"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

06 నవంబర్, 2026

అతనో ప్రశ్నల పుట్ట!

 అతనో ప్రశ్నల పుట్ట!?


అతడు

ఒక చిన్న దీపం వెలిగించాడు

చీకటికి అది నచ్చలేదు!


ఒక గుప్పెడు మెతుకులు

ఆకలితో ఉన్న అరచేతిలో పెట్టాడు

ఆకలి పేరుతో వ్యాపారం చేసేవాళ్లకు

అతడు నచ్చలేదు!


ఎండలో మాడుతున్న చెట్టుకు

నీళ్లు పోశాడు

నీడను కూడా అమ్ముకునే వాళ్లకు

అతడు నచ్చలేదు!


కూలిపోతున్న గోడకు

భుజం ఆనించాడు

కూల్చడమే తెలిసిన వాళ్లకు

అతడు నచ్చలేదు!


అతడు ఏం తప్పు చేశాడు?

కులం అడగకుండా

ఒక మనిషిని తన పక్కన కూర్చోబెట్టాడు

మతం చూడకుండా

ఒక మనిషి కన్నీటిని తుడిచాడు

ఆకలి ముందు

అన్ని గోడలూ చిన్నవేనన్నాడు!


అతడు ఏం తప్పు చేశాడు?

అక్షరాల్ని ఆయుధాలుగా చేసుకున్నాడు

అవమానాల్ని ప్రశ్నలుగా మలిచాడు

మౌనంగా ఉన్న గొంతులకు

తన గొంతును జతచేశాడు

అన్యాయం ముందు

తలవంచడం తనకు తెలియదన్నాడు!


అతడు ఏం తప్పు చేశాడు?

ఒకరి కన్నీటిని చూసి

తన కళ్లలో నీళ్లు నింపుకున్నాడు

ఒకరి ఆకలిని చూసి

తన కంచంలో అన్నం తగ్గించుకున్నాడు

ఒకరి అవమానాన్ని చూసి

తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నాడు!


అతడు ఏం తప్పు చేశాడు?

తనకంటూ ఒక కల కట్టుకున్నాడు

ఆ కలలో అందరికీ చోటిచ్చాడు

తనకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాడు

ఆ ఇంటి గుమ్మానికి

అంటరానితనం అనే తాళం వేయలేదు!


అతడు ఏం తప్పు చేశాడు?

తనకు ఎదురైన అవమానాన్ని

మరో మనిషికి ఎదువ్వొద్దన్నాడు

తనను తొక్కిన పాదాల్ని చూసి

మరొకర్ని తొక్కనివ్వనని కలకన్నాడు 

తనకు దక్కని గౌరవాన్ని

కనీసం తన తర్వాత వాళ్ళకైనా

దక్కాలనుకున్నాడు!


అతడు ఏం తప్పు చేశాడు?


ఇప్పుడు

అతని పేరు వినిపించదు

అతని నవ్వు కనిపించదు

అతడు నడిచిన దారిలో

ముళ్లే మిగిలాయో

పూలే మిగిలాయో

ఎవరికీ తెలియదు!


అతని ఇంటి ముందు

ఒకప్పుడు నిలబడ్డ మనుషులు

ఒక్కొక్కరూ దూరమైపోతున్నారు

అతని కోసం కన్నీరు పెట్టిన కళ్లు

ఒక్కొక్క చుక్కా ఇంకిపోతోంది

అతడు వెళ్లిపోయాడు!


అతని మంచితనం మాత్రం

ఒక పాత ఉత్తరంలా

కాలం చేతిలో మడతలు విప్పింది

అతని మానవత్వం మాత్రం

ఒక అనాథ దీపంలా

గాలిలో ఒంటరిగా వెలుగుతోంది!


అతడు చేసిన తప్పేమిటి?

మనిషిని మనిషిగా చూడటమా?

మనసును మమతగా పంచటమా?

అన్యాయాన్ని అన్యాయమని అనటమా?

ఆకలికి అన్నం పెట్టమనడమా?

అవమానానికి ఎదురుగా

ఆత్మగౌరవంతో నిలబడటమా?


అతడు చేసిన తప్పేమిటి?

ఒక మనిషిగా పుట్టి

మరో మనిషికి

మనిషిగా బతకాలని చెప్పడమేనా?

అయితే

ఈ నేల మీద

మనిషిగా బతకడమే నేరమైతే

ఆ నేరం చేసిన ప్రతి ఒక్కరి తరఫున

నేను కూడా ఒక ప్రశ్నగానే నిలబడతాను!

— దార్ల వెంకటేశ్వరరావు, 3.11.2026.

(కత్తి మహేష్ , సిద్ధార్థ్ సుభాష్ చంద్రబోస్ లను తలచుకొంటూ…)


కామెంట్‌లు లేవు: