"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

18 January, 2024

మాదిగ దండోరా తర్వాత దళిత పరిణామాలు

 // ఉద్యమం మాదిగలది - పదవులు మాలవారివి //



ఒక లేదా కొన్ని సమూహాలను అవకాశాల నుండి పక్కకి తప్పించడం అనే సామాజిక రాజకీయ అణచివేత  (మార్జినలైజేషన్) మాదిగలపై ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తాను. 


1994 ఆగస్టు 25 ఒంగోల్లో ఐదు వేల మంది మాదిగలతో మొట్ట మొదటి సారి MRPS ఆధ్వర్యంలో ఊరేగింపు, HCM హైస్కూల్ గ్రౌండ్ లో బహిరంగ సభ జరిపాము. ముందే మీడియా వారికి ఆహ్వానాలు పంపినప్పటికీ,కొన్ని ప్రముఖ దిన పత్రికలు మా ఊరేగింపు,సభ,ఆకాంక్షల వార్తలను ప్రచురించలేదు.సభ తెల్లారి పోయి,ఈనాడు దిన పత్రిక బ్యూరో చీఫ్ తో వాదులాడాను.ఏమనీ? లేడీ డయానా కన్యాత్వ పరీక్షలు గురించీ, బెనజీర్ భుట్టోకి అమ్మాయా? అబ్బాయా? అనే పనికి మాలిన విషయాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చిస్తున్న మీడియా వేల సంవత్సరాలుగా మూగ వేదనని అనుభవించిన మాదిగలు వారిపై జరుగుతున్న ఆర్థిక,రాజకీయ,సామాజిక అణచివేతలకు వ్యతిరేకంగా చరిత్రలో మొదటి సారిగా రోడ్డెక్కి గొంతులు నినదిస్తే,వారి సమస్యలు మీకు వార్తాంశాలు ఎందుకు కాకుండా పోయాయి? మీకు గోడలపై పోస్టర్లు మేస్తున్న మేకల ఫోటోలు,రోడ్డుకి అడ్డంగా పడుకున్న ఆవుల ఫోటోలు,మూతలేని మ్యాన్ హోల్ ల ఫోటోలు వార్తాంశాలు అవుతాయే!? మేమెందుకు వార్తాంశం కాకుండా పోయాము మీకు? ఏమిటీ వివక్ష?అని   తగాదా పడి వచ్చేశాను. 


                          ***               ***          ***


ఆరోజుల్లో (1995 - 97 మధ్య కాలంలో ) ఒక రోజు పొన్నూరు లోని కత్తి పద్మారావు యింటికి వెళ్ళాను. దండోరా ఉద్యమం డిమాండ్లకు మద్దతుగా ప్రకటన చెయ్యమని,ఆయన్ని కోరాను.ఆయన అన్నాడు కదా? "తమ్ముడూ మీరిప్పుడు ప్రచార స్థాయిలోనే పని చేస్తున్నారు.ఉద్యమ స్థాయికి వచ్చాక, మద్దతు ప్రకటిస్తాను" అన్నారు.అప్పుడు పద్మారావు ఇచ్చిన మాటని ఇప్పటికీ నెరవేర్చలేదు.ఏ కాగితం పైనా,ఏ వేదిక మీదా ఆయన సంఘీభావం కనిపించలేదు. వినిపించలేదు. ఆయన్ని గురించి మరింత మరొకసారి రాస్తాను.


                     ***                 ***          ***


ఆ కాలంలోనే ఒకసారి హైదరాబాద్ అశోక నగర్ లోని బొజ్జా తారకం యింటికి వెళ్ళాను.మాదిగల డిమాండ్లకు,ఉద్యమానికి సంఘీభావ ప్రకటన చెయ్యమని కోరాను.ఆయన అన్నాడు కదా? " రిజర్వేషన్లు అగ్రవర్ణాలు ఎస్సీలకు వేస్తున్న భిక్షమనీ,అవి బూజు పట్టిన రొట్టె ముక్కలనీ,వాటి కోసం మనం పోరాడే దానికి బదులుగా,రాజ్యాధికారం కోసం పోరాడటానికి కలిసి పని చేద్దామ" నీ అన్నారు!ఆయన వైఖరికి నాకు కోపం వచ్చింది. నేను చాలా ఉక్రోషంగా " .. రిజర్వేషన్లు లో మా వాటా పంచమంటే ఆ అంశాన్ని దాట వేస్తున్నారు. అడిగితే,అది బిచ్చం అంటున్నారు.బూజు పట్టిన రొట్టె ముక్క అంటున్నారు.మరి అదే బిచ్చాన్ని, బూజు రొట్టెను మీరెందుకు తింటున్నారు?ఈ రోజు రిజర్వేషన్లు పంచుకోవడానికి ఇష్టం లేని మీరు,రేపు కలిసి పోరాడి రాజ్యాధికారం తెచ్చుకున్నా అక్కడా మా పరిస్థితి ఇప్పటిలాగే చేస్తారు" అని పెద్దగా అనేసి వచ్చేశాను.


             ***                 ***              ***


లక్షోపలక్షలై మాదిగలము రోడ్డెక్కి,పంపక న్యాయాల కోసం పోరాడుతుంటే,నాటి తెలుగు దేశం ప్రభుత్వం న్యాయం చేయకుండా కాలాన్ని సాగదీసింది.మాదిగలను మోసం చేసింది.మరోవైపు మాల కులస్తులైన ప్రతిభా భారతి, జి.యం.సి. బాలయోగిలకు కీలక పదవులైన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవిని,పార్లమెంటు స్పీకర్ పదవులను కట్టబెట్టింది.


             ***                ***                 ***


మాదిగ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మాల కులస్తుడైన ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా నియమించి,రెండు సార్లు పొడిగించి,సుదీర్ఘ కాలం కొనసాగించింది.మాల ఉద్యోగి సంఘాలను,కొందరు మాదిగ అధికారులను,ప్రభుత్వ యంత్రాంగాన్ని మాదిగలకు పనికిరాకుండా చెయ్యడంలో ఈయన శక్తివంచన లేకుండా పనిచేశారు!


          ***                 ***                ***


మేము మాదిగ ఉద్యమం ప్రారంభించిన కొన్నేళ్ల తర్వాత,మాల మహానాడు అనే అసాంఘిక ప్రతీఘాతుక సంస్థ పుట్టింది.దీనిని నేను ఎలా అభివర్ణిస్తాను అంటే,1991 ఆగస్టు ఆరు చుండూరు ఎస్సీలపై వూచకోత సంఘటన నేపథ్యంలో,బాధితులకు సామాజిక న్యాయం కోసం మేము పోరాడుతుండగా,ఆ నేపథ్యంలోనే నంబూరు రెడ్లు " సర్వ జనాభ్యుదయ పోరాట సమితి " అనే సంఘం స్థాపించి,బాధితులకు సంఘీభావంగా ఉన్న గుంటూరు ఏసీ కాలేజీ,హాస్టళ్ల విద్యార్థులపై సామూహిక దాడులకు పూనుకుంది,రెడ్లకు చెందిన సర్వజనాభ్యుదయ పోరాట సమితి.సరిగ్గా రిజర్వేషన్ల లో 61 ఎస్సీ కులాలకు దామాషా ప్రకారం పంపిణీ న్యాయం కోసం ముందుకు వచ్చిన మాదిగ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి,నాటి సర్వజనాభ్యుదయ పోరాట సమితి లాగే ఒక అసాంఘిక శక్తిగా,ఎస్సీల వ్యతిరేక శక్తిగా మాల మహానాడు ఆవిర్భవించింది. ప్రారంభంలో పీవీ రావు అనే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మాలాయన,ఈ మహానాడుకు నాయకత్వము వహించాడు.అప్పట్లో రాష్ట్ర అసెంబ్లీలో మాదిగల డిమాండ్లకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానాలు,చట్టమూ జరిగినాయి.వీటిని వ్యతిరేకిస్తూ ప్రతీఘాతుక ఉద్యమానికి పాల్పడిన పీవీ రావును అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది.ప్రభుత్వం తీసుకున్న,అసెంబ్లీ ఏకగ్రీవంగా తీసుకున్న అధికారిక విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా,ప్రభుత్వ ఉద్యోగి అయివుండీ పనిచెయ్యడం ప్రభుత్వ సర్వీస్ నిబంధనలకు విరుద్ధం అని,అప్పటి ప్రభుత్వం పీవీ రావును ఉద్యోగ విధుల నుంచి తొలగించింది.


               ***               ***                ***


వై ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గా ఉండగా, కాంగ్రెస్ పార్టీ హయాంలో పీవీ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి,అక్కడ జబ్బు పడి చనిపోయాడు.రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి పీవీ రావు మృత దేహాన్ని హైదరాబాద్ కి విమానంలో తరలించింది!అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించింది!అంతటితో ఊరుకోలేదు.పీవీ రావు ప్రభుత్వ సర్వీసులో ఉంటే, ఎప్పటి దాకా ఉండే వాడో,ఎంత ఆర్థిక రాబడి పొందేవాడో లెక్కగట్టి అణా పైసలతో ఎరియర్స్ ను పీవీ రావు కుటుంబానికి చెల్లించింది,రాష్ట్ర ప్రభుత్వం!

అంతేగాదు, పీవీ రావు బ్రతికి ఉన్నపుడు,ఒక రాజకీయ పార్టీ పీవీ రావుకు ఎన్నికల టికెట్ కేటాయించగా,సస్పెండెడ్ ఉద్యోగి అయినందున ఇంకా ఉద్యోగం పూర్తిగా వదిలినట్లు కాదు గనక, అతని అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కొట్టి వేసింది.పీవీ రావు చనిపోయాక అతని భార్యకు కూడా ఒక మనువాద పార్టీ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయించిందనుకుంటాను.


         ***                  ***                *** 


పీవీ రావు కాలధర్మం చెందిన కొన్నేళ్లకు నేనే మాల మహానాడు అంటూ వచ్చిన జూపూడి ప్రభాకరరావు గత తెలుగు దేశం,కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో ఎమ్మెల్సీ పదవులు,ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ పదవులు పొందారు!


         ***                ***                *** 


ఆ తర్వాత కొంత కాలానికి నేనూ మాల మహానాడే అంటూ ముందుకొచ్చిన కారెం శివాజీ కూడా రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ గిరి చేశారు.


           ***               ***               *** 


ఒక్క పల్లవి గానీ ,చరణం కానీ మాదిగ దండోరా ఉద్యమానికి విచ్చి మ్రోయని రాజకీయ  వాగ్గేయకారుడు,మాల కళాకారుడు గోరటి వెంకన్న కూడా ఎమ్మెల్సీ అయిపోయాడు!

        

          ***                  ***             ***


మాదిగ దండోరా ఉద్యమం పుట్టిన ఇరవై ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తెలంగాణ మాల మహానాడు నేత అద్దంకి దయాకర్ కూడా ఎమ్మెల్సీ అయ్యాడు!


          ***                ***               ***


కేసీయార్ ప్రభుత్వం కూడా అధికార పదవుల విషయంలో మాల వారికే పెద్ద పీట వేసింది.మాదిగలకు తీవ్ర అన్యాయం చేసింది.ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి పదవి, టియస్పియెస్ చైర్మన్ పదవి,ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవి, బుద్దవనం ప్రాజెక్టు ముఖ్య అధికారి పదవి,ఎమ్మెల్సీ పదవి,చివరికి ముఖ్యమంత్రి కార్యాలయం లో అధికార పదవి మొదలగు వాటిల్లో మాల వారినే కూర్చో బెట్టింది!


                     ***              ***               ***


డాక్టర్ ఇ.వి.చిన్నయ్య అంబేడ్కర్ మీద పుస్తకం తర్జుమా చేసి, గౌరవ డాక్టరేట్ పొందారు.ఈయన కళాప్రపూర్ణ కూడా.ప్రముఖ బుద్దిస్ట్ అనీ అంటారు.ఇతడే,ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ కు వ్యతిరేకంగా సుప్రీమ్ కోర్టు లో కేసు ఆడి గెలిచిన మాల వీరుడు! చచ్చినా వీడని అంబేడ్కర్ దృక్పధుడు! అసాంఘిక న్యాయ కోవిదుడు!

 

                ***                   ***             ****


కె.రాజు మాజీ ఐయేఎస్ అధికారి.కాంగ్రెస్ పార్టీ జాతీయ ఎస్సీ సెల్ చైర్మన్.దళిత బహుజన ఫ్రంట్ నాయకుడైన మాల నాయకుడు కొరివి వినయ కుమార్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అయి,గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే సీటు పొందారు.ఇదే సమయంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడై, తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్ధి గా పోటీ చేశారు. 


         ***                     ***                   ***


మాదిగలకు ఇలాంటి అధికార స్థాయి విస్తృత అవకాశాలు ఎందుకు లేకుండా పోయాయి?మాల సోదరులకు మాత్రమే ఎందుకు ఇన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయి? ఇది అర్థం కావాలంటే,తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి,కమ్మ,వెలమ, బ్రాహ్మణ,కోమటి,కాపు మొదలగు పాలక కులాలే రాజకీయ,ఆర్థిక,సామాజిక,విద్యా,సాంసృతిక పాలన ఎందుకు చేస్తున్నారో అర్ధం కావాలి.దాదాపు రెండు వందల యాభై కులాలు,జాతులు, తెగలు ఉన్న తెలుగు నేలపై అంచెల వారీ సామాజిక - రాజకీయ వ్యవస్థలో రెండు వందల కులాలు,జాతులు,తెగలు ఇప్పటికీ పాలితుల గానే మిగిలి పోవడానికి డిజైన్ అయి వున్న సామాజిక,రాజకీయ,విద్యా,ఆర్థిక వ్యవస్థలు అర్థమైతే, ఇందుకు కారణాలు తెలిసిపోతాయి.


          ***                    ***                  ***


ఈ మాల వారికి ఉన్నత పదవులు పొందే వ్యక్తిగత ప్రతిభ,అర్హతలు లేవా అంటే,ఉన్నాయనే చెప్పాలి. మాదిగలకు మరి ఇలాంటి పదవులు ఎందుకు రావడం లేదంటే? అదే సిస్టమ్ డిజైన్ లో ఆధిపత్య కులాల రాజకీయం! ఈ రాజకీయ చట్రంలో డిస్ప్రపోర్షనల్ గా అవకాశాలు పొందే మాల వారి ఆనందం!


            ***                 ***                ***


మాజీ అయ్యేఎస్ అధికారి,మాజీ రాజ్యసభ సభ్యుడు,యూపీసీసీ, ఢిల్లీ సీసీ మాజీ ఇంచార్జి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల పునర్విభజన కమిటీ జనరల్ సెక్రెటరీ,మాల కులస్తుడూనైన జేడీ శీలం ఒకసారి వార్త దినపత్రికలో " ఉభయతారకంగా వర్గీకరణ సాధ్యమే " అని  ఒక వ్యాసం రాశారు.టైటిల్ మాదిగలకు అనుకూలం అని అనిపించినా,అది మాదిగలకు వ్యతిరేకంగా,మాలలకు అనుకూలంగా రాసిన వ్యాసం.అందులో ఏముందో మరొకసారి వివరిస్తాను.


              ***                   ***                 ***


మా మాల అక్కాయి గీతారెడ్డిని కర్రు కాల్చి వాత పెట్టాలి అనిన కోదండరామిరెడ్డి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీల జాబితాలోనే!


ఇంకా ఉంది....

కృపాకర్ పొనుగోటి FB వాల్ నుండి

No comments: