"అగ్రవర్ణాల మీద ఉగ్రవాదుల్లా విరుచుకుపడ్డారు కదా 'డాష్‌లో తంతామని' రాష్‌గా రాశారు కదా మా దగ్గరెందుకు ముడుచుకుపోయారు'' అని దళితకవుల్ని నిలదీసి అడుగుతూ, ఉపకుల విభజన జరిగినప్పుడు లబ్ధి పొంది, దాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేయడంతో, ఆ లబ్ధిదారుల ఆందోళన, ఆవేదనల అక్షరరూపం ఎండ్లూరి సుధాకర్ 'వర్గీకరణీయం'లో వ్యక్తమైన కవితా ఖండిక అది. 'వర్గీకరణీయం' దళిత కవుల్లోని నిబద్ధతను, ఆచరణను ప్రశ్నిస్తుంది. రాష్ట్రంలో ఎస్.సి.ల మధ్య తమకి రావాల్సిన హక్కుల్ని పొందడంలో కొన్నేళ్లుగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎస్.సి.లను విభజించకూడదని, దళితుల ఐక్యత చెడగొట్టకూడదని, అందుచేత దళిత సమైక్యత అవసరమంటూ ఒక వర్గం, 'ఐక్యత'కేమీ నష్టం రాకుండా రావాల్సిన రాయితీలను కుటుంబంలో సభ్యుల మాదిరి పంచుకోవాలని మరొక వర్గం వివిధ ఉద్యమాలు చేస్తూనే ఉంది. అసలు రిజర్వేషన్లు భారత సమైక్యతకు గొడ్డలి పెట్టని, కాబట్టి వాటిని వ్యతిరేకించే వర్గమూ ఉంది. ఈ వర్గాన్ని వ్యతిరేకిస్తూ 'సమైక్యదళితులు'గా చాలా తీవ్ర పదజాలంతో కవులు కవిత్వాన్ని రాశారు. దీనికి వ్యతిరేకంగా కొందరు తమ ఆవేదనల్ని అక్షరీకరిస్తూ చకోనా సంపాదకత్వంలో 'పాట చిక్కబడుతుందా?' కవితా సంకలనాన్ని కూడా ప్రచురించుకోవాల్సి వచ్చింది! తర్వాత చాలా చర్చలు ( ఈ విషయంలో) జరిగాయి. అంత తీవ్ర పదజాలంతో, తమ హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం, రాసిన కవులు వర్గీకరణను సమర్థిస్తూ గానీ వ్యతిరేకిస్తూ గానీ ఏదో ఒక అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పకుండా 'ప్రముఖ దళితకవులు' మౌనంగా ఉండడాన్ని ప్రశ్నిస్తున్నాడు కవి. రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఇప్పటికే రెండు సార్లు వర్గీకరణను సమర్థిస్తూ తీర్మానాలు చేసింది. అంటే దళితుల్లో ఒక వర్గానికి 'న్యాయం' జరడం లేదని, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. వర్గీకరణ చేసిన తర్వాత విద్య, ఉద్యోగ రంగాలలో ఎన్నో ఆవకాశాల్ని అన్ని వర్గాల (ఎస్.సి.లలోని) వారు పొందడం, సుప్రీంకోర్టు తీర్పుతో ఎప్పుడేమవుతుందోననే ఆందోళనతో ఉండడాన్ని కవి - "అరుంధతీ సుతుల కళ్లలో కన్నీటి కాటుక రేఖలు రెప్పల కింద చెప్పుల మేకులు గుండెలన్నీ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకున్నాయి ఉద్యోగాలు ఏమవుతాయోనని ఉద్వేగాలు పెరిగిపోతున్నాయి ఎవరిని కదిలించినా దిగులు మబ్బుల జల్లులు ప్రతి ఇల్లూ ఒక ఎమర్జెన్సీలా ఉంది... కన్నీళ్లు మింగి మింగి కడుపు నిండిపోయింది.....'' ఇలా వర్గీకరణ వల్ల లబ్ధి పొందిన వారి జీవితాల్తో మమేకమై, వారి ఆవేదనను ఆత్మీకరించుకున్నారు. నిజానికిది అక్షరాలుగా రాయలేకపోయి, అభిప్రాయంగా చెప్పలేకపోయినా వర్గీకరణ ప్రయోజనం పొందిన ప్రతి ఒక్కరిదీ! 'వర్గీకరణ ప్రయోజనం' అనడంలో మాల, మాదిగ, రెల్లి అన్ని ఉపకులాలూ ఉన్నాయి. వర్గీకరణ రద్దయితే ఎబిసిడిల విభజన ప్రకారం జరిగి అన్ని ఉద్యోగాల భర్తీ ఆగిపోయి, కొత్త భర్తీ జరిగితే, బాధ అనుభవించడంలో 'మాల - మాదిగ' తేడా ఉండదు. ఎందుచేతనంటే మళ్లీ ఇంతకు ముందు వచ్చినవాళ్లకే సీట్లయినా, ఉద్యోగాలైనా మళ్లీ వస్తాయనే గ్యారంటీ లేదు. 'సమైక్యత' గురించి మాట్లాడుకొనేటప్పుడు భిన్న జాతుల వస్తు ప్రదర్శనశాలగా పిలువబడుతున్న భారతదేశంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, భిన్న సంస్క¬ృతులూ ఉన్నా అవసరమైనప్పుడు సమైక్యంగానే భారతీయులు సమాధానం చెప్తున్నారు. అలాగే బి.సి.లు వెనకబడిన తరగతులు వివిధ గ్రూపులుగా విభజన జరిగి తమకు రావాల్సిన రాయితీలను పొందుతున్నారు. వీరిలో సమైక్యతకు నష్టం వాటిల్లిందా! అలాగే ఎస్.సి.లు కూడా! విభజన జరిగినంత మాత్రాన సమైక్యతకు నష్టం జరగదు. వర్గీకరణ కోసం ఉద్యమాలు జరిగినా, అవి సాధించుకున్న తర్వాత, సామాజిక ఉద్యమాలు కలిసే చేయాలనేది ఆ ఉద్యమనేతలే కార్యరూపం కూడా సూచించారు. ఉత్తర భారతదేశంలో కూడా ఎస్.సి.ల్లో ఒక వర్గమే అన్నింటినీ అనుభవిస్తుందని, అలాగే దక్షిణ భారతదేశంలో కూడా ఒక వర్గమే ప్రధానంగా హక్కుల్ని పొందుతున్నాయనే వాదనలు ఉన్నాయి. అసలు రిజర్వేషన్లు అనేవి దీర్ఘకాలికంగా కాకుండా కొన్ని సామాజిక అసమానతలు తొలగిపోయేందుకు మాత్రమే పాటించవలసిన అవసరం ఉంది. ఎస్.సి.ల్లోనూ క్రీమీలేయర్ పెట్టాలి. అగ్రవర్ణాలని పిలువబడుతున్న వారిలోనూ ఆర్థికంగా అణచివేయబడిన వారికి కొంత శాతం రిజర్వేషన్లు కొంత కాలం కల్పించాలి. హక్కుల్ని పొందడంలో అందరూ సమానులే అనేది నినదించాలి. ఈ భావాలను కొన్నింటిని కవిత్వ రూపంలో 'వర్గీకరణీయం'గా వర్ణించడంలో చక్కని వ్యంగ్యాన్ని అసుసరించారు కవి. శిల్ప దృష్ట్యా కూడా చాలా తోలుగా విశ్లేషణ చేయాల్సిన కావ్యం. వక్రోక్తి, ధ్వని చమత్కారం వంటివి కావ్యం నిండా ఉన్నాయి. శ్రీశ్రీ కవిత్వ ప్రవాహం, అనుకరణ అక్కడక్కడా కనిపిస్తుంది. సమకాలీన దళిత సాహిత్యాన్ని రికార్డు చేయడంలో కొత్త గబ్బిలం తర్వాత ఈ కవిది ఇది రెండవదైనా, సాహిత్యంలో మాత్రం ఏకైక దీర్ఘకావ్యంగా నిలుస్తుంది. ( వర్గీకరణీయం (దళిత దీర్ఘకవి); కవి: ఎండ్లూరి సుధాకర్; వెల: ఇరవై రూపాయలు; ప్రతులకు: ఎండ్లూరి సుధాకర్, అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి)
- డా. దార్ల వెంకటేశ్వరరావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి