మెరిసిన ‘ఆంధ్రపురాణ’ సౌందర్యం
విమర్శకునికి ఉండవలసిన ప్రధాన లక్షణాల్లో ‘భావుకత’ ఒకటి.
కవి భావించిన భావాన్ని విమర్శకుడు పట్టుకోగలిగే సామర్థ్యమే భావుకత. ‘ధ్వన్యాలోకం’ వ్యాఖ్యాత
అభినవగుప్తుడు ‘లోచనం’లో కూడా భావుకత, ‘సహృదయత’ల గురించి చర్చించాడు. అలాంటి సహృదయుడైన
విమర్శకుడు లభించినప్పుడు ‘కావ్యం’ పాఠకులు పాఠకుల హృదయాల్లో కొత్తవెలుగులు
ప్రసరిస్తుంది. అందుకనే పాండిత్యం బాగా ఉన్నప్పటికీ, విమర్శకునికి భావుకత, సహృదయత తోడయితేనే ‘కావ్యం’లో
కవిబ్రహ్మ వెలువరించిన భావాల్లో ఉండే మహోన్నతమైన ‘విషయాల్ని’ బయటకు తీయగలుగుతాడు.
ఆ విషయాన్ని చదివి, కొన్నిసార్లు ‘కవిగారే’ ఆశ్చర్యపోయే
సందర్భాలు కూడా కలగవచ్చు. తెలుగు సాహిత్య విమర్శకుల్లో పాండిత్యం, సహృదయత, భావుకత ముప్పేటలా కలిగినవారు కొంతమంది
ఉన్నారు. అందువల్లనే సాహిత్యంలో కొత్త కొత్త దృక్పథాలు, ధోరణులు
బయటకు వస్తున్నాయి. అలాంటి సహృదయ విమర్శకుల్లో ఆచార్య అనుమాండ్ల భూమయ్యగారొకరు.
ఇటీవల ‘ఆంధ్రపురాణం భారతీయ సంస్కృతి వైభవం’ పేరుతో ఆయన ఒక గ్రంథాన్ని
రచించారు.
మధునాపంతుల
సత్యనారాయణ శాస్త్రిగారు ‘ఆంధ్రపురాణం’ రచించి, ప్రచురించి యాభై సంవత్సరాలైంది. మొదటిసారి 1954లో ఈ ‘ఆంధ్రపురాణం’ గురించి భూమయ్యగారి కంటే ముందు కూడా ఎంతోమంది
రాశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిల్లో పాఠ్యాంశంగా ఈ
గ్రంథాన్ని అనేక వేల మంది విద్యార్థులు దీన్ని చదువుకున్నారు. బి. నాగిరెడ్డిగారు ‘ఆంధ్రపురాణం
- సమగ్ర పరిశీలనం’ పేరుతో పరిశోధన చేశారు. యువ భారతి వారి ‘ఇతిహాస లహరి’
లో జి.వి.సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి వ్యాసం
రాశారు. ఇంత మంది ‘ఆంధ్రపురాణం’ గురించి రాయగా, మళ్లీ
భూమయ్యగారు ఎందుకు రాశారనే దాన్ని తెలుసుకోవడమే ఈ చిరు సమీక్ష ఉద్దేశం.
ఆంధ్రపురాణం గురించి ఇంతకు ముందు రాసినవారి
కంటే అదనంగా భూమయ్య గారు భారతీయ సంస్కృతీ వైభవాన్ని అనేక కోణాల్లో చూడగలిగారు.
సంస్కృతిలో ధర్మం ప్రధానంగా భావించి కావ్యాన్ని మరింత సౌందర్య భరితం చేశారు. ‘కావ్య
కథకు మూలం చరిత్ర. ఎన్నుకొన్నది కావ్యకళా మార్గం. చెప్పదలచుకున్నది ధర్మం. ఇది
ఆంధ్రపురాణంలోని విషయం. ఈ కావ్యరచనకు రాజుల చరిత్ర సారకథనం ఒక మిష. ధర్మకథనమే
ప్రధానాంశం’' అని కావ్యాత్మను ఆవిష్కరించి పాఠకునికి కావ్య పఠనాభిరుచితో పాటు రచనలో గల
ఔన్నత్యాన్ని మరింత వివరించారు.
ఆంధ్రపురాణంలో మధునాపంతులవారు రాజవంశాల
పేర్లతో తొమ్మిది పద్యాలు రాస్తే,
భూమయ్యగారు ధర్మరక్షణ, భారతీయత, కళాసంపద, కావ్యకళ వంటి పేర్లతో తొమ్మిది విభాగాల్లో దాన్ని
విశ్లేషించడం ఒక చమత్కారంతో పాటు ఔచిత్యం. మొత్తం రెండూ కలిస్తే పద్దెనిమిది సంఖ్య
అవుతుంది. భారతీయ సాహిత్యంలో పద్ధెనిమిదికి ప్రముఖ స్థానం ఉంది. ఈ దృష్టితో కూడా
ఆంధ్రపురాణాన్ని పద్దెనిమిది సంఖ్యతో ముడిపడేట్లు చేసి దాన్ని భారతీయ సంస్కృతిలో
గల ఔన్నత్యాన్ని చమత్కార భరితంగా తన ప్రణాళిక ద్వారా సూచించారు. సుమారు రెండు వేల
నూట అరవై రెండు పద్యాలు గల కావ్యంలో 196 పద్యాల్లో గల
కళాత్మక సౌందర్యాన్ని విశదీకరించారు. రాజరాజ నరేంద్రుడు ఆంధ్ర మహాభారతాన్ని
రాయించడానికి కారణాలు అనేకం ఉన్నా, ధార్మికత కూడా ఉండబట్టే రాజ్యం పోయినా, రాజులు
పోయినా ఆ సాహిత్యం నేటికీ నిలబడి ఉంది. ఈ సందర్భంలో మధునాపంతుల సత్యనారాయణగారు
వర్ణించిన పద్యాన్ని భూమయ్యగారు వ్యాఖ్యానించిన
తీరుని చదివితే పాఠకుడు సంభ్రమాశ్చర్యాలకు గురవుతాడు.
‘‘కావున శ్రుత మత ధర్మపు
జీవకు జివురిచ్చిపూల దేలించు వసం
తావిర్భావమునకు మీ
దీవన కావలయు గని సుధీ మధుమూర్తీ’’ దీన్ని
రాజరాజనరేంద్రుడు నన్నయను మహాభారతాన్ని రచించమని కోరిన సందర్భంలో కవి వర్ణించారు. ఇది
రాజరాజు నన్నయను కోరినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ‘మధుమూర్తి’ ని బట్టి ‘మధునాపంతుల’
వారిని కూడా స్ఫురిస్తున్నాడు కవి అని భూమయ్యగారు అన్నారు. ఆనాడు, నన్నయ వైదిక ధర్మ పునరుద్ధరణకు
రాజరాజు ప్రేరణతో వ్యాసభారతాన్ని తెనిగించాడు. నేడు మధునాపంతుల సత్యనారాయణ
శాస్త్రి గారు ‘‘శ్రుత మత ధర్మపు జీవకు జివురిచ్చి పూల దేలించటానికి ఈ ఆంధ్ర
పురాణ రచనకు పూనుకొన్నట్లు తెలుస్తుంది’’ అనడం ద్వారా ఆలోచనాపరులైన పాఠకుల్ని
ఆహ్లాదంలో ముంచెత్తి ఆంధ్రపురాణ సౌందర్యం మెరుపు మెరిసినట్లు అవుతుంది. శ్రతులు
అంటే వేదాలు. దానిలోని ధార్మిక జీవనాన్ని ప్రచారం చేయడానికి కవి ప్రయత్నించాడనేది
భూమయ్యగారి వ్యాఖ్య. దీనివల్ల ఒక మత ప్రచారం కోసం కాకుండా వేదధర్మాన్ని ప్రచారం
చేయడానికి మహాభారతం తెలుగులో వెలిసిందనడం ద్వారా సాహిత్య విస్తృతిని పెంచారు.
ఆంధ్రుల పుట్టుపూర్వోత్తరాల్ని వివిధ కథల్లో
వర్ణించిన మధునాపంతుల వారి సుధారసాన్ని గొప్పగా ఈ విమర్శక పరిశోధకుడు
వ్యాఖ్యానించారు. మగధ సామ్రాజ్యంలో సామంతులుగా ఉన్న సాతవాహనులు స్వతంత్ర రాజులై
తొలి తెలుగు రాజులుగా కీర్తి గాంచడం, వీరిలో హాలుని కథ రసవత్తరంగా వర్ణితమయ్యాయి. చాళుక్య,
కాకతీయ పర్వాల్లో చరిత్రను చెప్తున్నట్లు ఉన్న ధర్మం అంతర్లీనంగా
దాగిన వైనాన్ని చక్కగా విశదీకరించగలిగారు. ప్రతాపరుద్రుడి ఆత్మహత్య సంఘటన రసార్ద్రంగా
ఉంది. ‘‘ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి’’ ని ఒక పాఠ్యాంశంగా చదివే
విద్యార్థులకు లేదా దీని గురించి తెలుసుకోవాలనుకునేవారికి
మధునాపంతుల వారి పద్యాలు చదివిన వెంటనే అర్థం చేసుకోలేనివారికీ భూమయ్యగారి గ్రంథం
అరటి పండు ఒలిచి పెట్టినట్లు ఉంటుంది. గ్రంథం ఆసాంతం చదివితే చక్కని శైలి,
పరిశోధనా పద్ధతి పాఠకుల్ని సత్యాన్వేషణకు పురికొల్పుతుంది.
ముఖచిత్రం హిమాలయాలు, అట్ట వెనక కాకతీయ తోరణం, వేయి స్తంభాల గుడి ఎంతో ఆకర్షణీయంగా మల్టీకలర్‌లో ముద్రించి చరిత్రలో
కాకతీయ శిల్పానికి శాశ్వతత్వం సిద్ధింపజేశారు. భారతీయ సంస్కృతిని హిమాలయాల చిత్రం
ద్వారా, తాను నివసించే ఓరుగల్లు శిల్పాల్ని కాకతీయ తోరణం,
వేయిస్తంభాల ద్వారా చూపి భారతీయతలో తెలుగు సంస్కృతి అంతర్భాగమనేది
ఔచిత్యవంతంగా ప్రతీకాత్మకంగా నిరూపించారు. భారత, రామాయణాలను, కొన్ని కావ్యాలను
చదివే పద్ధతిని గుర్తించడానికి ఈ గ్రంథం ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. భిన్నత్వంలో
ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వమనేది భారతీయ సంస్కృతిగా చెప్తున్నా దాన్ని నిరూపించే
పుస్తకంగా దీన్ని భావించవచ్చు. కవి రాసిన కావ్యాన్ని భావుకత, సహృదయత,
పాండిత్యాల్ని ముప్పేటగా ఉంటే సాహిత్యం నిరంతరం కొత్త కొత్త అందాల్ని, ఆలోచనల్ని
అందిస్తుందనడానికి, పునర్మూల్యాంకన విమర్శను చూడ్డానికీ ఈ పుస్తకం విమర్శకులకు,
పరిశోధకులకు కూడా ఉపయోగపడుతుంది.
( ఆంధ్రపురాణం: భారతీయ సంస్కృతి వైభవం, రచన: ఆచార్య అనుమాండ్ల భూమయ్య, వెల: రూ. 75/- ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్,
ఆర్యసమాజ్ ఎదురుగా, కాచిగుడా, హైదరాబాద్)
- డా. దార్ల వెంకటేశ్వరరావు
(25-07-2005,
ఆంధ్రప్రభ సాహితీగవాక్షం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి