"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

02 August, 2008

తెలంగాణ అస్తిత్వానికి 'గుక్క'

సమాజాన్ని అవగాహన చేసుకున్న ఆధునిక కవి గొంతులో ప్రజల ఆర్తి పలుకుతుంది. తన అస్తిత్వం ఏమిటో అంచనా వేసుకోవటం కన్పిస్తుంది. అత్యవసర పరిస్థితి ధ్వనిస్తుంది. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుండి వస్తున్న కథల్లో, కవిత్వంలో ప్రాంతీయ అస్తిత్వం పట్ల స్పష్టమైన దృక్పథం వ్యక్తమవుతుంది. కవికి దృక్పథదం ఉండటం వల్ల తన కవిత్వం ఎవరి కోసమో, తన కవిత్వ ప్రయోజనం ఏమిటో గుర్తెరిగినట్లవుతుంది. కాసుల ప్రతాపరెడ్డి ఈ కోవలోనే తెలంగాణ అస్తిత్వం కోసం నిజాయితీతో ఉద్యమప్రాయంగా కవిత్వం, కతలు, వ్యాసాలు రాస్తున్నాడు. తెలంగాణ కథలు, కవిత్వంపై వచ్చిన వ్యాసాల్ని పుస్తకాలుగాను అందుబాటులోకి తెస్తున్నాడు. 'భౌగోళిక సందర్భం', 'కొలుపు', 'తెలంగాణ తోవలు', 'తెలంగాణ కథ - దేవులాట' వంటి వ్యాససంపుటాల్లో గానీ, తన కథల పుస్తకం 'శిలువకు తొడిగిన మొగ్గ'లో గానీ, ఇప్పుడు ప్రచురించిన 'గుక్క' కవితాసంపుటిలో గానీ దేన్ని చూసినా తెలంగాణ బాగోగుల గురించిన తపన కనిపిస్తుంది. తన తెలంగాణ చరిత్ర, సంస్క¬ృతుల పట్ల ప్రేమతో కూడిన బాధ్యత ప్రతిఫలిస్తుంది. తన విమర్శవ్యాసాల్లో, కథల్లో తనకి కావాల్సిందేమిటో వాచ్యంగానే, స్పష్టంగానే, ధైర్యంగానే నిలదీసి అడిగితే కవిత్వంలో మాత్రం అందరి చేతా తెలంగాణ సమస్యను, ఆవేదనను అర్థం చేయించి, అనుభవింపజేసి, తన వాదనను అంగీకరింపజేసేలా ప్రయత్నిస్తాడు. 'గుక్క' దీర్ఘకవితతోపాటు ఈ పుస్తకంలో మరికొన్ని కవితలూ ఉన్నాయి. తెలంగాణా సంస్క¬ృతినీ, జానపద పౌరాణిక, చారిత్రక గాధల్నీ, సందర్భాల్నీ, చివరికి చిన్నపిల్లలు, పెద్దవాళ్ల నోళ్లలో కూనిరాగాలయ్యే పాటల్ని కూడా తన కవిత్వంలో అంతర్భాం చేసి, తల్లి తెలంగాణ 'గుక్క' పట్టి దుఃఖిస్తున్న దయనీయ దృశ్యాన్ని చూపిస్తాడు. గ్రంథ ముఖచిత్రంలో కూడా నెత్తి బాదుకుంటూ రోదిస్తున్న స్త్రీమూర్తి తల్లి తెలంగాణని స్ఫురింపజేస్తుంది. స్వాతంత్య్రానికి ముందూ, తర్వాత తెలంగాణలో జరిగిన పోరాటాలు చారిత్రాత్మకమైనవి. స్వరూపస్వభావాల్లో తేడాలున్నా సిద్ధాంత నేపథ్యం మాత్రం పీడన, పరాయాకరణల నుండి విముక్తి కోరుకోవటమే తెలంగాణా పోరాటాల తత్త్వం! "చినిగిన బట్టలేసి కుట్టిన నేల/ మొగుల కింద గన్నుల కోలాటాలు/ పెయ్యంతా తూట్లే తూట్లు'' అని కవి కాసుల ప్రతాపరెడ్డి వర్ణించడంలో తెలంగాణ ప్రాంత పరిస్థితి కండ్లకు కట్టినట్లుంది. "బట్టలేసి కుట్టిన నేల'' అనే ప్రయోగం చేయడంలో గొప్ప ఔచిత్యం ఉంది. తెలంగాణ ప్రాంతంలో వివిధ రాజ్యాధికార జెండాలు ఎగిరిన చారిత్రక స్థితిగతుల్ని స్ఫురింపజేస్తున్నాడు. స్వాతంత్య్రానికి పూర్వం నిజాం సంస్థానంలో తెలంగాణ, మరఠ్వాడా, కర్ణాటకలో గల భిన్న ప్రాంతాలతో, భిన్న సంస్క¬ృతులతో నిండి, అధిక శాతం తెలుగు మాట్లాడే వాళ్లున్నా 'ముక్కు మొగం లేని దిక్కుమాలిన తెలుగువాళ్లు' (తెలంగీ బేడంగీ)గా ఎగతాళికి గురికాబడ్డారు. రజాకార్ల దురంతాలు, దాని నుండి రక్షించుకొని భూస్వాముల దురంతాల నుండి కాపాడుకోవడానికి సాయుధ పోరాటం చేయటం, 1948 సెప్టెంబర్‌లో భారత ప్రభుత్వం చర్య తీసుకోవటం, 1950లో ముందుగా పౌరప్రభుత్వం, తర్వాత 1952లో సాధారణ ఎన్నికలు జరగటం, హైద్రాబాదు రాష్ట్రం ఏర్పడడం వంటి చారిత్రక సంఘటనలు జరిగాయి. అంటే అధికార జెండాలు మారాయి. ఆ తర్వాత అప్పటికే కుంఫిణీ వ్యాపారులు వాళ్ల సౌలభ్యం కోసం తెలుగు మాట్లాడే వాళ్లందర్నీ ఒక ప్రాంతంగా కాకుండా సర్కారు జిల్లాలు, దత్తమండలాలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలవారిని మద్రాసు ప్రెసిడెన్సీలో కొంతమందిని విభజించటంతో తెలుగువాళ్లు, మద్రాసు ప్రెసిడెన్సీలోనూ భాషా సంస్క¬ృతుల పట్ల వివక్షను ఎదుర్కోవలసి వచ్చింది. అనేక రంగాల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించగలిగారు. ఈ పరిస్థితుల్లో తెలుగు మాట్లాడే వాళ్లంతా ఒక రాష్ట్రంగా ఏర్పడాలనే భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన ఆకాంక్ష హైదరాబాద్ స్టేట్‌గా ఉన్న తెలంగాణను, మద్రాస్ ప్రెసిడెన్సీలో బాధితులైన తెలుగువాళ్లను కలిసిపోవడానకి ప్రేరేపించింది. ఇక్కడ 'విశాలాంధ్ర' ఉద్యమం వరకూ ముందున్న తెలంగాణను పరిశీలించినా కవి 'చినిగిన బట్టలేసి కుట్టిన' అనే ప్రయోగ ఔచిత్యం వెల్లడవుతుంది. సాయుధ పోరాటంలో, నేటి నక్సల్ (మావోయిస్టు) రాజకీయాల్లో ప్రభుత్వం తరఫు నుండీ, నక్సల్స్ నుండీ జరుగుతున్న కాల్పుల్ని, పోతున్న ప్రాణాల్ని 'మొగులు కింద గన్నుల కోలాటం'గా చెపపడంలో, కురవాల్సిన మేఘాలు, చల్లదనం అందించాల్సిన మేఘాల కింద నెత్తురు చారికలకు కవి ఆవేదనకు అక్షరరూపమే! దీనిలో ఒకానొక చారిత్రక పరిణామం, దాని ఫలితంగా దయనీయంగా మారిన తెలంగాణ బతుకు చిత్రం చూపగలిగాడు కవి. గతానికీ, వర్తమానానికీ ముడివేస్తూ 'పత్తి పంటల మీద పురుగుల మందు/ పొలాల నిండా కొయ్యకాళ్లే/ పర్రె కాలువలేవి, చెరువు ఊటలేవి?/ మింటికీ ఒంటికీ ఏకధారగా కురుస్తున్న చీకటి/ రెక్కలిరిగినై, కాల్లు విరిగినై/ చిలుకెగిరిపోతున్నది, ఎగిరిపోతున్నది/ ఊగరా, ఊగరా!!/ వాసాలు అందుకుని ఊగరా'' అని వెలుతురివ్వని, దక్కనివ్వని పోరాటాల స్థితిగతుల్ని చెప్తూ ప్రస్తుత తెలంగాణ స్థితికి ఆవేదనతో కుమిలిపోవటం కనిపిస్తుంది. త్యాగాలకు దక్కిన ఫలితం పేదరికమేనా అని ప్రశ్నిస్తున్నాడు. విశాలాంధ్ర ఉద్యమం, పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనలు అన్నీ తెలంగాణను అభివృద్ధిపథంలో నడిపించగలవని అనుకున్నా, వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా కనిపించడం పట్ల కూడా కవికి ఆవేదన ఉంది. ఈ నేలపై ఉంటూ ఈ సంస్క¬ృతిలో బతుకుతూ భాషనీ, ప్రజల్నీ తక్కువగా అంచనావేస్తూ, తన వాళ్లవల్లనే ఒక పరాయాకరణ జీవితాన్ని గడపవలసిన పరిస్థితిని జీర్ణించుకోలేకపోయే "నీ యావ వేరు/ నీ రంది వేరు/ నువ్వేమన్నా మా బాస రాసినవా?/ మా యాస రాసినవా?/ నీ రాతలకు మా తలరాతలకు పొంతనేది?/ మనిసివిక్కడ, మనసక్కడ!/ పాలు మర్సిన బిడ్డవైతివి, నీకేమెరుక?'' అని నిలదీస్తాడు. తెలంగాణ భాషను మాండలికంగా తీసిపారేయటం, సినిమాల్లో హీరోలకు కాకుండా రౌడీ పాత్రల చేత పలికించడం, కించపరచడం వంటివెన్నో జరుగుతున్న నేపథ్యాలన్నింటినీ గుర్తు చేస్తూనే తెలంగాణ ప్రజల్ని గుర్తించమంటున్నాడు కవి. తెలంగాణకు ఈ పరిస్థితి రావడానికి కారాణాన్ని అన్వేషించమంటూ - " ఎవరికి పుట్టిన బిడ్డరా అంటే/ ఎక్కెక్కి ఏడ్చే తల్లి/ ఏ గాలి సోకిందో, ఏ తూర్పు గాలి విసిరిందో/ కాకులు దూరిన ఇల్లు/ గుడ్లగూబలు చొచ్చిన ఇల్లు'' అని చెప్పడంలో ఆవేశం కూడా ఉంది. వర్షాలు లేవు. తన నేల నుండే ప్రవహించినా, తన నేల ఉపయోగించుకోలేని దుస్థితిలో గోదావరి జలాలు. పోనీ వర్షాలు కురవడం లేదు. పోనీ వర్షాలు కురవటం లేదు. దీనికి ఏవో పథకాలంటూ ఇజ్రాయెల్, నెదర్లాండ్ వ్యవసాయ పద్దతులంటూ చేసినవన్నీ 'పథకాలకు పాతరేసి, పైసలెత్తుకుపోయిన గద్దలు'గా మారటం విషాదకరం. వ్యవసాయం ఎలా ఉన్నా తాగటానికి మంచినీళ్లు దొరకని పరిస్థితి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫ్లోరైడ్ బారిన పడిన జీవితాలెన్నో! దీన్ని - విషమై పారుతున్న పాతాళగంగ/ కాల్లొంకర, కండ్లొంకర/ పసి పోరగాల్లయినా పండ్లిగిలిస్తే నల్లని గారలు'' అని ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడిన జీవితాల్ని చూపిస్తాడు. భగీరథుడుతన వంశాన్ని రక్షించుకోవడానికి తపస్సు చేసి ఆకాశగంగను పాతాళం దాకా ప్రవహించేట్లు చేశాడు. వాళ్లకు శాపవిముక్తి అయ్యిందో లేదో తెలియదు గానీ, వందలాది మీటర్ల లోతుల్లోకి తలతాకట్టు పెట్టయినా బోర్లు వేస్తే, వచ్చే నీళ్లు ఫ్లోరోసిస్‌ను తెచ్చి, తెలంగాణ ప్రలజకి విషంగా మారి నీటి శాపం వెంటాడుతున్న కతల్ని వినిపిస్తాడు. ఇంత జరుగుతున్నా, పీడితుల పక్షం వహించవలసిన పార్టీలు ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించడం పట్ల కూడా అధిక్షేపాన్ని ప్రకటిస్తూ - "మంత్రమేసెనో, మాయ చేసెనో, మరుగు మందే పెట్టెనో/ ఆత్మపంజరంలో పిట్ట/ కదం తొక్కుతూ, పదం పాడుతూ/ ఎర్రెర్రని పలుకులు, ఎదురొడ్డిన రొమ్ములు/ వీరభక్త హన్మంతులు/ గుండె చీల్చుకుంటే సూర్యుళ్లే/ నిన్ననా, మొన్ననా, ఆవలి మొన్ననా/ కాలచక్రం కింద నలిగిన దేహాలెన్నో'' అని చరిత్రలో పోరాటాల వల్ల ప్రాణాల్ని కోల్పోయిన వారిని గుర్తు చేస్తూ వారి పోరాటాలకి ప్రతిఫలం దక్కాలనే ఆశయాన్ని ప్రకటిస్తున్నాడు. అభివృద్ధికి ప్రత్యేక చర్యలు కాదనీ, సోది చెప్పటమో, శాంతి చేయటమో పరిష్కారానికి మార్గం చూపలేవంటూ - "మార్మానమొచ్చినోడు మదమెక్కి కూస్తుండు/ కావాల్సింది యిడుపు కాయితాలే'' అనీ, " ఏరుపడటం తప్ప మాకు వేరు లేదు/ నువ్వేంది చెప్పు తీర్పు చెప్పేది/ మేమప్పుడే చెప్పినం/ మాకు గట్టి గింజలు కావాలె, తాలు మాటలొద్దు'' అని తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ప్రతాపరెడ్డి కవిత్వంలో తెలంగాణ సమస్యను జడ్జీ అనే పాఠకుడి మందు లాయర్‌లా తన వాదనాపటిమను ఆర్ద్రంగా వినిపిస్తున్నాడు. 'గుక్క' పట్టి ఏడుస్తున్న తల్లి తెలంగాణ దుఃఖాన్ని ఆపాలంటే నీళ్లు కావాలి. ఆ నీళ్లు దాహం తీర్చాలి. గొంతు తడపాలి. గొంతు తడిసి, దాహం తీర్చి, జీవశక్తి నివ్వగలిగదే నీళ్లు కావాలి. కన్నీళ్లు తుడవాలి. జానపద సాహిత్యంలో ఆణిముత్యం వంటి కథ 'బాలనాగమ్మ' కథ తెలంగాణ ప్రాంతానికి చెందిందే. దీన్ని కవిత్వంలో ఉపయోగించుకొంటూ, సంస్క¬ృతిపరమైన కథల్ని తెలుసుకోమంటూనే చైతన్యానికి ఊపిరి కోణాల్ని చూపుతున్నాడు. "సోది చెప్పవచ్చిన తల్లి/ శాంతి చేయాలంటున్నది/ కాగల కార్యం తీర్చే గంధర్వులేరి?/ బాలనాగమ్మవో తల్లి, తెలంగాణా// చెర విడిపించే బాలవద్దిరాజేడి?'' అని ఒక చోట, మరో చోట- " ఏడేడు సముద్రాలు దాటావా, నా చిట్టి తండ్రీ/ మర్రిచెట్టు తొర్రలో చిలుక దొరకనే లేదు/ పిడికిలి నిండా పట్టి పిసికేయడానికి/ పరిగెడుతూ వుంటావా, ఎక్కడి దాకా?'' అనటంలోనూ, తెలంగాణ సమస్య పరిష్కారానికి చేయవలసిందేమిటో కూడా స్ఫురింపజేస్తున్నాడు. ఇలా కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో వస్తువుని ఆశ్రయించుకున్న ప్రత్యేక శిల్పాన్ని కూడా వివరించుకుంటూ పోతే కవిత్వనిర్మాణాల్లో ఎన్నో రహస్యాలు బయటపడుతుంటాయి. మీడియాని, జానపద గేయాల్ని, విప్లవ గీతాల్ని కూడా తెలంగాణ సాధనకు ఎలా వినియోగించుకోవచ్చో తన కవిత్వంలో రహస్యంగా అందరికీ అందంగా అందిస్తున్నాడు. వింటున్న పాటనూ, చూస్తున్న దృశ్యాన్నీ, రమ్యంగా చెబుతున్న కథనీ కూడా తెలంగాణ దృష్టితో చూడగలిగే విశిష్టశైలిని కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో చూడగలిగే అవకాశం ఉంది. ఉమ్మడి కుటుంబంలో ఉండటం వల్ల దొరకని ఏకాంతాన్ని వెతుక్కొనే సన్నివేశంలో 'కన్నులో మిసమిసలు కనిపించనీ, గుండెల్లో గుసగుసలు వినిపించనీ' అని హీరోగారు ఓ సినిమా (దేవత?)లో పాడుతుంటాడు. కాసులకవి దీన్ని "కన్నుల్లో బుసబుసలు కనిపించనీ/ గుండెల్లో బాకు దించనీ'' అని అనుకరణరూపంలో కవిత్వమవ్వటం ఓ చైతన్యస్రవంతి శిల్పం నుండి పుట్టిన కొత్త ఊహ! మరో సినిమా అల్లూరి సీతారామారాజులో తెల్లవాడిని ప్రశ్నిస్తున్న సన్నివేశాన్నే స్ఫురింపజేస్తూ "ఎవడు వాడు, ఎచటి వాడు/ ఇటువంటి నల్లవాడు/ ఎందుకొచ్చిండో ఎరుకలేదాయె/ కాకితో కబురైనా పెట్టకుండా వచ్చిన చుట్టమని/ అంగలార్చి అక్కున చేర్చుకుంటి/ నా నల్లనల్ల రేగళ్ల మీద పచ్చిపుండ్లు పడె'' అని తెలంగాణ సమస్యవైపు దృష్టి మరల్చేటట్లు కవిత్వీకరించాడు. సినిమా పాటల్నే కాదు విప్లవ పాటల్ని, పిల్లల్ని ఆడించే జాబిల్లి పాటల్లో కూడా చైతన్యాన్ని నింపే ప్రయత్నంలో "నీళ్లు మనవిరో, నేల మనదిరో/ వాడి ఎవుసమేందిరో, వాడి దున్నుడేందిరో'', "పైలం కొడుకో, కొమరన్న/ జర భద్రం కొడుకో'' అనటంలో విప్లవ చైతన్యంలోని చైతన్యాన్నీ వినియోగించుకోవాలనే తపన ఉంది. "గొంగట్ల మెతుకులేసి ఏరుకోవడమే/ చీకటి అర్రల ఒంటరి మొత్తుకోలు/ చందమామ రాకె, జాబిల్ల రాకె'' అనగలిగేదంతా ఆలోచించవలసిందే. సరదా కోసం వీటిని ప్రయోగించడం లేదు. ఒక విశిష్ట ప్రయోజనాన్ని ఆశించే ప్రయోగిస్తున్నాడు కవి. గ్లోబలైజేషన్ పట్లా, ఆర్థిక సరళీకృత విధానాల పట్లా కడూ స్పష్టత ఉంది. సమకాలీన తెలంగాణ రాజకీయ పొత్తుల పట్ల కవి అభిప్రాయం ఉంది. తన తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి సాధించాలనే ఆర్తి తన కవిత్వం నిండా ఉంది. తెలంగాణ ప్రజలందరూ హత్తుకొదగింది. కవి, విమర్శకుడు గౌరీశంకర్ అన్నట్లు "కాసుల ప్రతాపరెడ్డి కవిత్వంలో భావోద్వేగం, పదునైన ఆలోచనలు ఉన్నాయి. తెలంగాణా పటానికి అల్లుకున్న వలస గూడును తన చేతులతో చీరేసే ప్రయత్నం చేస్తున్నాడు''. కవి రచనకు, నిబద్ధతకూ నిత్యం నిదర్శనంగా నిలుస్తూ 'గుక్క' పట్టి దుఃఖిస్తున్న తల్లి తెలంగాణ దాహాన్ని తీర్చమని ఆహ్వానిస్తున్నాడు. 'వలస'ను నిర్వచించవలసిన అవసరం ఉన్నా, సమస్యను పరిష్కరించడం మాత్రం అత్యవసరం. సొంత అస్తిత్వానికై 'గుక్క' పట్టిన తెలంగాణ కవిత్వం ఒక ఎమెర్జెన్సీ పోయిట్రీ. ( గుక్క (కవితా సంకలనం; కవి: కాసుల ప్రతాపరెడ్డి; వెల: రూ. 15/-; ప్రతులకు: అన్ని ప్రధాన బుక్ షాపులల్లో)

-డా॥ దార్ల వెంకటేశ్వరరావు 23092005

No comments: