"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

24 March, 2024

ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారి రచనలపై ఆచార్య దార్ల ప్రసంగం


మాట్లాడుతున్న విహారిగారు
మాట్లాడుతున్న డా.సిహెచ్.సుశీలమ్మగారు
మాట్లాడుతున్న డా.లలితకుమారిగారు
స్పందించిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారు
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారు




ప్రముఖ కవి, విమర్శకుడు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య గారి రచనలలో కవిత్వం, విమర్శ, పరిశోధన మూడు ప్రక్రియలూ ఎంతో శక్తివంతంగా వెలువడతాయని, అవి సాహితీ విలువలతో శోభిల్లడం మరింత గొప్పతనమని హెచ్.సి.యు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అన్నారు. ‘ఆచార్య అనుమాండ్ల భూమయ్య పంచామృతం’ పేరుతో జరుగుతున్న సాహితీ సప్తాహం లో భాగంగా ‘సేవ సాహితీ సాంస్కృతిక సంస్థ,( నెల్లూరు, తిరుపతి) వారి ఆధ్వర్యంలో అంతర్జాలం ద్వారా ఆదివారం (24.3.2024) సాయంత్రం జరిగిన సమావేశానికి ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.  ఆచార్య భూమయ్య పదవీ విరమణ అనంతరం కూడా నిరంతరం అధ్యయనం చేస్తూ గొప్ప కావ్యాలను రాస్తున్నారని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు చెప్పారు. ఆయన రచనల్లో సాహితీ విలువలతో పాటు భారతీయ సమగ్రతను పెంచే దేశీయ దృక్పథం కనిపిస్తుందని ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు. రామాయణం, మనుచరిత్ర తదితర కావ్యాల్లో గల కొన్ని పాత్రలపై ఆచార్య అనుమాండ్ల భూమయ్య కావ్యాలు మూల కావ్యాలకు మరింత ఔన్నత్యాన్ని తీసుకొస్తూనే, ఆయన నవ్య భావనలతో రచనలు చేయడం ఒక విశేషమని ఆచార్య దార్ల వివరించారు. భూమయ్యగారు రచించిన ‘ఆద్యుడు కట్టమంచి’ ‘తెలంగాణ నాగేటి చాళ్ళు’ అనే అంశాలపై ఆచార్య దార్ల ప్రసంగించాల్సి ఉండగా, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఆద్యుడు కట్టమంచి’ అనే కావ్యంపైనే తన ప్రసంగాన్ని కొనసాగించారు.  కట్టమంచి రామలింగారెడ్డి గారు ‘ముసలమ్మ మరణం’ ద్వారా వస్తు నవ్యతను ప్రదర్శించి ఆధునిక పద్య కావ్యాలకు ఆద్యుడు అయ్యారని సోదాహరణంగా ఈ కావ్యంలో మొదటి భాగంలో వివరించారని ఆచార్య దార్ల సోదాహరణంగా విశ్లేషించారు.  ముసలమ్మ మరణం పై ఆయన రాసిన అనువర్తిత విమర్శను చదివితే ముసలమ్మ మరణం కావ్యం ఒకవైపు వ్యాఖ్యానం చదివినట్లుగా అనిపిస్తుందనీ, మరొకవైపు విమర్శ, పరిశోధనలలో ఆయన విశ్లేషణా శక్తి తెలుస్తుందని అన్నారు.దానితో పాటు ఆ కావ్యంపై వెలువడిన పండితుల అభిప్రాయాలను విశ్లేషించి తనదైన అభిప్రాయాలతో భూమయ్యగారు చక్కగా విశ్లేషించి చూపారని ఆచార్య దార్ల వివరించారు. ఆద్యుడు కట్టమంచి అనే గ్రంథాన్ని చదువుతూ ఉంటే భూమయ్యగారు ప్రత్యక్షంగా పాఠం చెబుతున్నట్లు, విమర్శ చేసే వారికి అది ఎలా రాయాలో వివరిస్తున్నట్లు, పరిశోధన చేసే వాళ్ళకి ఆ శాస్త్రీయ పద్ధతులను సూచిస్తున్నట్లు అనిపిస్తుందని ఆచార్య దార్ల వ్యాఖ్యానించారు. అదే గ్రంథం రెండవ భాగంలో ఆధునిక సాహిత్య విమర్శకు కట్టమంచి ఆద్యుడు ఎలాగయ్యారో సోదాహరణంగా భూమయ్య గారి విశ్లేషించిన తీరు ఎంతో శాస్త్రీయమైనదని దార్ల అన్నారు. ఆధునిక  తెలుగు సాహిత్య విమర్శకు ఆద్యుడు కట్టమంచి అనీ    తెలుగు సాహిత్య విమర్శకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం  అవుతారని, ఈ విషయంలో ఉన్న భిన్న వాదనను కూడా ఆయన సోదాహరణంగా వివరించారని ఆచార్య దార్ల చెప్పారు. డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి ‘తెలంగాణ నాగేటి చాళ్ళు’ గ్రంథంలో , అది వచన కవిత్వమైనప్పటికీ భూమయ్య గారు దాన్ని ఎంతో సమర్థవంతంగా ఆ కవిత్వ సౌందర్యాన్నీ, సామాజిక వాస్తవికతను అభివ్యక్తిని వివరించారని, అయితే ఆ కావ్యంపై మాట్లాడడానికి సమయం సరిపోలేదని దార్ల అన్నారు.ఈయనతో పాటు ప్రముఖ విమర్శకుడు విహారి, డాక్టర్ సుశీలమ్మ, డాక్టర్ లలిత కుమారి ఆచార్య భూమయ్య గారి రచనలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో చివర ఆచార్య భూమయ్య గారు స్పందించి తన రచనలపై మాట్లాడిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తన రచనపై మాట్లాడుతూ ఉన్న వారి మాటలు వింటుంటే తనకెంతో ఆనందం కలిగిందని అన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ కవి,  విమర్శకుడు  బీరంసుందరావు స్వాగతం పలికి, కార్యక్రమాల విషయాలను వివరించి,  ప్రసంగ కర్తలను పరిచయం చేశారు. సమావేశ అనంతరం ఆచార్య పిల్లల మీద రాములు ఈనాటి కార్యక్రమంలో నీ ప్రసంగాలన్నీ చాలా బాగున్నాయని లోతైన విశ్లేషణలు ఉన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సేవ సంస్థ అధ్యక్షులు కంచర్ల సుబ్బారాయుడు బోర భారత దేవి తదితరులు పాల్గొన్నారు. 

No comments: