"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

26 ఏప్రిల్, 2026

జీవితాన్ని పసిపిల్లాడిలా ఆస్వాదించిన ఆచార్య తుమ్మల రామకృష్ణ (నినాదం దినపత్రిక, 26.4.2026 సౌజన్యంతో)

 జీవితాన్ని పసిపిల్లాడిలా ఆస్వాదించిన 

ఆచార్య తుమ్మల రామకృష్ణ 


నినాదం దినపత్రిక, 26.4.2026 సౌజన్యంతో 

బిహెచ్ ఇ ఎల్ సెంటర్ నుండి శేరి లింగంపల్లి రైల్వేస్టేషన్ కి వెళ్ళె రోడ్డు…దానికి ఎడమవైపున రోడ్డుకు ఆనుకునే శ్రీ పోచమ్మ దేవాలయం ఉంటుంది. అక్కడ ఈశాన్యం వైపు ఓ టర్నింగ్ రోడ్డు…ఆ రోడ్డుకి పది అడుగుల దూరంలోనే  తుమ్మల రామకృష్ణ గారు ఉండే అపార్ట్మెంట్ ‘సిగ్మా సెంట్రల్’. 

ఆయన ఇంటికి ఎవరైనా వస్తే అడ్రస్ చెప్పేవాడు. వాళ్లకు సరిగ్గా తెలియక మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తే ‘’వీళ్ళు కవులు, రచయితలు…ఎన్నిసార్లు చెప్పినా, ఎంత వివరంగా చెప్పినా, చెప్పిన అడ్రస్ కే  రాలేరు. చివరికి గూగుల్ మ్యాప్ పంపించినా, ఆ టెక్నాలజీ మాకు తెలియదు అంటారు.… వీళ్ళు ప్రపంచాన్ని మార్చేయడానికి రచనలు చేస్తారట.’ అని అంటుండేవారు.

ఆయన ఇంటికి సుమారు ఐదు, ఆరు వందల మీటర్ల దూరంలోనే మా ఇల్లు.  క్యాంపస్ నుండి తన అపార్ట్మెంట్ కి వచ్చిన తర్వాత ఇంచుమించు రోజూ ఆయన ఇంటికి నేనో, మా ఇంటికి ఆయనో వెళ్తూ వస్తూ ఉండేవాళ్లం. ఉదయమో, సాయంత్రమో చందానగర్ లోని పిజిఆర్ గార్డెన్ వైపు వెళ్లే వాళ్ళం వాకింగ్ కోసం. అక్కడ కాకపోతే బీహెచ్ఈఎల్ గ్రౌండ్ కి వెళ్లేవాళ్లం. ఆయన కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా వెళ్లే వరకు ఇంచుమించు అలాగే వాకింగులో, టాకింగ్ లతోనో గడిచిపోయేది మాకు. వాకింగ్ కంటే కూడా టాకింగే ఎక్కువగా ఉండేది! ఆయన ముందు ఎవరైనా  మంచి శ్రోతగా ఉండటమెలాగో నేర్చుకుంటారు. అంత ఆకట్టుకొనేలా మాట్లాడతారు! 

ఆయనతో మనం ఉన్నంత సేపు వాళ్ల గురువులు ఆచార్య జి.యన్.రెడ్డి, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, ఆచార్య జి.నాగయ్య తదితరులంతా మన కళ్ళముందు మెదులుతున్నట్లుగా దృశ్యమానం చేసేవారు. అయినా కథల గురించి మాట్లాడితే, చా.సో., కా.రా., మధురాంతకం రాజారాం వంటి కథకుల గురించి మాట్లాడేవారు. వల్లంపాటి ‘కథా శిల్పం’లో లోపాలు ఉన్నాయనే వారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్లను అన్న అని పిలిచేవారు. ఆచార్య ఉషాదేవి గారిని తన క్లాస్మేట్ గానో, కలిసి పనిచేసినట్లుగానో చెప్పేవారు. ఆచార్య కె.కె.రంగనాథాచార్యులు, ఆచార్య ఎన్.గోపి., ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, ఆచార్య కె.యస్.రమణ వంటి వారితో తనకున్న పరిచయాలను పదేపదే చెప్తుండేవారు. 

     ఆయన మరణించి ఏడాది గడిపోయినా ఆ రోడ్డు మలుపు తిరుగుతున్నప్పుడల్లా  ఆయన నన్ను పిలుస్తున్నట్లే అనిపిస్తుంది. ఆయన కోసం నాలుగు అక్షరాలు …ఆయన బతికున్నప్పుడు రాసిన అక్షరాలు కాదు; ఆయన చనిపోయిన తర్వాత కన్నీళ్ళు తడిసి నాలుగు అక్షరాలు రాల్చడం కదా ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అనిపించింది.

సెంట్రల్ యూనివర్సిటీలో చేరడం…

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆశ్చర్య పరిమి రామ నరసింహం గారు తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మేమంతా ఉద్యోగాల్లో చేరాం. 2004లో ఆయన,  యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ (సెంట్రల్ యూనివర్సిటీ)తెలుగు శాఖలో రీడర్ చేరారు. అదే సంవత్సరం నేను కూడా లెక్చరర్ గా చేరాను.ఇద్దరం తొలిసారిగా ఇంటర్వ్యూలోనే కలుసుకున్నాం. 

ఒత్తైన తెల్లని జుట్టులో అక్కడక్కడ కొన్ని నల్లని వెంట్రుకలు. (తర్వాత ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనిపించకుండా తలకు రంగు వేసుకొనేవారు) ఒంటిపై టై లేకుండా, బ్లేజర్ లా ఫ్రీగా వేసుకొనే నల్లని కోటు, కాళ్ళకు మెరిసే షూ. చురుకైన కళ్ళు,  కళ్ళజోడు ..గలగల ప్రవహించే మాటలు…మనం ఎవరిమో ఆయనకు తెలియకపోయినా తెలిసినట్టు పలకరించే కలివిడితనం.ఆయన అందరితో భలే  ఉండేవాడు! ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండేది. తర్వాత మానేశారు. ఆ పొగను గుండ్రంగా ఊదుతూ, తన ‘మట్టిపొయ్యి’ కథల్లో కొన్ని పాత్రలను ఎలా వర్ణించారో చెప్పేవారు.

మేమంతా అద్భుతాలు వింటున్నట్లుగా ఆలకించేవాళ్ళం…ఆయన మాట్లాడే రాయలసీమ మాటల్లోని కొత్త పదాలను వింతగా వింటూ ఉండేవాడిని. ఇలా ఎంతసేపైనా సరదాగా గడిచిపోయేది. ఆయనకి ఎన్నిసార్లైనా టీ అంటే చాలా ఇష్టం. యూనివర్సిటీ క్యాంటీన్లో వెంకట్రావు టీ కాంటీన్ దగ్గర కూర్చొని, మనకోసం స్పెషాలిటీ తెస్తాడని చెప్పడం, ఆ టీవీ ఎంతో సంతోషంగా ఆస్వాదించడం…అది నిజంగా స్పెషల్ గా ఉన్నా లేకపోయినా తనకోసం స్పెషల్ గా చేసాడని సంతోష పడిపోయేవారు. నాకు ఇప్పటికీ ఆ క్యాంటీన్ దగ్గరకు వెళ్ళినప్పుడల్లా అది అక్కడ కనిపించే ఓ అద్భుతమైన దృశ్యం!  మధ్యాహ్నం మా ఫ్యాకల్టీ లో ఆచార్య గోనానాయక్ గారు, ఆచార్య పిల్లలమర్రి రాములుగారు నేనూ..ఇలా నలుగురుమూ కలిసి భోజనం చేసేవాళ్ళం. కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైనా తినేవారు కాదు. బి.పీ.కి భయపడేవారు. ఆయన అప్పుడప్పుడు ఆ సందర్భంగా ‘’తట్టలు’’ కడుక్కోండి అనేవారు. అంటే రాయలసీమ భాషలో అన్నం తినడానికి ఉపయోగించే ప్లేట్లు. ఆ యా సంభాషణల సందర్భంలో ‘మెట్టుతో కొట్టడం’ ( చెప్పుతో కొట్టడం) వంటి మాటలు ఆయన నోట్లో నుండి అప్రయత్నంగా వచ్చేవి. రాయలసీమలో కొంతమంది ‘బండ మీద కూడు’  తింటారని చెప్పేవారు. దాని గురించి లోతుగా అడుగుతుంటే ఓ కథ లేదా నవల రాయాలనేవారు. దానితో పాటు ‘నల్లకోతులు’ పేరుతో నవల రాయాలనేవారు. ఆధునికంగా ఉద్యమాలు, రాజకీయాలు పేరుతో జరుగుతున్న అనేక విషయాలను దాన్లో చెప్పాలనుకున్నట్లు చెప్పేవారు. 

ప్రతీకాత్మకంగా ‘తెల్లకాకులు’ కథ:

లోకంలో తెల్లకాకులు ఉంటాయా? మామూలుగా అయితే ఉండవనేదే సమాధానం! ప్రపంచం అంతా వెతికితే తెల్లకాకులు కూడా ఉంటాయి. కానీ, మనం..మన చుట్టూ నిత్యం చూసేది నల్లకాకులే కాబట్టి, తెల్లకాకులు ఉండవనేది మన నిశ్చితాభిప్రాయం. కానీ, ‘తెల్లకాకులు’ పేరుతో ఓ సుదీర్ఘమైన కవిత్వంలా అనిపించే ఓ కథ లాంటి కథను రాశారు తుమ్మల రామకృష్ణ కృష్ణగారు!  అధివాస్తవికతను, చైతన్య స్రవంతినీ కలపిన శిల్పరచనాపద్థతిలో దాన్ని రాశారు. ఆ రచనను రెండు మూడు పత్రికలకు పంపాననీ, దాన్నెవరూ ప్రచురించలేదనీ, అందువల్ల తానే ప్రచురించాలనుకుంటున్నానని చెప్పేవారు. ఆ లోగా నా దగ్గర ఓ ప్రాజెక్ట్ లో రీసెర్చ్ ఫెలోగా చేరిన వేముల ఎల్లయ్యగారు దాన్ని తీసుకెళ్ళి ఓ పుస్తకం రూపంలో ప్రచురించి తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు. మేము  వాకింగ్ కి వెళ్ళేటప్పుడు ఆయన జేబులో కొన్ని కాగితాలు, పెన్ను ఉండేది. తనకి మంచి వాక్యం గుర్తొస్తే, దాని అప్పటికప్పుడు రాసుకుంటూ ఉండేవారు. అలా ఎంతో కాలంగా ఉన్న ఆలోచనల ఫలితంగా  రాసిన కాగితాల కట్టను ఆయన దగ్గర పరిశోధన చేస్తున్న మా విద్యార్థి జి.వెంకటరమణ శుద్ధ ప్రతిని తయారు చేశాడు. అతని అక్షరాలు  ముత్యాల్లా ఉంటాయి. అందువల్ల ఆయన అనేక వ్యాసాలను, రీసెర్చ్ రిపోర్టులను తాను వ్యాసుడిలా చెప్తుంటే వెంకట రమణ మాత్రం విఘ్నేశ్వరుడిలా వ్రాయసకారుడు అయ్యేవాడు. తెల్లకాకులు పుస్తకం వచ్చిన తర్వాత దానిపై వచ్చిన వ్యాసాలు, ఆ మూల కథనూ, ఆంగ్ల అనువాదాన్నీ కలిపి ‘ఎక్కడవీ తెల్లకాకులు’ (2015) పేరుతో డా.జి.వెంకటరమణ తనతో  పాటు ఎం.నాగరాజుని జత కలుపుకొని సంపాదకులుగా ప్రచురించారు. తెల్లకాకులలో ‘మూర్తి’ అనే పాత్ర ఆయన జీవితాన్ని ప్రతిఫలించేలా ఉంటుంది. కానీ, అది ఆయన జీవితం అంటే ఒప్పుకోడు. ఆయన సెంట్రల్ యూనివర్సిటీ లో చేరిన వెంటనే ఒక విషాదాన్ని ఎదుర్కొన్నారు. తన భార్య చంద్రకళను ఓ యాక్సిడెంట్ లో పోగొట్టుకున్నారు. 

ఆ బాధతో చాలాకాలం రామకృష్ణ గారు కోలుకోలేదు. చాలా  తర్వాత తన దూరపు బంధువు  విజయలక్ష్మి గారిని వివాహం చేసుకున్నారు. ఆ జీవితం అంతా తెల్లకాకులలో కనిపిస్తుంది. తన జీవితాన్ని చెప్తున్నట్లుగా కాకుండా, ఆధునిక జీవితంలోని సంఘర్షణలను, సంక్లిష్టతలను మేడ నుంచి మానవుని స్వభావాన్ని చిత్రించేలా ఆ కథను వర్ణించారు. దానిపై నేను ఒక సుదీర్ఘమైన వ్యాసం కూడా రాసాను. ఆ వ్యాసాన్ని ఆ పుస్తకంలో కూడా ప్రచురించారు. ఆ వ్యాసాన్ని ఆయన ఎంతో మెచ్చుకున్నారు. తన ‘మట్టి పొయ్యి’ కథలల్లో కూడా తన కుటుంబానికి సంబంధించిన సంఘటనలనే కథా వస్తువులుగా మార్చారు. ‘మహా విద్వాంసుడు’ అనే కథ తన అన్నగారి కథ అని చెప్పేవారు. ఆ కథ కన్నడ, ఇతర భాషలలోకి కూడా అనువాదం అయింది.

ఆయనకి ఏమీ తోచకపోతే అది పొద్దుట… సాయంత్రం… రాత్రి…. ఏ సమయంలోనైనా ఫోన్ చేసేవాడు. 

ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాదు, వీ.సి.గా వెళ్ళిన తర్వాత కూడా, ఒక్కోసారి మధ్యాహ్నం సమయంలోనూ ఫోన్ చేసేవారు. ఏమి అర్జెంటు వచ్చిందదో అనుకుని ఫోన్ తీస్తే, ‘’ఏదోమాట్లాడాలి అనిపించింది ఫోన్ చేశాను’’ అనేవారు. ఆ ఫోన్ తీయడానికి భయమేసేది. సమయం కాని సమయం లో ఫోన్ చేస్తున్నారేమిటా అని! తర్వాత అక్కడ రాజకీయాల గురించి నర్మగర్భంగా మాట్లాడేవారు. అనవసరంగా వీసీగా వచ్చాననే ఫీలింగ్ కనిపించేది ఆ మాటల్లో. అయినా, బానే ఉన్నాను అనేవారు. 

తాను ఏ పదవిలో ఉన్నా, తనకంటూ కొంతమందిని మిగిల్చుకున్నారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గార్ని కలవడానికి ఆచార్య పిల్లలమర్రి రాములు గారితో పాటు నన్ను కూడా తీసుకొని వెళ్ళేవారు. సిటీలో మీటింగ్స్ జరిగితే వాళ్ళను కావాలనుకున్నప్పుడు ఒక సామాన్య ప్రేక్షకుడికిగా కూడా వెళ్ళేవారు. మీటింగ్ జరుగుతుంటే ఆ వెనుక లేదా వెనుక నుంచి రెండు మూడు వరుసల్లోనో కూర్చుందామనేవారు. స్వేచ్ఛగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందనేవారు. వాకింగ్ కి వెళ్ళి వచ్చేటప్పుడు వీధిలో పెట్టిన చిన్న బడ్డీలాంటి దానిలో కూడా కూర్చొని టిఫిన్ తినడం, టీ తాగడానికి ఏమాత్రం సిగ్గు పడేవారు కాదు. అన్ని పరిస్థితులకూ మనం అడ్జెస్ట్ కావడం నేర్చుకోవాలనేవారు. వీ.సి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు అత్యంత ఆత్మీయులను కలవాలనుకున్నప్పుడు నన్ను కూడా తీసుకువెళ్లేవారు. కథారచయిత ఖదీర్ బాబు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన కథలు అంటే చాలా ఇష్టం. ఆయన కోసం ఒకసారి కూకట్ పల్లి హోటల్లో కలవడం కోసం వెళ్ళాం. వీ.సి.ని అనే అధికార హోదాతో కాకుండా తనకి ఇష్టమైన  రచయితను కలవడానికి వెళుతున్నానని అనేవారు. 

గురజాడ, శ్రీశ్రీలపై అభిమానం

సుమారు రెండున్నర దశాబ్దాలుగా ఓకే డిపార్ట్మెంట్లో కలిసిమెలిసి పని చేసాం. కలిసిమెలిసి సుఖదుఃఖాలను పంచుకున్నాం. ఆయనకున్న సాహిత్య ఇష్టాయిష్టాలను కూడా గుర్తు చేసుకోవాలనిపిస్తుంది.

ఆయనకి గురజాడ, శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం! కన్యాశుల్కం లోని డైలాగులు కంఠతా వచ్చేవి.

గిరీశాన్ని బాగా ఇష్టపడేవారు. గిరీశం మరో వెయ్యేళ్ళైనా బ్రతికే ఉంటాడని చెప్పేవారు. గురజాడ సన్నగా ఉన్నాడు గాని, బలమైన భావంతో రచనలు చేశాడు అని చెప్పేవారు.

కన్యాశుల్కంలో పొగాకు తాగనివాడు దున్నపోతై పుడతాడని గిరీశం నోటితో గురజాడ వారు పలికించిన పద్యాన్ని  పదే పదే ఉదాహరిస్తూ, దేన్నైనా కొంతమంది బ్రాహ్మణ పండితులు శాస్త్రాలతో ఎలా ముడిపెడుతుంటారో చాలా జాగ్రత్తగా గమనించాలనే వారు. 

ఖగపతి అమృతము తేగా,

భుగభుగమని పొంగి పొరలి భూస్థలి పడి,

తా పొగ చెట్టయి జన్మించెను.

పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్.

ఆయన ఏ ప్రసంగం చేసినా, ముగ్గురిని కచ్చితంగా ప్రస్తావించేవారు. గురజాడ, శ్రీ శ్రీ, కృష్ణశాస్త్రి…వాళ్ల పద్యాలను గబగబా లయాత్మకంగా ప్రసంగానికి అనుగుణంగా చదివి వినిపించేవారు. 

‘’కవితా! ఓ కవితా!

నా యువకాశల సుమపేశల నవగీతావరణంలో,

నిను నే నొక సుముహూర్తంలో,

అతిసుందర సుస్యందన మందున

దూరంగా వినువీధుల్లో విహరించే

అందని అందానివిగా

భావించిన రోజులలో,

నీకై బ్రదుకే ఒక తపమై

వెదుకాడే నిమిషాలందున నిషాలందున,

ఎటు నే చూచిన చటులాలంకారపు

మటుమాయల నటనలలో,

నీ రూపం కనరానందున

నా గుహలో, కుటిలో, చీకటిలో

ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?...’’ అని ఆ కవితలోని కొన్ని భాగాలను చదివి వినిపించేసరికి, ఆయన ప్రసంగాన్ని అదే తొలిసారిగా వినేవారైతే ‘అయ్యబాబోయ్ …మహాకవుల కవిత్వాన్ని ఎలా గుర్తుపెట్టుకుని చెప్పేస్తున్నారో కదా. ఇది కదా పాండిత్యం…అని ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే! ఒకవేళ ఆయన ప్రసంగం ఎలా ఉంటుందో ముందే తెలిసిన వాళ్ళు అయితే, ఇక తర్వాత తన ప్రసంగంలో శ్రీశ్రీ, గురజాడలను ఎప్పుడు చెబుతారని మరికొంతమంది ఎదురు చూసేవాళ్ళు… ఎన్నిసార్లు అదే విన్నా చెప్పడంలో అంత నవ్యతను ప్రదర్శించేవారాయన! ఆయనకు అంత ఇష్టం వాళ్ళంటే!

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ‘అన్వేషణము’లోని…

‘’తలిరాకు జొంపముల సం

దులత్రోవల నేల వాలు తుహినకిరణ కో

మల రేఖవొ! పువుదీవవొ!

వెలదీ, యెవ్వతెవు నీపవిటపీ వనిలోన్ ? ‘’

అని సంప్రదాయ సాహిత్య పండితునిలా ఆ పదాలను విరస్తూ, లయాత్మకంగా వినిపించేవారు.

బహుజన సాహిత్యం-వృత్తి కథాసాహిత్యం:

నేను సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ.లో 1996లో  చేరాను. అప్పుడప్పుడే దళిత అస్తిత్వ ఉద్యమాలు పురుడు పోసుకుంటున్నాయి. ‘పల్లె మంగలి కతల’ను జిరాక్స్ తీయించి యూనివర్సిటీ గోడలకు అతికించడానికి నాగప్ప గారి సుందర్రాజు ఒకరోజు నన్ను కూడా  తీసుకొనివెళ్లాడు. మొట్టమొదటిసారిగా అప్పుడే తుమ్మల రామకృష్ణ గారి పేరు చూశాను. ఆ పుస్తకంలో మూడు కథలు ఉన్నాయి. అవి: అతడు బయలుదేరాడు (రాప్తాడు గోపాల కృష్ణ), అడపం (తుమ్మల రామకృష్ణ), అడివోడు (శ్రీనివాసమూర్తి). అది 1996లో ప్రచురించారు.  క్షౌరవృత్తి  చేసే వారి జీవన సంఘర్షణను ఈ మూడు కథలు వివరించాయి.  మంగలి వృత్తి చేసేవారిని పల్లెటూళ్ళలో ఎలా చూస్తారో, ఆ కులం తెలిస్తే పట్టణాలలో అద్దెకు ఇల్లు దొరకని పరిస్థితి ఎలా ఉంటుందో అటువంటివి అన్నీ ఈ కథలు వివరిస్తాయి. సామాజికంగా వెనుకబడిన తరగతులు అని పిలిచే చేతి వృత్తుల వారికే గౌరవం లభించినప్పుడు మాదిగల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ కథలలో పట్టణంను నుండి పల్లెటూరికి వచ్చి  కలవాలనుకున్న కొన్ని పాత్రలు ద్వారా రచయితలు స్పృశించారు. 

తర్వాత ఆచార్య తుమ్మల రామకృష్ణ గారు కొంతమంది తన పరిశోధకులతో కలిసి వృత్తి కథలను ప్రచురించాలనుకున్నారు. ‘అడపం’ అనే పేరుతో ఒక కథా సంపుటిని ప్రచురించారు. అలా అన్ని వృత్తుల కథలను  తీసుకురావాలనేది ఆయన పెద్ద ప్రాజెక్టుగా చెప్పేవారు. కానీ, అది నెరవేరలేదు. 

పసితనం వీడని ఆనందం:

ఆచార్య తుమ్మల రామకృష్ణగారితో కొన్ని ప్రయాణ అనుభవాలు కూడా ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలో చేరిన కొత్తలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఒక జాతీయ సదస్సులో లో పాల్గొన్నాం. హైదరాబాదు నుండి గుంటూరు వరకు ఆచార్య పరిమి రామ నర్సింహంగారే తన కారు మీద తీసుకువెళ్లారు. కారు డ్రైవ్ చేస్తూ భాష శాస్త్రం, వ్యాకరణం, అవధానానికి సంబంధించిన పద్యాలు ఎంతో రసవత్తరంగ చెప్పేవారాయన. సిమిలర్ పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు తాము ఉంటే సొంత ఇంటికి చూపించారు. దాన్ని కూలగొట్టేసిన ప్రాంతాన్ని చూపించారు. అది చూపించినప్పుడు ఆయన కళ్ళు చెమ్మకి వెళ్ళడం నేను గమనించాను. ఆ తర్వాత ఆ దృశ్యాన్ని ఆధారంగా చేసుకుని ఒక కవితను కూడా రాశాను. దాన్ని రామనరసింహం గారి సచ్చిపోతే సంచికలో ప్రచురించారు. ఇలా సరదాగా మాట్లాడుతూ మొత్తం ఆయనే డ్రైవ్ చేశారు. వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు అనేకమైన సాహిత్యానికి సంబంధించిన ముచ్చట్లు. అప్పుడు రామకృష్ణగారు తన కథా నేపథ్యాలను ఎంతో ఆసక్తిగా చెప్పేవారు. ఆ సెమినార్ నిర్వహించేటప్పుడు ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి గారు డీన్ గానో, హెడ్ గానో ఉన్నారనుకుంటాను. ఆయన మా కోసం ప్రత్యేకమైన వంటలు కూడా వండించారు. తను తినేది తక్కువే అయినా, రామకృష్ణ గారు తనకు అది కావాలీ, ఇది కావాలనీ చాలా హడావిడి చేసేవారు. అలా బయటకు వెళ్లి భోజనం చేసినప్పుడు కచ్చితంగా పాన్ (కిళ్ళీ) వేసుకునేవారు. తాను కర్నూలులో తన స్నేహితులందరికీ కొన్ని ప్రత్యేకమైన హోటల్ లో ఎలా తినిపించేవారో నోరూరేలా  చెప్పేవారు. ఒకసారి ఆయన కుటుంబం, మా కుటుంబం కలిసి యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఒక సెమినార్ జరిగినప్పుడు ఆచార్య విస్తాలి శంకర్రావు గారి ఆహ్వానం పై వెళ్ళాం. ఆ సందర్భంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు చూడాలని ఒక ప్రైవేట్ కారు తీసుకుని బయలుదేరాం. మహాబలిపురం తీర దేవాలయం చూశాం.  

 అక్కడ పూసలు అమ్మేవాళ్లు ఆ సముద్ర తీరంలో దొరికే వాటిని  అమ్ముతూ ఉంటారు. ఒకటేదో కొన్నారు. దానితో రామకృష్ణ గారికి ఆయన భార్యకి మధ్య గొడవ. ఇద్దరు ఎడమోహం పెడమోహం పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన పంచ పాండవ మండపాలు ఉండే స్థలాలకు చేరుకున్నాం. వాటిని 7వ శతాబ్దానికి చెందిన రాతి శిల్పకళా అద్భుతాలుగా చెప్తారు. వాటిని చూడడానికి బయలుదేరాం. కానీ, వాళ్ళిద్దరూ కారు దిగలేదు. నేనూ, నా భార్య మంజుశ్రీ వెళ్లి, చూసామన్నట్లుగా చూసి వచ్చేసాం. ఆ తర్వాత కంచి కామాక్షి అమ్మవారి ఆలయం, వరదరాజ పెరుమాళ్ దేవాలయాలు చూడాలనుకున్నాం. ఈ ప్రయాణం సమయంలో వాళ్ళిద్దరి మధ్య సంకేతన్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసాం. అలాగైనా సరే కంచి వెళ్లిన తర్వాత ఆయన దేవాలయం బయటే కూర్చుని ఉన్నారు. మేము ముగ్గురుము వెళ్లి చూసుకుని వచ్చేసాం. ఆ తర్వాత దేవాలయాల్లోని విశేషాలను చూద్దామనుకుంటే, ఏం చూస్తావులే కూర్చొమనన్నారు. ఇక తప్పలేదు. ఆయనతోపాటు కూర్చోబెట్టుకున్నారు. ఈ దేవాలయాల సందర్శన, సందర్భంగా జరిగే దోపిడీ, మనుషుల మనస్తత్వాలు…వాళ్ళిద్దరూ ఆ దేవాలయాలన్నీ చూసుకుని వచ్చేలోగా ‌  నాకు ఒక పెద్ద లెక్చరే ఇచ్చారు. మరి మీరీ దేవుళ్లను నమ్మకపోతే తిరుపతి ప్రసాదాన్ని ఎందుకు తీసుకుంటారు? ఇంట్లో వ్రతాలు పూజలు ఎందుకు చేస్తుంటే మౌనంగా ఉంటారు? అని అమాయకంగా అడిగితే… అది వాళ్ళని సంతృప్తి పరచడం కోసం మాత్రమే. దేవుళ్ళూ లేరు.. దెయ్యాలలూ లేరు. అవన్నీ మనం సృష్టించుకున్నవంతే! ఇంకా చెప్పాలంటే ఒకరినొకరు దోపిడీ చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు అంతే’ అనేవాడాయన! ‘’మనం నమ్మినా నమ్మకపోయినా, కొన్నిసార్లు మనతో ఉండే వాళ్ళ నమ్మకం కోసం నమ్మినట్టు లౌక్యంగా ప్రవర్తించాలి. అదే జీవితం’’ అని కూడా చెప్తుండేవారు.

చిన్నపిల్లాడిలా…చివరి రోజుల్లో…

తాను వీసీ పదవి పూర్తిచేసుకుని, ఎలాగోలా బయటపడ్డానని చెప్పుకొచ్చేవారు.  తాను అక్కడ నెల నెలా సిబ్బందికి జీతాలను ఇప్పించగలిగితే అదే పెద్ద విజయం సాధించినట్లు అనిపించేది అనేవారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనకు రచనలను ఇతర భాషలలోకి అనువాదం చేయించుకోగలిగానని మాత్రం సంతృప్తిగా చెప్పేవారు. ఆ మూడేళ్ల అనుభవాలను కథలుగా కర్నూలు జీవితంతో కలిపి చెప్తుండేవారు. ఆ ఫోటోలను, ఆ వార్తలను, ఆ కటింగులను చిన్నపిల్లడిలా ఆయన ఇంటికి వెళ్లినప్పుడల్లా చూపిస్తుండేవారు. ఆయనకు వీసీగా వెళ్లకముందే దీర్ఘకాలంగా ఉన్న డయాబెటిస్ వల్ల కనుచూపు మందగించింది. ఏదైనా చదవాలంటే భూతద్దం పెట్టుకుని చదివేవారు. తాను చదవలేక పోతున్నందుకు చాలా విచారపడేవారు.  చదువుకోవడం అంటే తనకెంతో ఇష్టమని, అదంతా కోల్పోయానని బాధపడేవారు. ఫోటోలు అంటే ఎంతో ఇష్టంగా తీసుకునే ఆయన, ఫోటోలు అంటే ఎంతో ఇష్టంగా దాచుకునే ఆయన, తన చివరి రోజుల్లో ఆయన ఫోటో తీయడానికి ఇష్టపడేవారు కాదు. అప్పటికే తన ఆరోగ్యం క్షీణించిపోయింది. కుప్పంలో ఉన్నప్పుడే కిడ్నీ వ్యాధికి డయాలసిస్ మొదలైంది. అది ఆయన హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయన మరింత కృంగదీసింది. నన్ను పదేపదే ఇంటికి రమ్మని పిలిచేవారు. నేను కూడా కాదనుకున్నా వెళ్లేవాడిని. నేను వెళ్ళగానే ఆయన కళ్ళల్లో  వెయ్యి బల్బులు వెలుగుతున్నట్లే అనిపించేది. ఎప్పుడు చూసినా, తన రచనల గురించీ, తన వాక్యం గురించీ, తన సభలను గురించీ ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా చెప్తున్నట్లే అనిపించేది. చంటి పిల్లాడి చిరునవ్వులతో ఆ  మెమొంటోలు, ఆ పేపర్ కటింగ్స్, ఆ ఫోటోలు అప్పుడే కొత్తగా చూపిస్తున్నట్లేచూపించేవారు. నా చూపుల్ని, మౌనంగా చూసే నా పరిశీలనని ఆయన ఎంతగానో ముచ్చట పడిపోయేవారు. మరికొన్ని లోననుండి తెచ్చి మరీ చూపించేవారు. తాను ఎంతో ముచ్చటపడి దాచుకొన్న పుస్తకాలను కొన్నింటిని సుబ్బారాయుడు గారికి పంపించి, స్కాన్ చేయించాలనేవారు. మరికొన్ని పుస్తకాలను సుందరయ్య విజ్ఞాన్ భవన్ కి, సిపి బ్రౌన్ గ్రంథాలయానికీ ఇవ్వాలి అనేవారు.  1957అక్టోబర్ 12వ తేదీన చిత్తూరు జిల్లా సోమల మండలం, ఆవుల పాలెం లో జన్మించిన రామకృష్ణగారు, 2025 మార్చి 31 వ తేదీన హైదరాబాద్ లో మరణించారు. ఏప్రిల్ 1 వతేదీన శేరి లింగంపల్లిలోనే ఆయనకు అంత్య క్రియలు పూర్తి చేశారు. మనిషి ఎక్కడ పుడతాడో, ఎక్కడ , ఏయే ప్రాంతాల్లో, ఎవరెవరికోసం పని చేస్తాడో, చివరికి ఎక్కడ తనువు చాలిస్తాడో ఎవరికీ తెలియదు.!

తే.గీ.

తెల్ల కాకుల అవినీతి తేట పరచి

మట్టి పొయ్యిల తత్వము మదిని నిలిపి

బహుజనుల చరితలనెల్ల భాగ్యమనుచు

రాయగలిగేను తుమ్మల రామకృష్ణ!

(కీ.శే. డా.తుమ్మల రామకృష్ణగారి ప్రథమ వర్థంతి సందర్భంగా)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

26.4.2026.


కామెంట్‌లు లేవు: