ఆకలికి తట్టుకోలేక మట్టినే తిని ప్రాణం కాపాడుకోవాలనుకున్న ఒక నిరుపేద పిల్ల, ఆ మట్టి తినడం వల్ల చనిపోయినట్లు చిత్రించిన కథ 'మన్నుబువ్వ' పేరుతో జాజుల గౌరి ఒక కథల సంపుటిని ప్రకటించారు. ప్రతి కథ హృదయాన్ని ద్రవించే శైలిలో, తెలంగాణా సజీవ భాషలో రాశారు. "సెట్టు కింద సల్లగుంది గానీ నా కడుపులో మంటగుంది'' అని రాయడంలో కథకి ఉండాల్సిన వాతావరణ చిత్రణ, కథకెలా ఉపయోగించుకున్నారో అర్థమవుతుంది. ఆకలికి తట్టుకోలేక, నీళ్లు తాగినా ఆకలి తీరక, ఇంటి ముందరున్న చెట్టు కింద కూర్చున్న పిల్ల, ఆకలి తీరే దాకా మట్టిని తినడంతో చనిపోతుంది. ఉత్తమ పురుషలో కథని నడిపించినప్పుడు, ఇటువంటి కథను ముగించడం కష్టంతో కూడిన పని. దాన్ని రచయిత్రి చక్కని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ "నేను బోయేతాలకల్ల అవ్వ బువ్వొండి ఎసరు వంపుతోంది. అన్న, సెల్లె అవ్వ సుట్టూ కూకుని బువ్వెప్పుడైతదా అని జూస్తుండ్రు, గానీ నేను కుండ కాడ్కి బోయి సెంబు నిండా నీళ్లు దీస్కుని గట్ట గట్ట తాగి, అవ్వ దిక్కు పోయి, మీదున్న డేగీస దిక్కు జూస్కుంట కిందనే పండుకున్నా. అప్పటి దాకా బువ్వడిగి గట్ల పండుకున్న, నా దిక్కు అవ్వ, అన్నా సెల్లి సిత్రంగా జూస్తుండ్రు. నాకు ఆ తరువాత ఏమైందో ఏమో! ఇగ లేసి తింటది, అగ లేసి తింటదని ఎదిరిస్తూనే ఉంటరు గావచ్చు'' అని ముగించారు. కథలో ఆ బాలిక చనిపోతుంది. మరణించిన తర్వాత పాత్ర ఎలా మాట్లాడుతుందని అనిపిస్తుంది. అందుకనే పడుకునే వరకూ ఉన్న స్థితి తర్వాత " ఏమైందో ఏమో!'' అని అనడం చక్కని మెరుపును సూచిస్తుంది. ఈ ఒక్క కథ చాలు, జాజుల గౌరి కథల్లో ప్రదర్శించిన కథాకథన శిల్పాన్ని గమనించడానికి. ఈ సంపుటిలో 25 కథలున్నాయి. చాలా కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవే. ఈ కథల సంపుటికి సుశీలా నారాయణ రెడ్డి స్మారక ట్రస్టు ఆర్థిక సహాయం, పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఆర్థిక సహాయం అందింది. " ఇప్పటి దాకా రికార్డు కాని దళిత జీవిత కోణాలు, సంస్క¬ృతి ఈ కథల్లో చూడవచ్చు'' అని అంటూ 'సాహిత్యంలో కొత్త నీరు' పేరుతో ప్రసిద్ద రచయిత బి. ఎస్.రాములు ముందుమాట రాశారు. దీనిలో బి. ఎస్. రాములు ప్రతి కథనీ చక్కగదా విశ్లేషించారు. 'పట్టాలు' కథ ఇళ్ల స్థలాల పేరిట జరిగే రాజకీయాల్ని, 'నీళ్లబాయి'లో స్త్రీపురుష వివక్షనీ, 'సూరీడు' కథలో దళితుల్లో రావాల్సిన చైతన్యాన్ని చక్కగా చిత్రించారు. రచయిత్ర తన ఆత్మకథగా చెప్పుకున్న 'నేన్ నేన్ లెక్కనే'లో ఆత్మగౌరవాభివ్యక్తి ఉంది. కథలన్నింటిలోనూ కన్పించే రచయిత్రి ఆవేదన అట్టడుగు స్థాయి జీవన వేదనలు, దళిత ఉద్యమాలు, దళితులపై జరిగే దాడులు (అవి అనేక రూపాల్లో ఉండవచ్చు) వాటన్నింటి గురించి ఆలోచింపజేయాలనేదే! 'నా పయనం' పేరుతో రచయిత్రి రాసుకున్న ప్రస్తావన ఆత్మీయంగా ఉంది. తనకు సహాయం చేసిన వారిని మరిచిపోలేని కృతజ్ఞతను ధ్వనింపజేశారు. కేవలం మాటలుగా కాకుండా ప్రతి దానికీ కార్యకారణాన్ని చూపారు. అలా ఆమె రచయిత్రి కావడానికి కేవలం దళితులే కాకుండా, దళిత స్ప¬ృహ ఉన్న వారెంతో మంది సహకరించినట్లు తెలుస్తుంది. ప్రతి రోజూ ఏదో ఒక పత్రికలో 'కథలు' వస్తున్నా, దళిత స్త్రీ, అదీ తెలంగాణా దళిత స్త్రీ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ ప్రాంతంలో ఉండే దళితుల ప్రత్యేక సమస్యల్ని అవగాహన చేసుకోవడానికి, కతలో ప్రవేశించవలసిన నేటివిటీ భాషకి ఎలా ఉంటే బాగుంటుందో గమనించడానికి జాజుల గౌరి 'మన్నుబువ్వ' కథల సంపుటిని చదవడం చాలా అవసరం. ( మన్నుబువ్వ (కథల సంపుటి), రచయిత్రి: జాజుల గౌరి; ప్రతులకు: విశాల సామాజిక తాత్త్విక విశ్వవిద్యాలయం, రామకృష్ణ నగర్, అంబర్‌పేట, హైదరాబాద్)
- డా॥ దార్ల వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి