"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., Ph.D., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. TL 801 Research Methodology ఉదయం11.00 నుండి12.00 గంటల వరకు, TL-426: Indian Literature క్లాసులు మధ్యాహ్నం 2.00 గంటల నుండి 3.00 గంటల వరకు జరుగుతాయి.

నా డైరీలో ఓ రోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా డైరీలో ఓ రోజు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31 అక్టోబర్, 2026

నాలో మిగిలిన నేను (17. దీపం) దీర్ఘ కావ్యం

నాలో మిగిలిన నేను

(దీర్ఘ కావ్యం)

17. దీపం



సాయంత్రం

ఒక దీపం వెలిగిస్తాను.

పగలంతా

బయటి ప్రపంచంతో ప్రయాణించిన చూపు

నెమ్మదిగా ఇంటి వైపు మళ్లుతుంది.

సూర్యుడు

 తన వెలుగును ఉపసంహరించుకుంటున్న వేళ

 చీకటి

 గది మూలల్లో

 తన ఉనికిని విస్తరించుకుంటుంది.

ఆ సమయంలో

 ఒక చిన్న దీపం వెలిగించడం

 నాకు ఒక అలవాటు.

ఆ జ్యోతి గదిని పూర్తిగా నింపదు.

గోడల మీదున్నప్రతి మరకనూ చెరపదు.

మూలల్లో దాగిన

ప్రతి చీకటినీ తరిమివేయదు.

తనకు సరిపడినంత

వెలుగును మాత్రమేపంచుతుంది.

అయినా

 ఆ వెలుగులో

 గదికి ఒక రూపం వస్తుంది.

ఎప్పటినుంచో అక్కడే ఉన్న

 వస్తువులుకొత్తగా కనిపిస్తాయి.

బల్ల మీద పుస్తకం,

 పుస్తకం పక్కన కళ్లద్దాలు,

 గోడకు ఆనించిన పాత చిత్రం,

 కిటికీ దగ్గర కదులుతున్న తెర

 అన్నీ

 ఆ చిన్న వెలుగులో

 తమ ఉనికిని గుర్తుచేస్తాయి.

కొన్నిసార్లు

 వెలుగు వస్తువులను చూపిస్తుంది.

మరికొన్నిసార్లు

 వస్తువుల మధ్య

 మనకు కనిపించని ఖాళీలను

 పరిచయం చేస్తుంది.

ఆ వెలుగులో

 గోడలు కొంచెం దగ్గరవుతాయి.

నీడలు

 నెమ్మదిగా

 తమ స్థానాలను మార్చుకుంటాయి.

కదలని వస్తువులకు కూడా

 కదలిక ఉన్నట్టనిపిస్తుంది.

దీపం కదలదు.

దాని జ్యోతి

 గాలి స్పర్శకు కొద్దిగా వంగుతుంది.

ఆ వంగడంలోనూ

 నిలబడాలనే ఒక ప్రయత్నం కనిపిస్తుంది.

కిటికీ అద్దంలో

 దీపం మరోసారి వెలుగుతుంది.

గదిలో ఒక దీపం

అద్దంలో మరొక దీపం

ఒకటి నా ముందుంది

మరొకటి నా చూపులో ఉంది

ఏది నిజమైన జ్యోతి?

తెలుసుకోవాలనే ఆతురం నాకు లేదు.

రెండూ వెలుగుతున్నాయి

చాలు

మనిషి జీవితంలోనూ

 ఇలాంటి ప్రతిబింబాలు ఎన్నో!

మన గురించి

మనకు తెలిసిన ఒక రూపం ఉంటుంది

ఇతరుల జ్ఞాపకాల్లో

మిగిలిన మరో రూపం ఉంటుంది

మన మాటల్లో

ఒక మనిషి కనిపిస్తాడు

మన చేతల్లో

మరొక మనిషి బయటపడతాడు

కాలం గడిచేకొద్దీ

ఈ రూపాలన్నీ

ఒకదానితో ఒకటి సంభాషిస్తాయి

అద్దంలో కనిపించే దీపం

అద్దం నుంచి బయటికి రాలేదు

అయినా

అది వెలుగులో భాగమైంది

బహుశా

మన జీవితాల్లోకి వచ్చిన కొందరు కూడా

 ఇలాగే ఉంటారేమో!

వాళ్లు మనతోనే ఉండరు

వాళ్ల అడుగులు

మన దారిలోనూ కొనసాగవు

వాళ్ల మాటలు

 ప్రతిరోజూ మన చెవులకూ చేరవు

అయినా

 వాళ్లు మనలో వెలిగించిన

 ఒక చిన్న ఆలోచన

 మరో సందర్భంలో

 మనకో దారి చూపిస్తుంది

ఒక ఉపాధ్యాయుడి మాట

 ఏళ్ల తర్వాత

 ఒక విద్యార్థి నిర్ణయంలో వెలుగుతుంది

ఒక తల్లి చూపు

 దూరమైన కాలంలోనూ

 బిడ్డ అడుగులకు ధైర్యమిస్తుంది

ఒక స్నేహితుడి ఆప్యాయత

 ఒంటరి సాయంత్రంలో

 మనసుకు తోడవుతుంది

ఒక పుస్తకంలోని వాక్యం

 మనకు తెలియని జీవితాన్ని

 చూడగలిగే చూపునిస్తుంది

ఎవరు ఎంతకాలం

 మనతో ఉన్నారన్నదానికంటే

 వాళ్లు మనలో ఏ వెలుగు మిగిల్చారన్నదే

 కొన్నిసార్లు ముఖ్యమవుతుంది

దీపం ఎవరినీ ఆపదు.

దాని దగ్గరకు వచ్చినవారిని

 తన దగ్గరే ఉండమని అడగదు

దాని వెలుగులో

 ఎవరైనా చదువుకోవచ్చు

ఎవరైనా ఉత్తరం రాసుకోవచ్చు

ఎవరైనా తమ పనిని కొనసాగించవచ్చు

మరికొందరు

ఏ పనీ చేయకుండా

 దాని ముందు కూర్చోవచ్చు

వెలుగు

 ఎవరి అవసరాన్ని బట్టి

 తన స్వభావాన్ని మార్చుకోదు

ఒక చిన్న పురుగు

ఆ వెలుగు చుట్టూచాలాసేపు తిరుగుతోంది

దానికి

దీపం గురించి ఏమీ తెలియదు

నూనె గురించి తెలియదు

వత్తి గురించి తెలియదు

మంట ఎలా పుడుతుందో

కూడా తెలియకపోవచ్చు

దానికి వెలుగు చాలు

ఆ చిన్న జీవి

తనకు కనిపించిన వెలుగునే

తన ప్రపంచంగా భావిస్తోంది

మనుషుల జీవితాల్లోనూ

 ఇలాంటి ఆకర్షణలు ఉంటాయి

ఎక్కడో కనిపించిన

 ఒక ఆశ వైపు పరుగెడతాం

ఒక వ్యక్తి మాటల్లో

 మన జీవితానికి సమాధానం వెతుకుతాం

ఒక స్థానాన్ని,

 ఒక గుర్తింపును,

 ఒక విజయాన్ని

 వెలుగుగా భావిస్తాం

దాని చుట్టూ

 ఎన్నో ఆశలతో తిరుగుతాం

కొంతకాలానికి

 ఆ వెలుగు వెనుక ఉన్న

 నూనెను, వత్తిని, మంటను

 అర్థం చేసుకునే సమయం వస్తుంది

అప్పుడు

 వెలుగు విలువ

 మరింత స్పష్టమవుతుంది

నా జీవితంలో

 ఎన్నో ముఖాలు అలానే వచ్చాయి

కొన్ని

 నా బాల్యపు చీకటిలో

 దారి చూపించాయి

కొన్ని

 చదువు ప్రయాణంలో

 అక్షరాల దీపాలయ్యాయి

కొన్ని

 అవమానాల మధ్య

 ఆత్మగౌరవాన్ని నిలబెట్టాయి

మరికొన్ని

 నా ఆలోచనలకు

 కొత్త కిటికీలు తెరిచాయి

ఒకరి దగ్గర

 ఒక మాట నేర్చుకున్నాను

మరొకరి దగ్గర

 ఒక అనుభవాన్ని అర్థం చేసుకున్నాను

ఇంకొకరి జీవితాన్ని చూసి

 మనిషి ఎదుర్కొనే కష్టాల లోతును

 తెలుసుకున్నాను

కొంతమంది

 నాతో కొంతదూరం నడిచారు

కొంతమంది

 దారి మధ్యలోనే

 తమ ప్రయాణాన్ని మార్చుకున్నారు

మరికొందరు

 కాలం దూరం చేసినా

 జ్ఞాపకాలలో వెలుగుతూనే ఉన్నారు

వాళ్లందరినీ

 ఒకే వరుసలో నిలబెట్టలేను

ప్రతి ఒక్కరూ

 నా జీవితంలో

 ఒక ప్రత్యేకమైన వెలుగును నింపారు

కొన్ని వెలుగులు

 నాకు ధైర్యాన్ని ఇచ్చాయి

కొన్ని

 నా లోపాలను చూపించాయి

కొన్ని

 నాలోని ప్రశ్నలను మేల్కొలిపాయి.మ

కొన్ని

 నేను నడిచిన దారిని

 మళ్లీ పరిశీలించుకునేలా చేశాయి

వెలుగు అంటే

 ఎప్పుడూ ప్రశంసే కావాల్సిన అవసరం లేదు

మన తప్పును చూపించే

 నిజాయితీ కూడా వెలుగే

మనల్ని ప్రశ్నించే

 ఒక స్నేహితుడి మాట కూడా వెలుగే

మన కళ్లకు కనిపించని

 సమాజపు చీకటిని చూపించే

 ఒక పుస్తకం కూడా వెలుగే

దీపం ముందు

 నా అరచేతిని చాచాను

ఆ వెలుగుచర్మాన్ని తాకింది

వేడిచర్మానికే తగిలింది

ప్రశాంతతనాలోకి వచ్చి కూర్చుంది

అరచేతి గీతల మధ్య

 వెలుగు చిన్న చిన్న మడతలుగా కనిపించింది

చేతిని కొద్దిగా కదిపితే నీడ కూడా కదిలింది

నా చేతి ఆకారం

 గోడ మీద పెద్దదిగా పడింది

నా అరచేతి చిన్నదే

దాని నీడ మాత్రం

 గోడంతా విస్తరించింది

మనిషి జీవితం కూడా

 కొన్నిసార్లు ఇలాగే ఉంటుంది

మన ఉనికి చిన్నదిగా అనిపించినా

 మన చర్యల ప్రభావం

 మనకు తెలియని దూరాల వరకువిస్తరిస్తుంది

ఒక మంచి పని

 మరో మనిషిలో

 మరో మంచి పనికి కారణమవుతుంది

ఒక ఆలోచన

 మరో ఆలోచనకు దారి తీస్తుంది

ఒక అక్షరం

 చదివిన మనిషి జీవితంలో

 కొత్త వెలుగును రగిలిస్తుంది

మన చేతిలో ఉన్నది

 ఒక చిన్న దీపం మాత్రమే కావచ్చు

ఆ వెలుగు చేరే ప్రదేశం

 మన అంచనాలకు మించి ఉండవచ్చు

దీపం వెలగడానికినూనె కావాలి

వత్తి కావాలి

మంట కావాలి

వాటిలో ఏ ఒక్కటి

 తనంతట తానుగా

 పూర్తి వెలుగును ఇవ్వలేదు

అన్నీ కలిసినప్పుడు

 జ్యోతి రూపం ఏర్పడుతుంది

మనిషి ఎదుగుదలలోనూ

 ఎన్నో అనుభవాలు కలుస్తాయి

కుటుంబం ఇచ్చిన పునాది,

 సమాజం నేర్పిన పాఠాలు,

 విద్య అందించిన చూపు,

 పుస్తకాలు విస్తరించిన ఆలోచన,

 పోరాటం పెంచిన ధైర్యం

 ఇవన్నీ కలిసినప్పుడు

 ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది

ఆ వ్యక్తిత్వం

 తనకోసమే వెలిగితే

 దాని వెలుగు చిన్న పరిధిలోనే ఉంటుంది

మరో మనిషి జీవితాన్ని

 కొంచెమైనా వెలిగించగలిగితే

 దాని ప్రయాణం విస్తరిస్తుంది

ఒక దీపం నుంచి

 మరో దీపాన్ని వెలిగించవచ్చు

మొదటి దీపం వెలుగు

 అందులోనే తగ్గిపోదు

మరో జ్యోతి పుట్టినప్పుడు

 చీకటిలో వెలుగు పెరుగుతుంది

జ్ఞానం కూడా

 పంచినకొద్దీ విస్తరిస్తుంది

అనుభవం

 చెప్పినకొద్దీ మరొకరికి ఉపయోగపడుతుంది

ఆత్మగౌరవం

 మరో మనిషిలోనూ

 తలెత్తే ధైర్యాన్ని కలిగిస్తుంది

ఒకరి వెలుగు

 మరొకరి వెలుగును

 తగ్గించాల్సిన అవసరం లేదు

దీపం ముందు

 కొంతసేపు కూర్చున్నాను

బయట

 చీకటి మరింత గాఢమైంది

గదిలో

 దీపం వెలుగు

 తన పరిధిని కొనసాగిస్తోంది

చీకటి కూడా

 తన స్థానంలోనే ఉంది

రెండింటి మధ్య

 నేను నిశ్శబ్దంగా కూర్చున్నాను

చీకటిని చూస్తే

 నా జీవితంలోని కొన్ని ఖాళీలు గుర్తొస్తాయి

వెలుగును చూస్తే

 ఆ ఖాళీల మధ్య

 నేను సంపాదించుకున్న అనుభవాలు కనిపిస్తాయి

జీవితమంతా

 వెలుగుతోనే నిండిపోదు

చీకటి కూడా

 మన ప్రయాణంలో భాగమే

ఏకాంతం

 మనలోని స్వరాన్ని వినిపిస్తుంది

మౌనం

 మాటల వెనుక ఉన్న భావాన్ని పరిచయం చేస్తుంది

వెలుగు

 మన ముందు ఉన్న దారిని చూపిస్తుంది

చీకటి

 మనలో దాచుకున్న భయాలను

 మనకు పరిచయం చేస్తుంది

ఈ రెండింటి మధ్య

 మనిషి తనను తాను

 నిర్మించుకుంటూ ఉంటాడు

దీపం

 నెమ్మదిగా కరిగిపోతోంది

దాని కిందనూనె తగ్గుతోంది

వత్తి

 కొంచెం కొంచెంగామంటలో కలుస్తోంది

జ్యోతి మాత్రంఇంకా నిలబడి ఉంది

దీపం తనను తాను ఖర్చు చేసుకుంటూ

 వెలుగును పంచుతోంది

ఆ దృశ్యం

 నాకు ఎన్నో జీవితాలను గుర్తుచేస్తుంది

తమ శ్రమను

 ఇతరుల ఎదుగుదలకు అందించిన మనుషులు

తమ జీవితకాలాన్ని

 విద్యార్థుల భవిష్యత్తుకు వెచ్చించిన ఉపాధ్యాయులు

తమ ఆకలిని పక్కనపెట్టి

 పిల్లల ఆకలి తీర్చిన తల్లిదండ్రులు

తమకు దక్కని అవకాశాలను

 తరువాతి తరాలకు అందించేందుకు

 పోరాడిన తరాలు

వాళ్ల జీవితాల్లో

 ఎన్ని వెలుగులు పుట్టాయో

 వాళ్లకు కూడా పూర్తిగా తెలియకపోవచ్చు

కొన్ని త్యాగాలకువెంటనే గుర్తింపు రాదు

కొన్ని సేవలకు చప్పట్లు వినిపించవు

కొన్ని జీవితాలు

 తమ ఉనికిని ప్రకటించుకోకుండానే

 ఎంతోమందికి దారి చూపిస్తాయి

అలాంటి మనుషుల్ని తలుచుకున్నప్పుడు

 దీపం ముందు నా తల సహజంగా వంగుతుంది

వెలుగు విలువ

 దాని ప్రకాశంలో మాత్రమే ఉండదు

దాని వెనుక ఉన్నశ్రమలోనూ ఉంటుంది

దాని కోసం కరిగిననూనెలోనూ ఉంటుంది

దాన్ని వెలిగించిన

 చేతుల ఆప్యాయతలోనూ ఉంటుంది

ఈ మధ్య

 ఆ జ్యోతిని ఎక్కువగా చూడడం లేదు

దాని కాంతి

 గదిలో ఎక్కడ పడుతోందోలెక్కించడం లేదు

నీడ ఎంత పొడవైందోకొలవడం లేదు

దీపం ఎంతసేపు వెలుగుతుందో

 ఆలోచించడం లేదు

అది తాకిన నిశ్శబ్దాన్ని వింటున్నాను

ఆ నిశ్శబ్దంలోనా బాల్యం ఉంది

నన్ను నడిపించిన గురువులున్నారు

నా ప్రయాణంలో

తోడుగా నిలిచిన మనుషులున్నారు

నా ఆలోచనలకు

 రూపం ఇచ్చిన పుస్తకాలున్నాయి

నా అక్షరాల్లో

 వెలుగుతున్న ఎన్నో జీవితాలున్నాయి

ఇంకా వెలుగు చూడాల్సిన

 అనేక మనసులూ ఉన్నాయి

దీపం ముందు నా నీడను చూశాను

ఆ నీడ

 వెలుగు ఉన్నంతవరకేగోడ మీద నిలిచింది

దీపం ఆరిపోతే

 ఆ నీడ కూడాఅక్కడి నుంచి మాయమవుతుంది

మనిషి పేరు,

 హోదా,

 గుర్తింపు,

 అధికారం

 ఇవన్నీ కాలంతో మారిపోతాయి

మనిషి తాకిన జీవితాల్లో

 మిగిలిన వెలుగు మాత్రం

 మరో రూపంలో కొనసాగుతుంది

బహుశా

 మనిషి తన జీవితాన్ని

 తిరిగి చూసుకోవాల్సింది

 తాను ఎంత వెలిగానని కాదు

తన వెలుగులో

 ఎంతమంది తమ దారిని

 గుర్తించగలిగారన్నదే

దీపం చివరి మంటఒక్కసారి వణికింది

గదిలోని గాలి దాన్ని మెల్లగా తాకింది

నేను

 చేతిని ముందుకు చాచలేదు

ఆ జ్యోతినిఆపాలని అనుకోలేదు

దాని వెలుగు

 నా లోపలికి వచ్చినంతసేపు

 నిశ్శబ్దంగా కూర్చున్నాను

దీపం ఆరిపోయినా

దాని ముందు కూర్చున్న

ఆ క్షణం

నాలో మిగిలిపోయింది

వెలుగు ఆగిన చోట

ఒక అనుభూతిమొదలైంది

చీకటి మధ్య

 నన్ను నేను

 మరింత స్పష్టంగా వినగలిగాను

దీపం వెలిగేది

గదిలోని చీకటిని కొంత దూరం చేయడానికే

మనిషి వెలిగేది

తనలోని వెలుగును

మరో మనిషి జీవితానికి చేర్చడానికే!

— దార్ల వెంకటేశ్వరరావు

 31.10.2026


29 సెప్టెంబర్, 2026

నా బాల్యం ఇంకా అక్కడే ఉంది

 నా బాల్యం ఇంకా అక్కడే ఉంది!

---

చెయ్యేరు అగ్రహారంలో

బ్రాహ్మణ చెరువు గట్టు మీద

నా బాల్యం ఇంకా

ఒక పాత చెప్పుల జతలా పడి ఉంది.


ఎవరూ దాన్ని తీసుకెళ్లలేదు

ఎవరూ దాని మీద

కాలం వేసిన దుమ్మును దులపలేదు.


నేను మాత్రం

ఏళ్ల తరబడి

దాని దగ్గరకు తిరిగి వెళ్లలేకపోయాను.


రంగరాజుకోడు కాలువ

నా బాల్యంలో ఒక నది కాదు—

ప్రపంచం మొత్తాన్ని దాచుకున్న

ఒక చిన్న సముద్రం.


దాని వంతెన మీద నుంచి

నీళ్లలోకి దూకిన శరీరం

ఈత నేర్చుకోలేదు

జీవితంలోకి దూకడం నేర్చుకుంది.


అక్కడే

పశువులను మేపుతూ

స్నేహాలు చేసుకున్నాను

తగువులు పెట్టుకున్నాను

మళ్లీ కలిసిపోయాను.


అక్కడే

కొబ్బరి మొక్కలు నాటాను

అవి పెరిగి

నా కంటే పొడవైన జ్ఞాపకాలయ్యాయి.


అదే కాలువ ఒడ్డున

జీవితం ఎంత దగ్గరగా ఉంటుందో

మరణం ఎంత నిశ్శబ్దంగా ఉంటుందో

మొదటిసారి చూశాను.


దహనం చేసిన శవాలను

ఆసక్తిగా పరిశీలించిన ఆ బాలుడికి

అప్పుడు తెలియదు—


ఒకరోజు

మనిషి తన బాల్యాన్ని కూడా

అలా బూడిదలో వెతుక్కోవాల్సి వస్తుందని.


నా తండ్రి

ఒకే పనితో జీవించిన మనిషి కాదు.


నాగలి పట్టాడు

బరువులు మోశాడు

చేపలు పట్టాడు

వలలు అల్లాడు

బుట్టలు అల్లాడు

కొబ్బరి చెట్లెక్కాడు

తాటాకులు కోశాడు—


అతని చేతులు

ఒక వృత్తికి చెందినవి కావు

బతకడానికి పుట్టిన

అనేక వృత్తుల భూగోళం.


అతని అరచేతుల్లో

గీతలు లేవు

పొలాల చీలికలు ఉన్నాయి.


అతని భుజాల మీద

కేవలం బరువులు కాదు

మా ఇంటి రేపటి రోజులు ఉండేవి.


అమ్మ

వాయికుడుము చేసేది.


ఆమె చేతుల్లో

పిండి మాత్రమే ఉండేది కాదు

ఇంటిని నిలబెట్టే

చిన్నచిన్న ఉపాయాలన్నీ ఉండేవి.


మిగిలిపోయిన అన్నం

మా ఇంట్లో వ్యర్థం కాదు

మరో భోజనానికి

మార్చుకోవాల్సిన జీవితం.


ఆకలి

మా ఇంటి తలుపు తట్టిన అతిథి కాదు—

లోపలే కూర్చున్న

ఒక కుటుంబ సభ్యురాలు.


అయినా

మేము నవ్వుకున్నాం.


పేదరికం

మా మీద తన పేరు రాసినా

మా బాల్యానికి

ఆ పేరు పెట్టలేకపోయింది.


బ్రాహ్మణ చెరువు గట్టు

మాకు చిరునామా మాత్రమే కాదు

సమాజం ఎలా చూస్తుందో

మొదటిసారి నేర్పిన నేల.


ఒక వైపు

చెరువు నీరు

మరో వైపు

మనుషుల మధ్య కనిపించని గీతలు.


నీటిలో అందరి ప్రతిబింబం ఒక్కటే

కానీ ఒడ్డున

ప్రతి మనిషికీ వేరే పేరు.


అప్పుడు అర్థం కాలేదు—


నీరు కులాన్ని అడగదు

ఆకలి కులాన్ని అడగదు

చెమట కులాన్ని అడగదు

కానీ మనిషి

మనిషిని మాత్రం అడుగుతాడు.


నా బాల్యం

అందుకే కేవలం మధుర జ్ఞాపకం కాదు.


అది

మట్టి అంటుకున్న ఒక అద్దం.


దానిలో చూస్తే

నా ముఖం వెనుక

నా తండ్రి వంగిన నడుము కనిపిస్తుంది.


నా నవ్వు వెనుక

అమ్మ చేతుల అలసట కనిపిస్తుంది.


నా మాటల వెనుక

కాలువ నీటి శబ్దం వినిపిస్తుంది.


నా నడకలో

పశువులను తోలిన దారి ఉంది.


నా కలల్లో

కొబ్బరి మొక్కల నీడ ఉంది.


నా నిశ్శబ్దంలో

కాలిపోయిన శరీరాల పొగ ఉంది.


నేను నగరాలకు వచ్చాను

దూరాలకు వెళ్లాను

కొత్త ఇళ్లలో నిద్రపోయాను

కొత్త వీధుల మీద నడిచాను—


కానీ

నా పాదాల కింద మట్టి మారలేదు.


అది

చెయ్యేరు అగ్రహారం మట్టే.


నా లోపల

ఇప్పటికీ ఒక బాలుడు

రంగరాజుకోడు కాలువ వంతెన మీద నిలబడి ఉన్నాడు.


నీళ్లలోకి దూకాలా

వెనక్కి వెళ్లాలా

అని ఆలోచించడం లేదు.


అతనికి

ఇప్పటికీ ఈత మీద నమ్మకం ఉంది.


అందుకే

నేను నా గతాన్ని

వెనక్కి తిరిగి చూడటం కాదు—


నా లోపల ఇంకా బతికున్న

ఆ బాలుడిని

ప్రతిరోజూ పలకరిస్తున్నాను.


ఇప్పుడు నాకు తెలుసు—


మనిషి తన జీవితాన్ని

తానే రాయడు.


తండ్రి చెమటతో

కొన్ని పంక్తులు వస్తాయి.


తల్లి ఆకలితో

కొన్ని పంక్తులు వస్తాయి.


కాలువలో ఈత కొట్టిన బాల్యంతో

కొన్ని పంక్తులు వస్తాయి.


కులం వేసిన గీతలతో

కొన్ని పంక్తులు వస్తాయి.


మరణాన్ని చూసిన కళ్లతో

కొన్ని పంక్తులు వస్తాయి.


చివరికి

మన శరీరమే

ఆ జీవితపు పుస్తకమవుతుంది.


దాని ప్రతి ముడత

ఒక జ్ఞాపకం.


ప్రతి గాయం

ఒక వాక్యం.


ప్రతి ఊపిరి

ఒక తిరిగి రాని గ్రామం.


నా బాల్యం

అక్కడే ఉంది—


బ్రాహ్మణ చెరువు గట్టు మీద

రంగరాజుకోడు కాలువ నీళ్లలో

తండ్రి చేతుల చెమటలో

అమ్మ వాయికుడుము వాసనలో

మిగిలిన అన్నం గిన్నెలో

కొబ్బరి మొక్కల నీడలో—


నేను ఎక్కడికి వెళ్లినా

నన్ను ముందే చేరుకున్న

ఒక చిన్న గ్రామంలా.

***

వేర్ల నుంచి వెలుగువైపు


---


ఈ రోజు

విశ్వవిద్యాలయ గదిలో

నా ముందు పుస్తకాలు

నా వెనుక

ఒక చిన్న ఊరు.


చెయ్యేరు మట్టి

నా పాదాల నుంచి విడివడలేదు

అది

నా నడకలోనే

విశ్వవిద్యాలయానికి వచ్చింది.


బోర్డు మీద

నేను రాసే ప్రతి అక్షరంలో

నాన్న అరచేతి గీతలు మెరుస్తాయి.


అమ్మ పొయ్యి పొగలో

పెరిగిన నా బాల్యం

ఈ రోజు

తరగతి గదిలో

వెలుగై కూర్చుంది.


నాన్న చేతులు

నాగలి పట్టాయి

వల అల్లాయి

బరువులు మోశాయి

కొబ్బరి చెట్లెక్కాయి

తాటాకులు కోశాయి—


ఆ చేతులే

నా భవిష్యత్తుకు

మొదటి మెట్టయ్యాయి.


అమ్మ చేతులు

వాయికుడుము వాసనతో

మా ఆకలిని నిద్రపుచ్చాయి.


మిగిలిన అన్నంలో

రేపటి ఉదయాన్ని కలిపి

మాకు పెట్టిన ఆ చేతులు

ఇప్పటికీ

నా భోజనంలో కనిపిస్తాయి.


ఒకప్పుడు

పుస్తకం

మా ఇంటి తలుపు బయట నిలిచేది.


ఒక బాలుడు

దాన్ని అందుకోవడానికి

మట్టిబాట పట్టాడు.


ఆ బాట

ఈ రోజు

విశ్వవిద్యాలయ ప్రాంగణంగా విస్తరించింది.


అప్పుడు

చేతిలో పలక.


ఇప్పుడు

చేతిలో పుస్తకం.


అప్పుడు

గమ్యం తెలియని అడుగు.


ఇప్పుడు

ముందు తరాల అడుగులకు

దారి చూపే అవకాశం.


నా కుర్చీలో

నా తండ్రి చెమట ఉంది.


నా మాటల్లో

నా తల్లి నిశ్శబ్దం ఉంది.


నా పేరులో

నా ఊరి మట్టి ఉంది.


నా పాఠంలో

ఆ మట్టిలోంచి మొలిచిన

వందల మొక్కల పచ్చదనం ఉంది.


గతం

నా వెనుక నడిచే నీడ.


వర్తమానం

నా చేతిలో వెలిగే దీపం.


భవిష్యత్తు

ఆ వెలుగును అందుకునే

కొత్త ముఖాల ఉదయం.


నా తండ్రి

మట్టిని తిప్పాడు.


నా తల్లి

ఆకలిని తిప్పికొట్టింది.


నేను

అక్షరాలను తిప్పుతున్నాను.


నా తర్వాతి తరాలు

ప్రపంచాన్ని చదువుతున్నాయి.


ఒక కుటుంబపు చెమట

ఒక బాలుడి కలగా మొలిచి

ఒక ఉపాధ్యాయుడి జీవితంగా ఎదిగి

ఇప్పుడు

వందల కలలకు

నీడనిస్తోంది.


చెయ్యేరు నుంచి

విశ్వవిద్యాలయం వరకు

దారి పొడవుగా ఉంది.


ఆ దారిలో

ప్రతి అడుగుకింద

అమ్మానాన్నల జాడ.


ప్రతి అడుగుముందు

ఒక కొత్త ఉదయం.


నా వేర్లు

మట్టిలో లోతుగా ఉన్నాయి.


నా కొమ్మలు

ఆకాశాన్ని తాకుతున్నాయి.


నా పూలు

నా విద్యార్థుల కళ్లలో పూస్తున్నాయి.


నా రేపు

వాళ్ల చేతుల్లో

ఇంకా పచ్చగా ఉంది.


నేను నడిచిన దారి

ఇక్కడితో ఆగలేదు—


నా తర్వాతి అడుగుల కోసం

ఇప్పుడే

మరో దారి మొలుస్తోంది.

***

నాకు ఇష్టం


---


చదవడంలో

ఒక ఆనందం ఉంది


రాయడంలో

మరో ఆనందం ఉంది


కష్టపడే వేళ

మనసులో

ఏదో ఒకటి మేల్కొంటుంది


“దేనికోసం?”

అని చాలామంది అడుగుతారు


నాకు చదువుకోవడం ఇష్టం


చెయ్యేరు మట్టి దారిలో

పుస్తకాన్ని గుండెలకు హత్తుకుని

నడిచిన రోజులు

ఇప్పటికీ గుర్తున్నాయి


ఇంట్లో వెలుగు తక్కువైన రాత్రుల్లో

అక్షరాల మీద వాలిన కళ్లు

తెల్లవారిన తర్వాత కూడా

చదువుతూనే ఉండేవి


నాన్న చేతుల మీద

పగిలిన చర్మాన్ని చూస్తూ

శ్రమ అర్థం తెలిసింది


అమ్మ చేతుల మీద

పిండి అంటుకున్న వేళ్లను చూస్తూ

జీవితం ఎంత జాగ్రత్తగా

మలచుకోవాలో తెలిసింది


ఆ రోజుల్లో

పుస్తకం ఒక వస్తువు కాదు—

ఇంకొక ప్రపంచానికి

చేరుకునే అవకాశం.


అక్షరం

చేతిలో పడిన చిన్న విత్తనం.


చదివిన కొద్దీ

లోపలే

ఒక చెట్టు పెరిగింది.


ఒకప్పుడు

చదువు కోసం దారి వెతికిన అడుగులు

ఇప్పుడు

తరగతి గదిలోకి

వందల అడుగులను ఆహ్వానిస్తున్నాయి.


ఒకప్పుడు

తెలియని పదం కోసం

పుస్తకాన్ని వెతికిన కళ్లు

ఇప్పుడు

విద్యార్థుల ప్రశ్నల్లో

కొత్త పదాలను వెతుకుతున్నాయి.


అక్షరాలు రాయడం ఇష్టం


ఖాళీ కాగితం మీద

మొదటి పదం పడగానే

చాలాకాలంగా నాలో ఉన్న

ఒక అనుభవం

గొంతు విప్పినట్టు ఉంటుంది.


చేతిలో ఉన్న

చిన్న అవకాశాన్ని

మనసంతా నింపి

ఆనందంగా మార్చుకోవడం ఇష్టం


నాకు లభించిన ప్రతి అవకాశం

నా గతపు మట్టిని

కొంచెం కొంచెంగా

కొత్త నేలగా మార్చింది.


చదువు

నా బాల్యాన్ని చెరిపివేయలేదు

దానికి ఒక విస్తారమైన ఆకాశాన్ని ఇచ్చింది.


రాత

నా జ్ఞాపకాలను దాచలేదు

వాటికి మరో జీవితం ఇచ్చింది.


శ్రమ

గడిచిపోయిన రోజులను

రేపటి అర్థంగా మలిచింది.


ఇప్పుడు

ఒక పుస్తకం తెరిచినా

ఒక తరగతి గదిలో నిలిచినా

ఒక వాక్యం రాసినా—


ఆనాటి బాల్యం

ఎక్కడో ఒక మూలన

నాతో పాటు కూర్చుంటుంది.


మట్టి వాసనతో

చెమట వాసనతో

అమ్మ చేతుల వాసనతో

అక్షరాల వాసనతో.


అక్కడే

చదువుకు ఆనందం దొరుకుతుంది.


అక్కడే

కష్టానికి అర్థం దొరుకుతుంది.


అక్కడే

రేపటి రూపం

ఈరోజే కనిపిస్తుంది.


చదవడం ఇష్టం.

రాయడం ఇష్టం.

కష్టపడడం ఇష్టం.

రేపటిని మలచడం ఇష్టం.


ఈ నాలుగు మాటల మధ్య

ఒక జీవితం

నిశ్శబ్దంగా

తన కథను రాస్తోంది.

- దార్ల వెంకటేశ్వరరావు 29.9.2026

27 సెప్టెంబర్, 2026

దుస్వప్నాలు

 నాకీ మధ్య గత కొన్ని రోజులుగా దుస్వప్నాలు వస్తున్నాయి. అలాంటి కొన్ని కలలు  మనసుని అల్లకల్లోలపరుస్తుంటాయి. 

'అవి కలలేకదా' అనీ మనసుకి సర్దిచెప్పుకున్నా, ఏదో ఆందోళన మాత్రం అంతరంగంలో భయాన్ని కలిగిస్తుంది. 

ఈ రోజు (27.9.2026) ఉదయం ఐదు గంటల ప్రాంతంలో మెలకువ వచ్చేసింది...ఆ కలవల్లే.

ఏదో సభలో మాట్లాడ్డానికి వెళ్ళాం.

ఆ సభలో నాకు తెలిసిన వాళ్ళు చాలా బాగుంది  ఉన్నారు.

'సభ అయిపోతుంది... మన వెహికల్ రెడీగా ఉందా' అన్నాను నా పక్కనున్న వాళ్ళతో. 

'' ఆఁ వచ్చేస్తుంది'' అని దానికెవరో సమాధానం చెప్పారు.

కాసేపటికి ఓ వెహికల్ సిద్ధంగా బయట ఉంది. 

ఆ వెహికల్ ఎర్రగా ఉంది.

దాని మీద అప్పటికే చాలామంది నిర్జీవంగా పడుకొని ఉన్నారు. 

అది శ్మశాన వాటికకు తీసుకెళ్ళే 'వైకుంఠ వాహనం' లా ఎర్రరంగులో ఉంది. 

'బ్రదర్... రండి త్వరగా బండి సిద్ధంగా ఉంది' అంటున్నాడు నాకు బాగా తెలిసిన ఒక సాహితీమిత్రుడెవరో.

' బట్టలు మార్చుకుంటున్నా...వస్తున్నా' అంటున్నాను...

అమాంతంగా మెలకువ వచ్చేసింది.

***

మొన్నామధ్య ఓ కల వచ్చింది.

రెండు మూడు రోజులు క్రితం.

అది కూడా తెల్లవారుజామునే... సుమారు  నాలుగు, ఐదు గంటల మధ్యలో.

ఒక పాడుబడిన తోటలాంటి స్థలం.

చెత్తాచెదారంతో నిండి ఉంది

ట్రాక్టర్ తో భూమిని చదును చేస్తున్నారు. 

అక్కడ పడిన చెత్తను శుభ్రం చేస్తున్నారు.

శుభ్రం చేసిన స్థలంలో ఓ చోట ఓ గొయ్యి తవ్వుతున్నారు.

నన్ను సిమెంట్ కాంక్రీటు కలిపి తీసుకొచ్చే బండిలాంటి ఒక తోపుడు బండిలో కూర్చోబెట్టి అక్కడకు ఎవరో తీసుకొస్తున్నారు.

నా కాళ్ళూ చేతులూ కదల్చలేకపోతున్నాను.

కానీ, వాళ్ళు చేస్తున్నవన్నీ తెలుస్తున్నాయి. 

చూస్తున్నాను.

ఏమీ మాట్లాడలేకపోతున్నాను.

సడన్ గా మెలకువ వచ్చేసింది.

వాల్ క్లాక్ లో ఉదయం సుమారు మూడున్నర గంటలవుతుంది .

***

అంతకు ముందు కూడా ఓ విచిత్రమైన కల వచ్చింది.

అదో అందమైన భవనం. హోటల్ లేదా ఏదో రిసెప్షన్ లా ఉంది.

జనం చాలామంది ఉన్నారు.

హాలంతా కిటకిటలాడుతున్నారు.

అందరూ మంచి మంచి బట్టలతో ఉన్నారు.

నేను వాళ్ళ మధ్య నిలబడాలంటే సిగ్గేస్తుంది

నా ఒంటిమీద నూలుపోగు లేదు.

అక్కడ ఉన్న ఓ బనియన్ లాంటి గుడ్డను మొలను కనబడకుండా చుట్టుకొంటూ దాచుకుంటున్నాను.

కానీ, జనం కూడా ఏమీ పట్టించుకోవడం లేదు. 

బట్టలున్నా వాళ్ళిష్టం వచ్చినట్లు వాటిని వదిలేస్తున్నారు.

వాళ్ళ చేతుల్లో  ఏవో మెరుస్తున్నాయి. వాటినే చూసుకొంటున్నారు.

ఎవరితో ఎవరూ మాట్లాడినట్లనిపించడం లేదు

అక్కడ జనం ఉన్నారు సమూహంగా...

తిరుగుతున్నది మాత్రం ఒంటరిగా..స్వేచ్చగా...

అయినా నేనే సిగ్గు పడిపోతున్నాను.

మెలకువ వచ్చేసింది.

సమయం సుమారు ఉదయం నాలుగు గంటల వుతుంది.

***

ఇవి కలలు !

కొన్ని కలలు భయపెడతాయి

మరికొన్ని కలలు సంతోషపెడతాయి

ఏ కల ఎందుకొస్తుందో తెలీదు

ఆనందపెట్టేది మర్చిపోతాం 

భయపెట్టేది మాత్రం 

ప్రతి పనినీ పరీక్షించుకోమంటుంది!

- దార్ల వెంకటేశ్వరరావు, 30.9.2026

సమయం, ఉదయం  గం.6:14 ని.లు. 





24 ఆగస్టు, 2026

అక్షరాలై మిగిలిన కన్నీరు

 అక్షరాలై మిగిలిన కన్నీరు


నేను ఏడిస్తే

నా కన్నీటి చప్పుడు

నా గుండెకు మాత్రమే వినిపిస్తుంది.

కళ్లలో దాచుకున్న దుఃఖం

ఎలాగోలా కన్నీరై జారిపోతుంది

గుండెలో దాచుకున్న మాట

అక్షరమై జాలువారుతుంది

నేను విరిగిపోయిన చోటే

ఒక వాక్యం పుడుతుంది

నేను మౌనమైన చోటే

ఒక కవిత మొదలవుతుంది

నన్ను చూసి

లోకం కదలకపోవచ్చు

నా అక్షరాన్ని చదివినప్పుడు

ఎవరి మనసులోనో

ఒక అల పుట్టినా చాలు!

నా కళ్లకు

ఏడ్చే శక్తి ఉంది 

నా అక్షరాలకు

ఎవరి గుండెనైనా

తడిపే హక్కుందో లేదో!

నేను కార్చిన కన్నీరు

నేలలో కలిసిపోవచ్చు

అదే కన్నీరు

అక్షరాలై మారితే

కాలం గుండెల్లో

ఒక జ్ఞాపకమై మిగిలిపోతుందా!

పోనీ

నీ పెదవులపై ఒక నవ్వుంది

ఆ నవ్వు వెనుక

నువ్వు నీకోసం

మనసారా నవ్వుకున్న

ఒక్క క్షణమైనా ఉందా?

— డా. దార్ల వెంకటేశ్వరరావు

23 ఆగస్టు, 2026

మా వివాహ వార్షికోత్సవ యాత్ర 2026

భక్తి–చరిత్రల సంగమం: 

ఓ మరపురాని జ్ఞాపకాల పయనం

నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 23.8.2026 సౌజన్యంతో 


ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్ లో తీసుకున్న ఒక ఫోటో. 

ముడుచుకున్న రెక్కల్ని విప్పిన

సీతాకోకచిలుకల్లా

మనసు దారుల్ని వెతుకుతున్నట్లు,

గూటి నుంచి జారిన

పిట్టల గుంపులా

సంతోషం ముందే గంతులేస్తున్నట్లు,

వెలుతురును తాకిన

మొగ్గలా

మా ప్రతి ముఖం విచ్చుకుంటుంటే

గమ్యం ఇంకా దూరంలోనే ఉన్నా

ప్రయాణం మాత్రం

మా కళ్లలో అప్పుడే మొదలయ్యింది.


కాలం చక్రంలా తిరుగుతుంటే, ఏటా మా అనుబంధాన్ని నెమరువేసుకునే పవిత్ర వివాహ వార్షికోత్సవం రానే వచ్చింది. ఈసారి మా పయనం ప్రాచీన భారతదేశ దివ్యత్వాన్ని, తెలుగు నేల శౌర్యప్రతాపాల చరిత్రను ఒకే వేదికపై ఆవిష్కరించిన అద్భుతమైన భావ సంగమంలా అనిపించింది. నా సతీమణి మంజుశ్రీ, సుపుత్రుడు శ్రీనివాసరావు, ఆత్మీయ శిష్యుడు సాయినాథ్ రెడ్డిలతో కలిసి, నమ్మకమైన డ్రైవర్ కిరణ్ బొలేరో వాహనంలో సాగిన ఈ రెండు రోజుల (ఆగస్టు 18, 19 వ తేదీలలో ) యాత్ర మా హృదయాలలో కలకాలం పదిలంగా నిలిచిపోయే ఒక సువర్ణాక్షర ఘట్టం. 

నినాదం దినపత్రిక సాహిత్య అనుబంధం 'సాహితీ లహరి' 23.8.2026 సౌజన్యంతో 

ఈ యాత్రలోని విశేషాలు ఒక నదీ ప్రవాహంలా, భక్తి ప్రపత్తుల నుంచి వీరత్వపు ఆనవాళ్ల వరకు సాగాయి. కృష్ణమ్మ ఒడ్డున వెలసిన విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వరుల ఆశీస్సులతో మొదలై, పంచారామ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరుడు, మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దివ్య మంగళ స్వరూపాల దర్శనంతో మనసంతా అపరిమితమైన ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండిపోయింది.



శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం ముందు 

ఉండవల్లి గుహలలో పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహ శిల్ప సౌందర్యం మమ్మల్ని మంత్రముగ్ధులను చేయగా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మిత్రుల ఆత్మీయ ఆతిథ్యం, నాగార్జునసాగర్ కృష్ణమ్మ ఒడ్డున ప్రశాంతమైన రాత్రి బస యాత్రకు ఎనలేని విశ్రాంతిని అందించాయి. కారంపూడి రణభూమిలో 66 మంది అమర వీరుల గుడి, వారు ఉపయోగించిన ప్రాచీన ఆయుధాలు, రక్తసిక్తమైన చరిత్ర కలిగిన నాగులేరు వాగును కళ్లారా చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచే అనుభూతి కలిగింది. బొలెరో కార్ లో మధుర గీతాల స్వరాల నడుమ, ప్రకృతి అందాలు, ప్రాచీన వైభవం, భక్తి పారవశ్యాల మేళవింపుగా సాగిన ఈ రెండు రోజుల యాత్ర మా వార్షికోత్సవానికి ఒక అమూల్యమైన, చిరస్మరణీయమైన కానుకగా మిగిలిపోయింది. ఈ వారం ఆ విశేషాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

తెల్లవారుజామున ఐదు గంటల వేళ… మంచు తెరలను చీల్చుకుంటూ మంగళకరమైన ప్రభాత సమయంలో మా ప్రయాణం మొదలైంది. ప్రతియేటా మా అనుబంధాన్ని గుర్తుచేసుకునే వివాహ వార్షికోత్సవ పర్వదినం ఇది. ఈ ఏడాది కూడా ఎప్పటిలాగే నమ్మకమైన డ్రైవర్ కిరణ్ తన బొలేరో కారుతో సిద్ధంగా ఉన్నాడు. నా సహధర్మచారిణి మంజుశ్రీ, మా సుపుత్రుడు శ్రీనివాసరావు, మా యాత్రలో భాగమైన ప్రియ విద్యార్థి సాయినాథ్ రెడ్డిలతో కలిసి చారిత్రక పరిమళాలు, దైవిక సాన్నిధ్యం కలగలిసిన పుణ్యక్షేత్రాల వైపు మా ప్రయాణం ఉత్సాహంగా సాగింది. మధ్యాహ్న సమయానికి మా ప్రయాణం ఇంద్రకీలాద్రి పాదపద్మాలను చేరింది. కృష్ణవేణి తరంగాల నాదాల మధ్య, శోభాయమానంగా విరాజిల్లుతున్న విజయవాడ శ్రీ కనకదుర్గ మల్లేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నాం. భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారి దివ్య మంగళ రూపం కళ్లారా గాంచగానే ప్రయాణ బడలికంతా పటాపంచలైంది. జగన్మాత కరుణాకటాక్షాలు పొందాం. అక్కడే అమ్మవారి భోజనప్రసాదాలు పూర్తి చేశాం.

కృష్ణమ్మ ఒడిలో ఇంద్రకీలాద్రి

ఆ కొండంతా

కనకదుర్గమ్మ కాంతేనేమో!

అమ్మవారి గర్భాలయంలో

ఒక్క క్షణం నిలిచి చూస్తే

కుంకుమలో

ఒక సూర్యోదయమే కనిపిస్తుందేమో!

ఆమె చిరునవ్వులో

చైతన్యపు వెలుగులు,

అలంకారంలో

అమ్మతనపు ఆత్మీయతలు,

దర్శనం ముగిసినా

ఆ దివ్యరూపమే

కళ్లలోనే కాదు,

మనసంతా

మంగళకాంతిగా నిలిచిపోతుంది కదా!

 ఒకసారి మా గురువుగారు ఆచార్య పరిమి రామ నరసింహం, వారి దంపతులతో కలిసి తిరుమల వెళ్ళాం. మనం ఏ హోదాలో ఉన్నా, దైవ దర్శనం, ప్రసాదాల స్వీకరణలో సామాన్యులు గానే ఉండాలని అంటూ ఆయన ఎంతో భక్తితో లైన్లో నిలబడిన తీరు నాకు గుర్తొచ్చింది. 

ఉండవల్లి గుహలు దగ్గర 

      అక్కడ నుండి కృష్ణానది దాటి ఉండవల్లి గుహల వైపు అడుగులు వేశాం. శిల్ప కళా రీతులకు అద్దం పట్టే ఉండవల్లి గుహలు మన పూర్వీకుల అద్భుత సృజనాత్మకతకు సజీవ సాక్ష్యాలు. ఇక్కడి త్రికూట ఆలయాల శిల్ప సౌందర్యం మమ్మల్ని మంత్రముగ్ధులను చేసింది. విశాలమైన గుహంతర్భాగంలో, శ్రీఅనంత పద్మనాభ స్వామివారు సుఖాసీనుడై ఉన్న భారీ ఏకశిలా విగ్రహం ఈ గుహలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ గుహలలోని ప్రధాన ఆకర్షణ రెండవ అంతస్తులో ఉన్న 17 అడుగుల (5 మీటర్ల) పొడవైన అనంత పద్మనాభ స్వామి (విష్ణుమూర్తి) విగ్రహం. ఆదిశేషునిపై శయనిస్తున్న ఈ ఏకశిలా విగ్రహాన్ని ఒకే గ్రానైట్ రాతితో అద్భుతంగా మలిచారు. ఆ స్వామివారి భంగిమలోని ప్రశాంతత, శిల్పి నైపుణ్యం చూసి మనసారా అభినందించకుండా ఉండలేకపోయాం.

కృష్ణమ్మ ఒడ్డున

రాతిలో చెక్కిన ఉండవల్లి గుహలు

కాలమే చెక్కిన

ఒక శిల్పకావ్యమే!

ఆ గుహల నిశ్శబ్దంలో

అనంతశయనుడైన

పద్మనాభ స్వామిని చూస్తే

శిలలోనే

శాశ్వతత్వం మేల్కొన్నట్టే ఉంటుంది.

ఆ విశాలమైన రూపం

కళ్లలో నిండగానే

కాలం కాసేపు ఆగి

మనసులో

ఒక ప్రశాంత కాంతిగా

నిలిచిపోవాల్సిందే!

చరిత్ర పేజీలను తడిమి చూసినంత అనుభూతిని ఈ గుహలు మాకు ప్రసాదించాయి. ఒకప్పుడు అజంతా, ఎల్లోరా గుహల వంటి నిర్మాణాలు చూసిన అనుభూతిని మళ్లీ పొందాం. ఈ గుహలు భారతీయ ఏకశిలా గుహాలయ వాస్తుశిల్పానికి అద్భుత నిదర్శనం. ఈ చారిత్రక గుహలలో ఉన్న త్రికూట ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక, మరియు నిర్మాణ పరంగా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ గుహాలయంలోని ఒక అంతస్తులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు (త్రిమూర్తులకు) అంకితం చేయబడిన మూడు గర్భగుడులు పక్కపక్కనే ఉంటాయి. ఈ మూడు గర్భగుడులు కలిసి ఉన్నందువల్లనే దీనిని 'త్రికూట ఆలయం' అని పిలుస్తారు.

మూడు శిఖరాల మధ్య

ఒకే ఆకాశం

బ్రహ్మ సృష్టిగా ఒకటి,

విష్ణు స్థితిగా ఒకటి,

మహేశ్వర లయగా ఒకటి!

రాతిలో నిలిచిన ఆ దేవాలయాలు

కాలాన్ని మోస్తూ

జీవిత రహస్యాన్ని చెబుతున్నట్టుగా

పుట్టుక, ఉనికి, పరిణామం

ఒకే చక్రంలో తిరుగుతూనే ఉంటాయి.

త్రికూటం చూస్తే

మూడు రూపాలు కనిపించినా

ఆధ్యాత్మిక భావనలో

ఒకే శాశ్వత తత్త్వం

విశ్వమంతా విస్తరించినట్టే ఉంటుంది!

 ఈ నాలుగు అంతస్తుల గుహాలయాన్ని 4 లేదా 5వ శతాబ్దంలో ఒకే ఒక ఇసుకరాయి (sandstone) కొండను తొలిచి అత్యంత నైపుణ్యంతో నిర్మించారు. అక్కడున్న వివరాలు ప్రకారం 6, 7 శతాబ్దాల్లో ఆ గుహలు నిర్మించినట్లు రాశారు. ఈ గుహలు ఒకే మతానికి పరిమితం కాలేదు. తొలినాళ్లలో బౌద్ధ భిక్షువుల విహారాలుగాను, తర్వాత జైన మునుల ఆవాసాలుగాను ఉండి, తదనంతర కాలంలో (విష్ణుకుండినుల ఏలుబడిలో) హిందూ ఆలయాలుగా రూపాంతరం చెందాయని చరిత్రకారులు భావిస్తారు.ఆ గుహలు చూసి కిందకు వచ్చేసరికి బాగా అలసట అనిపించింది. కింద సుగంధి కటోరి అని ఒక రకమైన సోడా అమ్ముతున్నారు. శివ పార్వతి గారు దాన్ని బాగా చేసి ఇచ్చారు. ఎంతో తృప్తిగా వాటిని తాగి బయలుదేరాం.

ఆ తర్వాత మా వాహనం అమరావతి వైపు సాగింది. పవిత్ర కృష్ణానదీ తీరాన వెలసిన శ్రీఅమరేశ్వర దేవాలయాన్ని సందర్శించాం. పంచారామాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే ఒక విచిత్రమైన ఆధ్యాత్మిక ప్రశాంతత ఆవరించింది. ఆకాశాన్ని తాకేలా ఉన్న అమరేశ్వరుని సుదీర్ఘ లింగరూపాన్ని దర్శించి పూజలు నిర్వహించాం.15 అడుగుల తెల్లటి పాలరాతి శివలింగం ఎంతో ఎత్తైనది. పవిత్ర పంచారామ క్షేత్రాలలో మొదటిదైన అమరారామం (అమరావతి) కృతయుగంలోనే 'క్రౌంచతీర్థం'గా ఆవిర్భవించిన మహోన్నత పుణ్యక్షేత్రం. త్రిపురాసుర సంహార సమయంలో కుమారస్వామి బాణం దాటికి విరిగిన రాక్షసుని ఆత్మలింగ ముక్కలలో ఒకటి ఇక్కడ పడగా, దేవతల రాజైన ఇంద్రుడు, దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు దానిని ప్రతిష్ఠించాడని, తదనంతరం చంద్రుడు కూడా ఈ శివలింగాన్ని పూజించి 'అమరేశ్వరుడు'గా నామకరణం చేశాడని స్థలపురాణం వివరిస్తోంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని చేత పూజలందుకున్న ఈ క్షేత్రంలో శివలింగం రోజురోజుకీ ఎత్తుగా పెరుగుతుండటంతో, దానిని నిలిపేందుకు తలభాగంలో మేకు కొట్టగా రక్తం చిమ్మిందని, ఆ ఎర్రని రక్తపు మరక నేటికీ లింగం పైభాగంలో స్పష్టంగా కనిపిస్తుందని చెబుతారు. అత్యంత ఎత్తైనది కావడంతో అర్చకులు ఒక ప్రత్యేక పీఠంపైకి ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహించే ఈ దివ్య లింగం చుట్టూ పరివార దేవతలు కొలువుదీరడం వల్ల, దేవతలు (అమరులు) నివసించిన పవిత్ర భూమిగా ఈ ప్రాంతానికి 'అమరావతి' అనే సార్థకమైన పేరు స్థిరపడింది. ఈ దేవాలయంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు విగ్రహం ఉంటుంది. ఆయన చేతిలో ఒక భిక్షా పాత్ర ఉంటుంది. దీని గురించి భిన్న భిన్న కథనాలు ఉన్నాయి. తాను దారిదోపిడిలు చేసేవారిని పిలిచి, వాళ్లని చంపించారని ఆ పశ్చాత్తాపం వల్ల ఆయన అమరేశ్వరుని సన్నిధిలోనే గడిపినట్టుగా చెప్తారు. అమరావతి సంస్థానాధీశులైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు (1761-1817) కృష్ణా, గుంటూరు ప్రాంతాలను సమర్థవంతంగా పరిపాలించిన ప్రసిద్ధ జమీందారు, కవిపండిత పోషకుడు. బ్రిటిష్ వారు సైనిక బలాన్ని తగ్గించడంతో ఆగ్రహించి, 1796లో తన రాజధానిని చింతపల్లి నుండి ధరణికోట వద్ద 'అమరావతి' అనే నూతన నగరానికి తరలించగా, ఆ పట్టణ వైభవాన్ని కోలిన్ మెకంజీ వంటి బ్రిటీష్ అధికారులు సైతం ప్రశంసించారు. తన పాలనలో ప్రజలను వేధిస్తున్న పిండారీలను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆయన, దారిదోపిడీలు చేసే 150 మంది చెంచు నాయకులను విందుకు పిలిచి వధించారు (ఆ ప్రదేశమే నరుకుళ్ళపాడుగా మారింది). అయితే, ఆ వధకు తీవ్ర పశ్చాత్తాపం చెంది, తన శేష జీవితాన్ని అమరేశ్వరుని సన్నిధిలోనే గడిపారు. ఈ క్రమంలోనే అమరేశ్వరాలయ పునర్నిర్మాణంతో పాటు వందకు పైగా దేవాలయాలను నిర్మించారని, మంగళగిరి నరసింహస్వామి ఆలయానికి 11 అంతస్తుల భారీ గాలిగోపురాన్ని కట్టించి, అర్చకులకు భూమిని దానం చేస్తూ గొప్ప దైవచింతనతో జీవించారని ప్రసిద్ధి చెందారు.

కృష్ణమ్మ ఒడ్డున

అమరావతి

అమరేశ్వరుని సన్నిధి

శివతత్త్వంతో నిండిన

ఒక ప్రశాంత తీరం!

రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు

భిక్షాపాత్ర విగ్రహం

అధికారపు కాలంలో

తన చేతుల మీదుగా జరిగిన

ఘటనల పట్ల పశ్చాత్తాపానికి

ఓ సజీవ ప్రతీక!

శివలింగ దర్శనంతో

భక్తుని మనసంతా ఓంకార నాదమై,

అమరావతి నేలంతా

ఆధ్యాత్మిక కాంతిగా

నిండిపోయినట్టే ఉంటుంది!

ఆ రాత్రి (18.8.2026) ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గెస్ట్ హౌస్ లో బస చేసాం.‌ మా టూర్ గురించి నాకు అత్యంత ఆత్మీయంగా మారిన యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రామ ప్రసాదరెడ్డి గారితో మాటలు సందర్భంలో ప్రస్తావిస్తే వెంటనే ఆయన, ప్రొఫెసర్ గుజ్జు చెన్నారెడ్డి గారికి ఫోన్ చేసి గెస్ట్ హౌస్ బుక్ చేయించేశారు. నాకు ఆ విషయం తెలియక నాకు తెలిసిన మా సెంట్రల్ యూనివర్సిటీలో చదివి, ప్రస్తుతం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఫిలాసఫీ డిపార్ట్మెంట్లో హెడ్ అండ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న  ప్రొఫెసర్ ఉదయ్ కుమార్ తో ప్రస్తావించినప్పుడు ఆయన కూడా గెస్ట్ హౌస్ బుక్  చేయడానికి ముందుకు వచ్చాడు. అంత ఆత్మీయులు ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ  ప్రాంగణంలో రాత్రి వేళ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా మారింది. పగటిపూట సాగిన దైవ దర్శనాలు, చారిత్రక క్షేత్రాల యాత్రల బడలికను మర్చిపోయేలా ఆ రాత్రి మాకు అద్భుతమైన ఆతిథ్యం లభించింది. ప్రొఫెసర్ గుజ్జు చెన్నారెడ్డి గారు ఇంగ్లీష్ లో ప్రొఫెసర్. అంతకు ముందు గ్రూప్ -1 ఆఫీసర్  ఉద్యోగాన్ని కాదని టీచింగ్ అంటే ఇష్టంతో చేరారు. ఆయన రాసిన నాలుగు నవలలు నాకు ఇచ్చారు. మరో మహాత్మ(2022),  లండన్ టు అమరావతి (2024), స్వప్నసాగరం (2024), వివేకమందిరం (2025). నా పుస్తకాలు నెమలికన్నులు (ఆత్మకథ), కోనసీమ కోయిల (హైకూ దీర్ఘ కావ్యం), దార్ల మాట తేటగీతి శతకం పుస్తకాలను ఆయనకు అందించాను. ఆయన ప్రత్యేక శ్రద్ధతో మా కోసం విశ్వవిద్యాలయపు గెస్ట్ హౌస్‌లో మంచి సౌకర్యాలతో కూడిన బసను ఏర్పాటు చేశారు. వారి సౌజన్యానికి, మమకారానికి మనసు పులకరించిపోయింది. అంతేకాకుండా, బుద్ధిష్ట్ స్టడీస్ లో గెస్ట్ ఫ్యాకల్టీ గా పనిచేస్తున్న డాక్టర్ ప్రశాంత్ గారు ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని దగ్గరుండి గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లారు. వారి ఆదరణ, చిరునవ్వుతో కూడిన మాటలు మా ప్రయాణ అలసటనంతా మాయం చేశాయి.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ భవనం ముందు 

గతంలో దూరవిద్య (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) వ్యవహారాల నిమిత్తం, అలాగే తెలుగు విభాగంలో పిహెచ్‌డి (Ph.D.) వైవా పరీక్షల నిర్వహణ కోసం ఎన్నోసార్లు ఈ విశ్వవిద్యాలయానికి వచ్చి, ఇక్కడే బస చేశాను. కానీ, ఈ సారి ఒక అనిర్వచనీయమైన ప్రత్యేక అనుభూతి కలిగింది. గతంలో వచ్చినప్పుడల్లా బాధ్యతలు, పరుగెత్తే సమయం, పరిశోధనల ఒత్తిడి మాత్రమే తోడుగా ఉండేవి. కానీ ఈసారి, నా అర్ధాంగి, సుపుత్రుడు, ప్రియ శిష్యునితో కలిసి... నా యాత్రానుభవాల నడుమ, వివాహ వార్షికోత్సవ పవిత్ర ఘడియల్లో ఇక్కడ అడుగుపెట్టడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది.చదువుల తల్లి నిలయమైన ఆ విశ్వవిద్యాలయ ఆవరణలో, నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి వేళ... జ్ఞాన పరిమళాలు, ప్రాచీన చరిత్ర జ్ఞాపకాలు, మిత్రుల ఆత్మీయ ఆతిథ్యం అన్నీ కలగలిసి ఆ రాత్రి బసను మా యాత్రలోనే అత్యంత మరపురాని ఘట్టంగా మార్చేశాయి. విశ్వవిద్యాలయంలో కొన్ని ఫోటోలు తీసుకొని బయలుదేరాం. గెస్ట్ హౌస్ పే చేయవలసిన మనీ కూడా ప్రొఫెసర్ చెన్నారెడ్డి గారు నన్ను పే చేయనివ్వలేదు. 

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ ముందు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా. మంజుశ్రీ, సాయినాథ్ రెడ్డి 

పొద్దున్నే హాయిగా వేడి నీళ్ళతో స్నానం చేసి మరలా యాత్రకు బయలుదేరాం. ఎంతకాలంగానో మా శ్రీమతి దర్శించాలని అడుగుతున్న మంగళగిరి పానకాల నరసింహస్వామి దర్శనం కోసం బయలుదేరాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం పనులను తిలకించుకుంటూ మంగళగిరి ప్రయాణం మొదలైంది. అ పరిసరాల్లో ఎక్కడ చూసినా రాజధాని నిర్మాణం జరుగుతున్న ప్రతి ప్రాంతంలోనూ పోలీసులు రక్షణకవచంలా కనిపించారు. 

కృష్ణమ్మ ఒడ్డున

విస్తరిస్తున్న అమరావతి 

నేలపై గీసిన గీతలు

రేపటి నగర రూపురేఖలై

కనిపిస్తున్నాయి!

విశాల రహదారుల మధ్య

నడుస్తుంటే

నిర్మాణంలో ఉన్న భవనాలు

భవిష్యత్తు వైపు

ఎదుగుతున్నట్టే అనిపించాయి

ఇక్కడి ప్రతి ఇటుకలోఒక ఆశయం,

ప్రతి అడుగులో ఒక అభివృద్ధి స్వప్నం,

ప్రతి నిర్మాణంలో

ఒక కొత్త అమరావతి

ఆవిష్కృతమవుతున్నట్టుంది!

చూసిన దృశ్యాలు

కళ్లలో నిలవగా

నిర్మాణంలో ఉన్న నగరం

మనసులో

రూపుదిద్దుకుంటున్న భవిష్యత్తుగా

మిగిలిపోయింది!

 మంగళగిరి చేరుకోగానే ముందుగా కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ దర్శనంతో మా ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభమైంది. ఆకాశాన్ని తాకేలా, పదకొండు అంతస్తులతో గర్వంగా తలెత్తుకుని నిలబడిన బ్రహ్మాండమైన గాలి గోపురం చూడగానే మనసు భక్తిభావంతో నిండిపోయింది. ఆ ప్రశాంతమైన వాతావరణంలో మా సుపుత్రుడు శ్రీనివాసరావు గారి అద్భుతమైన ఆలోచన మేరకు స్వామివారికి 'లక్ష ఒత్తుల దీపారాధన' చేయించడం నిజంగా మహద్భాగ్యం. వేలాది దీపపు కాంతుల నడుమ దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ గర్భాలయ దృశ్యం, ఆ వెలుగుల్లో స్వామివారిని దర్శించుకున్న క్షణం కనుల పండువగా అనిపించి మనసుకు అనిర్వచనీయమైన ప్రశాంతతను అందించింది. అక్కడ శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన మండపం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

కింది ఆలయంలో దీపకాంతుల పారవశ్యం నుండి తేరుకుని, దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉచిత బస్సుపై పయనిస్తూ భక్తిశ్రద్ధలతో ఎత్తైన మంగళగిరి కొండను అధిరోహించి పానకాల స్వామి గర్భగుడిని చేరుకున్నప్పుడు మనసుకు చెప్పలేనంత ప్రశాంతత ఆవరిస్తుంది. ఇక్కడ కూడా లక్ష దీపాల అర్చన చేయించి, దర్శనానికి వెళ్ళి శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామికి స్వయంగా పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్న ఆ క్షణాలు అత్యంత అద్భుతమైనవి. అర్చకులు స్వామివారి ముఖద్వారంలో శంఖంతో పానకాన్ని పోస్తుండగా, ప్రతిధ్వనించే స్పష్టమైన గుటకల శబ్దం భక్తులను ఒక దివ్యమైన లోకంలోకి తీసుకెళ్తుంది. స్వామివారు సగం పానకాన్ని మాత్రమే ఆరారగా స్వీకరించి, మిగిలిన సగాన్ని ఆశీర్వచనంగా, మధురాతి మధురమైన ప్రసాదంగా తిరిగి ప్రసాదించడం కనులారా చూసినప్పుడు కలిగే ఆధ్యాత్మిక ఆనందం వర్ణనాతీతం. ఆ పానకం చాలా బాగుంది. కొంచెం తెచ్చుకోవాలనిపించింది. కానీ,మర్చిపోయాం.

పానకాల నరసింహుని సన్నిధిలో

మంగళగిరి కొండపై

పానకాల నరసింహుని దర్శనంతో

మనసంతా మంగళధ్వనియే!

స్వామి సన్నిధిలో

పానకపు తీపి

భక్తి పరిమళమే!

ఆ దివ్య దర్శనం

మన కళ్లలో వెలుగై,

హృదయంలో ప్రశాంతతే!

స్వామివారి దర్శనానంతరం ఆ ఆలయ ప్రాంగణంలో కలిగే అనుభూతి ఒక వింతైన ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎటు చూసినా పానకం ధారలుగా పారుతూనే ఉంటుంది, గాలిలో బెల్లం, యాలకుల సుగంధం గుబాళిస్తూనే ఉంటుంది. అయినా, ఆ పరిసరాల్లో ఒక్క చీమ కూడా వాలకపోవడం స్వామివారి మహిమకు సజీవ సాక్ష్యంగా భక్తులు భావిస్తుంటారు. దైవికమైన ఆ అద్భుత ప్రదర్శన, లక్ష ఒత్తుల దీపారాధన వల్ల కలిగిన పుణ్యఫలం, అన్నింటికీ మించి ఎంతోకాలంగా ఈ క్షణం కోసం ఎదురుచూసిన మా శ్రీమతి ముఖంలో వెల్లివిరిసిన చిరకాల దర్శన సంతోషం... అన్నీ కలిసి ఈ యాత్రను మా జీవితాంతంలో గుర్తుండిపోయే మధుర స్మృతిగా మలిచాయి. పానకాల లక్ష్మీ నరసింహ స్వామి కొండ పై అరలు అరలుగా పేర్చినట్లుగా ఆ కొండలు కనిపిస్తాయి. 

కొండను జేరిన పిదపన్

నిండుగ పానక మొసగగ నేర్పుగ ద్రావెన్!

దండిగ దీపపు కాంతిన్

పండుగ వలె కనుల గాంచ పానక స్వామిన్!

మంగళగిరి పానకాల స్వామి ఆలయ ఆచారాల వెనుక భక్తితో పాటు ఒక అద్భుతమైన భౌగోళిక, శాస్త్రీయ కారణం దాగి ఉందని నిపుణులు చెబుతారు. భౌగోళిక శాస్త్రవేత్తల ప్రకారం, మంగళగిరి కొండ ఒక విలుప్త అగ్నిపర్వతం (నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతం). ఈ కొండ అంతర్భాగంలో ఇప్పటికీ అత్యధిక ఉష్ణోగ్రతలు, వేడి వాయువులు ఉన్నాయని అంచనా. కొండ లోపల ఉన్న ఆ భయంకరమైన వేడిని చల్లార్చడానికి మరియు అగ్నిపర్వతం ఉగ్రరూపం దాల్చకుండా నియంత్రించడానికి పురాతన కాలంలో మన పెద్దలు కనుగొన్న శాస్త్రీయ ప్రక్రియే ఈ పానకం సమర్పణ. బెల్లం, మిరియాలు, యాలకులు కలిపిన పానకం అత్యంత చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. స్వామివారి ముఖద్వారం అని పిలిచే ఆ కొండపై ఉన్న రంధ్రంలో రోజంతా ఎడతెగకుండా పానకం పోయడం వల్ల, ఆ ద్రవం కొండ లోపలి పొరల్లోకి వెళ్లి అగ్నిపర్వత ఉష్ణోగ్రతలను సమతుల్యంగా ఉంచుతుంది.

రెండవ శాస్త్రీయ కోణం ఏమిటంటే, ఈ కొండలోని రాళ్లలో గంధకం (సల్ఫర్) వంటి మూలకాలు ఉండటం వల్ల వాతావరణంలోకి హానికరమైన వాయువులు వెలువడే ప్రమాదం ఉంటుంది. బెల్లం అనేది సహజసిద్ధమైన రసాయన నిర్వీర్యకారి పానకంలోని బెల్లం, నీరు ఈ రాళ్లతో రసాయనిక చర్య జరపడం వల్ల ఆ వాయువుల తీవ్రత నశించి, చుట్టుపక్కల వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. స్వామివారు సగం పానకం మాత్రమే స్వీకరిస్తారనడం వెనుక ఉన్న వాస్తవం.. కొంత పానకం అగ్నిపర్వత గొట్టం ద్వారా లోపలికి వెళ్లి ఉష్ణాన్ని తగ్గించగా, మిగిలిన సగం బయటకు వస్తుంది. అప్పటికే ఆ పానకంలో కొండలోని ఔషధ గుణాలు, ఖనిజాలు కలవడం వల్ల ఆ పరిసరాల్లో నివసించే వారికి హాని జరగకుండా చేసిన ఒక వ్యూహంలా కూడా అనిపిస్తుంది. అంతే కాకుండా, భక్తులు స్వామిని దర్శనం చేసుకొని ఆ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచే దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ పానకం సమర్పణను ఒక ఆధ్యాత్మిక ఆచారంతో పాటు పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక శాస్త్రీయ ప్రక్రియగా ఏర్పాటు చేశారని చెప్తుంటారు. ఆ తర్వాత మా పయనం చారిత్రక ఘనతకు, పౌరుషానికి ప్రతిరూపమైన కారంపూడి వైపు సాగింది. ఉదయపు వేళ చల్లని గాలి తలుగుతుంటే కార్ లో హాయిగా ఉన్నా, మనసులో మాత్రం వీరుల యుద్ధ క్షేత్రాన్ని చూడబోతున్నామనే ఒక వేడిసెగలేవో ఒక కొత్త చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. తెలుగు నేల చరిత్రలో వీరత్వానికి నాంది పలికిన పల్నాటి యుద్ధ క్షేత్రంలో అడుగుపెడుతుంటే, నాటి వీరుల శౌర్యప్రతాపాలు, ఖడ్గమృదంగ ధ్వనులు మనోఫలకంపై సాక్షాత్కరించినట్లయింది. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు ప్రాంతంలో క్రీ.శ. 1178-1182 మధ్యకాలంలో దాయాదులైన నలగామరాజు, మలిదేవరాజుల మధ్య జరిగిన భీకర యుద్ధమే పల్నాటి వీర చరిత్ర. దీనిని తెలుగులో 'మినీ మహాభారతం' అంటారు. ప్రసిద్ధ కవి శ్రీనాథుడు ఈ చారిత్రక కథను ద్విపద కావ్యంగా మలిచారు. ప్రశాంతమైన ఆ ఉదయాన వీరత్వపు ఆనవాళ్లను వెతుక్కుంటూ ముందుకు సాగాం. కారంపూడిలో జరిగిన ఈ యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆ యుద్ధం జరిగిన ప్రాంతంలో నడుస్తుంటే ఒక రకమైన ఏవో వీరత్వానికి చెందిన వైబ్రేషన్స్ కలుగుతున్నట్లు అనిపించింది.  పల్నాడు, గురజాల, మాచర్ల నాగులేరు మొదలైన వాటికి రకరకాల అయినటువంటి వ్యుత్పత్తి అర్ధాలు చెప్తారు. గురివింద పొదలు ఎక్కువగా ఉండడం వల్ల దీన్ని గురిజాల అనే పేరు వచ్చిందట. కృష్ణానది తీరంలో సుమారు 120 మైళ్ళ దూరంలో ఈ గురజాల నగరం ఉంది. దీనికి తూర్పున నాగులేరు, చంద్రవంక నదులు ఈ ప్రదేశంలో పల్లం ప్రాంతంలో ఉండటంవల్ల పల్లవునాడు,  పలనాడుని పిలిచేవారు.  క్రమేపి అదే పల్నాడు, పలనాడు, వీర పల్నాడు పేర్లతో చరిత్రకెక్కింది.  నాగులేరు నదినే నాగానది అని కూడా పిలుస్తారు. ఇక్కడ నివసించే జాతిని నాగ జాతి వాళ్ళని పిలిచేవారట. తర్వాత వాళ్ల పేరుతోనే నాగులేరు అనే పేరు వచ్చినట్టు జనశ్రుతి. రామాయణ కాలంలో మారీచుడు పరిపాలించిన ప్రాంతమే మాచర్లగా భావిస్తారు. అప్పట్లో దీన్ని మాచిర్ల అని పిలిచేవారు. నాగులేరు సమీపంలో ఒక పొలం.. ఆ పొలం పక్కనే ఒక పుట్ట.. ఆ పుట్ట దగ్గర ఒక పాప దొరకడం… ఆ పాపే తర్వాత ‘నాయకురాలు నాగమ్మ’ గా ప్రసిద్ధి చెందిందంటారు. 

ముందుగా, పల్నాటి వీరుల ఇలవేల్పు, సాక్షాత్తు నాయని బ్రహ్మనాయుడు ప్రతిష్ఠించిన పవిత్ర శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నాం. భక్తి శ్రద్ధలతో సాగిన ఆ పూజల్లో బ్రహ్మ నాయుడి సంస్కరణల శోభ, ఆ క్షేత్రపు దివ్యత్వమూ స్పష్టంగా ప్రతిబింబించాయి. చారిత్రక ఆధ్యాత్మికతల మేళవింపుగా ఆ ఆలయ ప్రాంగణం అడుగడుగునా ఒక దివ్యానుభూతిని అందించింది. ఈ పర్యటనలో మాకు ఎదురైన అతిపెద్ద సర్ప్రైజ్, ఒక ఆత్మీయ ఆహ్వానం. మా సతీమణికి పూర్వ విద్యార్థి, కొన్నాళ్ల పాటు సహోద్యోగిగా పనిచేసిన కాశీం వలీ రూపంలో దక్కింది. గురువుల పట్ల ఉన్న అపారమైన గౌరవాభిమానాలతో కాశీం వలీ మా కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. సాధారణ యాత్రికులకు సులభంగా లభించని అరుదైన అవకాశాన్ని మాకు కల్పించాడు. పల్నాటి యుద్ధంలో వీరులు ఉపయోగించిన నాటి చారిత్రక ఆయుధాలను, కత్తులను అత్యంత సమీపం నుండి తిలకించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించాడు. అంకాలమ్మ గుడి దర్శించుకున్న తర్వాత అక్కడే వేడి వేడి ఇడ్లీలు తిన్నాం. చాలా బాగున్నాయి. ఆ తర్వాత చెన్నకేశవస్వామి దేవాలయం ఎదురుగా బ్రహ్మనాయుడు విగ్రహం ఉంది. దానిపై కారంపూడి యుద్ధం గురించి ఒకరు(తగిరిశ. రఘుబాబు) రాసిన కవిత కూడా ఆ శిల్పంపై చెక్కారు. ఆ పరిసరాల్లో అనేక శాసనాలు ఉన్నాయి. దేవాలయాన్ని తెరిచేవరకు ఉండి, బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు ఉపయోగించిన ఆయుధాలుగా చెప్పే ఆ ఆయుధాలను ప్రత్యక్షంగా తాకి చూశాం. ఆ నాటి వీర ఖడ్గాలను కళ్లారా చూసి, చేతులతో స్పృశిస్తుంటే ఒళ్లు గగుర్పొడిచింది. చరిత్ర పుస్తకాల్లో చదివిన పల్నాటి వీరగాథలు కళ్లముందు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది. ఆత్మీయ శిష్యుని అభిమానం, చరిత్ర సృష్టించిన ఆయుధాల సందర్శనం మా ఈ కారంపూడి పర్యటనను యాత్రలోనే ఒక చిరస్మరణీయమైన ఘట్టంగా మార్చేశాయి. 

పల్నాటి నేలపై

కారంపూడి

ఏ మట్టికణాన్ని కదిలించినా

ఏదో ఒక వీరగాథ

వినిపిస్తున్నట్టే ఉంటుంది!

గాలి తాకిన ప్రతిసారీ

గతకాలపు కత్తుల మెరుపులు,

గుర్రాల పరుగులు,

వీరుల నినాదాలు

కాలపు తెరను చీల్చుకుని

ముందుకొస్తున్నట్టే ఉంటాయి.

బ్రహ్మనాయుడి ఆశయం,

నాయకురాలు నాగమ్మ రాజకీయ చతురత,

మలిదేవుని వీరత్వం

అన్నీ కలిసి

ఈ నేలపై

తెలుగు భారతయుద్ధాన్ని

జ్ఞాపకాలుగా నిలిపేశాయి!

కారంపూడి యుద్ధభూమిలో

నిలబడితే

బ్రహ్మనాయుడి చాపకూడు సిద్ధాంతం,

నాయకురాలు నాగమ్మ కుతంత్రాలు

చరిత్ర పుటల నుంచి బయటకొచ్చి

మన కళ్లముందే కదనమాడుతుంటాయి!

ఆ పల్నాడు యుద్ధం గురించి ఆ రాత్రి వచ్చిన తర్వాత వీడియోలు చూశాం. నాకు నిద్రలో కూడా ఆ వీరుల స్థలం, రక్తసిక్తమైన యుద్ధ క్షేత్రం కనిపించినట్లే అనిపించింది. ఆ కాలంలో పల్నాడు ప్రాంతం మెట్ట ప్రాంతంగా, నీటి వసతి లేక కరువు కాటకాలతో ఉండేది. అక్కడి ప్రజల జీవితం పూర్తిగా కఠిన శ్రమతో ముడిపడి ఉండేది. అక్కడ బతకాలంటే కష్టపడి పని చేయాల్సిందే తప్ప, అందచందాలకు, రాజభోగాలకు, కళలకు అక్కడ తావులేదని శ్రీనాథుడు ఎంతో హాస్యభరితంగా, అద్భుతమైన పదజాలంతో వర్ణించాడు. సాక్షాత్తూ ఆ దేవలోకపు నాట్యకత్తె అయిన 'రంభ' అంతటి అందగత్తె అక్కడికి వెళ్ళినా, ఆమె నృత్యాలను అక్కడ ఎవరూ పట్టించుకోరు. బతకడానికి ఆమె కూడా పత్తి దారం వడకాల్సిందే. భూమండలాన్ని ఏలే సాక్షాత్తూ ఆ మహారాజు అక్కడికి వెళ్ళినా, రాజభోగాలు దొరకవు, నాగలి పట్టి పొలం దున్నాల్సిందే. పూల బాణాలు కలిగిన ఆ మన్మథుడే అక్కడికి వెళ్ళినా, అక్కడ తినడానికి పంచభక్ష్య పరమాన్నాలు దొరకవు. ముతకగా ఉండే జొన్నలతో వండిన అన్నం  మాత్రమే తినాలి అంటూ ఒక పద్యం చెప్పినట్లు సాహిత్యకారులు చెప్తుంటారు. 

రసికుడు పోవడు పల్నా

డెసగంగా రంభ యైన నేకులె వడుకున్

వసుధేశుడైన దున్నును

కుసుమాస్త్రుండైన జొన్న కూడే కుడుచున్ 

పల్నాడు ప్రాంతం శ్రీనాధుని కాలంలో ఎలా ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం అయితే సశ్యశ్యామలంగా కనిపిస్తోంది. ఎటుచూసిన నల్లరేగడి మట్టితో, పొలాలు పచ్చగా కనిపించాయి. ఈ ప్రయాణమంతటా రోడ్డు మార్గంలో సాగిన మా పయనానికి మరింత ప్రాణం పోసింది మా కార్ లోని సంగీతం. బొలేరో కారు కృష్ణానదీ తీరాల వెంట, పల్నాటి కొండల నడుమ సాగిపోతుంటే... మధ్య మధ్యలో ప్లేఅయ్యే అద్భుతమైన పాటలు మా ప్రయాణంలో కొత్త ఉత్సాహాన్ని, నవోత్తేజాన్ని నింపాయి. ఒకవైపు ఉదయకాలపు మంచు తెరల నడుమ జానపద గీతాలు, మరోవైపు పల్నాటి వీరభూమి దారిలో గూస్‌బంప్స్ తెప్పించే భావోద్వేగ గీతాలు, ఇంకోవైపు ప్రయాణ బడలికను మర్చిపోయేలా చేసే మధురమైన పాటలు... డ్రైవర్ కిరణ్ కారు స్పీకర్‌ల నుండి వినిపిస్తుంటే మా యాత్ర మరింత ఆహ్లాదకరంగా మారింది. నా సతీమణి మంజుశ్రీ, కుమారుడు శ్రీనివాసరావు, సాయినాథ్ రెడ్డిలతో కలిసి ఆ పాటలను ఆస్వాదిస్తూ, పాడుకుంటూ సాగిన ఆ ప్రయాణం ప్రతీ క్షణాన్నీ ఒక తీపి జ్ఞాపకంగా మార్చేసింది. గతంలో మా వివాహవార్షికోత్సవాల సందర్భంగా నా పరిశోధక విద్యార్థులు చంద్రమౌళి, రామ్ ప్రసాద్, కృష్ణవేణి, పుప్పిణి, మా చిన్నన్నయ్య గారి అబ్బాయి మురళీ మనోహర్ లతో వచ్చినప్పుడు వాళ్ళ హడావిడి, వాళ్ళు దారి మధ్యలో కట్ చేయించిన కేక్, పట్టుకెళ్ళిన పదార్థాలు పంటపొలాల్లో, తోటల్లో తిన్నదృశ్యాలు, ఆ నాటి అనుభూతులను నెమరువేసుకుంటూ ఈ యేడాది పయనం ఒక చారిత్రక, ఆధ్యాత్మక ప్రదేశాల సందర్శనగా మరో పుటలో చేరిపోయింది. 

గడియారపు పరుగులకు కాసేపు సెలవిచ్చి

దైనందిన అలజడులను దాటేసి

 మరొక్కసారి కొత్తగా కలుసుకున్న క్షణాలివి!

చేతిలో చేయి వేసి నడుస్తుంటే 

ఆనాటి ఏడడుగుల ముచ్చట మళ్లీ గుర్తొచ్చినట్టుంది, 

కొత్త దారుల్లో పాత జ్ఞాపకాలను వెతుకుతుంటే, 

ప్రకృతి కూడా మనకు తోడుగా నడిచినట్టుంది.

కొత్త ప్రదేశాలెన్నో చూసినా 

పరిచయమున్న నీ నవ్వులోనే నా ప్రపంచం ఉందని... 

ఎన్ని మైళ్లు ప్రయాణించినా

కలకాలం సాగే మన జంట పయనమే నా గమ్యమని... 

ఈ మధుర యాత్ర మరల మరాలా పరిమళిస్తూ గుర్తుచేస్తోంది....

డా. దార్ల వెంకటేశ్వరరావు, 22.8.2026




11 ఆగస్టు, 2026

నాలో మిగిలిన నేను- 7 నీడ

 నాలో మిగిలిన నేను



(దీర్ఘ కావ్యం)

7. నీడ

నడుస్తున్నది నేనొక్కడినే

నా వెంటమరొక నడక

అది అడుగుల శబ్దం చేయదు

 నేను ఆగితే ఆగుతుంది

 నేను కదిలితే కదులుతుంది

ఉదయం

 అది నా వెనుకే ఉంది.

సూర్యుడు

 నా ముందుకు వచ్చేకొద్దీ

 అది నన్ను అనుసరిస్తూనే ఉంది.

మధ్యాహ్నం

 నా పాదాల కింద

 ముడుచుకుంది.

నా అడుగుల మధ్య చిన్నదైపోయింది.

అప్పుడు

 దాని ఉనికి

 దాదాపు కనిపించలేదు.

మనిషి జీవితంలో కూడా

 కొన్ని బంధాలు

 అలానే ఉంటాయేమో!

దూరంగా ఉన్నప్పుడు

 పెద్దవిగా కనిపిస్తాయి.

చాలా దగ్గరగా వచ్చినప్పుడు

 తమను తాము

 చిన్నవి చేసుకుంటాయి.

సాయంత్రం

 నన్ను దాటి ముందుకు వెళ్లింది.

నేను వెనుక నడుస్తున్నట్టు,

 అది ముందుగా

 నా దారిని చూసుకుంటున్నట్టు

ఎండ దిశను మార్చింది

నీడ నిశ్శబ్దాన్ని మార్చింది

చిన్నప్పుడు దాన్ని ఆటగా చూశాను

నా చేతులను పైకెత్తితే

 అది కూడా పైకెత్తేది

నేను పరుగెత్తితే

 అది నా వెంటే పరుగెత్తేది

నేను ఒక్కసారిగా ఆగితే

 అది కూడా ఆగేది.

అది నన్ను అనుకరిస్తుందని

 అనుకున్నాను

అది నన్ను

 ఎప్పటినుంచో చదువుతోందని

 అప్పుడు నాకు తెలియదు

యవ్వనంలో

 దాని ఉనికిని నేను పట్టించుకోలేదు.

నా ముందు

 ప్రపంచం పెద్దగా కనిపించింది

నా వెనుక

 ఏమి నడుస్తుందో

 చూడడానికి అప్పుడు నాకు సమయం లేదు

వెలుగు వైపేపరుగెత్తాను

నీడ మాత్రం నా వెనుకే వచ్చింది.

ఎత్తులకు వెళ్లాను

అది కూడా

 నా వెంట ఎక్కింది

జనం మధ్య నిలబడ్డాను

అది

 నా పాదాల దగ్గర

 ఒంటరిగానే నిలబడింది

చప్పట్ల మధ్య

 నేను నా పేరును విన్నాను

నీడ

 ఏమీ విననట్టు

 నిశ్శబ్దంగా ఉంది

అవమానాల మధ్య

 నేను నా మౌనాన్ని మోశాను

నీడ

 ఆ మౌనానికి

 మరో రూపమై నిలిచింది

గోడ మీద

 అది నాకంటే

 పెద్దగా కనిపించింది

నేను చిన్నగా అనిపించాను

నా నీడ

 నా కంటే పెద్దదిగా కనిపించింది 

అప్పుడు అనిపించింది

మనిషి తన జీవితాన్ని

 తాను చూసుకున్నంత చిన్నగా

 తన నీడ

 ఎప్పుడూ చూడదేమో!

గోడ మీద

 నా భుజాలు విస్తరించాయి

నా తల

 అసాధారణంగా పొడవైంది

నా చేతులు

 నాకు తెలియని దూరాల వరకు

 చేరుకున్నాయి

వెలుగు మారగానే

 నా ఆకారం కూడా మారింది

అప్పుడు తెలిసింది

రూపం

ఎప్పుడూ మనది కాదు

వెలుగు మారితే

 మన గురించి

 ప్రపంచం చూసే విధానం కూడా మారుతుంది

నీళ్లలో

 నా నీడ

 అలలతో పాటు విరిగిపోయింది

నేను

 నీళ్లలోకి వంగి చూశాను

నా ముఖంచెదిరిపోయింది

నా ఆకారంముక్కలైపోయింది

నీడకు

 ముఖం ఉండదని

 అప్పుడే గుర్తొచ్చింది.

అది

 నా రూపాన్ని మాత్రమే మోస్తుంది

నా వయసును కాదు

నా పేరు కాదు

నా పదవిని కాదు

నా మీద

 ఇతరులు పెట్టిన

 ఏ పేరునూ కాదు

దుమ్ము దారిలో

 అది నా అడుగుల ఆకారాన్ని

 ధరించింది

ప్రతి అడుగుకీ ఒక నీడ.

ప్రతి మలుపుకీ ఒక మార్పు

నేను ఎక్కడ ఆగానో

 అది కూడా అక్కడే నిలిచింది

నేను ఎక్కడ తిరిగానో

 అది కూడా నాతోనే తిరిగింది

నేను తప్పిపోయినప్పుడు

 అది మాత్రమే

 నా వెంట ఉంది.

దారి చూపలేదు

దారి తప్పుపట్టలేదు

నా గురించి

 ఒక్క ప్రశ్నా అడగలేదు

నేను ఎందుకు వచ్చానని

 అడగలేదు

ఎక్కడికి వెళ్తున్నావని

 అడగలేదు

ఎందుకు ఆగిపోయావని

 అడగలేదు

ఎందుకు తిరిగి చూశావని

 అడగలేదు

నా మౌనాన్ని

 ఎప్పుడూ అడ్డుకోలేదు

నా కన్నీటిని

 ఎప్పుడూ తుడవలేదు

నా నవ్వును

 ఎప్పుడూ తనదిగా చేసుకోలేదు

నేను ఎలా ఉన్నానో

 అలానే

 నన్ను వెంట తీసుకెళ్లింది

అది

 నా జీవితంలో

 ఏమీ మార్చలేదు

నా జీవితాన్ని

 వదిలిపెట్టలేదు కూడా

అచ్చం నా సహచరిలాగే!

కొన్ని తోడ్పాట్లు

 అలానే ఉంటాయేమో

మనిషిని మార్చకుండా

 అతనితో పాటు

 మారుతుంటాయి

ఒక రోజు

 నేను పరుగెత్తడం ఆపేశాను

నీడ కూడా

 నాతో పాటు

 నెమ్మదించింది

ఒక బెంచీ మీద

 కూర్చున్నాను

నా పక్కనెవరూ లేరు

నా ముందు పొడవైన దారి.

నా వెనుకచాలా సంవత్సరాలు

నేల మీదనా నీడ

దాన్ని చూస్తూ

 చాలాసేపు కూర్చున్నాను

మొదటిసారి

 దానిని

 నా సొంతం అనిపించలేదు

అది

 నన్ను అనుసరించినది కాదు

నేను

 దాన్ని అనుసరించినట్టనిపించింది

నా కదలికలన్నింటినీ

 అదే మౌనంగా సేకరించుకుంది.

నా బాల్యం

నా తొందర

నా కోపం

నా ప్రేమ

నా బాధ్యతలు

నా ఒంటరితనం

నా మాటలు

నా చెప్పని మాటలు

నేను మర్చిపోయిన

 అనేక దృశ్యాలు

 దాని నడకలో

 ఇంకా ఉన్నాయేమో!

సాయంత్రం

కొంచెం పొడవైంది

నీడ కూడా!

సూర్యుడు

 దూరంగా దిగుతున్నాడు

నా నీడ

 ముందుకు సాగుతోంది

ఇద్దరం

 మాట్లాడుకోలేదు

ఆ నిశ్శబ్దం

 చాలా దూరం నడిచింది

ఒక దశలో

 నీడ

 నా ముందే ఆగింది

నేను

 దాని దగ్గరకు వెళ్లాను

మా మధ్య

 వెలుగు మాత్రమే ఉంది

అది

 నన్ను తాకలేదు

నేను

 దాన్ని తాకలేకపోయాను

అయినా

 ఎన్నో సంవత్సరాలుగా

 మా మధ్య

 ఒక విడదీయలేని సంబంధమేదో ఉంది

అప్పుడు

 నాకు ఒక విషయం అర్థమైంది

మనిషి తనను తాను

 ఎప్పుడూ పూర్తిగా చూడలేడు

తన ముఖాన్ని అద్దంలో చూస్తాడు

తన శరీరాన్ని నీడలో చూస్తాడు

తన జీవితాన్నిజ్ఞాపకాల్లో చూస్తాడు

తన అసలు రూపాన్ని

 తన వెంట నడిచిన

 నిశ్శబ్దంలో మాత్రమే

 ఎప్పుడో ఒకసారి వింటాడు

ఇప్పుడు

 నేను నా నీడను చూడడం లేదు

దాని నడకలో నన్ను నేను వింటున్నాను

నా అడుగు పడకముందే

 అది నన్ను గుర్తుపడుతోంది

నేను తిరిగి చూడకపోయినా

 అది నా వెనుక ఉంది

నేను ముందుకు వెళ్లినా

 అది నా వెంట ఉంది

ఒకరోజు

 వెలుగు నన్ను దాటి

 ఎక్కడికో వెళ్లిపోతుంది

నా అడుగులుఆగిపోవచ్చు

నా స్వరం నిశ్శబ్దమైపోవచ్చు

నా పేరు

 ఎక్కడో ఒక పుస్తకంలో

 మిగిలిపోవచ్చు

అప్పుడు

 నా నీడకు ఏమవుతుందో

 నాకు తెలియదు!

బహుశా

 అది కూడా

 వెలుగులో కలిసిపోతుంది!

లేకపోతే

 ఎవరైనా ఒకరు

 నా దారిలో నడుస్తూ

 తన పక్కన పడిన

 ఒక పొడవైన నీడను చూసి

 తనను తాను

 గుర్తుపట్టుకోవచ్చు

అంతవరకూ

 నేను నడుస్తూనే ఉంటాను

నా వెంట

 నడిచే ఆ నిశ్శబ్దంతో.,.,

 దార్ల వెంకటేశ్వరరావు 11.8.2026