డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు 'దళిత తాత్వికుడు' అనే కవితా సంపుటిని వెలువరించారు. అప్పుడప్పుడు రాసిన కవితలను ఏరి కూర్చి ఒక పుస్తకంగా తెచ్చారు. ఆయన కవిత్వంలో దళిత వాదం ఉంది. ' ఈ కులంలో పుట్టకపోతే నేను ఇంకోలా ఆలోచించేవాణ్నేమో ఈ కులంలో పుట్టటమే మంచిదైంది' అని అనుకునే దార్ల వెంకటేశ్వరరావు కులం వల్ల సంక్రమించిన ఆత్మన్యూనతను అధిగమించి ఆత్మగౌరవాన్ని ప్రకటిస్తున్నాడు. నేటి దళిత కవిత్వానికి కావాల్సిందే అదే. అందువల్లనే ఆయన శంబూకడి మీద ప్రేమను వ్యక్తం చేశారు. 'దళిత తాత్వికుడు' అనే కవిత కవిత్వపరంగానే కాకుండా ఆయన దృక్పథానికి అద్దం పడుతుంది. ఈ కవిత పాదాలు గ్రామీణ ప్రాంతంలో దళితులు పడే మానసిక, సామాజిక, సాంస్క¬ృతిక వేదనను వ్యతిరేకిస్తూనే దాన్ని అధిగమించే మార్గం చెబుతుంది. "అన్నీ మామూలై పోయి కొత్త బట్టలేసుకొన్నప్పుడల్లా వింతవింతగా చూసే వాళ్లెదుట ఏదో తప్పు చేసినట్లింకా కుంగిపోలేను రంగునీ, రూపాన్నీ, భాషనీ అన్నింటినీ అనుమానించినా ఆత్మన్యూనతకింకా అర్థం కల్పించలేను'' అని ప్రకటిస్తున్నారు దార్ల వెంకటేశ్వరరావు. దార్ల వెంకటేశ్వరావు మంచి కవిత్వం రాయగలరడానికి ఈ పుస్తకంలోని కవితలు నిదర్శనం. ( దళిత తాత్త్వికుడు (కవితా సంకలనం); కవి: డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు; వెల: పది రూపాయలు; ప్రతులకు : విశాలాంధ్ర బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలు)
- కాసుల ప్రతాపరెడ్డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి