జలియన్ వాలా బాగ్ దురంతం…
శాంతి కోరుచు చేరిన జనము పైన
గుండ్ల వర్షము కురిపించె ఘోరముగను
జాలి లేని యా డయ్యరు చావు విత్తె
రక్త సిక్తము చేసెను రంగమెల్ల.
ఎటుల పోదురో తెలియని స్థితిని గనిరి
గోడ లెక్కిరి ప్రాణాల కొరకు నచట
సందు లేని ఆ తోటలో జరిగె కీడు
కూలి పోయిరి ప్రజలెల్ల గుంపులుగను.
తల్లి పిలుపును వినలేక తనయుడచట
తండ్రి కన్నుల ముందర తనయ మడిసె
మిన్న నంటెను ఏడ్పులు మిగుల నచట
తోట నిశ్శబ్ద మాయెను దుఃఖ మలమ.
బావి లోపల దూకిరి బతుకు కొరకు
నీటి బదులుగా నెత్తురు నిండె నచట
గుండె నీరౌను ఆ గురు తులను గనగ
సాక్షి యై నిల్చె బావియు చావులందు.
భరత మాతను సేవించు భాగ్య మెంచి
అర్ప ణము చేసి రసువుల నచట వారు
వారి త్యాగము మరువదు వసుధ యెపుడు
నిత్య దీపమై వెలుగును నిఖిల జగతి.
కత్తి పట్టని జైత్రులి క్కడను చేరి
శౌర్య మందున వీరులై సాగి రచట
గుండు దెబ్బల కెదురుగా గుండె నిచ్చి
కూలి పోయిరి నేల పై కోటి తార.
మాన వత్వము మరచిన మత్తు నాడు
పరగి సాగెను తెల్లని వారి పాల
న్యాయ మన్నది కానని నరక మదియె
గాయ మయ్యెను భరతమ్మ కైత కచట.
వగచి నాడు ఆ బాలుడు వరుస గనియు
పగను పెంచెను గుండెలో భార మపుడు
చంపి తీరెను లండను సభను గెలిచి
వీర పతకము దొరికెను విజయి నగుచు.
నేటి కాలము మరువదు నీతి నచట
రక్త తర్పణ మాయెను రంగ మపుడు
జాతి కంతయు స్ఫూర్తిని చాటి నట్టి
వీర గాథలు మిగిలెను విశ్వ మందు.
మేఘ మప్పుడు కురిపించె మెరపు గుండ్లు
నెత్తు రయ్యెను పచ్చని నేల యచట
ఎండి పోయెను ప్రాణాల తీగ లపుడు
నిండు కుండల వంటి ఆ నీటు ప్రజలు.
పరవ శమ్మున పాడిన పాట లాగి
పరచి రచ్చట నెత్తుటి పార లపుడు
కరుణ లేని ఆ దొరలకు కాటు పడగ
మరణ మందెను శాంతియు మట్టి లోన.
చెదర నీయని గుర్తులు చేరి నవియు
కదిలి వచ్చెను కాలము కంటినీరు
రక్త తర్పణ మైన ఆ రంగ మందు
భక్తి తోడుత మ్రొక్కెద భారతమ్మ.
కంట నీరును తెప్పించు కథయు నిదియె
మంట రేపెను భారతా మహిని నాడు
అసువు లర్పించె వీరుల యాత్మ శాంతి
కైత లర్పించు చున్నము గౌరవమున.
వీర మరణము పొందిన విమల మతులు
భార తమ్మకు ప్రేరణ భాగ్య మపుడు
కోరు కున్నది స్వేచ్ఛను కోర్కె తోడ
పేరు నిలిచెను లోకాన ప్రేమ తోడ.
గర్వ మణచగ భారతా గడ్డ పైన
గుర్తు లున్నవి గాయమై గుండె లోన
అన్య మెరుగని వారల ఆత్మ లచట
మట్టి లోపల కలిసెను మౌన ముగను.
నేల పైనను నెత్తురు నిండె నాడు
కాల మందున త్యాగము కాంతి నిచ్చె
బాష్ప ధారల నర్పించి భక్తి తోడ
ప్రేమ తోడను మ్రొక్కెద పిల్ల లముగ.
గుండు దెబ్బల వర్షము గుండె చీల్చె
నిండె నచ్చట నెత్తురు నిఖిల మెల్ల
వంక లేని ఆ జనముల వంశ మపుడు
మంట లాయెను డయ్యరు మౌఢ్య మందు.
జాతి కంతయు స్ఫూర్తిని చాటి నారు
నీతి తోడుత పోరాడి నిలిచి నారు
ఖ్యాతి కెక్కిరి లోకాన గౌరవమున
మ్రొక్కు దామును మనమిల ముక్తి కొరకు.
తోట లోనను నిండిన తొంద రగను
ధార లేరులై పారిన ధాత్రి నాడు
మార ణమ్మును జేసిన మౌఢ్య మపుడు
ధైర్య మందున నిలిచిరి ధన్యు లచట.
వీర మాతకు మొక్కిరి వినయ మునను
కోరు కున్నది స్వేచ్ఛను కోర్కె తోడ
గుండు దెబ్బల కెదురుగా గుండె నిచ్చి
పేరు నిలిపిరి లోకాన ప్రేమ తోడ.
బావి లోపల దూకిరి బతుకు కొరకు
నీరు దొరకక నెత్తురు నిండె నచట
చావు కేకలు మిన్నంటె శాంతి లేక
గుండె కరిగెను ఆనాటి ఘోర గతిని.
కళ్ల ముందర జరిగిన కాళ రాత్రి
చిన్న బాలుని గుండెలో చిచ్చు రేపె
పగను తీర్చుచు లండను పట్టణాన
వీర మరణము పొందెను విక్రమమున.
శాంతి మార్గము కోరిన సత్య మూర్తి
వింత దారుణ కాండను విన్న నాడు
కంట కన్నీరు నింపెను కాక తోడ
దేశ మంతయు గర్జించె దీక్ష తోడ.
మ్రొక్కు దామును వీరుల ముక్తి కొరకు
చాటి చెప్తుము వారల శాశ్వతమ్మ
నిత్య జ్యోతిగ వెలుగును నిజముయెపుడు
ఖ్యాతి నిలిచెను భారతా క్ష్మాత లమున.
నెత్తు రయ్యెను అచ్చట నేల యంత
నేల రాలెను ప్రజలెల్ల నిమిష మందు
అందు కున్నది స్వేచ్ఛను ఆత్మ బలిని
బలిని గోరిన ఆంగ్లేయ పాప మదియె.
(ఆ తోటలోని నేల అంతా రక్తంతో నిండిపోయింది. ఆ నేల మీదే నిమిషాల వ్యవధిలో ప్రజలందరూ రాలిపోయారు. తమ ఆత్మ బలిదానంతో వారు స్వేచ్ఛను కోరుకున్నారు. అది కేవలం అమాయకుల బలిని కోరిన ఆంగ్లేయుల పాపకాండ మాత్రమే.)
బావి లోపల దూకిరి బతుకు కొరకు
కొరకు ప్రాణాల నచ్చట కోలుపోయె
పోయి రందరు స్వర్గాన పుణ్య మతులు
మతులు పోయెను ఆంగ్లేయ మౌఢ్య మపుడు.
(ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలు ఆ బావిలోకి దూకారు. కానీ బతుకు కొరకు చేసిన ఆ ప్రయత్నంలోనే అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఆ పుణ్యమూర్తులందరూ స్వర్గస్థులయ్యారు. అమాయకులను పొట్టనబెట్టుకున్న ఆంగ్లేయుల మూర్ఖత్వానికి ఆనాడే మతి భ్రమించింది.)
చావు కేకలు మిన్నంటె చాటు నాడు
నాడు విరిసెను నెత్తుటి నవ్య పూలు
పూలు రాలెను ధాత్రిపై పుణ్య మగుచు
పుణ్య గాథగ నిలిచెను పుడమి యందు.
(ఆనాడు చావు కేకలు మిన్నంటాయి. నేల మీద రక్తపు చుక్కలు కొత్త పూలలా విరిశాయి. ఆ పూ
ల వంటి ప్రజలు పుణ్యమూర్తులై నేల మీద రాలిపోయారు. వారి త్యాగం ఈ భూమి మీద ఒక పుణ్య గాథగా నిలిచిపోయింది.)
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
13.4.2026

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి