విప్లవ, దళిత ఉద్యమ నాయకత్వ విశ్లేషణ సమకాలీన సాహిత్యంలో 'విప్లవ కవిత్వం' ఎప్పుడూ ఒక నిత్య స్రవంతిగానే కనిపిస్తుంటుంది. సమస్యలు ఉన్నంత వరకూ పోరాటాలు తప్పవని, అందుకు నిరంతర సంఘర్షణలు జరుగుతూనే ఉంటాయని విముక్తి పోరాటాలు నిరూపిస్తూనే ఉన్నాయి. విప్లవోద్యమంలో స్థలాతనికీ, వ్యక్తికీ చరిత్రలో ప్రాధాన్యం కనిపిస్తూ, అది వర్తమాన, భవిష్యత్తు తరాలవారికి ప్రేరణగా నిలుస్తుంటుంది. అందుకే వీరి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన/ కోల్పోయిన వారిని వీరులుగా స్మరించుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. నక్సల్‌బరీ ప్రాంతానికీ, చారు మజుందార్‌కీ ప్రాధాన్యం ఇవ్వడంలో స్థల, వ్యక్తుల్ని గుర్తిచటమంటే ఆ ఉద్యమ ఆవయాల్ని ప్రచారం చేయడమే! ఈ నేపథ్యంలో కాశీం 'గుత్తికొండ' పేరుతో ఒక దీర్ఘకవితను ప్రచురించి, విప్లవ పార్టీల్లో చర్చనీయాంశాలవుతున్న కులం, వర్గం, అగ్రవర్ణ నాయకత్వం, ఉద్యమంలో నుండి బయటికి వచ్చేసినవారు చేసే ప్రకటనల్ని, దళిత - విప్లవ సంఘాల మధ్య ఉన్న అభిప్రాయాల్ని, గ్లోబలైజేషన్ ప్రభావాన్ని, దాన్ని ఎదుర్కోవటానికి ప్రేరణని, మతవాద శక్తులతో అధికారం కోసం ఆరాటపడి పొత్తులు పెట్టుకొనే పార్టీల భావజాలాల్ని తనదైన దృక్పథంతో హృద్యంగా కవిత్వం చేస్తూనే, మేధోపరంగా ఆలోచనలకు పురిగొల్పడంతో వస్తు, రూపాలకు చక్కని సమన్వయాన్ని సాధించడం కనిపిస్తుంది. గ్రంథం మూడు భాగాల్లో కవి స్వీయానుభవ ముద్ర మొదటి భాగంలోనూ, రెండవ భాగంలో అంతర్జాతీయంగా కుట్ర జరుగుతున్న ప్రపంచీకరణ ప్రభావాన్నీ, దాన్ని విప్లవకారులు ఎదుర్కొంటున్న తీరుతెన్నుల్ని, మూడవ భాగంలో హైదరాబాద్‌లో విప్లవకారులతో జరిగే/ జరగబోయే శాంతిచర్చల వల్ల మారిపోతున్న వాతావరణాన్ని, మరో వైపు ఉద్యమం నుండి బయటకు వచ్చినవాళ్లు తీసుకునే నిర్ణయాల్ని ఖండిస్తూ పోరాటాల వైపు మరలమనే ప్రబోధాన్ని చేయడం వంటివాటిని వర్ణించారు. కొన్ని విప్లవ పార్టీలు కూడా 'కులాన్ని' అంగీకరిస్తున్నాయి. కుల ప్రభావాన్ని గమనిస్తున్నాయి. దళిత సంఘాలు/ పార్టీలు విప్లవ పార్టీలను 'కులం' గురించి నిలదీయడంలో శత్రువైరుధ్యం కంటే మిత్రవైరుధ్యమే గమనించవలసి ఉంది. విప్లవ పార్టీల్లో, ఉద్యమాల్లో అత్యధికులు దళితులే ఉండటం, పీడితులుగా దళితులే ముందుగా నష్టపోవడం వంటివే కాకుండా 'పీడితుల' పక్షం కోసం పోరాడే వాళ్లయిన విప్లవ పార్టీల్ని దళితులు నిలదీయడంలో ' ఆత్మీయమైన హక్కు' ఉన్నట్లు భావిస్తారు. మతవాద పార్టీల్ని ఇదే ప్రశ్నతో దళితులు నిలదీయకపోవడానికి కారణం, అవి ఎలాగూ వ్యతిరేకమనే అభిప్రాయం ఉండటమే. అందుకనే విప్లవ పార్టీలవాళ్లు దళితులను చేజార్చుకోలేరు. కనుక, తమ పోరాట ఎవరి క్సోమో చెప్తూ కాశీం "ప్యాపిలిలో / మనవాడు కాని/ గణేషుడి కోసం గొడవెందుకు/ నిశ్శబ్దంగా కనిపించే ఈ గణేష్/ నడిరాతిరి నక్షత్రాల వెలుగులో / చంద్రుణ్ని సాయుధుణ్ని చేస్తున్నాడు' (పు.6) అనడంలో 'ప్యాపలి' సంఘటతో కులాన్ని బట్టి హత్యలు జరిగినా విప్లవ పార్టీలు తమదనైన రీతిలో తీర్పు చెప్పడం జరిగింది. మావోయిస్టు నేత రామకృష్ణ ఆధిపత్య కులంలో పుట్టినా అతనికి 'కుల స్వభావం' లేదని చెప్తూ "అతడు మా నేస్తం/ వసంతకాల మేఘగర్జనతో/ అంటరాని వాకిట్లో/ మా నొసటిపై రాలిన/ తొలి వానచినుకు'' (పు.3)గా ప్రశంసిస్తాడు కవి. ఒకప్పుడు గుత్తికొండలో రాముడు తిరిగి రాడని పురాణాలు చెప్తున్నా, రాముడు 'మా వాడు కాదని/ శంబూకుడి శిరచ్ఛేదన చరిత్ర తెల్పింది'' అని అనడం, వెంటనే 'ప్పుడేమో/ రామకృష్ణ/ పెదాల మీద చిరునవ్వుతో/ ఎనిమిది కోట్ల ఆంధ్రుల హృదయాలపై/ లాంగ్‌మార్చ్‌కు బాటలేస్తున్నాడు'' అని 'చరిత్ర'కు నిజమైన అర్థం పరమార్థం 'గుత్తికొండ' ఏర్పరుచుకుందని గర్విస్తున్నాడు. సైద్ధాంతిక అవగాహన కవికి ఉండబట్టే, చిన్న కావ్యమైనా సుదీర్ఘమైన భావాల్ని సమర్థంగా చెప్పగలిగాడు. 'పదునెక్కుతున్న ప్రాయాన్ని/ ముక్కలు చేసి/ సైబర్ కేఫ్‌లకు వేలాడదీస్తున్న' గ్లోబలైజేషన్ ప్రభావాన్ని పట్టుకోగలిగాడు. దళిత ఉద్యమం'లో రాజ్యాధికారం ఒక ముఖ్యమైన అంశమైనా దళిత సాహిత్యం కూడా దీనికి వత్తాసు పలకడంతో కొంతమందికి కొన్ని విభేదాలున్నాయి. రాజ్యాధికారం పొందడమంటే దళితులు పాలకులు కావడమా? దళితులకే ప్రత్యేక రాష్ట్రం/ దేశం కావడమా? అప్పుడు దళితులంతా బాగుపడిపోతారా? ఇప్పటికే ఐదు దశాబ్దాల నుంచి దళితులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. రాజకీయ పార్టీలో సీటు వచ్చేవరకూ, నెగ్గేవరకూ తప్ప పదవుల్లో ఉన్న దళిత నేతలు ఎంత మంది హీనాతిహీనమైన స్థితిలో ఉన్న దళితుల్ని, వారి సమస్యల్ని పట్టించుకునే స్థితిలో ఉన్నారు? దీనికి అనేక సాకులు చెప్తారు. అధికార పీఠంపై ఉన్నా అధికారం చెలాయించే స్థితి రాలేదని. రిజర్వేషన్లపై పొందిన పదవుల్లో ఉండి రిజర్వేషన్ పొందవలసినవాళ్ల ప్రతినిధిగా వాళ్ల హక్కుల్ని సాధించలేనప్పుడు రాజీనామా చేసి బయటకు రాగలరా? సమాజానికి నేటికి దూరంగానే జీవిస్తున్న వాళ్లలో దళితులు అనేకమంది ఉన్నారు. జీవనస్రవంతిలోకి అటువంటి దళితుల్ని తీసుకు రాగలిగితే, వాళ్లే వాళ్ల హక్కుల్ని సాధించుకోగలుగుతారు. అలా కాకుండా దళితులు రాజ్యాధికారం సాధించినప్పుడే దళితులు ఉన్నతస్థితిలోకి వచ్చేస్తారనడం ఆలోచించవలసిన విసయమే! విప్లవ పార్టీలో ఆధిపత్య కులాలవారే నాయకత్వం వహించడం పట్ల, దళిత వర్గాల్లో నిరసన ఉంది. దాని వల్లనే చాలామంది ఉద్యమం నుండి బయటకి వచ్చేస్తున్నట్లు అప్పుడప్పుడు వచ్చే పత్రికా ప్రకటనలే సాక్ష్యం. ఆధిపత్య కులంలో పుట్టినా కులనిర్మూలన, పీడితుల పక్షం వహించే ఉత్తమ నాయకత్వాన్ని పోగొట్టుకోవలసిన పని లేదు. ఇది ఎలాంటిదంటే, దళితులుగా పుట్టి, ఉన్న పదవుల్లో ఉండి, దళితులకు ఉపయోగపడనివారి కంటే దళితుల అభ్యున్నతి గురించి కృషి చేసే వారెవరైనా దళిత/ పీడిత అభ్యున్నతిని ఆశించినవాళ్లే అవుతారని భావించడం వంటిది. దళిత/ పీడిత కులాల్లో నాయకత్వ స్థాయికి ఎదిగినవాళ్లని గుర్తించినప్పుడు కచ్చితంగా కొన్ని సంఘర్షణలు, సమస్యలు తప్పవు. ఈ విషయాల పట్ల కాశీం తన అభిప్రాయాల్ని స్పష్టం చేశాడు. ' ఉట్టి మీద ఒట్టి తునకల్ని/ మునవేళ్లతో ముద్దాడి/ కొవ్వు సృష్టించేశాడు/ ట్రిగ్గర్ పట్టిన అగ్రతనాన్ని/ క్లీన్ చేసిన / మనుషులు వాళ్లు' అని వాళ్లకు క్లీన్‌చిట్ ఇస్తాడు. అంతేకాదు, సోఫాల్లో కూర్చుని కలలు గనే సోకాల్డ్ దళిత నేతల రాజ్యాధికార వీలునామాల్ని ప్రశ్నిస్తాడు - దళిత కార్డుతో దేశదేశాల్లో దర్జాగా తిరిగే దళిత మేధావుల్ని, హస్తినాపురం (ఢిల్లీ)లో మనువు (మతతత్వశక్తుల)తో జటకట్టడంలో గల సైద్ధాంతిక నిబద్ధతను గమనించమంటున్నాడు. కాశీం రాసింది చిన్న దీర్ఘ కావ్యమే. కానీ విప్లవ పార్టీకి గొప్ప స్ఫూర్తినివ్వడంలో గుత్తికొండ (దీర్ఘకవిత) కావ్యం నిర్వహించే పాత్ర నిర్వచించలేనిది. ఈ దీర్ఘ కావ్యం నిండా దీర్ఘంగా చర్చించవలసినన్ని అంశాలు నిండి ఉన్నాయి. ఇది ఉద్యమంతో సంబంధాలున్నవారికి ఆత్మీయ స్పర్శను కలిగించగలుగుతుంది. ( గుత్తికొండ (దీర్ఘకవిత); కవి: కాశీం, వెల: రూ. 10/-? సేటలు : 24; ప్రతులకు: సహచర బుక్‌హౌస్, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి