"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

21 జులై, 2026

డా. ఉమేష్ వాళ్ళ నాన్న గార్కి నా హృదయపూర్వక నివాళి

 శిల్పి చెప్పిన జీవిత సత్యం 

నువ్వు

చెక్కలను శిల్పాలు చేసేవాడివనుకున్నాను

నువ్వు

చెట్టు బెరడును

సున్నితంగా మార్చేవాడివనుకున్నాను

నువ్వు

నీ పనిలోనే మునిగిపోయావనుకునేవాణ్ణి.

నువ్వు చెక్కేది నన్నేనని,

నువ్వు నునుపుగా మార్చేదీ నన్నేనని

తెలుసుకొనే సరికే...

నవ్వుతూ నువ్వు వెళ్లిపోయావు.

ఇప్పుడు...

ఉలిని చూస్తే

నా జీవితాన్ని అక్షరక్షరం దిద్దిన

నీ చేతిలానే కనిపిస్తోంది

సుత్తి మోతలో

నీ మౌన బోధనలే వినిపిస్తున్నాయి

ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.

శిల్పం పూర్తయ్యాక

శిల్పి వెనక్కి తప్పుకుంటాడట.

బహుశా...

నన్ను పూర్తిగా చెక్కేశాననే

తృప్తితోనే

నువ్వు నవ్వుతూ వెళ్లిపోయావేమో.

ఇప్పుడు...

ఎవరో నా మంచితనాన్ని మెచ్చుకున్నప్పుడల్లా,

నా మాటల్లో సంస్కారం ఉందన్నప్పుడల్లా,

నా జీవితానికి ఒక రూపం ఉందన్నప్పుడల్లా,

వాళ్లు నన్నే చూస్తున్నారు అనుకుంటారు.

నేను మాత్రం...

నాలో ఇంకా చెక్కుతూనే ఉన్న

నీ చేతులనే చూస్తుంటాను.

దార్ల వెంకటేశ్వరరావు 6.7.2026

(నా పరిశోధక విద్యార్థి డా. బడిగె ఉమేష్ తన తండ్రిని కోల్పాయడని తెలిసి క్షణంలో… )


నాతో డా.ఉమేష్

నాకున్న ప్రియమైన శిష్యులలో డాక్టర్ బడిగే ఉమేష్ ఒకరు. ఎం.ఏ. సెంట్రల్ యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. తర్వాత నా దగ్గర ఎం.ఫిల్ చేశాడు. అది పూర్తయిన తర్వాత పీహెచ్డీ కూడా పూర్తి చేశాడు. పద్యాన్ని బాగా పాడతాడు. కష్టపడి రాయడం నేర్చుకున్నాడు. తాను చూసిన దాన్ని, తను చదివిన దాన్ని చక్కగా దృశ్యంగా ఆవిష్కరించగలడు. అతని పిహెచ్డి వైవా ఎప్పటికీ మర్చిపోలేను. రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారి వాక్యాలను అనర్ఘళంగా చెప్పాడు. అంతకుముందు అలా అనంతకృష్ణ శర్మ గారి గురించి చెప్పిన వారిని ఒకరినే చూశాను. ఘట్టమరాజు అశ్వత్థనారాయణగారు. ఆయన మంచి విమర్శకులు. ఆయన తన ప్రసంగంలోగానీ, సంభాషణలో గానీ అనంతకృష్ణశర్మగారి వాక్యాలను యథాతధంగా చెప్తూ ఉంటారు. అలా తాను పిహెచ్డి చేసిన రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారిపై మళ్ళీ ఉమేష్ మాత్రమే చెప్పగలడనిపించేలా చెప్తాడు. ఇదంతా ఎందుకంటే నా దగ్గర పరిశోధన చేసేటప్పుడు ఉమేష్ ని గమనించేవాడిని. వాళ్ల నాన్న పట్ల, వాళ్ళ కుటుంబం పట్ల ఉమేష్ ఎంతో బాధ్యతతో మెలిగేవాడు. తన తండ్రిని ఒకసారి మా ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత మళ్లీ తాను డాక్టరేట్ డిగ్రీ అందుకునేటప్పుడు స్నాతకోత్సవానికి కుటుంబంతో సహా తీసుకొచ్చాడు. 




ఈ రెండు సందర్భాల్లోనూ వాళ్ళ నాన్నగారిని కలిసాను. నా పట్ల ఆయనకు ఎంతో, గౌరవం ప్రేమ ఉందనిపించింది. ఆయన మరణించిన తర్వాత నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి నాకు దూరమైనట్లు అనిపించింది. ఆయన త్యాగం వల్ల తన కొడుకులు అభివృద్ధిలోకి వచ్చారు. పిల్లలు సంపాదించే సమయంలో తాను పిడికెడు మెతుకులు తినకుండా గానే వెళ్ళిపోయారు. ఆయనకు డయాబెటిస్ ఉండేది. ఉమేష్ తో ఎప్పుడు మాట్లాడిన ఆయన గురించి అడిగేవాడ్ని.ఆయన కూడా నా గురించి అడిగేవాడని  ఉమేష్  చెప్పేవాడు. ఆయన తన కొడుకులను ఉన్నత విద్యలను అభ్యసించేలా చేశాడు. ఒక కొడుకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్టర్ చేసి గోల్డ్ మెడల్స్ సాధించాడు. అతడే డాక్టర్ ఉమేష్. ఆ గోల్డ్ మెడల్ ని అందుకున్నప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. ఆయనలో అందరి పట్ల కృతజ్ఞతలు చూశాను. తన కొడుకుని అందరూ దీవించాలనే ఆశను కనిపెట్టాను. ఆయనను నా హృదయానికి హత్తుకున్నాను. ఆ ఆనందకర క్షణాలు అన్నీ నా బ్లాగులో పోస్ట్ చేశాను కూడా. https://vrdarla.blogspot.com/2022/10/blog-post_17.html?m=1

 తన మరొక కొడుకు మంచి ఆర్టిస్ట్. ఆయన తన పెద్దకొడుకుకి పెళ్లి చేశాడు. పిల్లలు పుట్టారు. మనవలను ఎత్తుకొని మురిసిపోయాడు. తనకిదే సంతృప్తి అనుకున్నాడో ఏమో హఠాత్తుగా మరణించారు. ఆయనకు నా హృదయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను. 

- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 21.7.2026.

కామెంట్‌లు లేవు: