(ఆదివారం వార్త ( 21-12-2008, పేజీ: 31)లో ప్రముఖ కవి అఫ్సర్ రాసిన కవతను పూర్తి పేజీలో వేశారు. ఆ పత్రిక సౌజన్యంతో దాన్ని మళ్ళీ ఇక్కడ అందిస్తున్నాను---దార్ల )
-->
నాన్న ఇంకా ఇంటికి రాలేదు
ఇంకా...
ఇం...కా...!
నాన్న ఇంకా ఇంటికి రాలేదు
*
ఈ పూట
ఈ నగరం నా కళ్ల కింద
నా కాళ్ల కింద మంట
నాన్న ఇంకా ఇంటికి రాలేదు
చీటికి మాటికి వెనక్కి తిరిగి
గోడ మీది గడియారంతో మాట్లాడుతుంది అమ్మ.
దాని ముళ్లలోకి మిర్రి మిర్రి చూస్తుంది
ఎనిమిది..తొమ్మిది..పది..
అమ్మ క్షణాల్ని లెక్కపెడుతుందో
శవాల్ని లెక్కపెడుతుందో తెలీదు.
వచ్చెయ్ నాన్నా...
*
ఇప్పుడే కాల్చిన రొట్టెల వాసన
ఇప్పుడే నూరిన గోంగూర పచ్చడి
ఆకలి జమాయించేస్తోంది
నాన్న తొరగా రా...
అమ్మ వీపు తలుపుకి అతుక్కు పోతొంది.
ఇప్పుడే ఇదిగో
అనేసి, వెళ్లి చాలా సేపయ్యింది.
నాన్న ఇంకా ఇంటికి రాలేదు.
*
“అమ్మా, ఆకలే...?!”
”వూళ్లో ఏమవుతోందో తెలుసా?
ఎప్పుడూ ఆకలి...ఆకలి
నన్ను చంపి కొరుక్కుని తినరా...”
కేకేసీ ఆ తర్వాత అమ్మ ఇలా గొణుక్కుంది...
“ఇంకా కాలేదు
ఇంకా కాలలేదు
కుప్పలు కుప్పలుగా పోసిన శవాలు
మంటల దుప్పట్ల కింద
ఇంకా కాల్తున్నయి
47 నుంచీ...”
ఆ రాత్రి నాన్న ఇంటికి రాలేదు
ఈ రాత్రి కూడా రాలేదు.
(అనేక ముంబైల కన్నీళ్ల తరవాత.....)
-అఫ్సర్
6 కామెంట్‌లు:
అద్బుతమైన కవిత.
నిన్నే చదివాను దీన్ని.
గొప్ప నిస్సహాయతా, దైన్యం, అభద్రతా ప్రతి అక్షరం వెనుకా గూడుకట్టుకొని, అగ్నిపర్వతం లాంటి ప్రశ్నల్ని మనకు సంధించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ కవిత.
కవిత్వం లో అరుదైన టెక్నిక్.
మా యానాంపై కవితవ్రాసిన అప్సర్ గారికి నా నమస్కారములు తెలియచేయండి సార్.
బొల్లోజు బాబా
బాబా గారూ!
కవిత నాకు బాగా నచ్చింది. మీరన్నట్లు మంచి టెక్నిక్ ఉందా కవితలో. తల్లీ పిల్లల సంభాషణలో ...ఆ చిన్న చిన్న వాక్యాల్లో వర్ణించనలవి కానంత భయం తొంగిచూసినట్లు అనిపిస్తుంది. అఫ్సర్ గార్కి మీ కామెంట్ ని చేరవేస్తాను. నాకు కలిగిన అనుభూతే మీకూ కలిగినందుకు సంతోషంగా ఉంది.
మీ
దార్ల
గుండే పిండేసింది దార్లగారు..మనసంతా బాధగా అయిపొయింది :(
అఫ్సర్ తన కవిత గురించి ఇలా నాకు మెయిల్ ఇచ్చారు.
"dear darla:
thank you. Responses choostunnanu. blog valla inta prayojanam
vuntundani nenu anukoledu nijamgaa...
afsar"
కనుక, అఫ్సర్ గారికి మీ స్పందనలు చేరుతున్నాయి.
మీ
దార్ల
Very well done.
ఇండియన్ ఓషన్ సునామీ నించీ సద్దాం ఉరి దాకా కల్లోల సంఘటన జరిగితే చాలు, స్పందించడానికి కొల్లలుగా కవులున్న నేపథ్యంలో, ఒక దారుణ సాంఘిక రాజకీయ ఘటనని ఆర్ద్రంగా, అర్ధవంతంగా కవిత్వీకరించడం చాలా అరుదైన విషయమే. అఫ్సర్ కి అభినందనలు.
Naana..kavitha..chaduvuthunty..kodhirojulu...kreethma..nenuAnukonabhavallu...guruthuku..vachai.thanks.Afsargaru....
కామెంట్‌ను పోస్ట్ చేయండి