తెలుగు పత్రికల్లో సంస్కృత పదాల వాడకం పెరిగిపోయిందని, దీన్ని తగ్గించి తెలుగు భాషను బతికించుకునేందుకు తెలుగు పత్రికలు కృషిచేయాలని వక్తలు సూచించారు. తెలుగు బాలసాహిత్య వేదిక ఆధ్వర్యంలో నెక్లస్‌రోడ్‌లోని 26వ హైదరాబాద్ బుక్ పెయిర్ ప్రాంగణంలో 'తెలుగు దినపత్రికల భాష ఆధునీకరణ' గ్రంథావిష్కరణ సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు పై విధంగా పేర్కొన్నారు. ఈ సభకు ఆచార్య సి.లక్ష్మన్న అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గ్రంథావిష్కరణ చేసి అనంతరం మాట్లాడుతూ పత్రికభాషలో సంస్కృత పదాల వాడకం విపరీతంగా పెరిగిపోయిన సమయంలో ఈ పుస్తకం రావడం వల్ల పాత్రికేయులు రాసే భాషలోని లోపాలు తెలుసుకోవచ్చని అన్నారు. ఇది తెలుగు భాష పరిరక్షణకు దోహదపడుతోందని, అలాంటి పుస్తకం రాయడానికి పగడాల చంద్రశేఖర్ పూనుకొవడం అభినందనీయమని అన్నారు. అనంతరం ప్రముఖ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ జీవనంలో భాష భాగమైందని, ఆ భాషే సజీవమైందని తెలిపారు. పత్రిక భాష ప్రసార భాషగా మారి చాలా కాలమైందని, దీని వల్ల పత్రికలు తరుచుగా వాడే సంస్కృత పదాలు కూడా వాడుక భాషగా మారాయని అన్నారు. కాబట్టి అలాంటి పదాల వాడకాన్ని పత్రికలు క్రమంగా తగ్గించాలని, అదే సమయంలో కొత్తగా అన్య భాష పదాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని అన్నారు. పత్రికలకు వార్తలను ప్రచురించడానికి చాలా తక్కువ సమయం ఉంటోందని, దీని వల్ల ఇతర భాష నుంచి తెలుగుకు అనువాదలు చేసేటప్పుుడు ఈ సమస్య తలెత్తుతోందని అన్నారు. పత్రిక భాష లోపాలు తెలియజేయడానికి రచయిత చేసిన కృషి అమోఘమైందని అన్నారు. పత్రికలు వాడే భాషపై రచయిత ప్రామాణికమైన పరిశోధన చేసి ఈ పుస్తకం రాశారని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయులు ఎబికె ప్రసాద్ మాట్లాడుతూ భాష లోపాలకు సంబంధించిన వివరణలను ఈ పుస్తకంలో పొందుపరిచారని అన్నారు. ఆంగ్ల భాష పదాలను కొన్ని సందర్భాల్లో పత్రికలు నేరుగా వినియోగిస్తున్నాయని, దీన్ని తర్వాతైనా సరళమైన తెలుగు భాషలోకి అనువాదించాలని తెలుగు పత్రికల నిర్వహకులకు సూచించారు. తెలుగు విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టరు జె. చెన్నయ్య మాట్లాడుతూ పాత్రికేయులతో పాటు భాష పరిశోధనాలు చేసే వారికి ఈ పుస్తకం ఉపయోడపడుతోందని అన్నారు. కార్యక్రమంలో ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య డి.చంద్రశేఖర రెడ్డి, జి.యస్ వరదాచారి, పుస్తక రచయిత పగడాల చంద్రశేఖర్ ప్రసంగించారు. కార్యక్రమంలో పలువురు సాహిత్య ప్రియులు పాల్గొన్నారు.
26వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో జనవిజ్ఞాన వేదిక (జెవివి) మ్యాజిక్ షో నిర్వహించింది. ఈ మ్యాజిక్ పలువురు సందర్శకులను ఆకట్టుకొవడంతో పాటు మూఢనమ్మకాలను, బాబాల మహిమలను నమ్మరాదనే సందేశానిచ్చింది. మ్యాజిక్‌లో నిర్వహించిన అద్భుత విన్యాసాలకు పిల్లలు ముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమాన్ని జెవివి రాష్ట్ర కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి