ్యాల, వర్గ, లింగ, ప్రాంతాల ప్రాతిపదికతో కూడా సాహిత్య విలువల నిర్ణయం జరుగుతుంది. ఆ విధంగా సంప్రదాయ, నవ్యసంప్రదాయ సాహిత్య విమర్శ ధోరణులతో పాటు స్త్రీవాద, దళిత, మైనారిటీ, ప్రాంతీయ, అస్తిత్త్వ వాదాలను కూడా అధ్యయనం చేస్తూ, వాటి పేర్లతోనే ఆ విమర్శను కూడా పిలుస్తున్నారు.
స్త్రీ, దళిత వాద ఉద్యమాల్లోనూ లోతైన చూపు మొదలైంది. స్త్రీవాదంలో
దళిత స్త్రీవాదం, మైనారిటీ స్త్రీవాదం మొదలైన పాయలు బయలుదేరాయి. దళిత ఉద్యమం వల్ల
వచ్చిన దళిత సాహిత్యం, దాన్ని ఆధారంగా చేసుకొని వచ్చిన
దళిత సాహిత్య విమర్శ ఒక ధోరణిగానే గుర్తింపు పొందింది. అలాగే దళిత సాహిత్యంలో అంత: సంఘర్శణ ప్రారంభమైన
తర్వాత మాదిగ సాహిత్య వాదం బయటకొచ్చింది. మాదిగ సాహిత్యంలో అంతర్బాగంగానే దళితసాహిత్యాన్ని కూడా చూడానే ఒక వాదం కూడా ఒకటి బయలుదేరింది. కానీ, దళితసాహిత్యం పేరుతో మాదిగలకు, మాదిగ
సాహితీవేత్తలకు సరైన స్థానం, గుర్తింపులభించడంలేదనే వాదనతోనే మాదిగసాహిత్యం, మాదిగ
సాహిత్య విమర్శ కూడా ముందుకొచ్చింది. మాదిగల కుల వృత్తిని, సంస్కృతిని ఆధారం చేసుకొనే ఇంతవరకూ దళిత సాహిత్యం పేరుతో కొనసాగటం వల్ల మాదిగలు, వారిఉపకులాల వారు నిర్లక్ష్యానికి గురయ్యారని వాదిస్తూ మాదిగ సాహిత్యం ముందుకొస్తుంది.
మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యం మాత్రమే కాదనీ, క్రైస్తవ మత సాహిత్యం కూడాతెలుగులో మైనారిటీ సాహిత్యమే ననే వాదన ఒకటి బయటకొస్తుంది. ముస్లిం మైనారిటీ సాహిత్యంలోకూడా ప్రగతి వాద ముస్లిం సాహిత్యం అనే వాదన మరొకటి బయలుదేరింది.
దళిత, మాదిగ,
ముస్లిం సాహిత్య వాదాలన్నీ వివక్షను వ్యతిరేకించడమనే మౌలికసూత్రానికి కట్టుబడి
ఉండటం వల్ల వారి వారి అస్తిత్త్వాలను నిలబెట్టుకొంటూనే సంప్రదాయ సాహిత్యానికీ,
సంప్రదాయ సాహిత్య విమర్శకీ ప్రత్యామ్నాయంగా బహుజన సాహిత్య విమర్శ కూడా ఒకటి తెలుగు
సాహిత్యంలో బలంగానే కనిపిస్తోంది.
సాహిత్యంలో వస్తు గుణాన్ని మాత్రమే ప్రధానంగా చేసుకోకుండా ప్రక్రియా పరమైన అంశాల పై కూడాదృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఆ విధంగా భాషను ఆధారంగా చేసుకొని శైలీ శాస్త్ర విమర్శను ముందుకుతీసుకొస్తున్నారు. దీన్ని రూపవాద విమర్శలో అంతర్భాగంగా భావిస్తే సరిపోతుందని మరికొంతమంది అంటున్నారు. సాహిత్యంలో కనిపించే వస్తువు మాత్రమే కాకుండా, సాహిత్య సౌందర్యాన్ని అభివ్యక్తీకరించే విధానంపై కూడా విమర్శ వస్తుంది.
రూపం, ప్రక్రియల పట్ల స్పష్టతను సాధించేదిశగా విమర్శరావలసిన అవసరం ఉంది. మినీకవిత, దీర్ఘకవిత, దీర్ఘకావ్యం, హైకూ, నానీ, నానో వంటి కవితా రూపాలపై విమర్శ వస్తున్నా, మరింతశాస్త్రీయంగా వెలువడవలసిన అవసరం కనిపిస్తుంది.
నాటక, సాంస్కృతిక విమర్శలో భాగంగానే కాకుండా సినిమా సాహిత్యంపై ప్రత్యేక దృష్టికేంద్రీకరించవలసిన అవసరం ఉంది. మరో వైపు పాశ్చాత్య విమర్శ ధోరణులను తెలుగుకి అనువర్తించి చూసే విమర్శకనిపిస్తుంది. దీనిలో ప్రధానంగా పోష్టుమోడర్నిజం ఒకటి. దీన్నే ఆధునికానంతరవాదం, అత్యాధునికత అనే పేర్లతో కొంతమంది విమర్శిస్తున్నారు. భాషను ఆధారంగా చేసుకొని వినిర్మాణవాదం పేరుతోనూ విమర్శ చేస్తున్నవాళ్ళున్నారు. వీటితో పాటు తెలుగు సాహిత్యంలో ప్రాంతీయ సాహిత్య వాదం, ప్రాంతీయ సాహిత్య
విమర్శ కూడా కనిపిస్తోంది.
వీటిని అన్నింటినీ లోతైన చర్చ చేసేదిశగా తెలుగు సాహిత్య విమర్శ- నేటి ధోరణులు' పేరుతో ఈ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నాం .
-------------------------------------------------------------------------------
"తెలుగు సాహిత్య విమర్శ: నేటి ధోరణులు'' జాతీయ సదస్సు, నిర్వహణ: తెలుగు శాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన చిరునామా: డా.దార్ల వెంకటేశ్వరరావు, సదస్సు సమన్వయకర్త,
ఈ మెయిల్: com,vrdarla@gmail.com, : 09989628049, 040-2313 3563. సదస్సు జరిగే తేదీలు: 17-18,సెప్టెంబరు 2009.స్థలం ;
డా. అంబేద్కర్ ఆడిటోరియం, హైదరాబాదు విశ్వవిద్యాలయం. హైదరాబాదు.
-------------------------------------------------------------------------------------------------------------
National Seminar on
''Telugu Literary Criticism: Latest Trends''
Held at Department of Telugu, University of Hyderabad, Hyderabad, Andhra Pradesh, India. For details, Contact: Dr.Darla Venkateswara Rao, Co ordinator of the seminar.
Email: vrdarla@gmail.com,
Ph: 09989628049, 040-2313 3563.
Seminar dates: 17-18, September 2009.
Venue: Dr. Ambedkar Auditorium, University of Hyderabad, Hyderabad.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి