*’సాహితీ క్రియ-ప్రతిక్రియ’ సాహిత్య సంకలనం ఆవిష్కరణ*
వివిధ ప్రక్రియలు, ధోరణులతో బి.వి.వి.ఎస్.కామేశ్వరరావు సంపాకత్వంలో 18 మంది రాసిన సుమారు 25 వ్యాసాల సంకలనం’సాహితీ క్రియ-ప్రతిక్రియ’ గ్రంథాన్ని అంతర్జాల వేదికపై ఆదివారం నాడు ప్రముఖపద్యకవి తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ప్రముఖ సాహితీవేత్త మాజీ ఐ.ఏ.ఎస్ అధికారి నందివెలుగు కామేశ్వరరావు అధ్యక్షత వహించి పుస్తకం హస్త భూషణమే కాదు, మస్తకభూషణం కూడా అని ఆయన అన్నారు. శతకం, కావ్యం, ద్విపదకావ్యం, చంపూకావ్యం, ఉదాహరణకావ్యం, స్మృతి కవిత్వం, ప్రభంధం మొదలైన వివిధ సాహిత్యాంశాలను ఒక పుస్తకంగా తీసుకొనిరావడం ప్రశంసనీయమన్నారు. ప్రముఖసాహిత్య విమర్శకులు, హెచ్ సియు తెలుగు శాఖ పూర్వ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని, ఒకప్పుడు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో తెలుగు సాహిత్యాన్ని అందరికీ అర్థమయ్యేరీతిలో పదమూడు సంపుటాలుగా తెచ్చారని, కామేశ్వరరావు తన ‘తెలుగులోకం’ దినపత్రిక ద్వారా రెండు పుటల్లో ప్రతిరోజూ సాహిత్యాన్ని ప్రచురిస్తూ ఒకవైపు సాహిత్య అవగాహన కలిగిస్తూనే, మరొకవైపు వ్యాసాలు రాయించి ఒక పుస్తకంగా తీసుకొని రావడం అభినందించదగిన విషయమనీ, ఇది కూడా ఆరుద్ర కృషి వంటిదేనని ఆయన వ్యాఖ్యానించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ విమర్శకులు డా.బీరం సుందరరావు మాట్లాడుతూ రచయితలు చేసే కృషి క్రియ అనీ, వారు వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారనీ, ఆ విధంగా ‘సాహితీక్రియ-ప్రక్రియ’అనే పేరు ఈ సాహిత్య వ్యాస సంకలనానికి ఔచిత్యమంతంగా ఉందన్నారు సాహిత్యచర్చల్లో ప్రక్రియ అనేది ఎంతో స్పష్టంగా ఉందనీ, కవితా రూపాలను ప్రక్రియలుగా కొంతమంది పిలుస్తున్నరనీ, వాటి మధ్య స్ఫష్టతను గుర్తించాలని సూచించారు. విశ్రాంత అధ్యాపకురాలు శ్రీమతి పి.శాంతమ్మ తనకు తోచిన ఆర్థిక సహాయాన్ని పుస్తక ప్రచురణకు అందించానని చెప్పారు. డా.రాధాశ్రీ, శ్రీమతి అవధానం అమృత లత, డా.నల్లా నరసింహమూర్తి, బాగి కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రంథ సంపాదకుడు బి.వి.వి.ఎస్.కామేశ్వరరావు గ్రంథ ప్రచురణ సాధకబాధకాలను వివరించారు.




కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి