నాకీ మధ్య గత కొన్ని రోజులుగా దుస్వప్నాలు వస్తున్నాయి. అలాంటి కొన్ని కలలు మనసుని అల్లకల్లోలపరుస్తుంటాయి.
'అవి కలలేకదా' అనీ మనసుకి సర్దిచెప్పుకున్నా, ఏదో ఆందోళన మాత్రం అంతరంగంలో భయాన్ని కలిగిస్తుంది.
ఈ రోజు (27.9.2026) ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మెలకువ వచ్చేసింది...ఆ కలవల్లే.
ఏదో సభలో మాట్లాడ్డానికి వెళ్ళాం.
ఆ సభలో నాకు తెలిసిన వాళ్ళు చాలా బాగుంది ఉన్నారు.
'సభ అయిపోతుంది... మన వెహికల్ రెడీగా ఉందా' అన్నాను నా పక్కనున్న వాళ్ళతో.
'' ఆఁ వచ్చేస్తుంది'' అని దానికెవరో సమాధానం చెప్పారు.
కాసేపటికి ఓ వెహికల్ సిద్ధంగా బయట ఉంది.
ఆ వెహికల్ ఎర్రగా ఉంది.
దాని మీద అప్పటికే చాలామంది నిర్జీవంగా పడుకొని ఉన్నారు.
అది శ్మశాన వాటికకు తీసుకెళ్ళే 'వైకుంఠ వాహనం' లా ఎర్రరంగులో ఉంది.
'బ్రదర్... రండి త్వరగా బండి సిద్ధంగా ఉంది' అంటున్నాడు నాకు బాగా తెలిసిన ఒక సాహితీమిత్రుడెవరో.
' బట్టలు మార్చుకుంటున్నా...వస్తున్నా' అంటున్నాను...
అమాంతంగా మెలకువ వచ్చేసింది.
***
మొన్నామధ్య ఓ కల వచ్చింది.
రెండు మూడు రోజులు క్రితం.
అది కూడా తెల్లవారుజామునే... సుమారు నాలుగు, ఐదు గంటల మధ్యలో.
ఒక పాడుబడిన తోటలాంటి స్థలం.
చెత్తాచెదారంతో నిండి ఉంది
ట్రాక్టర్ తో భూమిని చదును చేస్తున్నారు.
అక్కడ పడిన చెత్తను శుభ్రం చేస్తున్నారు.
శుభ్రం చేసిన స్థలంలో ఓ చోట ఓ గొయ్యి తవ్వుతున్నారు.
నన్ను సిమెంట్ కాంక్రీటు కలిపి తీసుకొచ్చే బండిలాంటి ఒక తోపుడు బండిలో కూర్చోబెట్టి అక్కడకు ఎవరో తీసుకొస్తున్నారు.
నా కాళ్ళూ చేతులూ కదల్చలేకపోతున్నాను.
కానీ, వాళ్ళు చేస్తున్నవన్నీ తెలుస్తున్నాయి.
చూస్తున్నాను.
ఏమీ మాట్లాడలేకపోతున్నాను.
సడన్ గా మెలకువ వచ్చేసింది.
వాల్ క్లాక్ లో ఉదయం సుమారు మూడున్నర గంటలవుతుంది .
***
అంతకు ముందు కూడా ఓ విచిత్రమైన కల వచ్చింది.
అదో అందమైన భవనం. హోటల్ లేదా ఏదో రిసెప్షన్ లా ఉంది.
జనం చాలామంది ఉన్నారు.
హాలంతా కిటకిటలాడుతున్నారు.
అందరూ మంచి మంచి బట్టలతో ఉన్నారు.
నేను వాళ్ళ మధ్య నిలబడాలంటే సిగ్గేస్తుంది
నా ఒంటిమీద నూలుపోగు లేదు.
అక్కడ ఉన్న ఓ బనియన్ లాంటి గుడ్డను మొలను కనబడకుండా చుట్టుకొంటూ దాచుకుంటున్నాను.
కానీ, జనం కూడా ఏమీ పట్టించుకోవడం లేదు.
బట్టలున్నా వాళ్ళిష్టం వచ్చినట్లు వాటిని వదిలేస్తున్నారు.
వాళ్ళ చేతుల్లో ఏవో మెరుస్తున్నాయి. వాటినే చూసుకొంటున్నారు.
ఎవరితో ఎవరూ మాట్లాడినట్లనిపించడం లేదు
అక్కడ జనం ఉన్నారు సమూహంగా...
తిరుగుతున్నది మాత్రం ఒంటరిగా..స్వేచ్చగా...
అయినా నేనే సిగ్గు పడిపోతున్నాను.
మెలకువ వచ్చేసింది.
సమయం సుమారు ఉదయం నాలుగు గంటల వుతుంది.
***
ఇవి కలలు !
కొన్ని కలలు భయపెడతాయి
మరికొన్ని కలలు సంతోషపెడతాయి
ఏ కల ఎందుకొస్తుందో తెలీదు
ఆనందపెట్టేది మర్చిపోతాం
భయపెట్టేది మాత్రం
ప్రతి పనినీ పరీక్షించుకోమంటుంది!
- దార్ల వెంకటేశ్వరరావు, 30.9.2026
సమయం, ఉదయం గం.6:14 ని.లు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి