"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-502: Techniques of writing a Dissertation క్లాసులు సోమ, మంగళ, గురు, శుక్రవారం మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ భవనంలో జరుగుతాయి.

29 డిసెంబర్, 2014

తొలి తెలుగు కథామూలాలు - వివినమూర్తి (ఆంధ్రజ్యోతి 29-12-2014 వారి సౌజన్యంతో)




గురజాడ దిద్దుబాటు కథ 1910 జనవరి-ఫిబ్రవరి ఆంధ్రభారతి సంచికలో ప్రచురింపబడింది. ఈ కథ ఇటీవలి వరకు తొలి తెలుగు కథగా విమర్శకులు, కథా చారిత్రకులు భావించేవారు. కొంతకాలంగా తెలుగులో తలెత్తిన అస్తిత్వ ఉద్యమాల వెలుతురులో తేదీల ప్రకారం 1910కి ముందే కొన్ని కథలు ప్రచురితమైన విషయం బయటకు వచ్చింది. అంతకు ముందు కూడా కొందరు ఔత్సాహికులు ఆచంట సౌంఖ్యాయనశర్మగారి లలిత, అపూర్వోపన్యాసం కథలను దిద్దుబాటు కన్నా ముందు వెలువడిన కథలుగా గుర్తించి తెలుగు సాహితీ ప్రపంచం ముందు తమ ప్రతిపాదన ఉంచారు. ఇలా తొలి తెలుగు కథగా ప్రతిపాదింపబడిన ఏడు కథలను, వాటిని ప్రతిపాదించిన వారి అభిప్రాయాలతో చేర్చి కథానిలయం ఒక సంకలనం కూడా ప్రచురించింది.
ఇంతకీ తొలి తెలుగు కథ ఏది?
సమాధానం కోసం అనేక పాత పత్రికలను నాలుగేళ్లుగా వెదుకుతున్నాను. ఈ వెదుకులాటలో కొత్త ప్రశ్నలు ఎదురయ్యాయి. కొత్త సమాధానాలు అవసరమయ్యాయి. అసలు ప్రశ్ననే మార్చవలసిన అవసరముందనిపించింది. తెలుగు భాషలో ముద్రించిన మొదటి కథానిక ఏది ముద్రణకీ కథానికకీ సంబంధం ఉందా? ఉందనే పాశ్చాత్య విమర్శకులు తేల్చారు.
గోథే 1795లో పత్రికలలో తను రాసిన కథానికలని Entertainments(వినోదములు) అన్నాడు. హాఫ్మన్‌ వాటిని  Tales అనే అన్నాడు. కథానిక పేరే కాక, లక్ష్య, లక్షణ చర్చ విరివిగానే సాగింది. అలాగే ఎవరు తొలి క థకుడు వంటి చర్చ అన్ని భాషలలోనూ నడిచింది. లక్ష్యం (స్వభావం లేదా ఉద్దేశ్యం), లక్షణం (స్వరూపం) నిర్ధారించటానికీ తద్వారా కథానిక పుట్టుకనూ (లేదా అచ్చునూ) కథకుడినీ నిర్ధారించటానికి చర్చలు అన్ని భాషలలోనూ కనిపిస్తాయి. ఆధునిక కథానిక, దాని స్వరూప స్వభావాలు పై నడిచిన చర్చ కొంత గమనంలో ఉంచుకోవాలి.
స్వరూప నిర్ధారణలో అనేక అంశాలు ఉన్నాయి. నిడివి, సంఘటనల సంఖ్య, కథలో ప్రస్తావించబడిన పాత్రల జీవన కాలావధి, కథా సమయపు కాలావధి, పాత్రల సంఖ్య, వస్త్వైక్యత వగైరా అనేక అంశాలు స్వరూప నిర్ధారణ చర్చలో ప్రస్తావించారు. వాటినీ, వాటిననుసరించి మనం ఆలోచించిన స్వరూప నిర్ధారణలు గానీ అన్నింటినీ ఒక దగ్గర పెట్టి చూస్తే రెండు ప్రధాన వాదనా ధోరణులు కనిపిస్తాయి. 1. ఏది కథ కాదో చర్చించే ధోరణి. 2. ఏది కథో నిర్వచించే ధోరణి.
ఈ చర్చలో మన అంటే తెలుగు లేదా భారతీయుల ప్రత్యేక సమస్యని కూడా కొంత తడుముకోవాలి. మనం వలస పాలనలో దాదాపు మూడు శతాబ్దాలు ఉన్నాం. ఈ పాలనలో మనం అనేక మార్పులకి లోనయ్యాం. కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం. కొన్ని పాత వాటిని వదిలించుకున్నాం. ఈ సమస్యని పక్కనపెట్టి ఆలోచించినా ఆధునిక కథ మూలాల చర్చ, చలికాగుతూ మంట చుట్టూ కూర్చుని ఆది మానవులు చెప్పుకునే కథని ప్రస్తావించటంతోనే ప్రాశ్చాత్య భాషలలో కూడా ఆరంభించారు. దాదాపు చాలా మంది అంగీకరించిన కథానికా లక్షణాలు 1. కథానిక అంతటా ఒకే అంశం పరుచుకుని ఉండటం. దీనికి వస్త్వైక్యత లేదా ఏకాంశ వ్యగ్రత ఇలాంటి పదబంధాలు మన తెలుగులో కనిపిస్తాయి. 2. చెప్పదలుచుకున్న అంశాన్ని, ఇంతకుమించి చెప్పవలసినదేమీ లేదన్నట్టు చెప్పటం. దీనికి స్వయం సమగ్రత వంటి పదబంధాలు ఉన్నాయి.
ఏతా వాతా నాకు అర్థమైన మేరకు పూర్తి నిర్ధారణ సాధ్యం కాదు. అలాగని ఈ చర్చ ఆగిపోదు. తెలుగు కథా స్వరూప చర్చ, ఆరంభ, పరిణామాల చర్చ కూడా మరింత లోతుగా సాగాలని నా ఆశ. అందుకు ఈ దిద్దుబాటలుఉపయోగపడాలని నా ఆశ.
దిద్దుబాటుకు ముందు నేను పట్టుకోగలిగిన కథలు ఈనాటికి 102. నేను సేకరించగలిగిన పత్రికలలో జనవినోదిని 1876 జూన్‌ సంచిక అన్నింటికన్న పాతది. ఇది 2వ సంపుటం 1వ సంచిక. కనక ఈ పత్రిక 1875 జూన్‌లో ఆరంభమయి ఉండవచ్చు. 1876 నుంచి 1881 జూన్‌ వరకు గల పత్రికలు లభిస్తున్నా వీటిలో కథలు లేవు. దశకుమార చరిత్ర, షేక్స్పియర్‌ నాటక కథ వెనిస్‌ వర్తకుడు, దక్కను పూర్వ కథలు ఇందులో ధారావాహికలుగా వచ్చాయి. చిన్నవాండ్రకు కావలసిన కథ పేరుతో బాలసాహిత్యం దాదాపు జనవినోదిని అన్ని సంచికలలో కనిపిస్తుంది. 1879 జనవరిసంచికలో చిలక గురించిన సంభాషణ అన్నది కథలా కనిపించింది. అందులో ఒక సంఘటన (చిలకను తేవటం), చర్చ, సామాజిక ధర్మాల పట్ల కొంత విశ్లేషణ కనిపించాయి. దీనిని బాలల కథగా గాని, ధారావాహికగా గాని పత్రిక చెప్పలేదు. కనక ఇది ఈ సంకలనంలో తొలి కథ. ఈ పత్రికలోనే వరసగా 1884 జనవరి వరకూ 13 కథలు వచ్చాయి కనక ఆధునిక కథారంభం ఇందులోనే జరిగిందని భావించవచ్చు. ఆనాటి కథలలో చిత్రమేమిటంటే కథకుని పేరు కొన్నిం టికి కనబడదు.
బహుశా సంపాదకుడు (ఆనాడు కొన్ని పత్రికలు పత్రికాధిపతి అన్నాయి) రాసినవి అయ్యుండవచ్చు. అనువాదాలుగా స్పష్టంగా ప్రకటించటం కొన్నింటికి జరగలేదు. కథలో వాతావరణం బట్టి, పాత్రల స్థలా ల పేర్లను బట్టి అనువాదం లేదా అనుసరణ కావచ్చని కొన్ని అనిపిస్తాయి. జనవినోదిని పత్రికలో కథలకి కథకుని పేరు లేదు. సంపాదకుని పేరు కూడా దొరకలేదు.
ఇలా మొదలైన కథలు 102 తేలాయి. వీటిలో 4, 5 మాత్రం పత్రికల, వాటిలోని పుటల అలభ్యత వల్ల అసంపూర్ణాలు. పౌరాణికి కథలు నేను పరిశీనలకు దాదాపు తీసుకోలేదు. ఈ సంకలనంలో దిద్దుబాటుతో సహా 93 కథలు చేర్చాను. ఇంత శోధించినా ఈ సేకరణ సమగ్రం కాదని అనుకుంటున్నాను. 
రచయితల విశేషాలు - కథన విశేషాలు
ఈ కథా రచయితలకి సంబంధించిన విశేషాలు చూద్దాం.
సీ్త్రలు: రచయిత్రి పేరు, రాసిన కథల సంఖ్య, తొలికథ తేదీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. హిందూ బాలిక (కలంపేరు)-1- 1897, జూన్‌ 1, భండారు అచ్చమాంబ-1- 1901 మే, మండపాక జోహానమ్మ-1-1902, జూన్‌ 1, విన్నకోట లక్ష్మీజోగమ్మ-1- 1902, జూలై 1, పులుగుర్త లక్ష్మీనరసమాంబ-2- 1902 డిసెంబర్‌ 1, మొసలిగంటి రామాబాయమ్మ-3- 1902 డిసెంబర్‌ 1, వడ్లమన్నాటి సుందరమ్మ-1- 1903 జనవరి 1, శ్రీధర సీతాదేవమ్మ-1- 1903 ఆగస్టు 1, గంటి జోగమాంబ-1- 1903 సెప్టెంబర్‌ 1, గుండాల లచ్చమ్మ-1- 1903 డిసెంబర్‌ 1, బాలాంత్రపు శేషమ్మ -1- 1904 జనవరి 1, ఉన్నవ లక్ష్మీబాయమ్మ-1- 1904 మార్చి 1, చౌ. శాంతాబాయి-1- 1904 అక్టోబర్‌ 1, సబ్నివీసు లక్ష్మీనర్సబాయి-1- 1904 అక్టోబర్‌ 1. 
మొత్తం 14 మంది రచయిత్రులు, కథలు 25. 
పురుషుల పట్టిక ఇదీ : రాయసం వెంకటశివుడు-7- 1895 జూన్‌ 1, జో. రామశేషయ్య-1- 1896 ఆగస్టు, ఆచంట సుందరరామయ్య-4- 1896 జూన్‌, ఎస్‌.రామ స్వామి అయ్యర్‌-1- 1897 జూలై 1, వంగూరి నందీశ్వరరావు-2- 1900 జనవరి 1, కె.ఎల్‌. నరసింహం (కాంభట్ల)-2- 1902 అక్టోబర్‌ 1, ఆచంట సాంఖ్యాయనశర్మ-2- 1903 నవంబర్‌ 1, సి. శ్రీనివాసాచారి -1- 1904, సెప్టెంబర్‌ 1, పులుగుర్త వెంకటరత్నము -1- 1904 అక్టోబర్‌, తల్లాప్రగడ సూర్యనారాయణ -1- 1905 ఏప్రిల్‌ 1, పూళ్ల సుబరాట్కవి -1- 1905 ఆగస్టు 1, బుద్దిరాజు ఈశ్వరప్పపంతులు -13- 1908 జూన్‌ 1, గురజాడ అప్పారావు- 1- 1901 జనవరి 1. 
మొత్తం 13 మంది రచయితలు, 37 కథలు. 
పై వివరాలను బట్టి 14 మంది స్ర్తీలు 25 కథలు రాసారు. గురజాడతో కలిపి 13 మంది పురుషులు 37 కథలు రాసారు. కథకుల పేర్లు లేని కథలు 34. దిద్దుబాటుతో కలిపి 96 కథలు.
ఈ కథల వల్ల గురజాడ నాటికి భాష, వస్తువు విషయంలో తెలుగు కథకి ఒక బీజం ఏర్పడిందని, కొన్ని ఆలోచనలు ఉన్నాయనీ, కొన్ని ప్రయత్నాలు జరిగాయనీ భావించవచ్చు. వాడుకభాష విషయంలో కొన్ని విషయాలు గమనించాలి. అందని ద్రాక్ష పులుపు అన్నట్లు గ్రాం ధిక భాష రాయటం రాక గ్రామ్య భాష రాసేరనిపించుకుంటారన్న జంకు పండితులకు, విద్యావంతులకు ఉన్నట్లు కనిపిస్తుంది. అటువంటివి లేకుండా రాసేవారు కూడా ఉండేవారనిపిస్తుంది.
గురజాడ వారి వద్దకే వస్తే వారి దినచర్యలో 1895లోనే కొన్ని కథల పేర్లు కనబడతాయి. కట. Mr.Underwood కోసం కథలు అని రాసిపెట్టుకున్న ఈ కథల పేర్లను బట్టి జనం చెప్పుకునే కథలను సేకరించినట్లు కనిపిస్తుంది. ఈ పుస్తకంలో కథలు చూస్తే అలా కథలు సేకరించటం లేదా లిఖితం చేయటం ఆనాటికి సాధారణమనిపిస్తుంది.
1904 ఫిబ్రవరి 7 తేదీగల ఉత్తరంలో జె.డబ్ల్యు. రీస్‌, అదే సంవత్సరం నవంబర్‌ 29 తేదీగల ఉత్తరంలో మాక్స్‌ పెంబర్టన్‌ భారతీయ జీవితాన్ని ప్రతిబింబించే కథలు పంపమని గురజాడని కోరారు. దానిని బట్టి అప్పటికే కథలు గురజాడ రాసారా లేక రాసే ఆలోచనలో ఉన్నారా అనిపిస్తుంది.రాస్తే ఇంగ్లీషులో రాసారా అవి ఏమిటి అన్న ప్రశ్నలు వస్తాయి. తెలుగులో రాయటం (కన్యాశుల్కం) మొదలుపెట్టిన దాదాపు ఇరవై సంవత్సరాల కాలం వరకూ గురజాడ కథ రాయలేదా అన్న అనుమానం వస్తుంది. ఇవి ఏ పత్రికలలో వచ్చాయో ఏమయ్యాయో అనిపిస్తుంది. శశిలేఖ అన్న పత్రిక ఒక్క సంచిక కూడా నాకు లభించలేదు. గురజాడ కథలు ఇందులో వచ్చే అవకాశం ఉంది.
గురజాడ తనకాలంలోని పత్రికలను చూసే అవకాశం ఉందనే నేను అనుకుంటున్నాను. ఆయన తెలుగులో రాయటానికి ఆదిలో ప్రయత్నించలేదు. కన్యాశుల్కం రాజుగారి ప్రోత్సాహంతో రాసినట్టు అర్థమవుతుంది. అది రాసిన రెండు దశాబ్దాల వరకూ ఆయన కథ రాయలేదా? రాసినవి మనకి దొరకటం లేదా? రాయకపోతే కారణం ఏమిటి? రాసినపుడు లక్ష్యం ఏమిటి? వంటి ప్రశ్నలకి జవాబులు వెతకాలి.
చరిత్ర పట్ల ఆసక్తి గురజాడ వారిలోనూ, సమకాలికులలోనూ కనిపిస్తుంది. చారిత్రక నేపథ్యంలో కథలు గురజాడ వారి లభ్య కథలలో లేకపోయినా, ఆనాడు చాలా మంది ప్రయత్నించారు. ఇది భారతదేశం అంతటా కనిపించే ఒక సామాన్య లక్షణం.
దానాదీనా-
1910 నాటికి గురజాడ అప్పారావు గారి కలంతో కథ ఒక ఆధునిక రూపం సంతరించుకుంది. అలాగే వస్తువు పట్ల కూడా ఆయనకు స్పష్టత ఉంది. వారికి తెలుగు సమాజంలో రావలసిన సంస్కరణల గురించి ఒక ధ్యేయం ఉంది. అంతేగాక నీతిని, ఆదర్శాలను యధాతధంగా చెప్పటంలో కళ దెబ్బతింటుందనీ వారికి లోతైన అవగాహన ఉంది. ఆయన జాబులు, దినచర్యలలో ఆయన విమర్శనాత్మక దృష్టి ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. వాస్తవికతను ఎంతగా ఆశించారో, అంతగానూ కళా ధర్మాన్ని గురజాడ ఆశించారు. చదువరిని రంజింపజేయటం ఎంత కళాధర్మమో, అంతకన్న ఆత్మవిమర్శన చేసుకునేట్టుగా, ఆలోచింప జేసేట్టుగా చేయవలసిన బాధ్యత సాహిత్య ధర్మంగా వారు భావించారు. ఆత్మ ముగ్ధత్వానికి లోనై రచయిత చెడుని ఆకర్షణీయంగా చేయటానికున్న అవకాశం కూడా ఆయన చూపు దాటిపోలేదు. వీటన్నింటి వల్ల తెలుగు సాహిత్యానికి రావలసిన మార్పు పెద్దఎత్తున ఆదిలోనే వచ్చింది. సామాజిక సంస్కరణలను సమర్ధించటం ఎంత అవసరమో, వాటి పేరుతో పబ్బం గడుపుకునే వారిని సాహిత్యం విస్మరించరాదన్న గురజాడ ఎరుక తెలుగు కథకులకు ఆదిలోనే అందింది. దీనిని కథ తాలూకు ఆధునిక స్వభావం (వర్తమాన సమాజ విమర్శ) అనీ దీనిని సైతం గురజాడే అందించారని నేను భావిస్తున్నాను. దిద్దుబాటు కథలో కమలిని, రాముడు చిన్న నాటకం ఆడి నాయకునికి కనువిప్పు కలిగిస్తారు. దీనిని అంతర్నాటకం అనవచ్చు. గురజాడ కన్యాశుల్కంలో ఈ అంతర్నాటకాలు కనిపిస్తాయి. ఈ అంతర్నాటక విధానం మిగిలిన 92 కథలలోనూ కనపడదు. నవలలో కనిపిస్తాయి. ఇది తెలుగు సినిమాను ఆదిలోనే ప్రభావితం చేసి ఉండవచ్చు. ఈ కథ ఆరంభం, కథా శీర్షిక, ముగింపు అంతకుముందు వెలువడిన కథలన్నింటికీ భిన్నమైనవి. ఇవి కథయిత శిల్ప పరిజ్ఞానాన్ని సూచిస్తాయి. కథలోని ఉత్సు కతా గుణంలో చదివే కథకీ, వినే కథకీ తేడా ఉంటుంది. గురజాడ ఈ విషయాన్ని ఆకళింపు చేసుకున్నట్టు 5 కథలలోనూ గమనించవచ్చు. కథ ముగిసాక వ్యాఖ్యానం చదువరిని పట్టదని శిల్ప విమర్శకులు చెబుతారు. గురజాడ ఈ నియమాన్ని పాటించారు. మీ పేరేమిటి కథలోని వస్తువు ఆయన హేతుబుద్ధికీ, క్రాంత దర్శనానికీ చాలా పెద్ద ఉదాహరణ. అంతేగాక అది తెలుగుకథ వేసిన ఒక పెద్ద అంగ. ఇది వ్యక్తి కథ కాదు. ఒక సమాజపు కథ. సూక్ష్మస్థాయిలో ఒక గ్రామాన్ని చూపిస్తూ స్థూలస్థాయిలో ఆనాటి ప్రపంచాన్ని చూపించారు గురజాడ. 
వర్తమానంలోని శైధిల్యాన్ని రచయిత చూడగలగటంతో బాటు భవిష్య నిర్మాణంపై ఒక ఊహ ఉండటం సమాజం పట్ల రచయిత అంతరంగాన్ని వ్యక్తం చేస్తుంది. గురజాడ సాహిత్యమంతటా ఆయన ఆశావహమైన భవిష్యదృష్టి నిండుగా కనిపిస్తుంది. ఒక వ్యక్తిగా ఆయన నుంచి తెలుగు సాహిత్యమూ, సమాజమూ ఇంకా నేర్చుకోవలసింది చాలా ఉంది. ప్రపంచానికి తెలియజేయవలసిందీ ఉంది. ఆయన ఇతర కథలను ఇంకా తవ్వి తీయవలసి ఉంది. ఈ 92 కథల వంటివీ దిద్దుబాటుకి ముందు రావటం సహజ పరిణామంగా నేను భావిస్తున్నాను.
తెలుగులో తొలికథ ఏది అన్న వెదుకులాటకి ఈ పుస్తకం ప్రకారం చూస్తే ఏదో ఒకటి అనవచ్చుగాని, రచయిత ఎవరూ అంటే సమాధానం దొరకదని నిశ్చింతగా చెప్పగలను. అంతేకాదు, ఈ కథలను శ్రద్ధగా చదివితే మంచి కథకి కావలసిన ఊహాశక్తీ, కల్పనాశక్తీ, సామాజిక బాధ్యతలను ఆరంభంలోనే తెలుగువాడు గ్రహించాడని మనం గర్వపడగలం. సామాజిక శృంఖలాలను సీ్త్రలు బద్దలు కొట్టుకుంటున్న చప్పుళ్ళు వినగలం.
- వివినమూర్తి
(‘దిద్దుబాటలు- దిద్దుబాటుకు ముందు కథలు 92’ సంకలనం ముందుమాటలోని కొన్ని భాగాలు ఇవి. జనవరి 2వ తేదీన విజయవాడ పుస్తక మహోత్సవంలో సాయంత్రం 6 గంటలకు ఈ సంకలనం ఆవిష్కరణ)

కామెంట్‌లు లేవు: