"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

మనం పత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మనం పత్రిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

09 అక్టోబర్, 2018

నీ కౌగిలి తన్మయత్వం ( మనం- దినపత్రిక, 9 అక్టోబరు 2018 కవిత)


నీ కౌగిలి తన్మయత్వం!




అప్పుడప్పుడూ నువ్వు
కనిపించీ కనిపించని దారిలో నడుస్తున్నట్టు 
నువ్వు అర్ధమైయ్యీ 
అర్ధం కానట్లనిపిస్తావు
ప్రేయసీ ప్రియుల్లా
కర్త,కర్మ క్రియల్లేని మాటల్నేవో 
గుసగుసలాడుతున్నట్లుంటావు 
ఎగిరేపిట్టల వెంటపరుగెడతాను
కదిలే నదుల్లో దూకుతాను
అంతా అలిసిపోయాననుకుంటారు
ఆనందంలో తడిసిపోయాను 
మెరుస్తున్న కళ్ళల్లో తెలిసిపోకుండా 
ఆ పిట్టలు చూపిన చోటుల్ని
నేను మాత్రమే చూసుకుంటూ
నదులు తీర్చిన దాహాన్ని 
నేను మాత్రమే రుచినాస్వాదిస్తూ 
రెప్పలవాకిళ్ళు మూసుకుంటాను 
నన్ను పిచ్చోడనో
నన్ను ఋషిననో 
ఎవ్వరేమంటే నాకేమి 
నిన్నందుకున్నాను
ఇన్నాళ్ళూ నిన్ను 
నిఘంటువుల్లో వెతికాను 
మనసులోతుల్లో తేలుతున్న
మనిషి లోతుల్లో దాగున్న నిన్నందుకున్నాను 
ఎవ్వరేమంటే నాకేమి 
నిన్ను చేరుకునప్పుడల్లా 
నిలువెత్తు ఆనందంతో అభిషేకిషిస్తున్నావు!
-దార్ల వెంకటేశ్వరరావు
09182685231



26 ఆగస్టు, 2018

అంతరంగ నృత్యం ( మనం 25 ఆగస్టు 2018 సౌజన్యంతో)

( ‘మనం’ 25 ఆగస్టు 2018 సౌజన్యంతో)

అంతరంగనృత్యం!
  
తెరతీసి ముఖాన్ని చూసీ చూడనట్లు
తీసినా తియ్యకున్నా చూడాలన్నట్లు
నీఅంతరార్థాన్ని పట్టుకోవాలనీ
నీ అంతరంగాని ముట్టుకోవాలనీ
నీఆనందాన్ని పంచుకోవాలనీ
పరుగుపరుగునొస్తాను
పట్టుపరికిణిలా మెత్తగా తాకగానే
తన్మయమవుతూ పట్టేసుకోగలిగానన్నంతనే
గట్టుకిచేరినట్టే చేరీ చేరనట్లే
గుట్టును విప్పీ విప్పనట్లే
అర్థమైయ్యీ  కానట్లే
కోపాన్ని కంటిలోనూ
ప్రేమని పెదవిమీదా మొలకల పులకరింతలై
మది వలపు తలుపులు వెతుకమంటావు!
బాధనో, వేదనో, మోదాన్నో
పట్టుకొన్నట్లు
పదాల్నో, పెదాల్నో, నదాల్నో
పట్టుకొనివేలాడాలని మళ్ళీ...!
నీ పాదాల్ని  నాయెదవాకిట్లో
చిందులేయించాలని మళ్ళీ మళ్ళీ నీవెంటే!
నీతో నేనున్నా నాతో నువ్వున్నా
కళ్ళవంతెనల్లో కల్లోలాల పాలపుంతల్లో
నువ్వూనేనయ్యే నేనూనువ్వైయ్యే
అవ్యక్తానురూపాలింగనమై అనుభూతుల తన్మయ కాంతిపుంజమైమెరిసిపోతుంటావు!
నువ్వు నాకెలా తెలుస్తావో
నువ్వు నాకేదొకటి తేలుస్తావో
తలుచుకుంటూ తలచుకుంటా తన్నుకుంటుంటే
నువ్వొక్కొక్క చోట దయతో జారవిడిచే
ఓ కొత్తశబ్దమై తగలగానే
చిక్కావులే చేతికనుకుంటూ
అకారాదిగానో
మకారాదిగానో
వికారంగానో
నిఘా వేసి మరీ వెతుకుతా
నిన్ను గుర్తుపట్టాలనుకుంటానా
నీబడిగుండెల్లోనే ఉంటానంటావు!
నీ యెదవాకిట్లోనే నిలిచానంటావు!
-దార్ల వెంకటేశ్వరరావు
21.8.2018
(కవిత్వాన్ని అర్థం చేసుకోవడం, అదీ ఆధునిక కవిత్వాన్ని అవగాహన చేసుకోవడంలో పాఠకుడు పొందే అనుభూతి!)

31 జులై, 2018

మళ్ళీ నీ కోసమే ఈ నిరీక్షణ


31 జూలై 2018, మనం దినపత్రిక సౌజన్యంతో


నిద్రరాని ప్రతి అర్థరాత్రీ
 ఆకాశంకేసి చూసినప్పుడల్లా
నాఒంటరితనాన్ని పోగొట్టే
నక్షత్రమై పలకరించిన నిన్ను చూడాలనిపిస్తుంది.
నీకళ్ళల్లో నన్నూ నాకళ్ళల్లో నిన్నూ-
ఒకర్నొకరం మౌనసంగీతాన్ని వింటూ
మబ్బులచాటున చెఫ్పుకున్న
వేదనలయెరుపులన్నీ
మళ్ళీఈకళ్ళల్లోమెరిసేలానిన్ను చూడాలి
చూపులుకురుస్తున్నతడితో
ఆ కాగితప్పడవల్లో ఊగిసలాడుతూ
కొండలనుండీ కోనలనుండీ
తొంగితొంగిగెంతులేసే
సూర్యుణ్ణలాగే పిడికిళ్ళలోబంధించి
మనసుతెరచాపల్లో
 
దాగుడుమూతలాడుతూ గోడలకేసినపోస్టర్లు
నినాదాలైమోగినకదనరంగాన్ని
 
మళ్ళీ నీకళ్ళల్లో చూడాలి
ఇంటినిండా పరుచుకున్నవస్తువులే
అవసరమున్నా లేకున్నా కొన్న
ప్రపంచంలోని ఎన్ని వస్తువులో!
ఒక్కదానిలోనూ జీవకళకనిపించదే
ఒక్కరైనా కాసేపు మనసువిపిమాట్లాడరే
వాయిదాలముచ్చట్లు
ఆయుధాలుముచ్చట్లు
ఒక్కరైనా కాసేపు కళ్ళనైనా మరల్చరే
ఇడియట్ బాక్స్ కొకరు
 
ఆండ్రాయిడ్ పిక్స్ కొకరు
అంతబట్టని అంతరాంతర్జాలశోధన!
పొగగొట్టం కొట్టిన నామసిముఖాన్నిముద్దాడిన
ఆకుక్కపిల్లనువెతగ్గలిగే
నీసహాయపు జాడలు కోసమైనా నిన్ను చూడాలి
నలిగినహృదయాలాపాలవిలాపాలు
బూతులుగా మారినా,వాతలుగా మారినా
సహించి నన్నక్కున చేర్చుకొనే
 'అమ్మ'లాంటి నిన్ను మళ్ళీ చూడాలి!

-దార్ల వెంకటేశ్వరరావు, మొబైల్: 9182685231
(‘మనం’ దినపత్రిక, 31 జూలై 2018 లో ప్రచురితం)

08 మే, 2018

నువ్వూ...నేనూ...'మనం' ( మనం’ దినపత్రిక, 7 మే 2018 సౌజన్యంతో)


నువ్వూ...నేనూ...'మనం'

మనం...మళ్ళీ ఆ మనం...
ఆమనిగా మనమంతా కలిసినప్పుడు

అకస్మాత్తుగా కురిసిన చిరుజల్లుల్లో తడిసినట్లయ్యింది!
వాళ్ళెవరో ఫోజులు రాయుళ్ళు పోతున్నప్పుడు 
మనం వదిలిన వ్యంగ్య బాణాల దెబ్బలతో 
మూతులు ముడుచుకున్న వాళ్ళంతామనముందు నిలబడుతున్నప్పుడు 
మూకుమ్మడిగా మనం నవ్వుకున్ననవ్వుల సవ్వడేదో
మదిలో మెదులుతున్న చప్పుడు వినిపిస్తున్నట్లుంది!
ఆ చప్పుడులో పారిజాతాల్లానోపున్నమి చంద్రునిలానో
మహాసామ్రాజ్యాన్ని గెలిచిన విజేతలుగానో...ఎంతగా మురి‌సిపోలేదు!
జింక పిల్లల్లా ఎంతగా జడిసి పోలేదు!
ఇదేమిటీ...మనం ఇన్నేళ్ళ తర్వాత కలిసినా 
వెంటాడుతూ...వేడివేడి సెగలనేవో రువ్వుతూ...
కీలుగుర్రం మీద వస్తాడనుకున్నఆ యువరాజుగారి 
కలల దృశ్యాలేవో కళ్ళల్లో మౌనంగానే కదులుతున్న అలజడి...!
ఎదురుచూస్తూ కలవాలని తలచుకున్నా 
కలవడానికి వస్తుంటే మనసేదో తెలియని గుబుల మబ్బుల్తో
ఆ ఎగిసి వచ్చిన స్నేహకెరటంలో
తడవాలో, మునగాలో ఏమీ తెలియని మౌనం...!
ఆ సంభాషణల బంధాల్ని ఆ అనుబంధాల్ని ఏమని వర్ణించాలి?
జ్ఞాపకమెప్పుడూ ఒకవెంటాడే చల్లని కళ్ళ తడి!
జ్ఞాపకమెప్పుడూ మదిని పలకరించే పుష్ప పరిమళం!
జ్ఞాపకమెప్పుడూ గొంతువరకూ వచ్చినా 
తడబడుతూ వెలువడే పసిదాని బోసి నవ్వు!
అయినా మనం మళ్ళీ రావడమేంటిలే
కళ్ళముందు మన పిల్లల చేష్టల్లో నిత్యం ఆ మనమే కదా!
-దార్ల వెంకటేశ్వరరావు

చిరునామా: ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్
( మనం’ దినపత్రిక, 7 మే 2018 సౌజన్యంతో)

30 ఏప్రిల్, 2018

అమ్మచెట్టు ( బాల్యస్మృతులు)

నిన్న 29 ఏప్రిల్ 2018 ‘మనం’ పత్రిక వారు ఆదివారం అనుబంధం ‘మకుటం’లో నా అనుభవాలను ప్రచురించారు. దానితో పాటు అందమైన చిత్రాన్ని గీసారు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో కొన్ని కథలు రాసినా, మళ్ళీ ఆ రచనా ప్రక్రియను స్ఫర్శించలేదు. అంటే అలా రాయలేదు. ఇదిగో దీనితో మరలా ప్రవేశించాలనుకుంటున్నాను. అది ఒక ఉద్యేగంతో రాశాను. కేవలం ఒక పుట మాత్రమే ప్రచురిస్తారు. అందువల్ల ఆ పుటను నిర్వహించే ఎడిటర్ ఫోను చేశారు. ఎడిట్ చేసి పంపించమని. కానీ, దాన్ని మీరే చేస్తేబాగుంటుందన్నాను. దాన్ని నిన్న ప్రచురించారు. దాన్ని చదివి వందలాది మంది అభినందిస్తూ ఫోనులు చేశారు. ‘మనం’ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి సౌజన్యంతో నా రచనను, మూలాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాను.
మనం వారి ఆదివారం అనుబంధం ‘మకుటం’ (29 ఏప్రిల్ 2018) సౌజన్యంతో...


నారచన పూర్తి పాఠం:
అమ్మమ్మ ఊరిలో ‘అమ్మచెట్టు’
మా అమ్మమ్మ ఊరి పేరు వింటే నాకు ఒకకెరటమేదో మనసుని చల్లగా తాకినట్లనిపిస్తుంది. ఆ కెరటంపై అరటిబోదె, ఆ బోదెపై నేనూ కెరటాలతో సయ్యాటలాడుతున్నట్లనిపిస్తుంది.
ఇంటి చూరు ముందు నిలుచొని తడిసీ తడవని జల్లల్లో తడుస్తూ, వాననీటిలో కాగితప్పడవల్ని వదులుతున్నట్లనిపిస్తుంది. అమ్మమ్మ గారింటి వెనుకున్న ప్రశాంతమైన చెఱువు... ఆ నీటిపై చిల్లరపెంకుల్ని చిందులేయించిన జ్ఞాపకాలు కళ్ళల్లో మెరుస్తుంటాయి.
అమ్మమ్మగారి ఊళ్ళోని రామస్వామి తోటలో చిలుక్కొట్టిన జాంపండ్ల కోసం వెతుకుతుంటే సిగ్గుమొగ్గలయ్యే యువతులెవరో కేరింతలు కొడుతున్నట్లుంటుంది. కాకి ఎంగిలితో స్నేహితులమంతా పంచుకున్న జీళ్ల రుచి నోటిలో ఊరుతున్నట్లనిపిస్తుంది.
వచ్చీరాని సైకిల్ని వేగంగా తొక్కి రత్తాలత్తను గుద్దేసి అమ్మ కొంగు చాటున కోడిపిల్లలా భయం భయంగా దాక్కున్న దడేదో గుండెలో మెదులుతుంది.  జీడిమామిడి తోటలో దుమికినట్టు, ఏటిగట్టున కాల్వలో ఈతకొట్టినట్టవుతుంది.
 వేసవికాలంలో కాల్వలో దూకి కేకలేస్తూ స్నానం చేస్తున్నంత సంతోషంగా ఉంది – అమ్మమ్మ ఊరు గుర్తొస్తుంటే వరదలవుతున్న భావాలు, పొందికకానంటూ నురగలా ఎగిరిపడుతున్న అక్షరాలు...
            మా అమ్మమ్మ ఊరు తూర్పుగోదావరి జిల్లా, అందాల కోనసీమలోని కాట్రేనికోన. అది మండల కేంద్రం. ఎటు చూసినా ప్రకృతి పచ్చని చీరకట్టినట్టుంటుంది. రోడ్డుకిరువైపులా నిలబడి స్వాగతం పలుకుతున్నట్లు కొబ్బరిచెట్లు... దారిలో కొంచెం ఆగితే తినడానికేమైనా ఇచ్చే బంధువుల్లా  పిలిచే తోటల్లోని అరటి, బొప్పాయి, జామ, సపోటా, పనస, మామిడి...రకరకాల ఫలవృక్షాలు... ఎటుచూసినా ప్రవహించేకాల్వలు.
కొన్ని ఊళ్ళలో పెద్దపెద్ద చెరువులు. ఇరుకిరుకుగా కట్టుకునే ఇళ్ళు. ఆ ఇళ్ళ దగ్గరా కాస్తకూడా చోటు లేకుండా నాటిన మొక్కలో, కూరగాయలో పెంచుకోవాలనుకునే వాళ్ళ కుతూహలం... . ఆ ఇళ్ళపక్కనే పశువుల పాకలు, కోళ్ళు ఉండడానికి గంపలు, పెట్టెలు... వాటితో ముచ్చట్లాడే పక్షల కిలకిలారావాలు... అమ్మమ్మ ఊరు నాకొక నిత్యవసంతాన్నిచ్చే చక్కని అనుభూతి...
మా ఊరు చెయ్యేరు అగ్రహారంలో ఐదోతరగతి పూర్తవగానే,  తర్వాత చదువుకోవడానికి చెయ్యేరులో ఉన్న ఉన్నత పాఠశాలలో సీటు దొరకలేదు. దొరకలేదనే కంటే, నాకు సీటు దొరకనివ్వకుండా చేశారని తర్వాత తెలిసింది. మా ఊరుకి చుట్టూ ఒక అయిదారుకిలోమీటర్ల దూరంలో మూడు హైస్కూల్స్ ఉన్నాయి. ముమ్మిడివరం, భీమనపల్లి..మరొకటి కాట్రేనికోన.  
మా ఊరుకి  కాట్రేనికోన ఆరు కిలోమీటర్లు. అది మా అమ్మగారి పుట్టినూరు. అక్కడే అమ్మమ్మవాళ్ళున్నారు.అందువల్ల అక్కడున్న ఉన్నతపాఠశాలలో చేర్చారు. అందువల్ల వారానికి రెండుమూడుసార్లు అమ్మమ్మగారింటిలోనే ఉండేవాణ్ణి.
ఆ పాఠశాల పేరు శ్రీవరాహబొట్ల నారాయణమూర్తి ప్రాథమికోన్నత పాఠశాల. ఒక బ్రాహ్మణాయన విరాళం ఇవ్వగా కట్టిన పాఠశాల. అది చాలా పెద్దది. ఆ వయసులో ఆ హైస్కూల్ ని చూసి ఒకింత భయం, ఒకింత సంతోషం కలబోసిన రెండుకళ్ళల్లో అమరిపోయాయి. మా ఊళ్ళోకంటే పెద్ద స్కూల్లో చదువబోతున్నననే చిన్నపాటి గర్వంగా కూడా ఫీలయ్యాను. రెండు మూడు వారాలు భయం ఉండేది.
 తరగతి గదిలో శ్రీకంఠం లక్ష్మణరావుగారు తెలుగు పాఠాలు చెప్పేవారు. పద్యాలు రాగయుక్తంగా పాడేవారు. అప్పుడప్పుడూ పిల్లల్ని కూడా చదవమనేవారు.  వెంకటరెడ్డిగారనే ఒక సోషల్ టీచర్ ఉండేవారు. ఆయన బోర్డుపై రాయించేవారు. ఈ రెండు పన్లూ భయపడకుండా చెయ్యడానికి నేనూ లేచేవాణ్ణి. గట్టిగా రాగం తీస్తూ చదివేవాణ్ణి. కొన్నాళ్ళ తర్వాత క్లాసులో చదవమన్నప్పుడల్లా ‘‘బూరా...రారా...చదవరా..’’ అనేవారు. క్లాసంతా నవ్వులు...నాలో మాత్రం విజయదరహాసంతో కూడిన ముసిముసినవ్వులు కురిసేవి...
మా ఊరి నుండి రోజూ నడిచి వస్తుంటే, పెనుమల్లె నుండి సైకిల్ పై వచ్చేవారు. ఆయనతో పాటు ఆతుకూరు లక్ష్మణరావుగారనే ఒక సోషల్ మాస్టారు ఉండేవారు. రోజువారీ వార్తల్ని బోర్డుమీద రాయించేవారు. అప్పుడే లైబ్రరీకి వెళ్ళడం బాగా అలవాటుగా మారింది. ఆ విధంగా పత్రికల్ని చదవించే అలవాటుతో పాటు, లోకజ్ఞానాన్ని పెంపొందించేవారు. ఆయన చెయ్యేరు గున్నేపల్లి నుండి సైకిల్ పై వచ్చేవారు. ఆయనకీ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయితో పాటు వీళ్ళు ఒక్కొక్కసారి నన్ను సైకిల్ పై ఎక్కించుకునేవారు.  
పితాని సత్యనారాయణగారనే ఒక సైన్స్ మాస్టారు ఉండేవారు.  పాఠం చెప్తే మళ్ళీ చదవనవసరం లేకుండా అరటిపండు ఒలిచినట్లు చెప్పేవారు. పోటీలు పెట్టి, సొంత డబ్బుల్తో నిఘంటువుల్ని బహుమతిగా ఇచ్చేవారు. ఒకసారి నేనూ గెలుచుకున్నాను. ఆ నిఘంటువునొకరు నాదగ్గర నుండి తీసుకున్నారు. అది నా దగ్గర లేదనే విచారం నన్ను వెంటాడుతుంటుంది.
అందువల్ల తరగతిలో తొందరగానే నాకెంతోమంది స్నేహితులు ఏర్పడ్డారు. నాకు తొలిసారి పరిచయమైన మిత్రుడు నారాయణమూర్తి. వాళ్ళ తాతగారే ఈ హైస్కూల్ ని కట్టించారు.  తర్వాత వర్మ, అప్పాజీ, బాబీస్టెవార్డ్...ఎంతోమంది మిత్రులయ్యారు. వాళ్ళతో తోటల్లో తిరిగిన రోజులు గుర్తుకొస్తున్నాయి. అదే ఊరైనా మధ్యాహ్నం భోజనం తెచ్చుకుని, తోటల్లో చెట్ల కొమ్మల మీద కూర్చొని తిన్న కోతి చేష్టలు గుర్తుకొస్తున్నాయి.
అమ్మమ్మ దగ్గరే తన నలుగురు కూతుళ్ళలో చిన్నామే లక్ష్మి పిన్ని ఉండేది.  నేటికీ మా పిన్నివాళ్ళ కుటుంబమే ఉన్నారు. పిన్నికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు. వాడూ నేనూ మా పొలంలోకి వెళ్ళి కొబ్బరిబొండాలు తాగేవాళ్ళం.
పొలంలో కందికాయలు కోసుకొని కాల్చుకొని తినేవాళ్ళం. పండిన గుమ్మడికాయల్లో గుజ్జుని తీసేసి, దానిలో బెల్లం పెట్టి తంపడ (కాల్చేపద్ధతి) వేసుకుని తింటే, ఆ రుచే వేరు. గుమ్మడికాయ పనసతొనల్లా విడిపోయి తియ్యగా ఉంటుంది.
ఒక్కోరోజు పొలం దగ్గరే మా పిన్ని కొడుకు దేవదానం నేనూ ధాన్యం రాసులు కాపలా కాస్తూ రాత్రులు మా తాత వచ్చేలోగానే నిద్రపోయేవాళ్లం. పైన వెన్నెల, దూరంగా చుక్కల్లా కదిలే విమానాల్ని చూస్తూ, రకరకాల కథల్ని చెప్పుకుంటూ కునుకువేసేసేవాళ్లం. ‘‘నేనొచ్చిందే తెలీదు మీకు...మీరేమి దొంగల్ని పట్టుకుంటార్రా?’’ అనేవాడు మా తాత ముసిముసి నవ్వులతో తెల్లారిన తర్వాత. ఏమి చెప్పాలో తెలియక తెల్లబోయిన మొహాలు పెట్టుకునేవాళ్ళం. మెల్లగా జారుకునేవాళ్ళం. 
అమ్మమ్మ ఎంతో అమాయకురాలు. కానీ, తన దగ్గరే ఉన్న పిన్ని పిల్లలంటే నాకంటే కొంచెం ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపించేది. ఈ ఊళ్ళో శనివారం పెద్దసంత జరుగుతుంది. నేను అక్కడే చదవడం వల్ల ఆ సంతను చూసేవాణ్ణి. ఆ సంతపక్కనే రోడ్డుకానుకొని ఒక లైబ్రరీ ఉండేది. అది నాకు ప్రియనేస్తమయ్యేది.  
అమ్మమ్మ సంత నుండి ఒకరోజు ఏవో బాగా తియ్యగా ఉండే మామిడి రసాలపండ్లు తెచ్చింది. అమ్మమ్మకి అప్పటికే కొంచెం కళ్ళు మసకలొచ్చేశాయి. ఆ మామిడి పండ్లు చూసి మాట్లాడకుండా అమ్మమ్మ దగ్గర నిలబడ్డాను. గబగబా ఒక మంచి పండు తీసిచ్చి, ‘‘తొందరగా తినేయ్... వెంకటేశ్వరరావు వచ్చేస్తాడు...’’ అంది. నాకు నవ్వొచ్చింది. అమ్మమ్మ తన దగ్గరుండేవాళ్ళపట్ల చూపే ప్రత్యేకతకు సంతోషమనిపించినా, ఎక్కడో మనసులో కొంచెం బాధ కూడా అనిపించినట్లయ్యింది.  ‘‘నేనే మామ్మా...’’ (అమ్మమ్మని ‘మామ్మా’ అనిపిలుస్తాం) అన్నాను ఎలా స్పందిస్తుందో చూస్తూ. గొంతు గుర్తు పట్టేసింది. ఒక్కసారిగా తానేదో తప్పేదో చేసినట్లు ఉలిక్కిపడింది. హడావిడి పడిపోయింది. ‘‘నేను వాడికిస్తానులే...కాకపోతే కొంచెం తినేసిస్తా...’’ అంటూ ఆటపట్టించాను.
 నాకిప్పటికీ అమ్మమ్మగారి ఊరన్నా, వెళ్ళినా నాకు ఆ సంఘటనే గుర్తొస్తుంది. అమ్మమ్మ వేడివేడిగా వండిపెట్టిన మినపరొట్టెల కమ్మదనం నోటిలో రుచులూరిస్తుంది.
మా అమ్మంటే అమ్మమ్మకి చాలా ఇష్ణం. ఆ ఇంటి దగ్గర నాలుగువైపులా నాలుగు, ఇంటివెనుక కొన్ని కొబ్బరి చెట్లున్నాయి. ఆ వెనుకనే  కొంచెం దూరంగా ఒక చింతచెట్టు ఉండేవది. అందులో ఇంటి ముందున్న ఒక కొబ్బరిచెట్టు మాత్రం ‘‘మా నాగమ్మదే. దీన్నెవరూ కాలుతో తన్నొద్దు’’ అనేది. ఆ మాటన్నప్పుడల్లా మా అమ్మమ్మ అనురాగం, ఆ ప్రేమలను అంచెనా కట్టలేమనిపించేది.
 ఇప్పుడు అమ్మమ్మలేదు. ఇప్పుడు తాతయ్య లేడు. ఇప్పుడు పిన్ని వాళ్ళ పెద్దమ్మాయి లేదు. కానీ... వాళ్ళ మమతానురాగాలు, ప్రేమానుబంధాలు నాకు అలాగే ఉన్నాయి. ఆ ఊరివెళితే ‘అమ్మచెట్టు’ చూడాలనిపిస్తుంది. అమ్మచెట్టుతో ముడిపడిన అమ్మమ్మని చూడాలనిపిస్తుంది.  ఆ ఊరితో, ఆ ఇంటితో ముడిపడిన తియ్యని నా బాల్య జ్ఞాపకాలున్నాయి. ఆ ఇంటి వెనుకున్న చింతచెట్టు చిగురుతో అమ్మమ్మ వండిపెట్టిన కమ్మని రుచులు గుర్తుకొస్తుంటాయి.
-ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
ఫ్రొఫెసర్, తెలుగుశాఖ, డిప్యూటి డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్, యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్, హైదరాబాదు
9182685231










07 జనవరి, 2018

కూల్ ఇన్ ఇండియా!


కూల్ ఇన్ ఇండియా!
సంకనెక్కిన చలేమిటిలా  
సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా
 
దేహమంతా మెల్లమెల్గగా ఆక్రమిస్తూ
 
దేశమంతా కొరుక్కొంటూ ఉరకలేస్తోందిలా
 
నరనరాల్లో నెమ్మనెమ్మదిగా దూరిపోతూ
 
జనాల్నంతా
  మత్తునేదో జల్లుకుంటూ
దుప్పట్లేదో ముసుగులేస్తూ
 
నన్ను మంచాన్నే బిగించేస్తుందేమిటిలా!

సంకనెక్కిన చలేమిటిలా
సంపుకుంటూ నన్ను నంజుకుంటోందిలా
 
కళ్ళెదుటే దృశ్యాలేవో కదులుతున్ళా
ఇంటిపక్కనే కేకలేవో వినపడుతున్నా
 
రంగురంగుల టీవీల్లో స్ఫష్టంగా చూద్దామనో
హోమ్ థియేటర్ బాక్సుల్లో విస్ఫష్టంగా విందామనో
అనిపిస్తుందేమిటిలా! 
మనం కన్నవే, మనం విన్నవే
వింతవింతగా మీడిమాలో
మెదులుతున్నాయ్యేమిటిలా?

సంకనెక్కిన చలిప్పుడు
మునివేళ్ళ స్ఫర్శానుబంధమై
నెచ్చెలి కంటే నాకునులి వెచ్చనయ్యింది
 
నెట్టింటలో పొట్టి పలుకు చాలు
బతుకంతా ప్లాస్టిక్ మనీ నేస్తమయ్యింది !

నాది తెలిసినట్లుండే అతి తెలివిడి తనమో
 
నాది గడ్డ కట్టిన ఒంటరి కలివిడి తనమో
నాది బలిసిన బద్దకమో
 
నాది తలకెక్కిన మధమో
 
నా దేహమంతా సోకిన జ్వరమో
నాకప్పుడేమీ తెలియలేదు
 !
జేబుల్నుండి
  విత్తులన్నీ 
చిట్టెలుకలేవో కొట్టేస్తున్నాయని
పొట్టి పలుకులు మొత్తుకున్నా మిన్నకున్నాను
నన్ను ఆకాశాన్నందుకునే
 
నిగ్రహానికే విగ్రహమేదో చేశారనుకున్నాను


నాకింతవరకూ రక్షణ కవచమన్న 
బ్యాంకుల్లోని దుప్పట్లన్నీ
 
కొరికేసే పందికొక్కుల చుట్టాలొస్తున్నారు
 
నాకిప్పుడిప్పడే
వెన్నులోవణుకు బెణుకులేవో పుట్టకొస్తున్నాయి
నాకిప్పుడిప్పడే
వైట్ హౌస్ హారనేదో మెల్లమెల్లగా వినిపిస్తోంది!
నాకిప్పుడిప్పడే
మీడియా చూపని బొమ్మలేవో
 
కళ్ళెదుటే బెదురుబెదురుగా కదులుతున్నాయి
నాకిప్పుడిప్పడే
పెయిడ్ కాని అక్షరమేదో
నేలకింద పిడికిళ్ళై పలకరిస్తోంది
 
సంకనెక్కిన చలి వదిలే దాకా
ఋతువులెప్పుడు మారతాయోనని
 
ఎదురుచూస్తూ
 
సూర్యకిరణం తాకుకుంటూ
 
అంబేడ్కర్ - మార్క్స్ మార్గ్ వరకూ
 
అరిస్టాటిల్ సైకిలెక్కి పిక్కలరిగేలా తొక్కవలసిందే
!
అంతవరకూ దేశమంతా చుట్టుతున్న
 
దేహమంతా పిండి పిండి చేస్తూ ఉన్నా
  
సంకనెక్కిన చలికి
నువ్వూ నేనూ వంగి వంగి మొక్కవలసిందే!
-దార్ల వెంకటేశ్వరరావు
    27.12.2017

మొబైల్: 9182685231

06 జనవరి, 2018

‘ఇవాంకా’ నువ్వేదో వంకతో మళ్ళీ మళ్ళీ రావా!




మొన్న మావాళ్లు పొందిన క్లింటన్ మృదుస్ఫర్శనింకా
మరిచిపోలేకపోకుండానే ‘ఇవాంకా’ నువ్వొస్తున్నావు 
నువ్వేమి తెస్తావో మాకు తెలీదు
 
నువ్వేమిస్తావో మాకు తెలీదు
నగరమిప్పుడు ఎగిసిపడే ఆనంద కెరటమవుతోంది
నగరమిప్పుడు వసంతకాల పూదోటవుతోంది
నగరమంతా రెడ్ కార్పెట్ల స్వాగతమవుతోంది
మూసీ పండినంత సంబరంగా
 
అధికారుల ప్రేమంతా బిచ్చగాళ్ళమీదే ప్రవహిస్తోంది
మాకిప్పుడు అద్దాలవసరంలేదేమో
హైదరాబాదు రోడ్లమీదే ముఖాల్ని చూసుకొనేలామారిపోతున్నాయి.
ఓట్లేయించుకున్న మా ప్రజాప్రతినిధులకెన్ని విన్నపాలు చేసుకున్నా
ఒక్కగొయ్యి కూడా పూడ్చలేనివాళ్ళంతా
 అన్నీ అలికిముగ్గులేస్తుంటే
సంక్రాంతి ముగ్గులే సిన్నబోతున్నాయి!
అడక్కుండానే నిధులన్నో
 వరదలకు కొట్టుకొచ్చే చేపలవుతున్నాయి
మళ్ళీ నువ్వెన్నాళ్ళకొస్తావో ఇవాంకా 
మళ్ళీ మా గల్లీ గల్లీకి మూన్నెల్లకోసారైనా
ఏదోవంకతో ముచ్చటగా రావాలనిపిస్తోంది
‘‘ఇవాంకాలు రావాలి వానదేవుడా
మాబతుకంతా పండాలి వానదేవుడా!’’
ఇలాంటి పాటలెన్నో పాడుకుందాం
అమెరికా ఆటలెన్నో ఆడుకుందాం!
ఇవాంకా! నీకు తెలుసా నీభద్రత కోసమే మావాళ్లు
ఆకాశంలో దాగిన మబ్బుల్ని కూడా ఎలా గాలిస్తున్నారో !
ఇవాంకా! నీకు తెలుసా నీభద్రతకోసమే
 మా వాళ్ళు
అణువణువునా ఎలా నైపుణ్యంతో శోధిస్తున్నారో!
కుక్కల్నీ, కోడి పిల్లల్నీ కూడా సీసీ కెమారాలెంత అందంగా చిత్రిస్తున్నాయో!
గోకుల్ చాట్ సెంటర్లో,
 నెక్లెస్ రోడ్ కూడళ్ళలో
చార్మినార్ సాక్షి గా పాత బస్తీల్లోనే కాదు దేశమంతా నువ్వే
ఏ ఛానెల్లో చూసినా నీ బొమ్మలే
ఏ పత్రికలు రాసినా నీ రాతలే ఎక్కడ చూసినా నీ ముచ్చట్లే!
నీతో పాటే నువ్వు తినేవన్నీ వండించుకున్న రుచుల ఘుమఘుమలు 
మా ఫలక్ నామా ప్యాలస్ లో నూటొక్కరకాలవంటగాళ్ళకే తెలీదు!
నూలు పోగు తేడారాకుండా కళ్ళకు బూతద్దాలు పెట్టుకొని మరీ
పొదుగుతున్న పోచంపల్లి పట్టుచీరతో
మాతెలుగుతనాన్ని నీలో చూడాలని
 కళ్ళెంతగా ఆశపడుతున్నాయో!
లాడ్ బజార్లో గాజులన్నీ నీకోసమే
  మెరుపులకే మెరుపులద్దుకొన్న 
కొత్త పెళ్లి కూతుళ్ళలా సిద్ధమవుతున్నాయి
నీమేను మెరుపులతో పోటీపడుతూ నీతో బతకమ్మనాడాలని
తంగెడు పూలన్నీ తొంగి తొంగి చూస్తున్నాయి
మళ్ళీ నువ్వెన్నాళ్ళకొస్తావో ఇవాంకా 
మళ్ళీ మా గల్లీ గల్లీకి మూన్నెల్లకోసారైనా
ఏదోవంకతో ముచ్చటగా రావాలనిపిస్తోంది
‘‘ఇవాంకాలు రావాలి వానదేవుడా
మాబతుకంతా పండాలి వానదేవుడా!’’
ఇలాంటి పాటలెన్నో పాడుకుందాం
అమెరికా ఆటలెన్నో ఆడుకుందాం!
                                                     -దార్ల వెంకటేశ్వరరావు
                                                          24 నవంబర్ 2017

( అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ నవంబర్ 28, 29 తేదీల్లో హైదరాబాదులో జరిగే అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల శిఖరాగ్ర సమావేశం లో పాల్గొనడానికి వస్తున్న సందర్భంలో జరుగుతున్న ఏర్పాట్లకు స్పందించి...)