"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 12.00 గంటల నుండి 1.00 వరకు జరుగుతాయి.

19 ఫిబ్రవరి, 2026

గుండెపోటు- మానసిక వేదన

 గుండెపోటు- మానసిక వేదన


  1. అతిచింత - అగ్ని:

కం.

కట్టెను కాల్చును అగ్నియు

నట్టెను మది నిండు చింత యనవరతంబున్

నెట్టన గుండెను గాల్చును

దట్టపు వేదనల తోడ తలపగ దార్లా!

( నిప్పు కట్టెను ఎలా దహిస్తుందో, నిరంతరం మదిలో ఉండే చింత కూడా అలాగే గుండెను లోలోపల కాల్చివేస్తుంది.)

2. మనోవ్యధ - విషము:

కం.

విషమును త్రాగిన చచ్చును

విషమౌ నాలోచనలును విడకను మదినిన్

వశమును దప్పును గుండెయు

దశలను మార్చును గదయ్య తలపగ దార్లా!

( విషం తాగితే ప్రాణం ఎలా పోతుందో, విషతుల్యమైన ఆలోచనలు మదిలో నిండితే గుండె తన స్వాధీనం తప్పుతుంది.)

3. ఆవేదన - ఉప్పెన:

కం.

ఉప్పెన ముంచెడి రీతిగ

తప్పక ఆవేదనలును తలపున నిండన్

నొప్పులు గుండెకు గలుగును

చొప్పును దెలిసికొన నీవు జూడగ దార్లా!

(సముద్రపు ఉప్పెన ఊళ్ళను ముంచెత్తినట్లు, మితిమీరిన ఆవేదనలు మనసును ముంచెత్తితే గుండెపోటు వంటి ముప్పులు తప్పవు.)

4. దుఃఖము - తుప్పు:

కం.

ఇనుమును తిను గద తుప్పును

ఘనమౌ దుఃఖంబు గూడ కాయము నందున్

దినదినము గుండె నణచును

కనికర మునులే కయేను కనుమిక దార్లా!

(తుప్పు పట్టిన ఇనుము ఎలా క్షీణిస్తుందో, నిరంతర దుఃఖం మనిషి శరీరాన్ని, గుండెను కనికరం లేకుండా క్షీణింపజేస్తుంది.)

5. చింత - చీడ:

కం.

చెట్టును జెరుచును చీడయు

మట్టును మీరగ జెరుచును మనుజుని మదినిన్

నెట్టన గుండెను నాపును

గట్టును దెగతెంపు జేయు గమనున దార్లా!

( చీడపురుగు చెట్టును ఎలా నాశనం చేస్తుందో, హద్దులు దాటిన మనోవ్యధ గుండె లయను దెబ్బతీసి ప్రాణాంతకమవుతుంది.)

6. భయము - పిడుగు:

కం.

పిడుగు పడగనే కూలును

కడు భీతియు నాదు మదిని కడవరకున్నన్

ఝటితిగ గుండెయు నాగును

విడకను వేదనలు దరిని వీడవు దార్లా!

( పిడుగు పడగానే భవనం ఎలా కూలుతుందో, మనసులో గూడుకట్టుకున్న తీవ్రమైన భయం గుండెను ఒక్కసారిగా ఆపివేస్తుంది.)

7. కోపము - కార్చిచ్చు:

కం.

కార్చిచ్చు వనము గాల్చును

పేర్చిన కోపమును మదిని పెను వ్యధ నింపన్

వార్చును గుండెకు పోటును

నేర్పుగ శాంతమును బూను నిజముగ దార్లా!

( అడవిని కాల్చే కార్చిచ్చులాగా, మితిమీరిన కోపం గుండెకు పోటును తెస్తుంది, అందుకే శాంతంగా ఉండటం అలవరచుకోవాలి.)

8. కన్నీరు - వరద:

కం.

వరదలు పొంగిన వేళను

ధరపై నష్టాలు గలుగు తథ్యము గాగన్

గురుతగు మానసికవ్యధ

నరకము గుండెకును జూపు నమ్ముము దార్లా!

( వరదలు వస్తే ఎలా నష్టమో, అతిగా విలపించడం వల్ల కలిగే మానసిక వ్యధ గుండెకు నరకం చూపిస్తుంది.)

9. శాంతము - అమృతము:

కం.

శాంతము నొసగును హాయిని

వింతగ వేదనల బాపి వెలుగును నింపున్

పంతము వీడిన వేళను

వింతగ గుండెయును నవ్వు వినుమిక దార్లా!

(అమృతంలాంటి శాంతము వేదనలను పోగొట్టి మనసుకు వెలుగునిస్తుంది, పంతాలు వీడితే గుండె హాయిగా ఉంటుంది.)

10. మనోబలము - రక్ష:

కం.

మతి బలమును పెంచుము నీ

మతులితమగు వేదనలను మాన్పుచు నెపుడున్

ధృతితోడను నిలు దార్లా!

క్షితిలోనను సౌఖ్యమొందు సిద్ధము గాగన్!

(ఓ దార్లా! నీవు నీ మనోబలాన్ని (మతి బలమును) పెంచుకో. అంతులేని వేదనలను ఎల్లప్పుడూ అణచివేస్తూ లేదా మాన్పుకుంటూ, గుండె నిబ్బరంతో (ధృతితో) నిలబడు. అప్పుడే ఈ లోకంలో నీకు ఆరోగ్యకరమైన సుఖం లభించడం ఖాయమవుతుంది.)

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, 19.2.2026

...

కం.

కష్టము వచ్చిన వేళను

నష్టము రాకుండ నిలిచి నమ్మిక తోడన్

ఇష్టముగ విజయడండగ

పుష్టముగా బ్రోచు నెపుడు భువిలో దార్లా!

(ఓ దార్లా! నాకు కష్టము వచ్చిన వేళలో, ఎటువంటి నష్టము వాటిల్లకుండా, సోదరుడు విజయ్ కుమార్ ఎంతో ఇష్టముగా, ఒక శిష్టతతో (నిబద్ధతతో) అండగా నిలుస్తున్నాడు. ఆయన సహకారం మరువలేనిది.)

2. తమ్ముడి తోడ్పాటు - మరువలేని మేలు:

కం.

ముందర నిలిచియు పనులన్

చందముగా జేయు విజయ చతురుడు తానై

నందముగ మేలు జేయగ

నందగ మరువంగ లేను నమ్మిక దార్లా!

(భావం: ఏ పనికైనా ముందుండి, ఎంతో చాకచక్యంగా, చక్కగా పూర్తిచేసే విజయ్ కుమార్ చేసిన మేలును నేనెన్నటికీ మరువలేను. నా వ్యక్తిగత పనులన్నింటిలో ఆయన చూపుతున్న ఆదరణ అమోఘం.)

3. అన్నదమ్ముల బంధం - ఆత్మీయత:

కం.

తమ్ముడు తోడై నిలువగ

నమ్మికతో పనుల నెల్ల నయముగ జేయున్

నెమ్మది యొసగెడి మైత్రిని

నెమ్మది మరువంగ లేను నిజముగ దార్లా!

(భావం: తన తమ్ముడు విజయ్ కుమార్ తోడుగా ఉండటం వల్ల అన్ని పనులు ఎంతో నమ్మకంగా, సులభంగా పూర్తవుతున్నాయి. మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఆ సోదర ప్రేమను, సహకారాన్ని నేను నా జీవితంలో మరువలేను.)


కామెంట్‌లు లేవు: