HCU, Telugu, National Seminar 24.2.2022 News
నిగూఢమైన భావాల నిధి జానపద సాహిత్యం
-హెచ్ సి యు విసి ఆచార్య బి.జె.రావు వ్యాఖ్య
జానపద సాహిత్యంలో నిగూఢమైన భావాలు ఉంటాయనీ, అది తెలుసుకుంటే జానపదుల్లో ఉండే గొప్ప విజ్ఞానాన్ని సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని, మానవ సంబంధాల్ని పటిష్టపరుస్తుందని హెచ్ సియు వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు అన్నారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగుశాఖ నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాల జాతీయ సదస్సు ‘‘జానపద సాహిత్య అధ్యయనం-నాడు:నేడు‘’ ని గురువారం నాడు ముఖ్య అతిథిగా పాల్గొని, భావవీణ ప్రచురించిన ఈ సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, సదస్సుని ప్రారంభిస్తూ ఆచార్య బి.జె.రావు మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో జానపదసాహిత్యంపై అనేక కోణాల్లో పరిశోధనలు జరగాలనీ, ఈ సదస్సుని ప్రత్యక్షంగాను, ఆన్ లైన్ ద్వారాను నిర్వహిస్తున్నప్పటికీ, ఇకపై అన్ని సభలూ ప్రత్యక్షంగా జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. జానపద కళాకారుల్ని ప్రత్యక్షం తీసుకొచ్చి, ఆ కళారూపాల్ని ప్రదర్శించడం ద్వారా మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు. ఈ ప్రారంభ సమావేశానికి తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తూ తొలుత ఈ సదస్సుని అంతర్జాలం ద్వారానే నిర్వహించాలని తలపెట్టినట్లు, తర్వాత విశ్వవిద్యాలయం వారు ప్రత్యక్షంగా కూడా పాఠాలు చెప్పే అవకాశాన్ని కలిగించడం వల్ల ఈ సదస్సుని రెండు విధాలుగాను (బ్లెండెడ్ మోడ్)లో నిర్వహిస్తున్నామని వివరించారు. యుజిసి కేర్ జర్నల్ భావవీణ ముందుకు రావడంతో ఈ సమావేశ పత్రాలను ఒక ప్రత్యేక సంచికగా తీసుకొచ్చామనీ, సదస్సు పూర్తయిన తర్వాత సమగ్రంగా ఆ ప్రత్యేక సంచికను తీసుకొస్తామని ప్రకటించారు.ఈ సమావేశంలో మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య వి.కృష్ణ మాట్లాడుతూ నిష్కళంకమైన, స్వచ్ఛమైన మానవీయ పరిమళం జానపద సాహిత్యంలో ఉంటుందని, నిజమైన ప్రజల సాహిత్యమని అన్నారు. కీలకోపన్యాసం చేస్తూ ప్రసిద్ధ జానపద పరిశోధకులు, బెంగుళూరు విశ్వవిద్యాలయం పూర్వ తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జి.యస్.మోహన్ దేశవ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణ, మద్రాసు, బెంగుళూరు, మైసూరు, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోను, విశ్వవిద్యాలయాల్లోను జరిగిన పరిశోధనలను సమీక్షించారు. జానపద విజ్ఞానం అనేక కోణాల్లో ఉంటుందని వాటిని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. జానపద విజ్ఞానంపై కృషి జరగడానికి ప్రభుత్వాలు ముందుకురావాలని, దానికి ఈ సదస్సు ద్వారా ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. సదస్సు సమన్వయ కర్త తెలుగుశాఖ అధ్యాపకురాలు డా.దాసర విజయ కుమారి సదస్సు లక్ష్యాన్ని తెలియజేశారు.
జానపదసాహిత్యం, ముఖ్యంగా వీరగాథాసాహిత్యంపై విశేషమైన పరిశోధన చేసిన ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు, ఆచార్య ఎన్. ఎస్.రాజు, ఆచార్య జి. అరుణ కుమారి, ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్యపమ్మి పవన్ కుమార్, డా.సుధాకర్ బాబు అతిథులుగా పాల్గొన్నారు. తర్వాత జరిగి వివిధ సమావేశాల్లో ఆచార్య సూర్య ధనుంజయ్, ఆచార్య పమ్మిపవన్ కుమార్, డా.పి.విజయ్ కుమార్, ఆచార్య భూక్యా తిరుపతి అధ్యక్షతన జానపద సాహిత్యంలోని వివిధ అంశాలలో సుమారు 25 పరిశోధన పత్రాలను వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన అధ్యాపకులు, పరిశోధకులు తమ పత్రాలను సమర్పించారు. మరలా శుక్రవారం కూడా ఈ అంతర్జాల జాతీయ సదస్సు కొనసాగుతుందని దానిలోను జానపద సాహిత్యంపై విశేషమైన కృషిచేసిన విద్వాంసులు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొని పత్రసమర్ప ణ చేస్తారని నిర్వాహకులు తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి